Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అంతిమలేఖ
#3
అంతిమలేఖ - 2 


రచన: ఆటీను రాజు



కుర్చీలో కదిలి కాలు ముడవబోయాడు. నొప్పి మళ్ళీ మోకాలిదాకా పొడిచింది. గుండెలో మంట ఉధృతమైంది. లేచి నుంచున్నాడు, కొంచెం రిలీఫ్ వస్తుందేమో అని. మళ్ళీ కూచున్నాడు. కళ్ళు మూసుకొని గుర్తు తెచ్చుకోటానికి ప్రయత్నించాడు. 


ఎలా ఉండింది ఆమె, నాలుగేళ్ల తర్వాత  చూసినప్పుడు?


గ్లాస్ లోని ద్రవం తాగి ఆలోచిస్తూ కూచున్నాడు. గది మూలనుంచి మందపాటి శబ్దం వస్తోంది. తెలిసిన శబ్దం. టాబ్లెట్ ల వంక చూసాడు. రాయాల్సినది ఇంక ఎంతో లేదేమో. ఒక కొలిక్కి వస్తోంది. ముగించాక  ఒళ్ళు మరిచి నిద్ర పోవాలి. 


ఒక టాబ్లెట్ తీసి గొంతులో వేసుకున్నాడు. 


* * *


రమ్మీ, డియరెస్ట్, 


ఆ రోజు కార్తీకపౌర్ణమి. సూర్యాస్తమయమయింది.  ఆడవాళ్ళందరూ నది ఒడ్డుకి చేరి దొన్నె పడవల్లో దీపాలు వదులుతున్నారు. ఆ ముందు రోజే నేను సిటీ నుంచి ఊరికి వచ్చాను. అప్పటికింకా జాబ్ చేస్తున్నాను. ఊరి మీద నాకు వ్యామోహం లేదు. అసలు ఊరిని చూడాలనే కోరిక లేదు. ఊరికి వస్తే జ్ఞాపాకాలు నన్ను మరింత హింసిస్తాయి. ఏ వీధి చూసినా ... ఏ గుడి చూసినా ... ఏ తోట చూసినా ... ఏ చెట్టు నీడ చూసినా ... నువ్వే గుర్తొస్తావు. అక్కడ మనం కలిసిన సందర్భం గుర్తొస్తుంది.  భరించలేను.  కానీ నన్ను చూడాలని  అమ్మ పట్టుబట్టింది. తప్పనిసరై వచ్చాను. 


ఈ పాటికి తాగుడికి బానిసయ్యాను. పెళ్లి చేసుకుంటే మారతానేమోనని  అమ్మానాన్నా నన్ను పెళ్ళికి  వత్తిడి పెడుతున్నారు. పెళ్లా! నేనా! హా హా. నా కలలో నేను నీకు తాళి కట్టాను. ఆ కలలోనే బతుకుతున్నాను. వాస్తవంలోకి వచ్చి బతకటం నాకు ఇష్టం లేదు. నా ప్రియ మిత్రుడు, అంటే  మిస్టర్ విస్కీ బాటిల్, అన్నివేళలా నేను కలలోనే బతకటానికి ఎంతో సహాయపడుతున్నాడు. 


కానీ, ఆ సాయంత్రం ఎందుకో, తాగినది ఎక్కువయ్యో ఏమో, నేను గడపదాటి ఒక లక్ష్యం, గమ్యం లేకుండా వీధులు పట్టుకుని తిరిగాను. కాళ్ళు నన్ను గోదారి వేపు తీసుకుపోయాయి. ఘాట్ మెట్ల  మీద కూచుని ఆడవాళ్లు నదిలో దీపాలు వదలటం చూస్తున్నాను. కళ్ళు ఎటు తిప్పినా నీళ్ళల్లో వందల వేల దీపాలు. ముద్దు ముద్దు దీపాలు.  గోదారమ్మకు అలంకారంగా ఉన్నాయి.  అలలపైన వయ్యారి భామలల్లే  మనోహరంగా హంసనడకతో ఊగుతూ,  తళుకుబెళుకులతో మెరుస్తూ, సాగి పోతున్నాయి. 


అవి మంత్రముగ్ధుడినై చూస్తూ చూస్తూ  ... ఎందుకో చూపు తిప్పి ...   హఠాత్తుగా స్తంభించిపోయాను. 


కళ్ళు పెద్దవి చేసుకుని నావంక చూస్తూ నువ్వు!


మెల మెల్లగా, జాగ్రత్తగా, ఒకామె -- నీ అత్తగారిది కాబోలు -- చెయ్యి పట్టుకుని మెట్లు ఎక్కి పైకి వస్తూ నువ్వు! 


పెరిగి ఉన్న నీ గర్భం కొట్టొచ్చినట్టు కనపడుతోంది. నుదుటి పాపిడి మీద కుంకుమ.  వేలాడుతున్న నల్లపూసలు, మంగళసూత్రం.  ఒళ్ళు చేసి, అందం రెట్టింపై, పట్టుచీరలో దేదీప్యమానంగా స్త్రీత్వానికి ప్రతీకగా ఉన్నావు. 


స్పృహలోలేని నేను తేరుకుని నా మొహం నీకు కనపడకుండా దాచుందామనుకునే లోపలే ...   జరగకూడనిది జరిగిపోయింది.  నేను నిన్ను చూశానని గమనించావు. నువ్వు కూడా ఒక్క క్షణం స్తంభించిపోయావు!


ఆ తర్వాత జరిగినది ఇప్పటికీ ... గుర్తు వచ్చినప్పుడల్లా ...  నా గుండెని ముక్కలు ముక్కలు గా కోసేస్తుంది. 


నువ్వు ఆగి "బాగున్నావా" అని అడుగుతావని నేను ఆశించలేదు. 


మాటలతో కాకపోయినా చిరునవ్వుతో అయినా పలకరించి వెళతావనీ  ఆశించలేదు. 


నన్ను గుర్తుపట్టనట్టో, నేనెవరో తెలియనట్టో  నటించి నీ దారిన నువ్వు వెళ్తావని అనుకున్నాను. అలా జరిగిఉంటే నా గుండె ఘోషించకుండా ఉండేది. కానీ అలాగ కూడా జరగలేదు.


నీ కళ్ళలో చెప్పలేనంత  బెదురు, భయం! భీతహరిణేక్షణ ... పులిని చూసిన కళ్ళతో ఉన్న  లేడి ... అలా ఉన్నావు. 


ఎంతోసేపు లేవు  నా మీద నీ కళ్ళు.  గబుక్కున తిప్పుకుని, మొహం కూడా పక్కకి తిప్పేసి,  ఏ కుష్టురోగినో దుష్టశక్తినో చూసినట్టు పరుగులు  పెట్టావు! నీ పక్కన ఉన్నావిడ "అదేంటమ్మా, నెమ్మది, నెమ్మది, నువ్వలా ఎక్కకూడదు!" అని వారిస్తున్నా వినకుండా చెయ్యి విడిపించుకుని వేగంగా మెట్లు ఎక్కి నా ఉనికి నుంచి దూరంగా పారిపోయావు! 


ఆ రాత్రి దిండులో తలదాచుకుని ఆడదానికి మల్లె వెక్కి వెక్కి ఏడ్చాను. జీవితంలో మళ్ళీ నీ కంటికి కనిపించకూడదని ఒట్టు వేసుకున్నాను. 


* * * 


ఉలిక్కిపడ్డాడు. కళ్ళు చెమ్మగిల్లి ఉన్నాయి! అద్దుకున్నాడు. 


డెస్పరేట్ గా యాష్ ట్రే లో చెయ్యిపెట్టి వెతికాడు, సొగమే కాల్చి ఆర్పేసిన సిగరెట్ ఏదైనా ఉంటుందేమోనని. దొరికింది. వణుకుతున్న చేతులతో వెలిగించి గాఢంగా దమ్ము పీల్చి వదిలాడు. 


తేరుకుని బాటిల్ వేపు చూసాడు. దాన్ని డైరెక్ట్ గా ఎత్తి బొటబొటా  తాగాడు. మనసు కుదుట పడింది. ఉద్వేగం తగ్గింది. 


తను ఆత్మహత్య చేసుకుని ప్రపంచంలోనుంచి శాశ్వతంగా వెళ్లిపోవాలనే  నిర్ణయానికి వచ్చిన మూమెంట్ ని గుర్తు చేసుకున్నాడు. ఈ ఉదయమే జరిగిందది. 


రాత కొనసాగించాడు. 


* * *


రమ్మీ, డియరెస్ట్, 


నిజం చెప్పాలంటే నేను గత పదేళ్లుగా ఒకరకమైన ప్రశాంతత తోనే బతుకుతున్నాను. నా కలలో నీకు భర్తగా బతుకుతున్నాను. విస్కీ బాటిల్ నాకు ఒక తోడునే కాదు,   ఊహా ప్రపంచాన్ని కూడా  సృష్టించి ఇస్తోంది. అమ్మ వెళ్ళిపోయాక నన్ను పట్టించుకున్నవాడు లేడు. చుట్టాలూ స్నేహితులూ నన్ను వదిలేశారు. అదే నాకు కావాల్సింది కూడా. నేను నిజప్రపంచంలోకి రాను, నా ప్రపంచం లోనే నేను బతుకేస్తాను.  వాస్తవంలోకి లాగేది ఏదైనా నాకు భయం, అసహ్యం. 


ఇదిగో, ఈ గది నా ప్రపంచం. విస్కీ, సిగరెట్లు ... వీటికోసం తప్ప బయటికి అడుగుపెట్టను. నెలసరుకులు కూడా ముసల్ది రమణమ్మే తెస్తుంది. నా పద్ధతులు దానికి ఎంత జుగుప్స కలిగించినా పాపం నేనిచ్చే పైసలకోసం నన్ను అంటిపెట్టుకు ఉంది. పొద్దున్నే వస్తుంది. ఇల్లు ఊడుస్తుంది. నన్ను తిట్టిపోస్తుంది. కొత్త కర్టెన్లు, దుప్పట్లు కొనలేదని సతాయిస్తుంది. 'మిక్సీ పాడైపోయింది బాగు చెయ్యించవా?' అని అరుస్తుంది. సిగరెట్ పీకలూ,  బాటిల్ మూతలూ  ఎక్కడంటే అక్కడ పడున్నాయని శివమెత్తుతుంది. చెవులు మూసుకుంటాను. ఇరుగు మాటా పొరుగు మాటా వాగుతుంది. వింటున్నట్టు నటిస్తాను. నాలుగు మెతుకులు వండి పోతుంది. అవి తిని పడుకుంటాను.    


ఈ జీవితం నాకు బానే ఉండింది, ఈ పొద్దున్న రమణమ్మ పక్క బంగళాలోకి కొత్తవాళ్లెవరో దిగారని చెప్పేదాకా. ఆమె ఆ వార్తా చెప్పినప్పుడు "ఆహా", అన్నాను, ముక్తసరిగా.  "ఎంత బాగుంటారో  ఆయమ్మా  కూతురూనూ. కుందనం బొమ్మలే ఇద్దరూ", చెప్పింది. "అలాగా", అన్నాను, ఆవులిస్తూ. 


ఆ బంగళా ఒక కంపెనీ వాళ్ళది. ఆ కంపెనీ దాన్ని టాప్ మేనేజర్లకి  క్వార్టర్స్ గా ఇస్తుంది. నా కిటికీ తెరిచి చూస్తే దాని లాన్, పూలమొక్కలు కనిపిస్తాయి. ప్రతిరోజూ తోటమాలి వచ్చి నీళ్లు పోస్తాడు. ఆ బంగళా రెండు నెలలుగా ఖాళీగా ఉంది. 


రమణమ్మ వెళ్లి కిటికీ తీసి ఆ బంగళా లోకి చూసింది కుతూహలంతో. "మూసెయ్యి" అన్నాను, చిరాగ్గా. నాకు కిటికి తెరవటం ఇష్టం ఉండదు. రమణమ్మ అలిగి మూతి తిప్పుకుంటూ పోయింది.  


ఆ తర్వాత, బాత్రూమ్ లోంచి వస్తూ, తెరిచి ఉన్న కిటికీని చూసి రమణమ్మని తిట్టుకుంటూ వచ్చి,   నేనే దాని తలుపులు ముయ్యబోయాను  ... బయటికి చూసాను. కుందనపు బొమ్మ లాంటి ప్రౌఢ!


నువ్వు!


సందేహం లేదు. నా రమ్మీ! కొంచెం మారింది. కానీ గుర్తుపట్టలేనా? తిరుగులేదు! నా రమ్మీ! నా రమ్మీ!


ఆమె పక్కన ఎవరు? ... ఇంకెవరు! జూనియర్ రమ్య! స్కూల్ డ్రెస్ లో! పదేళ్ళ వయసులో  నువ్వెలా ఉన్నావో  అచ్చు అలాగే ఉంది!


ఆ పక్కన ... ఆ పక్కన ... నా గుండె మీద సమ్మెట దెబ్బ కొట్టినట్టు అనిపించింది ....  అందంగా హుందాగా ఉన్నాడు... ఆఫీస్ డ్రెస్ లో ఫార్మల్ గా టై కట్టుకుని, కోటు వేసుకుని... నీ ... అసలు భర్త. నిజ జీవితం లో నా రమ్యని నా నుంచి దొంగిలించిన మనసులేని మనిషి. 


కార్ వచ్చి ఆగింది. డ్రైవర్ దిగి డోర్ తెరిచి పట్టుకున్నాడు. తండ్రి కూతుళ్లిద్దరూ ఎక్కారు. నువ్వు బై చెప్పావు. కారు రెండు అడుగులు కదిలి మళ్ళీ ఆగింది. అతడు విండో కిందకు దించాడు. నువ్వు వెళ్లి ఏదో మాటాడుతున్నావు. నవ్వుతున్నాడు. నీ బుగ్గ మీద వేలితో చిలిపిగా కొట్టాడు. నువ్వూ నవ్వావు. కారు కదిలింది. గేట్ దాటేదాక చెయ్యి ఊపుతూనే ఉన్నావు. 


నాలో అగ్నిపర్వతాలు పేలుతున్నాయి. 


గులాబీ మొక్కల వద్దకు వెళ్లి పరీక్షిస్తున్నావు. పనిపిల్ల బయటికి వచ్చింది. ఆమెకి ఏదో  చెప్తున్నావు. ఆమె వచ్చి గార్డెన్ అంతా చూపిస్తూ ఏదో చెప్తోంది. నువ్వూ చూస్తున్నావు. నీ చూపు నేను ఉంటున్న బిల్డింగ్ మీద కూడా పడింది. చటుక్కున నా తల కిటికీ నుంచి లాక్కున్నాను. ఒక క్షణమాగి మళ్ళీ తొంగి చూసాను.  ఒక ఐదు నిముషాలపాటు  ... రమ్మీ ...  కల లోంచి బయటికి వచ్చి రియల్ లైఫ్ లో కళ్లెదుట  ప్రత్యక్షమైన నా రమ్మీ ... పూల మొక్కల మధ్య అటూ ఇటూ తిరగటం తదేకంగా ఊపిరి బిగపట్టి చూసాను. ఆ తర్వాత పనిపిల్లతో పాటు లోపలికి వెళ్లి తలుపు వేసుకున్నావు. 


కిటికీ మూసి కూలబడ్డాను. గుండె మాత్రమే కాదు. శరీరం అంతా భారంగా అనిపించింది. నా కాళ్ళకింద భూమి కంపించినట్లు ఉండింది. 


నువ్వు నా పక్క ఇంట్లోనే నివాసానికి వచ్చావన్న నిజాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను!


రమ్మీ, డియరెస్ట్. 


దేవుడు నా మీద పగబట్టాడు. కోట్ల మంది బతికే ఈ మహానగరం లో,    ఏ సినిమాకో మాల్ కో పోతే  మనకి తెలిసిన మనుషులు కనిపించటమే అరుదు. అలాటిది ... నా ఇంటిపక్కనే ... ముప్ఫయి అడుగుల దూరంలో ... నువ్వు! దీన్ని యాదృచ్చికమూ  కాకతాళీయమూ అనగలమా?  నా మీద దేవుడు తీర్చుకుంటున్న కక్ష కాకపొతే ఏమిటిది?


ఇక తర్వాత జరిగేదేమిటో నాకు తెలుసు. ఎప్పుడో ఒకప్పుడు నేను నీ కళ్లబడతాను.  భుజాలదాకా పెరిగిన నా ముళ్ళపంది ముళ్ల లాంటి జుట్టూ, ఛాతీ దాకా వేలాడుతున్న  మాసిన గడ్డం, మురికి బట్టలు, పీక్కుపోయిన మొహం, లోతు కళ్ళు, పగిలిన పెదాలు  ... ఒక్క ముక్కలో చెప్పాలంటే, అసహ్యకరమైన నా రూపం ... నీచేత నన్ను గుర్తుపట్టనిస్తుందా? పట్టనిస్తుంది! ఒకప్పటి ప్రియుడిని! మర్చిపోలేవు! గుర్తు పడతావు! అప్పుడు ... అప్పుడు ... ఏం చేస్తావు?


కార్తీకపౌర్ణిమ నాడు నది ఒడ్డున ఏం చేసావో అదే చేస్తావు! నన్ను చూసి బెదురుతావు. భయంతో వణికి పారిపోతావు.  తలుపులూ  కిటికీలూ అన్నీ మూసేసుకుంటావు, ఎక్కడ నేను చొరబడతానో అని. ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరి అవుతావు. అదురుతున్న గుండెలని చేతులతో అదుముకుంటూ పరుపుమీదపడి  గుక్కతిప్పుకోకుండా ఏడుస్తావు. 


ఎందుకంటే --- ఆహ్లాదకరంగా సాగిపోతున్న నీ సంసార జీవితంలో నేను చిచ్చు పెడతానని భయపడతావు. నువ్వు ఆ ఇంట్లో ఉన్న ప్రతి క్షణమూ నీకు ముళ్ళమీద ఉన్నట్టుగా ఉంటుంది. పారిపోవాలి, పారిపోవాలి, వీడినుంచి వేలకివేళ్ళ మైళ్ళు దూరంగా పారిపోవాలి ... ఇదే ఆలోచన ఉంటుంది నీ మైండ్ లో అహర్నిశమూ. ఎందుకు పారిపోవాలో భర్తకి  చెప్పుకోలేవు. కానీ పారిపోవాలి ... నరకయాతన అనుభవిస్తావు. నేను నీకు జీవిస్తున్న పీడకలని అవుతాను. 


నిజంచెప్పనా? నా మనసులోనూ అదే ఆలోచన ఉంది. పారిపోవాలని! నీ నుంచి వేల మైళ్ళు దూరంగా పారిపోవాలని. నువ్వు నా ఊహాజీవితంలో చిచ్చు పెడుతున్నావు. నా రంగులకలకి అడ్డుపడుతున్నావు. నేను నా కలలోని భార్య రమ్యతో బతుకుతున్నాను. ఆమెని పొద్దున్న పెసరట్టు చెయ్యమంటాను, చేస్తుంది. సాయంత్రం టీ పెట్టమంటాను, పెడుతుంది. ఆఫీస్ కి వెళ్లేప్పుడు ముద్దు ఇవ్వమంటాను, ఇస్తుంది. టీవీ లో సినిమా చూద్దామంటాను. నా ఒళ్ళో పడుకుని చూస్తుంది.  కానీ ఇప్పుడు అవి నా కళ్ళముందు నిజంగా జరగటం చూడగలనా? వేరే మగవాడికి ఆ సేవలు నువ్వు చేస్తూ ఉంటే చూసి తట్టుకోగలనా? వాడికి నీ ప్రేమని పంచి ఇస్తూ ఉంటే చూసి సహించగలనా? నా గుండె  బద్దలైపోతుంది. 


నేను భరించలేను రమ్మీ. భరించలేను, భరించలేను, భరించలేను. చచ్చిపోతాను. 


అవును, నేను చచ్చిపోతాను. నేను కంటపడినప్పుడల్లా నువ్వు పారిపోయేబదులు, నువ్వు కంటపడినప్పుడల్లా నేను పారిపోయేబదులు ...  నేను ఈ లోకాన్నే విడిచిపెట్టి వెళ్ళిపోతే ...  మన ఇద్దరి సమస్యలూ పరిష్కారం అవుతాయి. 


ఈ ఉత్తరం రాయటం ముగించగానే, దాన్ని ఒక కవర్ లో పెడతాను. పైన నీ అడ్రస్ రాస్తాను. తర్వాత  ఆ పక్కన ఉన్న నిద్రమాత్రలు మింగుతాను. సుఖంగా నిద్ర పడుతుంది, మళ్ళీ కళ్ళు తెరవాల్సిన అవసరం లేకుండా, శాశ్వతంగా నిద్ర పడుతుంది.


పొద్దున్నే రమణమ్మ వచ్చి తలుపు కొడుతుంది. కొట్టి కొట్టి, "ఈ తాగుబోతు సచ్చినోడు మళ్ళీ తాగి పడిపోయినట్టున్నాడు" అనుకుని వెళ్లిపోతుంది. మర్నాడు మళ్ళీ వచ్చి కొడుతుంది. అప్పుడు దానికి అనుమానం వస్తుంది. నలుగుర్నీ పిలుస్తుంది. తలుపు బద్దలుకొట్టి లోపలికి వస్తారు. 


సెక్యూరిటీ అధికారి లు వస్తారు. నా బిల్డింగ్ ముందు జనాలు గుమికూడతారు. నా శవాన్ని బండి లోకి ఎక్కిస్తారు. నువ్వు చూస్తావు. "ఏమైంది అక్కడ?" అని నీ పనిపిల్లని అడుగుతావు. "ఆ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ లో ఎవరో సూసైడ్ చేసుకున్నారంటమ్మా. తాగుబోతోడంట", చెప్తుంది. 


కొద్దిసేపటి తర్వాత నీ చేతికి ఈ ఉత్తరం అందుతుంది.... 


రమ్మీ .... బాగుంది కదూ ఈ ప్లాను? 


కానీ నిన్ను పెర్మనెంట్ గా వదిలిపెట్టేసానని భ్రమపడి సంబరపడిపోకు! 


నేను నిన్ను మళ్ళీ కలిసి తీరతాను,  పైలోకంలో! 


అక్కడ కూడా నదులుంటాయి తెలుసా?  వాటికి కూడా వరదలొస్తాయిలే. రాకపోతే దేవుడ్ని రిక్వెస్ట్ చేసుకుంటా కొంచెం తెప్పించమని. ఆ వరదల్లో  నువ్వు నీలం ఓణీ వేసుకుని మా ఇంటికి వస్తావు. ఎంత ముద్దుగా ఉంటావో! ముగ్ధ. పూబోణి. వెన్నెల్లో ఆడపిల్ల! 


మనం కాగితపు పడవలు చేసి నీళ్ళల్లో వదులుతాం... రాత్రంతా కబుర్లు చెప్పుకుంటాం... నీకు కవిత్వం చెప్తా.. నన్ను ఆటపట్టిస్తావు ... నాకు కోపమొచ్చి నిన్ను గాఠిగా ముద్దుపెట్టేసుకుని, నా నోటితో  నీ నోరు మూసేస్తా... 


ఆ లోకంలో కార్ యాక్సిడెంట్ లు ఉండవు. కనుక మనం పెళ్లిచేసుకుంటాము. ఊరు ఊరంతా వస్తుంది మన పెళ్ళికి. "ఎంత బాగుంది జంట!" అనుకుంటుంది.


ఒక ఏడాది గడిచాక ...  కార్తీక పౌర్ణమి నాడు ... నా బిడ్డ నీ కడుపులో పెరుగుతున్నప్పుడు ... నేనూ నీతో పాటు నది ఒడ్డుకి వస్తాను. నువ్వు దీపం పెడుతుంటే ఫోటోలు తీస్తాను... 


రమ్మీ ... డియరెస్ట్ ... 


"చిల్లరకొట్టు చిట్టెమ్మ" అనే పాత సినిమా చూసావా? అందులో  హీరో హీరోయిన్లు ప్రేమించుకుంటారు.  భార్యాభర్తలమైపోతామని కలలు కంటారు.  అమ్మవారి గుళ్లో మొక్కుకుంటారు,"తల్లీ మమ్మల్ని దీవించవమ్మా" అని. కానీ పాపం ఏమవుతుందో తెలుసా? దేవత దీవించదు. తప్పనిసరి పరిస్థితుల్లో హీరో ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఆ పెళ్ళిలో మొహాన నవ్వు పులుముకుని హీరోయిన్ వాళ్ళకి మంగళారతి పాడుతుంది. కొత్త దంపతులు గుడికి వెళ్తారు. ఈర్ష్య అసూయలు లాంటి లేని స్వచ్ఛమైన మనసున్న ఆ హీరోయిన్ దేవతని ఉద్దేశించి ఏమని పాడుతుందో తెలుసా?


ఉలకని  పలకని మూగరాయివని 
తెలిసే అందరు వస్తారు 
కోరినవన్నీ  అవుతాయనుకొని 
గుండె నింపుకుని ఎడతారు 
మౌనంగా ఎన్నాళ్ళని  ఉంటావోయమ్మా 
మనసారా ఈసారైనా దీవించవమ్మా 
మనసారా ఈసారైనా దీవించవమ్మా 


రమ్మీ. మనం కూడా ఎన్నో గుళ్ళలో మొక్కుకున్నాము, మనని జంటగా దీవించమని. దేవుళ్ళు దీవించలేదు. 


ఈర్ష్య అసూయలు లేని స్వచ్ఛమైన మనసు కాదు నాది. ఈలోకంలోని నీ భర్తతో నేను నిన్ను చూడలేను. కనుక పైలోకంలోని దేవతలు  మనసారా ఈసారైనా దీవించాల్సింది ఎవరినో తెలుసా. మనల్ని. నిన్నూ నన్నూ. అక్కడ నేను చందమామని, నువ్వు వెన్నెలవి. 


పై పాటకి పల్లవి కూడా విను.


సుక్కల్లో పెదసుక్క చందమామా 
ఎలుగులకే ఎలుగమ్మ ఎన్నేలమ్మా 
ఆ చందమామకు, ఈ ఎన్నేలమ్మకు 
చల్లని గోదారి ఒడిలో పెళ్ళమ్మా 
ముత్యాల జల్లమ్మా 


రమ్మీ, డియరెస్ట్. 


రమ్మీ, డియరెస్ట్. 


ఆ ముత్యాల జల్లు కురిసేవరకు ... సెలవు!  ఉంటాను. 


* * *


అతని కళ్ళమ్మట ధారగా నీళ్లు ప్రవహిస్తున్నాయి. 


తను రాసినది  చదివిన మనిషి కంటతడి పెట్టాలనే అతను ఆశిస్తున్నాడు. కానీ తానే భావోద్వేగానికి లోనయ్యి ఏడవటం అతన్ని ఒక పక్క ఇబ్బంది పెట్టింది. కానీ ఇంకో పక్క ... 


ఉత్తరం పూర్తయ్యింది. తృప్తిగా ఉంది. గుండెల్లోని మంట మటుకు తగ్గలేదు. ఇంకొక టాబ్లెట్ తీసుకుని వేసుకున్నాడు. ఆ మందులు ఫాస్ట్ గా పనిచెయ్యాలంటే నమలాలి, చప్పరించాలి,  మింగకూడదు అని వినటం గుర్తొచ్చింది.  


కాళ్ళూ చేతులూ విదిలించుకున్నాడు. కాలు విదిలిస్తుంటే నొప్పి మళ్ళీ తన్నుకుని వచ్చింది. 


టేబుల్ లాంప్ ఆఫ్ చేసాడు. గది అంతా  చీకటి వ్యాపించింది.  ఒక మూల నుంచి విసుగు పుట్టించే ఆ శబ్దం వస్తోంది.


కిటికీలోకి చూసాడు. చీకటికి అలవాటు పడిన కళ్ళు ఏదో  గమనించాయి. చేతులు అడ్డంపెట్టుకొని కనుబొమలు ముడిచి కళ్ళు చిట్లించి మళ్ళీ చూసాడు. 


~ ఇంకా ఉంది
[+] 2 users Like KingOfHearts's post
Like Reply


Messages In This Thread
అంతిమలేఖ - by KingOfHearts - 15-03-2024, 07:37 PM
RE: అంతిమలేఖ - by sri7869 - 15-03-2024, 09:36 PM
RE: అంతిమలేఖ - by KingOfHearts - 16-03-2024, 10:32 PM
RE: అంతిమలేఖ - by sri7869 - 16-03-2024, 10:56 PM
RE: అంతిమలేఖ - by Rishithejabsj - 17-03-2024, 10:13 PM
RE: అంతిమలేఖ - by KingOfHearts - 18-03-2024, 09:07 PM
RE: అంతిమలేఖ - by sri7869 - 18-03-2024, 11:50 PM



Users browsing this thread: 1 Guest(s)