16-11-2023, 02:54 AM
(This post was last modified: 16-11-2023, 01:20 PM by అన్నెపు. Edited 1 time in total. Edited 1 time in total.)
పెళ్లి పదిరోజులు ఉందనగా దీప్తిని ఒక కాఫీ షాపులో కలిసి కీర్తన గురించి చెప్పాడు శ్రీధర్. తను కాలేజీ రోజుల్లో ఎంతగా ఆమెను ఆరాధించాడో, ఆమె జ్ఞాపకాల్లో వేరే అమ్మాయిని ఎందుకు తన జీవితంలోకి ఆహ్వానించలేకపోయాడో, ఇప్పుడేం జరుగుతుందో అంతా పూసగుచ్చినట్లు చెప్పాడు. వేరే అమ్మాయైతే ఎంత రచ్చ చేసేదో తెలీదు కానీ దీప్తి మాత్రం శ్రీధర్లో ఉన్న నిజాయితీని చూసి అతన్ని అర్ధం చేసుకుంది. నెలకో అమ్మాయిని ప్రేమించే ఈ రోజుల్లో అన్ని సంవత్సరాలు ఒకే అమ్మాయిని తలుచుకుని ఉండడం ఆశ్చర్యంగా అనిపించింది తనకు.
ఆ టైంలో తనకు గుర్తొచ్చిన ఒకే ఒక వ్యక్తి సురేష్. సురేష్ గుర్తుకు రాకపోయుంటే బరస్ట్ అయిపోయి వేరేలా ప్రవర్తించేదేమో. సురేష్ కూడా ఆరు సంవత్సరాల నుండి తనకు ప్రపోజ్ చేస్తూనే ఉన్నాడు కానీ ఎప్పుడూ ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించలేదు. సురేష్ ఇల్లు వాళ్ళ వీధి చివర్లో ఉండేది. మొదట్లో ఆటో నడుపుకునేవాడు. అక్కడే తనతో పరిచయం అయ్యింది. తర్వాత కారు కొనుక్కుని క్యాబ్ నడిపాడు. ఇప్పుడు సొంతంగా నాలుగైదు కార్లవరకూ కొని క్యాబ్ లకు రెంటుకు ఇస్తున్నాడు. కష్టపడే తత్వం కలవాడు, పైగా ఏ చెడు అలవాట్లూ లేవు. నీ ఇన్స్పిరేషన్ తోనే జీవితంలో పైకి రావాలని నిర్ణయించుకున్నానని ఎప్పుడూ చెబుతుండేవాడు. దీప్తి ఐఐఎంలో ఎంబిఎ చేసింది. పెద్ద కంపెనీలో మంచి పొజిషన్లో ఉంది. దాంతో సురేష్ ఎప్పుడూ తన స్టేటస్ కి సరిపోడేమో అని దూరం పెట్టేది. అయినా ఈ ప్రేమలు దోమలు వేరే బెటర్ చాయిస్ దొరికేవరకే అన్న అపోహలో ఉండేది తను. ఇప్పుడతని ప్రేమలో నిజాయితీ తెలుస్తుంది ఆమెకి. సిన్సియర్గా ప్రేమించేవాళ్ళు ఈ జెనరేషన్లో కూడా ఉంటారని అర్ధమైంది తనకు. ఆమె మనసు కొంచెం తేలికైనట్టు అనిపించింది.
“ఇంతకీ ఆమెకు ఈ విషయం చెప్పావా లేదా?” అంది శ్రీధర్ వైపు చూస్తూ దీప్తి.
“లేదు” అన్నాడు శ్రీధర్.
“ఆమెకి చెప్పకుండానే నాతో పెళ్లిని క్యాన్సిల్ చెయ్యాలనుకుంటున్నారా?”
“ఆమెను మనసులో పెట్టుకుని మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదనిపించింది”
“ఆమె ఒప్పుకోకపోతే?”
“అదంతా నేను ఆలోచించలేదు” ఎటో చూస్తూ అన్నాడు శ్రీధర్.
“అయితే ఫోన్ చేసి వెంటనే ఆమెను ఇక్కడికి రమ్మను” అంది దీప్తి కొంచెం గట్టిగా.
శ్రీధర్ భయంతో, “ఎందుకు?” అన్నాడు.
“ఎందుకో తర్వాత చెప్తా..., ఏం భయపడకండి, ముందు ఫోన్ చెయ్యండి. అట్లీస్ట్ ఆమెను నాకు పరిచయం చెయ్యరా?” అనడంతో తప్పక కీర్తనకి ఫోన్ చేసి ఆ కాఫీ షాపుకి రమ్మన్నాడు.
అరగంట తర్వాత వచ్చింది కీర్తన. దీప్తి తనను తాను పరిచయం చేసుకుని, ఆ విషయం ఈ విషయం మాట్లాడుతూ శ్రీధర్ కీర్తనని ప్రేమిస్తున్న విషయం మెల్లిగా చెప్పింది. కీర్తన ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. తర్వాత దీప్తీనే కాలేజీ రోజులనుంచి జరిగిందంతా కీర్తనకి అర్ధమయ్యేలా చెప్పింది. శ్రీధర్ టెన్షన్ పడుతూ కూర్చున్నాడు.