16-11-2023, 02:51 AM
(This post was last modified: 16-11-2023, 01:18 PM by అన్నెపు. Edited 1 time in total. Edited 1 time in total.)
“లవ్ అంటే నవ్వొచ్చింది. నాకు చాలామంది లవ్ ప్రపోజ్ చేసారు. నేను ఎవ్వరినీ యాక్సెప్ట్ చెయ్యలేదు. కాలేజీలో ఉండగానే మంచి సంబంధం అని నాకు పెళ్లి చేసేసారు. ఆయనకి బిజినెస్, ఫ్రెండ్స్ తప్ప ఏమీ పట్టేది కాదు. ఇంట్లో ఫ్రిడ్జ్, టి.వి, ఏసి లాగ నేను కూడా ఒక వస్తువునే తనకి” బైక్ వేగం పెంచింది తను.
‘ఒక అపురూపమైన అందమైన అమ్మాయిని ఇంట్లో పెట్టుకుని ఆమె విలువ తెలుసుకోలేకపోయాడు వెధవ’ అనుకున్నాడు మనసులో. ‘ఎంతోమంది కలల రాణిని, ఇంట్లో పెట్టుకుని ఒక వస్తువుగా చూస్తాడా? ప్రేమించే హృదయం అందరికీ ఉండదు కదా. దేవుడికి ఎవరికి ఏం ఇవ్వాలో తెలియదు’ ఇలా ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు.
ఇంతలోనే శ్రీధర్ ఇల్లు వచ్చేసింది.
శ్రీధర్ ఈ లోకంలోకి వచ్చి, “ఇక్కడ సైడుకి ఆపండి” అన్నాడు.
బైక్ దిగి థాంక్స్ చెప్పాడు.
“సారీ నా పర్సనల్ విషయాలు చెప్పి బోర్ కొట్టించాననుకుంటా?” నవ్వుతూ అంది కీర్తన.
“అదేం లేదు” అన్నాడు ఆమె నుదురు మీద చిరు చెమటను చూస్తూ.
స్ట్రీట్ లైట్ వెలుతురులో మెరుస్తున్న ఆ చెమట బిందువులు ముత్యాల్లా అనిపించాయి తనకు.
“ఓకే బై, గుడ్ నైట్” బైక్ రివర్స్ చేస్తూ అంది తను.
“గుడ్ నైట్” కీర్తన వెళ్లిపోతుంటే అలాగే చూస్తూ నిల్చున్నాడు.
రాత్రంతా శ్రీధర్ కి నిద్ర పట్టలేదు. దీప్తి ఫోన్ చేసినా లిఫ్ట్ చెయ్యలేదు.
‘ఇదేంటి తను కీర్తనతో మళ్ళీ ప్రేమలో పడిపోతున్నాడా? ఈ టైంలో ఇది కరక్టేనా? అందరూ ఏం అనుకుంటారు? అందరి గురించి వదిలేసినా, దీప్తికి తెలిస్తే తన గురించి ఏం అనుకుంటుంది?’ ఇలా రకరకాలు ఆలోచిస్తూ ఉండిపోయాడు.
రోజులు గడుస్తున్నకొద్దీ శ్రీధర్ కి భయం పెరగడం మొదలైంది. కీర్తన తన జీవితంలోకి రాకపోతే దీప్తినే పెళ్లి చేసుకునేవాడిని కదా అని సర్దిచెప్పుకుందాం అనుకున్నా దేవుడే తన కోసం కీర్తనని తన ఆఫీసుకి పంపాడని మనసు మళ్ళీ మళ్ళీ చెప్తుంది. ఇంక ఏదో ఒకటి తేల్చుకోకపోతే జీవితాంతం బాధ పడాల్సివస్తుందని నిర్ణయించుకున్నాడు.
***