Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అంతిమలేఖ
#1
అంతిమలేఖ 

రచన: ఆటీను రాజు 


గది అంతా చీకటి. తెరిచిఉన్న కిటికీ కి ఆనుకుని టేబుల్ ఉంది. దాని మీద టేబుల్ లాంప్ వెలుగుతోంది. లాంప్ పక్కగా తెల్ల కాగితాలు. 


కాగితాలు మాత్రమే కాదు. ఒక బాటిల్, గ్లాస్ కూడా ఉన్నాయి. యాష్ ట్రే. సిగరెట్ ప్యాకెట్. ఆ పక్కనే ... ఏమిటవి? ఏవో మందులు. టాబ్లెట్ లు. 


టేబుల్ ముందరి కుర్చీలో అతను కూచుని ఉన్నాడు. దీర్ఘాలోచనలో ఉన్నాడు. కొంచెం ముందుకి వొంగి ఉన్నాడు. కనుబొమలు ముడిచి ఉన్నాయి. చేతి లో పెన్ ఉంది. దాని టిప్ ని నముల్తున్నాడు. టైము ఎంతయిందో తెలియదు. ప్రపంచం నిద్రపోయింది. అతను మటుకు చాలా మెలుకువగా ఉన్నాడు. 


అతనికి ఎలా మొదలు పెట్టాలో తెలియటం లేదు. ఇందాకటినుంచి అదే కొట్టుమిట్టాడుతున్నాడు. మొదలుపెట్టాక ఏమి రాయాలన్నది వివరంగా నిర్ణయించుకున్నాడు. కానీ ప్రారంభమే తేల్చుకోలేకపోతున్నాడు. తొడ నుంచి మోకాలుకి పాకుతున్న నొప్పి అతన్ని ఇబ్బంది పెడుతోంది. ఆలోచనకి అడ్డం వస్తోంది. అంతకన్నా ముఖ్యంగా, అతని లోలోని నొప్పి ... గుండెల్లోని నొప్పి ... చాలా బాధ పెడుతోంది, కడుపుని పిండేస్తోంది. 


టేబుల్ మీద ఉన్న మందులకేసి చూసాడు. అవి మింగితే అతని కష్టాలు తీరిపోతాయి. కానీ రాయాల్సింది చాలా ఉంది. మందులు ఇప్పుడు మింగితే బాధ తగ్గి నిద్ర లోకి జారుకోవచ్చు. అలా వళ్ళు తెలియకుండా నిద్ర లోకి జారుకుంటే ఆ నిద్ర .... నో! మామూలు నిద్ర కాదు అతనిది! పడుకుంటే లేవడు! అందుకని ముందు ఈ ఉత్తరాన్ని ముగించాలి. రేపు పొద్దున్న కల్లా అది చేరవలిసిన చేతుల కి చేరాలి. టైము లేదు. రాయటం ముగించినాక అప్పుడు మందులు తీసుకుంటే మంచిది. 


గాలిలో పెద్దగా చలనం లేదు. కిటికీ లోంచి లైట్ గా మామిడి వాసన వస్తోంది. బయట మామిడి తోట ఉంది. అప్పుడప్పుడు మామిడి ఆకులు సన్నగాలికి ఊగుతున్నాయి.


పదిహేనేళ్ల కిందటి ప్రియురాలు. ప్రాణమిచ్చి ప్రేమించిన ప్రేయసి. పెళ్లి దాకా వచ్చి ... చివరి క్షణం లో భగ్నమైన ప్రేమ. ఆ రోజుల్లో ఆమెని ఎన్నో ఎన్నో ముద్దుపేర్లతో పిలిచాడు. కానీ ఇప్పుడు ఆమె పరాయి మొగవాడి భార్య. ఆ మగవాడి బిడ్డకి తల్లి. పండంటి కాపురాన్ని నడుపుతున్న గృహిణి. పాత పేర్లతో పిలిచే హక్కు అతనికి ఇప్పుడు లేదు. మరి ఏమని పిలవాలి? 


అప్పట్లో ఏమని పిలిచేవాడో గుర్తు చేసుకోటానికి ప్రయత్నించాడు. ఆ రోజులే రోజులు! హ్యాపీ హ్యాపీ డేస్. సరదాగా గడిచిపోయిన రోజులు. ఇద్దరి పెదవుల మీద ఎప్పుడూ పాట ఉండేది. గోదావరి గట్టు మీద కూచుని, గాలికి ఆమె వైల్డ్ వైల్డ్ ఉంగరాల జుట్టు ఊగుతూ ఉంటే, పెద్ద పెద్ద కాటుక కళ్ళలోకి చూస్తూ ... ఏమని పిలిచేవాడు? "రమ్యా" అని ఒకసారి. "రమ్మీ!" అని ఇంకొసారి. "రమ్ములూ" అని చిలిపిగా మరొకసారి. ("ఛీ, ఛీ, ఏదోలా ఉంది. అలా పిలవద్దు" అనేది నవ్వుతూ). 


బాటిల్ అందుకుని గ్లాసు సగం నింపాడు. ముందు రెండు సిప్ లు తీసుకుని తర్వాత రెండు పెద్ద గుటకలు మింగాడు. పెదవులు తుడుచుకుని మరోసారి మెదడు ని ఆలోచన మీద కేంద్రీకరించాడు. 


ఉత్తేజం వచ్చింది. పరిష్కారం తట్టింది. 


ఒకొక్కసారి ఇంగ్లీషే మంచిది! 


"రమ్మీ డియరెస్ట్!" రాయటం మొదలు పెట్టాడు. 


"రమ్మీ డియరెస్ట్! దయచేసి అసహ్యంతో స్పందించకు. భయంతో చదవకుండా ఈ ఉత్తరాన్ని ముక్కలు ముక్కలు గా చింపి పారెయ్యకు. ఇంకొద్ది సేపటిలో నేను ఉండను. నేను నిన్ను వేధించటానికి రాయటం లేదు. నాకు నీమీద లేని హక్కుని ప్రకటించటానికి రాయటంలేదు. నేను రాస్తున్నది మిసెస్ రమ్య కి కాదు. పదిహేనేళ్ళు గా ఒక కలలో బతుకుతున్నాను. ఆ కలలోని రమ్య నాకు పరాయి మనిషి కాదు. కానీ ఆ కల పూర్తిగా నాదే. దానితో నీకు ఎటువంటి సంబంధం లేదు. అది నిన్ను బెదిరించదు, ఇబ్బంది పెట్టదు. ఈ చివరి క్షణం లో నా చిన్న కోరిక ఒకటే. ఈ ఉత్తరాన్ని ఆ రమ్యకి రాయనియ్యి. ఆ రమ్య ఎప్పటికీ నాదే. జన్మజన్మలకి నాదే. ఆ రమ్య ... ఆ రమ్య ... నా రమ్మీ డియరెస్ట్!"


గ్లాస్ ఎత్తి ఇంకొక సిప్ తీసుకుని సిగరెట్ వెలిగించాడు. లాంప్ షేడ్ చుట్టూ చిన్న చిన్న మేఘాల్లా వ్యాపిస్తూన్న పొగలో ఇప్పుడు ఆమెని స్పష్టం గా చూడగల్గుతున్నాడు. అప్పట్లో ఎలావుండేదో సరిగ్గా అలాగే చూడగలుగుతున్నాడు. చంద్రబింబం లాంటి మొహం అమాయకత్వాన్ని ప్రకాశిస్తోంది. గులాబీ రేకుల్లాంటి పెదవులమీద చిరునవ్వు. అదుపులోలేని నల్లటి ఉంగరాల జుట్టు. 


ఊళ్ళో ఆడపిల్లలందరికి ఆమె అంటే ఈర్ష్య. ఊళ్ళో మగవాళ్లందరికి అతడంటే అసూయ!


"రమ్మీ, డియరెస్ట్", రాసాడు. భావోద్వేగం ఒత్తిడి ఒక్కసారిగా, ఒక ఆఖరి ఉధృతి లో ఫెళ్ళున పేలి గాల్లో కలిసిపోయినట్టు అనిపించింది. బరువు తొలగిపోయింది. ఇప్పుడు పదాలు చాలా సులభంగా వస్తున్నాయి. 


* * * 


రమ్మీ, డియరెస్ట్, ఎక్కడ మొదలుపెట్టమంటావు? ఎక్కడ అంతం చెయ్యాలో తెలుసు. నా జ్ఞాపకాల కధనం తో నీ వ్యక్తిగత జీవితంలోకి నేను చేస్తున్న ఈ చొరబాటు --- నా అంతం తో పాటే అంతమవ్వాలి. సినిమాల్లోలాగా. 


ఇది హింస. జ్ఞాపకాలు ఒక హింస. మధురమైన జ్ఞాపకాలు తీవ్రమైన హింస. తెల్లవాళ్లు వాటికో పేరు కూడా పెట్టారు. నాస్టాల్జియా. ఈ నాస్టాల్జియా నా మనసుని హింసించకుండా పడుకుని నిద్ర పోగలగటం, ఒక్క కల కూడా లేని లోతైన నిద్ర లోకి వెళ్ళిపోవటం -- ఇది కొన్నేళ్లుగా నాకు లభించని లగ్జరీ. కానీ ఇకపైన కాదు. అతిత్వరలోనే నాకు ప్రశాంతత వస్తుంది.  నీ హ్యాపీ సెటిల్డ్ లైఫ్ లో నా ఈ ... ఏమన్నాను? ... చొరబాటు, అవును దాడి  ... ముగించగానే, నాకు ప్రశాంతత వస్తుంది! ఆ తర్వాత నేను ఎల్లప్పటికీ ప్రశాంతంగా ఉంటాను. నీ జీవితం లోకి మరొక చొరబాటు ఉండదు. కనుక కొద్దిక్షణాలు నన్ను భరించు ... ఈలోగా ఎక్కడ మొదలుపెట్టాలో నిర్ణయిస్తాను. 


వానా కాలం లో ఆ రోజు తో మొదలుపెట్టనా? కుండపోతగా వాన కురుస్తోంది, గుర్తుందా? గోదారి పొంగింది. దిగువ ఊరు మునిగిపోయింది. మీ ఇంట్లోకి నీళ్లు వచ్చేసాయి. మీ కుటుంబం అంతా మోకాళ్లలోతు నీళ్లలో ఈదుకుంటూ మా ఇంటికి వచ్చి ఆశ్రయం తీసుకున్నారు. ఆరోజునే కదా , మన కధ సీరియస్ గా మొదలైంది?


పెద్దదే అయినా పురాతనకాలపు పెంకుటిల్లు మాది. చాలా గదుల్లో కప్పులోంచి నీరు లీక్ అవుతోంది. ముందుగదే కొంచెం పొడిగా ఉంది. పెద్దవాళ్ళు వాళ్ళ మాటల్లో వాళ్ళు బిజీ గా ఉన్నారు. నువ్వూ నేనూ కిటికీ పక్కన ఎదురెదురుగా కూచుని వర్షంలోకి చూస్తూ కబుర్లు చెప్పుకున్నాం. బయట వీధి కాలువలా ప్రవహిస్తోంది. 


నువ్వు అప్పటికి నాకు తెలియనిదానివి కాదు. మన కుటుంబాలు ఫామిలీ ఫ్రెండ్స్ అవటం తో చిన్నప్పటి నుంచి మనం అప్పుడప్పుడు కలుసుకుంటూనే  ఉన్నాం. కానీ ఎక్కువగా అక్కతోనే మాటాడేదానివి. ఆ రోజున మటుకు అక్క ఇంట్లో లేదు. నేనే నీకు కంపెనీ. అదే మన కధని మలుపు తిప్పిందనుకుంటా. 


ఆ రోజున, నువ్వలా కొంచెం సిగ్గుతో నాకు చాలా దగ్గరగా కూచుని, ఓ పక్క నీ ఒత్తైన ఉంగరాల జుట్టుని కొద్దిగా మెడవంచి తువ్వాలుతో ఆరబెట్టకుంటూ, మరో పక్క నా వంక క్రీగంట చూస్తూ, మాటాడుతూ ఉంటే ... మొదటిసారిగా ఎదిగిన రమ్యని చూసాను. నీలపు రంగు ఓణీ. పసిడి పచ్చని ఛాయ. "మొహంలో సగం మేమే!" అన్నట్టుగా ఉన్న కళ్ళలో చెదిరిపోయిన కాటుక. చెవికి బుట్టలు. "లొంగను" అంటున్న జుట్టుని విసురుతుంటే  పాలబుగ్గలమీదకి చిమ్ముతున్న నీళ్ల బొట్లు. కుంకుమ దిద్దిన నుదురు. 


ముగ్ధ.  ముద్దొచ్చే ... వెన్నెల్లో ఆడపిల్ల కాదేమోలే, కానీ వానల్లో ఆడపిల్ల (నవ్వు, కొంచెం).


నువ్వు జుట్టు ఆరబెట్టుకున్నాక ఇద్దరమూ అరుగు మీదకి వెళ్లి చిన్నపిల్లల్లా కాగితపు పడవలు చేసి నీళ్ళల్లో వదిలాము. "ఇది శ్రీలంక పోతుంది", అన్నావు నువ్వు ఒక బోట్ వదిలి. "ఇది ఇంకా దూరం ... పాకిస్తాన్ పోతుంది" అన్నాను నేను ఇంకోటి విడిచిపెట్టి. "నీ మొహం, దేశం చుట్టూ తిరిగిపోతుందా?" అని నాకు జాగ్రఫీ పాఠం చెప్పావు, నాకు తెలియదన్నట్టు. "నేను కాలేజీ చదువు అయ్యాక ఈ బోట్ లో అమెరికా పోతా", అన్నాను ఒక పడవ చేసి. "కొంచెం పెద్దది చెయ్. నేనూ వస్తా", అన్నావు నువ్వు. నవ్వుకున్నాం. 


"నిజంగా అమెరికా పోతావా?" అడిగావు నువ్వు కొంచెం సేపు ఆగి. 


"అవును వెళ్తా" అన్నాను. "మరి నువ్వేం చేస్తావ్ చదువయ్యాక?" అడిగాను. 


"అమ్మా నాన్న పెళ్లి చేసేస్తామంటున్నారు", చెప్పావు. 


"సంబంధాలు చూడనా?" అడిగాను, 


"అమెరికా పోయి అక్కడ చూస్కో పెళ్లిళ్ల పేరయ్య ఉద్యోగం"


మళ్ళీ నవ్వులు. 


అలా అలా మాటలు. ఎన్నో ఎన్నో మాటలు. ఇష్టాయిష్టాలు తెలుసుకున్నాం. నీ ఆడపిల్లల కాలేజీ లోని కధలు నువ్వు నాకు చెప్పావు. నా కాలేజీ కధలు నేను నీకు చెప్పాను. ఆ రాత్రి, ఇంటి మొత్తం మీద ఒకటే గది  కొద్దో గొప్పో పొడిగా ఉండటం వల్ల, మన  రెండు ఫ్యామిలీలు అక్కడే నేల మీద దుప్పట్లు పరుచుకుని సర్దుకున్నాయి. నీవీ నావీ  పక్కలు పక్క పక్కనే వచ్చాయి. "ఇంక పడుకోండ్రా" అని అమ్మ అంటూ ఉన్నా కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నాం. మన ఇష్టమైన పుస్తకాల గురించి, రచయితల గురించి, సినిమాల గురించి, పాటల గురించి మాటాడుకున్నాం. నువ్వు పాటలు బాగా పాడతావన్న సంగతి నాకు తెలిసింది. నేను కవిత్వం రాస్తానని నీకు చెప్పాను. అలా  మాటాడుకుంటూ  పోతూ ఉంటే  ... టైము ఒకటో రెండో అయినప్పుడు అనుకుంటా ... మనిద్దరిమధ్యా నిశ్శబ్దం పెరిగింది. ఎందుకో తెలుసా? నిద్ర వచ్చి కాదు. మనం ఒకరికొకరు కనెక్ట్ అయ్యామన్న సంగతి ఇద్దరికీ అర్ధమైంది. మనసులో మధురభావన మొదలైంది. అప్పుడు పెదవులు విశ్రాంతి  తీసుకుని గుండెలు మాటాడుకున్నాయి ... ఇంటి కప్పు మీద వర్షపు జల్లుల థప్ థప్ శబ్దాన్ని వింటూ. నీ చేతిలో చెయ్యి వెయ్యాలని అనిపించింది. ధైర్యం చెయ్యలేకపోయాను. 


రోజులు గడిచాయి. ప్రేమ పెరిగింది. బాగా దగ్గరయ్యాము. 


కొన్ని నెలల తర్వాత, మీ నాన్నగారి అరటి తోట లో పంప్ సెట్ దగ్గర పిట్ట గోడ మీద ఇద్దరం కూచుని ఉండగా నేను నీకు నా లేటెస్టు కవిత్వం చదివి వినిపించాను. నాకు బాగా గుర్తుంది --  నువ్వు కట్టిన కుంకుమవన్నె  చీర తోట పచ్చదనానికి కాంట్రాస్ట్ గా ఉండింది. నాతో ఆడుకున్నావ్ లే ఆ రోజు.


నేను కవిత్వం చదివాను.


తొలకరి జల్లుల 
పులకించి మొలిచిన 
ప్రేమవృక్షపు బీజం ... 


* * * 


అతడు రాయటం ఆపి నిటారుగా కూచుని గట్టిగా ఊపిరి పీల్చాడు. హఠాత్తుగా ఒకటి గుర్తొచ్చింది, కవిత్వం రాసి చాలా చాలా రోజులైందని. "ఎందుకని?" తనని తనే ప్రశ్నించుకున్నాడు. "ఎందుకని కవిత్వం రాయటం మానేసాను?"


గుండెల్లో మంట భారంగా అనిపించింది. మందు  గుళికలు   ఆహ్వానిస్తున్నట్టుగా కనిపించాయి.  వాటిని మింగి ఆ భారాన్ని తొలగించుకోవాలని బలంగా అనిపించింది. కానీ అప్పుడే కాదు. పడుకునేముందు వేసుకుంటే బెటరు. ఉత్తరం పూర్తి చెయ్యాలి. 


గ్లాస్ ఎత్తి ఇంకొన్ని సిప్ లు తీసుకున్నాడు. పెన్ అందుకుని మళ్ళీ రాయటం మొదలుపెట్టాడు. 


* * *


తొలకరి జల్లుల 
పులకించి మొలిచిన 
ప్రేమవృక్షపు బీజం
గడిచిన వసంతాన
నీ వీక్షణా వీచికల
నా ఎదను వాలింది 


నేను నీకు ఇది చదివి వినిపించినప్పుడు నువ్వు సీరియస్ గా మొహం పెట్టావు. అది నాన్సెన్స్ అని ప్రకటించావు.


"నాన్సెన్సా ?" అన్నాను నేను, కొంచెం అహం దెబ్బ తిని. 


"యస్, నాన్సెన్స్", చెప్పావు. "నువ్వు ఎప్పుడూ పదే పదే వినిపించే నాన్సెన్స్. ప్రతీ కవిత కూ  నేనే నీకు స్ఫూర్తిని. అందమైన నేను. చందమామ లాంటి నేను. పువ్వు లాంటి నా నవ్వు.  ఒక కవిత లో నేను కంచిపట్టు చీర కట్టిన గోదావరిని. ఇంకో కవితలో ఇదుగో ... ఈ అరటితోట అంతా నా పైట. సిల్లీ గా ఉంది బాస్!"


నేను నీ కళ్ళలోని కొంటెతనాన్ని చూడలేకపోయాను. నా అహం బాగా దెబ్బతింది. 


"బట్ ... నేను మనస్ఫూర్తిగా ఏం  ఫీల్ అవుతానో  అదే కవిత్వం రూపంలో బయటపెడుతున్నా", అన్నాను నా సెల్ఫ్ రెస్పెక్ట్ ని కాపాడుకుంటూ. 


"ఆఫ్ కోర్స్. దిక్కులేని ఆడవాళ్ళ బాధలగురించి ఎందుకు మనస్ఫూర్తిగా ఫీల్ అవ్వవు? ఎందుకు వేరే టాపిక్కుల మీద కవిత్వం రాయవు? ఆడవాళ్ళ హక్కుల మీద రాయచ్చుగా?"


"ఆ టాపిక్కుల మీద నాకు ఇంటరెస్ట్ లేదు!"


"అవునవును, ఆ టాపిక్కుల మీద  మిస్టర్ రొమాంటిక్ గారికి  ఇంటరెస్టేం ఉంటుంది?  నా మీద నీకున్న  ఫేంటసీలన్నీ పేజీలు పేజీలు గా గుప్పిస్తావు. నన్ను ముద్దాడుతున్నట్టో, కౌగిలించుకుంటున్నట్టో, ఇంకేదో చేసేస్తున్నట్టో ... ఎంతసేపూ ఇదేనా? గృహహింస కీ, మగాడి కామానికీ బలైపోతున్న ఆడవాళ్ళ గురించి  ఆలోచించచ్చుగా? వాళ్ళ గురించి రాయచ్చుగా? చలం పుస్తకాలు చదివావా ఎప్పుడైనా?"


ఈ పాటికి నేను కంట్రోల్ లోలేని కోపంతో వణికిపోతున్నాను. 


"ఓహ్ అలాగా. సడన్ గా స్త్రీస్వేచ్చావాది అయిపోయారా  తమరు? విప్లవం వర్ధిల్లాలా? నువ్వు చదివావా అసలు చలం పుస్తకాలు? సెక్స్ మేడమ్! ముద్దలు ముద్దలు కారుతుంది సెక్స్ ఆయన రాతల్లో. అది మాత్రమే గొప్ప సాహిత్యం కదా నీకు. కానీ నా నిజమైన ఫీలింగ్స్ మటుకు కాదేం?" కసి వెళ్ళకక్కాను. 


"నిజమైన ఫీలింగ్సా. కోయ్ కోయ్. అసలు నువ్వు నా శంఖం లాంటి మెడ  గురించి, కోటేరు లాంటి ముక్కు గురించి, పిడికిలిలో ఇమిడే నడుము గురించీ ఎందుకు రాస్తావో చెప్పనా? కమాన్  .. నిజాయితీ తో ఒప్పుకో ... నన్ను ఫిదా చేసి అడ్వాంటేజి తీసుకుందామని కాదూ... నన్ను టెస్ట్ చేస్తున్నావు ... చూస్తున్నావు నిన్ను ఎంత దాకా వెళ్లనిస్తానా అని. ఎప్పుడోఒకప్పుడు, "ఇంక ఇది లొంగిపోయిందిలే, ఏం చేసినా ఏమీ అనదు", అని డిసైడ్ అయిపోయి ఏ ముద్దో పెట్టేస్తావు. అవునా? ఛాన్స్ దొరికితే ఇంకేదో చేస్తావ్ కూడా!"


"షటప్!" అరిచాను. లేచి నుంచొని కాగితం నేల కేసి కొట్టాను. "షటప్! ఏం మాటాడుతున్నావు? నీతో ఇంత  దూరం వచ్చాక నేను చీప్ మగాడిని, బేవార్స్ గాడిని అని నిర్ణయించుకున్నావా? నా మీద నీ ఒపీనియను అదే అయినప్పుడు అసలు ఇక్కడిదాకా రానివ్వటం దేనికట? థాంక్  యు, ఇప్పటికైనా బయటపడ్డావు. గుడ్ బై!" 


నిప్పులా రగిలిపోతూ తిరిగి వెనక్కి చూడకుండా సైకిల్ కేసి పెద్ద పెద్ద అంగలు వేసాను. 


"ఓయ్, ఉండు", పరిగెత్తుతూ నా వెనక పడ్డావు. "ఆగు! మరీ అంత కోపమా!" అంటూ  అడ్డంపడి ఆపి నా ఎదుట నుంచున్నావు. నిన్ను పక్కకి తోసెయ్యబోయాను. కానీ ... నేను ఏం జరుగుతోందో గ్రహించేలోపల ... నీ చేతులు నా మెడ చుట్టూ ఉన్నాయి. నీ పెదవులు నా పెదవులని హత్తుకుంటున్నాయి!


"సారీ రా ప్రేమికుడా. ఏదో సరదాగా ఆట పట్టిస్తున్నా అంతే, దానికింత రెచ్చిపోతే ఎలా?" అన్నావు గోముగా. 


జనరల్ గా మొగాడు చొరవ తీసుకుంటాడు. మొదటి ముద్దు పెడతాడు. నాకు మటుకు జీవితం లో మొదటిముద్దుని నా ప్రేయసి ఇచ్చింది. 


"నువ్వు నన్ను అడ్వాంటేజి తీసుకుంటావా? నీకు అంత సీనుందా? ఏదీ, తీసుకో చూద్దాం", చిలిపిగా అంటూ ఇంకోసారి ముద్దు పెట్టావు. ఈ సారి గాఢంగా, చాలాసేపు. 


అయినాక నా మెడ చుట్టూ చేతులు అలా ఉంచి నా కళ్ళలోకి చూస్తున్నావు. నీ కళ్ళు నవ్వుతున్నాయి. నేను ఇంకా షాక్ లోంచి తేరుకోలేదు. 


"ముద్దు పెట్టుకున్న పెదవుల మధ్య సూర్యుడు ఉదయిస్తాడట. అలాగని  కవి రాశారు, తెలుసా?" అడిగావు. 


"ఏ కవి?" అన్నాను. 


"వేటూరి"


పాట  పాడావు.


చుంబించుకున్న, బింబాధరాల
సూర్యోదయాలే  పండేటి వేళా ...


నాకూ గుర్తొచ్చింది ఆ పాట. ప్రేమించు పెళ్లాడు. ఇళయరాజా.  నేను కూడా గొంతు కలిపాను. 


వయ్యారి గోదారమ్మ వళ్ళంతా ఎందుకమ్మా కలవరం 
కడలి ఒడి లో కలిసిపోతే కల - వరం ...


* * *


పెన్ను కింద పెట్టి నడుము వెనక్కి వాల్చి  కిటికీ లోంచి బయటికి చూసాడు. చిమ్మ చీకటి. లీలగా మామిడి చెట్లు తెలుస్తున్నాయి. 


చేతులతో మొహం రుద్దుకున్నాడు. గడ్డం గీసి ఎన్నాళ్ళయిందో!  గ్లాస్ ఎత్తి తాగాడు. 


తొలిముద్దు! దాని తియ్యదనం! భావుకత అతన్ని ఆలోచింపచేసింది. రోజులు మారిపోయాయి. మెటీరియలిజం బాగా పెరిగిపోయింది. యువతీ యువకులు చెడిపోయారు. అందరికీ తక్షణ తృప్తి కావాలి. వేచి ఉండే ఓపిక లేదు.  పరిచయమైన రెండురోజులకే మంచం ఎక్కుతున్నారు. పెళ్లి లోపల పదిమంది పార్టనర్ లని మారుస్తున్నారు.  ప్రపంచం అంతా సెక్స్ మయం. నలుమూలలా  మనిషిని వలవేసి పట్టుకుంటున్న సెక్సువల్ మెసేజింగ్. సినిమాల్లో సెక్స్. పుస్తకాల్లో సెక్స్. ఆన్ లైన్ లో సెక్స్. చివరికి టూత్ బ్రష్ అడ్వర్టయిజుమెంట్  లో కూడా సెక్స్...


కానీ పాతరోజుల్లో? నిజమైన ప్రేమ ఉండేది. అమాయకత్వం ఉండేది. రొమాన్సు ఉండేది.  నది ఒడ్డునా, పొలం గట్టునా చేతిలో చెయ్యి వేసి నడవటం ఉండేది. ప్రేమలేఖలు ఉండేవి. ఎప్పుడో ఒకసారి ... భయం భయం గా ... ముద్దు దొంగిలించటం ఉండేది.... ఈ రోజుల్లో అబ్బాయిలు అమ్మాయిలు అసలు వీటికేమైనా విలువ ఇస్తున్నారా? తక్షణ తృప్తి ...  క్షణికావేశం...


గ్లాసు ఖాళీ అయ్యింది.  గది చల్లబడిందన్న విషయం గ్రహించాడు. కిటికీ మూసేద్దామన్న ఆలోచన వచ్చింది. కానీ ముయ్యాలంటే లేచి నిలబడాలి. కాలు నొప్పి పుడుతుంది. ఆ నొప్పి జ్ఞాపకాలకి అడ్డం వస్తుంది. లేవకూడదు. 


బాటిల్ తీసి గ్లాసు ని నింపాడు. చాలా సిప్పులు తీసుకున్నాడు. టేబుల్ మీద ఉన్న మందు గుళికలు మింగాలనీ, గుండెల్లోని బాధని అంతం చేయాలనీ మరొకసారి టెంప్ట్  అయ్యాడు. నిగ్రహించుకున్నాడు. సిగరెట్టు ముట్టించాలా  వద్దా అని తటపటాయించి, ఒకటి తీసి వెలిగించాడు.   రాయటం మొదలుపెట్టాడు. 


* * *


డియరెస్ట్ రమ్మీ, ఇంగ్లీష్ లో సూక్తం ఉంది. మాన్ రిమెంబర్స్ ది ఫస్ట్ కిస్ ఈవెన్ ఆఫ్టర్ ది వుమన్ హాజ్ ఫర్గాటెన్ ది లాస్ట్ ... ప్రియుడు అప్పుడే పెట్టిన ముద్దుని కూడా ఆడది మర్చిపోతుందిట, కానీ మగాడు మొట్ట మొదటిముద్దుని ఎప్పటికీ  గుర్తు ఉంచుకుంటాడట. 


మనం పెట్టుకున్న ముద్దులన్నీ  నాకు గుర్తున్నాయి. కానీ, ఆ జూన్ నెలలో పెట్టిన ముద్దు అన్నిటికంటే బాగా గుర్తుంది. ఎందుకంటే అదే ఆఖరి ముద్దు. 


గోదారి ఇసుకతిన్నె లో చెట్టపట్టాలు వేసుకుని నడుస్తున్నాము. నది తగ్గివుంది,  ఇంకా వానలు రాలేదు, కానీ ప్రశాంతం గా ఉంది. దూరంగా కనుచూపు మేరలో ఒక చిన్న పడవ.  


క్రీమ్ కలర్ చీర కట్టుకున్నావు. అది నాకు ఇష్టమని నీకు తెలుసు. 


"కానీ", నీకు సర్దిచెపుతూ మెత్తగా అన్నాను, "నేను ప్రతి ఏడాదీ హాలిడే కి వస్తూనే ఉంటాను. రెండేళ్లలో నీ చదువు పూర్తయిపోతుంది. అప్పుడు నేనింక రానక్కర్లేదు. ఎందుకంటే నువ్వే వచ్చి నాతో ఉంటావు, నా భార్యగా! మనకి పెళ్లవుతుంది. ఇంక అప్పుడు ఒకళ్ళని ఒకళ్ళం విడిచిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండము!"


నువ్వు  మొహం ముడుచుకుని మౌనంగా ఉన్నావు. నా మాటలు నీకు ఊరడి ఇవ్వలేదు. నేను కొద్దిరోజుల్లో అమెరికాకి వెళ్ళటం నీకు ఇష్టం లేదు. 


"ఏయ్ పిచ్చిపిల్లా ... చీర్ అప్! ఇది మన లైఫ్ లో బెస్ట్ మూమెంట్ తెలుసా? మన అమ్మ నాన్నలు పెళ్ళికి ఒప్పుకున్నారు. ఎంత భయపడ్డాము, విషయం చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటారో అని! సినిమాల్లో జరిగే కొట్లాటలన్నీ ఊహించేసుకోలేదూ? చివరికి చూడు, ఎంత తేలిగ్గా ఒప్పేసుకున్నారో.  నీ చదువు పూర్తవగానే నీకూ నాకూ పెళ్లి చేసేస్తామంటున్నారు. ఇంకేం కావాలి చెప్పు మనకి? నాకు కూడా గుండె తరుక్కుపోతోంది, నిన్ను విడిచి పెట్టి ఉండాలంటే. కానీ ఒకటి చెప్పనా? దూరం మన ప్రేమని మరింత బలపరుస్తుంది.  నేను నీతో రోజూ ఫోన్ లో మాటాడతా. వారానికోసారి నా కవిత్వం పంపిస్తా... ఏదీ కొంచెం నవ్వు, ఇప్పుడు మనం అర్జెంటు గా ఒక చెడ్డ పని చేసెయ్యాలి", అన్నాను, నీ బుగ్గలు నా చేతిలోకి తీసుకుని. 


విదిలించుకున్నావు. "నీకేం, చాక్లెట్ షాప్ లో చిన్న పిల్లాడిలా ఎక్సైట్ అయిపోయి ఉన్నావు. అమెరికా పోవాలని చాలా ఉత్సాహం గా ఉన్నావు. నా బాధ నీకెందుకు  కనిపిస్తుంది?" అన్నావు. 


నేను నిన్ను హత్తుకున్నాను. 


"రమ్మీ, నా ప్రాణమా", నీ చెవిలో గుసగుసగా చెప్పాను, "నాకు జీవితం లో నీకంటే ముఖ్యమైంది ఏమీ లేదు, అమెరికా తో సహా. కానీ నేను వెళ్ళేది మన ఫ్యూచర్ కి బలమైన పునాది ఇవ్వటం కోసం. నేను దూరంగా ఉన్నా కానీ నా మనసంతా నువ్వే ఉంటావు ... అదేంటబ్బా ... ఆ పాట  ...


నువ్విక్కడ నేనక్కడ పాటిక్కడ పలుకక్కడ 
మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా ... 
ఉండీలేకా ఉన్నది నీవే, ఉన్నాకూడా లేనిది నేనే,
నా రేపటి అడియాసల రూపం నీవే ...
దూరాన ఉన్నా నా తోడు నీవే 
నీ దగ్గరున్న నీ నీడ నాదే 
నాదన్నదంతా నువ్వే నువ్వే ...


పల్లవి లో  నువ్వుకూడా గొంతు కలిపావు.


జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై ...
నిను కాన లేక మనసూరుకోక పాడాను నేను పాటనై ...


నా చెంపమీద సుతారం గా కొట్టి నవ్వావు, "భలే బుట్టలో పడేస్తావేం నువ్వు?" అంటూ.


"పడు మరి బుట్టలో", అంటూ అప్పడు ముద్దు పెట్టుకున్నాను నిన్ను. నుదుటిమీద, కళ్ళమీద, పెదవుల మీద.


నా భుజం మీద తలవాల్చి కళ్ళు మూసుకున్నావు. ఆ బొమ్మ నా మనసులో ఎప్పటికీ నిలిచిపోయింది... ప్రశాంతం గా ఉన్న గోదారి ఒడిలో మనిద్దరం, నా ఒడిలో ప్రశాంతం గా నువ్వు... 


మనం అంత దగ్గరగా కూచున్నది అదే ఆఖరి సారి. 


కొన్ని నెలల తర్వాత, నేను నిన్ను మళ్ళీ చూసినప్పుడు .... పరిస్థితి వేరే గా ఉండింది. అమెరికాలో జరిగిన కార్ యాక్సిడెంట్ నా జీవితాన్ని ముక్కలు చేసింది. 


* * *


సిగరెట్ పాకెట్ అందుకున్నాడు. అది ఖాళీ గా ఉంది. లేవటం తప్పని సరి అయ్యింది. ఒక అడుగు వెయ్యగానే తొడ నుంచి మోకాలు దాకా భరించలేని నొప్పి కత్తి లాగ పొడిచింది. కుంటుకుంటూ అలమారా దగ్గరకి వెళ్లి చొక్కా జేబుని తడిమి చూసాడు. ఖాళీ గా ఉంది. 


వెనక్కి తిరిగి కుంటుకుంటూ,  తనలోతనే  ఎదో గొణుగుకుంటూ కుర్చీని చేరి పెన్ను అందుకున్నాడు. 


* * *


మీ నాన్నగారు మర్యాదగా గౌరవంగానే మాటాడారు. కానీ ఆయన దృఢనిశ్చయం తేటతెల్లంగా తెలుస్తోంది.


"సారీ", అన్నారాయన. "నిన్ను చూస్తే నాకు చాలా బాధగా ఉంది. జాలి వేస్తోంది. విధి నిన్ను దెబ్బ తీసింది. బాధ పడటం తప్ప నేనేమీ చెయ్యలేను. నేను మీ పెళ్ళికి ఒప్పుకున్నప్పుడు ఇలా అవుతుందని ఊహించలేదు. యాక్సిడెంటు నిన్ను అవిటివాడిని -- క్షమించు, ఇలా అంటున్నందుకు ఏమీ అనుకోకు, కానీ ఇది నిజం -- అవిటివాడిని చేస్తుందని అనుకోలేదు.  నువ్వు చెప్పేది కాదనను. నువ్వు చూపులకి మామూలుగానే ఉన్నావు, కృత్రిమావయం పెట్టుకున్నావు, నీ పనులన్నీ నువ్వే చేసుకోగలుగుతున్నావు, ఎవ్వరి మీద ఆధారపడటం లేదు. అన్నీ ఒప్పుకుంటా.  కానీ కాళ్ళూ చేతులూ అవయవాలూ సక్రమం గా ఉన్న అల్లుడినీ కోడలినే ఎవరైనా కోరుకుంటారు. నేను కూడా అంతే. నాకూతురికి ఒక --- పూర్తి శరీరం ఉన్న భర్తను కోరుకుంటున్నా. నీకిలా జరగటం శుభసూచికం కూడా కాదు. జాతకాలు కలవలేదు. అందుకని దయచేసి ఈ మాటలు ఇక్కడితో ఆపేసి వెళ్ళిపో", అన్నారు.


నువ్వు తలుపు పక్కన నుంచుని ఉన్నావు. నీ జుట్టు రేగి పోయి ఉంది.  కళ్ళు ఉబ్బి ఉన్నాయి, ఏడ్చినట్టు. కానీ నువ్వు నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడటం లేదు. నేల కేసి చూస్తున్నావు. నన్ను సపోర్ట్ చేస్తూ ఒక్క మాట అనలేదు. ముంగి వల్లే ఉన్నావు. మన ప్రేమకి నువ్వు కట్టిన విలువ ఎంతో  నీ మౌనంతో  చెప్తుంటే నా గుండె పగిలిపోయింది. అయినా, ఏ మూలో చిన్న ఆశ. మీ నాన్నగారు నిన్ను మాటాడనివ్వటం లేదనీ, నువ్వే కనుక  నోరు విప్పితే నన్నే కోరుకుంటావని. 


ఆత్మ గౌరవాన్ని దిగమింగుకుని ఒక చివరి ప్రయత్నం చేసాను.  


"నాకు శరీరం ఉంది మామయ్యగారు.  ఒక కాలు మోకాటి నుంచి పాదం వరకు జైపూర్ లెగ్ అంతే. రమ్యని ఎందుకు అడగరు, అది ఆమెకి ప్రాబ్లెమ్ కాదేమో? ఒక్కసారి తనని మాటాడనివ్వండి"


"తన అభిప్రాయమూ నా అభిప్రాయమూ ఒకటే. రమ్య మాటాడేది వేరే అంటూ ఏమీ లేదు. నువ్వు  తెలివైనవాడివి. నీ మెదడు చురుకు.  హ్యాండీక్యాప్ ఉన్నాకానీ, నీ భవిష్యత్తు బాగుంటుంది. మంచి భార్యే దొరుకుతుంది. ఆ భార్య నా కూతురు కాబోదు, అంతే. ముందు ముందు సంతోషం గా ఉంటావు, ఉండాలని ఆశిస్తున్నాను. మన కుటుంబాలు ఇప్పటికీ స్నేహితులే. ఎప్పటికీ అలాగే ఉండాలి. ఈ టాపిక్ తప్ప ఇంకేదీ మాటాడేది లేకపోతే, దయచేసి ఇక వెళ్ళు. చీకటి పడింది. మీ ఇంట్లో చూస్తూ ఉంటారు. నన్ను దింపమంటావా?"


నువ్వు నీ మొహాన్ని చేతులతో కప్పుకుని ఏడుస్తూ లోపలికి  వెళ్ళిపోయావు. మీ నాన్న దగ్గర నన్ను వంటరిగా  వదిలేసి. నిస్సహాయంగా నుంచున్నాను, తలవంచి. నాలోని ఆక్రందనని నేనే వింటూ...


నేను నిన్ను మళ్ళీ చూసినప్పుడు -- నాలుగేళ్ల తరువాత -- నీ కడుపులో వేరొక మగవాడి ప్రతిబింబం పెరుగుతోంది.


* * *


కుర్చీలో కదిలి కాలు ముడవబోయాడు. నొప్పి మళ్ళీ మోకాలిదాకా పొడిచింది. గుండెలో మంట ఉధృతమైంది. లేచి నుంచున్నాడు, కొంచెం రిలీఫ్ వస్తుందేమో అని. మళ్ళీ కూచున్నాడు. కళ్ళు మూసుకొని గుర్తు తెచ్చుకోటానికి ప్రయత్నించాడు. 


ఎలా ఉండింది ఆమె, నాలుగేళ్ల తర్వాత  చూసినప్పుడు?


గ్లాస్ లోని ద్రవం తాగి ఆలోచిస్తూ కూచున్నాడు. గది మూలనుంచి మందపాటి శబ్దం వస్తోంది. తెలిసిన శబ్దం. టాబ్లెట్ ల వంక చూసాడు. రాయాల్సినది ఇంక ఎంతో లేదేమో. ఒక కొలిక్కి వస్తోంది. ముగించాక  ఒళ్ళు మరిచి నిద్ర పోవాలి. 


ఒక టాబ్లెట్ తీసి గొంతులో వేసుకున్నాడు. 


* * *

~ ఇంకా ఉంది ~
[+] 3 users Like KingOfHearts's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
అంతిమలేఖ - by KingOfHearts - 15-03-2024, 07:37 PM
RE: అంతిమలేఖ - by sri7869 - 15-03-2024, 09:36 PM
RE: అంతిమలేఖ - by KingOfHearts - 16-03-2024, 10:32 PM
RE: అంతిమలేఖ - by sri7869 - 16-03-2024, 10:56 PM
RE: అంతిమలేఖ - by Rishithejabsj - 17-03-2024, 10:13 PM
RE: అంతిమలేఖ - by KingOfHearts - 18-03-2024, 09:07 PM
RE: అంతిమలేఖ - by sri7869 - 18-03-2024, 11:50 PM



Users browsing this thread: 1 Guest(s)