16-11-2023, 02:45 AM
(This post was last modified: 16-11-2023, 01:14 PM by అన్నెపు. Edited 3 times in total. Edited 3 times in total.)
తనకు ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువ. ఎవరితోనైనా మాట్లాడినా చదువు గురించే మ్యాగ్జిమమ్ మాట్లాడేవాడు. దీంతో సబ్జెక్టులో ఏమైనా డౌట్స్ వచ్చినవాళ్ళు తప్ప ఎవ్వరూ ఎక్కువ మాట్లాడేవారు కాదు. అలాంటి టైంలోనే కీర్తనని చూసాడు. కీర్తన తనకు జూనియర్. చాలా అందంగా ఉంటుంది. అందానికి తగ్గట్టు హుందాగా ఉండేది. తెలివైంది, బాగా చదివేది కూడా. ఎంతోమంది ఆమెతో మాట్లాడడానికి తెగ ప్రయత్నించేవాళ్ళు. అందరితోనూ ఆమె మొహమాటం లేకుండా చక్కగా మాట్లాడేది. ఆమె ముఖాన్ని చిరునవ్వు ఎప్పుడూ అంటిపెట్టుకుని ఉండేది. అలా ఆమె అందరితోనూ కలుపుగోలుగా ఉండడం తనకు ఎంతో నచ్చేది. తను కూడా ఆమెలా ఉంటే ఎంత బాగుండు అనుకునేవాడు కానీ చిన్నప్పటినుండి అలావాటైన స్వభావం ఎలా మారుతుంది? బహుశా అదే ఆమెతో ప్రేమలో పడేటట్టు చేసిందేమో. ఆమె చనువును చూసి చాలామంది ప్రపోజ్ చేసారు. సున్నితంగా అందరినీ తిరస్కరించింది. చాలామందికి ఆమె ఒక డ్రీం గర్ల్.
శ్రీధర్ కూడా ఆమెతో ఒక్కసారి మాట్లాడితే చాలు అనుకునేవాడు. చిన్నప్పటి నుండి ఇంట్రావర్ట్ గా పెరగడంతో ఎవరితోనైనా కొత్తగా పరిచయం పెంచుకోవాలంటే తనవల్ల అయ్యేది కాదు. ఇంకో విషయం ఏంటంటే ఆ అమ్మాయి వాళ్ళ ఇల్లు శ్రీధర్ ఇంటి దగ్గరే అయినా కూడా కనీసం పేరు కూడా పరిచయం చేసుకోలేకపోయాడు, దూరంనుండి చూసి సంతోషపడడం తప్ప. తన చదువు, తన పుస్తకాలు - అదే లోకం. ప్రొఫెసర్ల చేత మాత్రం చాలా మంచివాడు అనిపించుకున్నాడు. తన క్లాస్మేట్స్ కొంతమంది ప్రేమలో మునిగి తేలుతుంటే తను కూడా ప్రేమ పొందగలిగితే ఎంత బాగుండూ అనుకునేవాడు తప్ప కనీసం తన ప్రేమ గురించి ఆమెతో చెప్పాలి అనే విషయం గ్రహించలేకపోయాడు. చెప్తే రిజెక్ట్ చేస్తుందేమో అన్న భయం. ఇలాగే మూడు సంవత్సరాలు గడిచిపోయాయి. క్యాంపస్ ప్లేస్మెంట్లలో అందరికంటే ముందు తనకే జాబ్ వచ్చింది. అప్పుడు చెప్పాలనుకున్నాడు తన ప్రేమ గురించి. అప్పుడైతే ఒప్పుకునేందుకు చాన్సెస్ ఎక్కువుంటాయనుకున్నాడు. కానీ తన దురదృష్టమో ఏమో కానీ అదే టైంలో ఆ అమ్మాయికి పెళ్లైపోయింది. కొన్ని రోజులు ఆ బాధలోనే ఉండిపోయాడు. ఇంక ఆ ఏరియాలో ఉండలేక వేరే చోటికి వెళ్ళిపోయాడు.ఆ కాలేజ్ స్టూడెంట్స్ ని చూస్తుంటే ఆ రోజుల్లో తను ఏం కోల్పోయాడో అర్ధమైంది.‘ఇప్పుడు చూడు నా పరిస్థితి బావిలో కప్పలా తయారయ్యింది’ అని బాధపడ్డాడు.
కనీసం అందరిలా పెళ్లి చేసుకోవాలన్నా భయపడే పరిస్థితి వచ్చింది, వచ్చే అమ్మాయి ఎలాంటిది వస్తుందో అని. ఏదైనా ఫంక్షన్ కు వెళ్ళినా పెళ్ళెప్పుడు అనే మాటలు వినలేక చుట్టాలని కలవడమే మానేసాడు. ఊరికి వెళ్ళాలంటేనే భయమేసేది. లైఫ్ అంతా ప్రశాంతంగానే ఉన్నా జీవితంలో ఏదో శూన్యం ఆవరించినట్టు అనిపించింది.‘ఇంకా ఎన్ని రోజులు ఇలా... ఇప్పుడైనా తన జీవితంలో మార్పు రావాలి. అనవసరమైన భయాలన్నీ వదిలేయాలి’ అని నిర్ణయించుకున్నాడు.వెంటనే ఇంటికి ఫోన్ చేసి పిల్లని చూడమని చెప్పాడు. వారం రోజుల్లోనే మంచి సంబంధం వచ్చింది.