16-11-2023, 02:53 AM
(This post was last modified: 16-11-2023, 01:19 PM by అన్నెపు. Edited 1 time in total. Edited 1 time in total.)
ఆ రోజు ఆదివారం కావడంతో తీరిగ్గా వరండాలో కూర్చుని పేపర్ చదువుతున్నాడు శ్రీధర్. అప్పుడప్పుడు పిచ్చుకలు శబ్ధం చేస్తుండడంతో అటువైపు చూస్తున్నాడు. రెండు పిచ్చుకలు గోడమీద కూర్చుని సరదాగా సరసాలు ఆడుకుంటున్నాయి. వాటినే కొద్దిసేపు చూసి పేపర్ పక్కన పడేసి ఇంట్లోకి వెళ్ళాడు. ఆమె వంట గదిలో కూరగాయలు తరుగుతూ ఉంది. నుదిటి పై చెమట వస్తోంటే ముంగుర్లని వెనక్కి సరిచేసుకుంటూ ఉంది. ఆ టైంలో ఒక చెయ్యి తిరిగిన చిత్రకారుడు ఎంతో శ్రద్ధతో వేసిన పెయింటింగ్ లా కనిపించింది. ఆ దృశ్యం అదృశ్యం కావొద్దు అనుకుని వెంటనే మొబైల్ ఫోన్ తీసుకుని ఆమెను దూరం నుండే ఫోటో తీసాడు.
కీర్తన అతని వైపు చూసి, “ఏం చేస్తున్నావ్?” అంది.
“ఏం లేదు నా ఏంజెల్ ని ఫోటో తీస్తున్నా” అన్నాడు శ్రీధర్.
“అబ్బో...” అంది తను టమాటాలు తరుగుతూ.
వెంటనే వెళ్లి ఆమెను వెనక నుండి వాటేసుకున్నాడు.
“ఏంటండీ ఇదీ...” అంది ఆమె ఇబ్బంది పడుతూ.
“ఏం నా భార్యను నేను వాటేసుకుంటే తప్పా?” అంటూ ఇంకా బలంగా హత్తుకున్నాడు.
ఇంతలో కాలింగ్ బెల్ మోగింది.
“ముందు ఎవరొచ్చారో చూసి రండి” అని కీర్తన అనడంతో వెళ్లి డోర్ ఓపెన్ చేసాడు. ఎదురుగా దీప్తి నిల్చుని ఉంది.
“లోపలికి రావొచ్చా...” అంది దీప్తి. ఆమె వెనకాలే ఇంకో అబ్బాయి ఉన్నాడు.
“ప్లీజ్ కమిన్” అంటూ లోపలికి ఆహ్వానించాడు శ్రీధర్.
కీర్తన కూడా వారిని చూసి హాల్లోకి వచ్చి దీప్తిని విష్ చేసి కూర్చోబెట్టింది.
“తిను సురేష్. నెక్స్ట్ వీక్ మా మ్యారేజ్ ఉంది. మీరిద్దరూ తప్పకుండా రావాలి” అంటూ పెళ్లి పత్రిక తీసి వారి చేతిలో పెట్టింది దీప్తి.
“ఓహ్! కంగ్రాట్స్ తప్పకుండా వస్తాం” అంది కీర్తన. కొద్దిసేపు మాట్లాడాక వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు.
“దీప్తి చాలా మంచమ్మాయి కదండీ..., నా వల్ల తన పెళ్లి ఆగిపోయినా అవేమీ మనసులో పెట్టుకోకుండా తన పెళ్ళికి ఇన్విటేషన్ తెచ్చి ఇచ్చింది” అంది కీర్తన.
“అవును” అన్నాడు శ్రీధర్ ఆ రోజు కాఫీ షాపులో జరిగింది గుర్తుతెచ్చుకుంటూ.
***