Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
హైదరాబాద్ కథలు
#4
1.                     ఉద్యోగం
 
 అది ఆదివారం మధ్యాహ్నం... వారం మొత్తంలో ఎక్కువ మంది కస్టమర్లు ఒచ్చేది ఇప్పుడే.... సూపర్ మార్కెట్ జనంతో కిటకిటలాడుతోంది. ఉన్న నాలుగు కౌంటర్లు ముందు లైన్లు పెరిగిపోయినయి. పదేండ్ల నించి కృష్ణవేణి ఇక్కడే పని చేస్తుంది. పప్పులు, రవ్వ, పిండి ఇలాంటివన్నీ జల్లెడ పట్టడం, ప్యాకింగ్ చెయ్యడం, తరవాత అవన్నీ సర్దడం, షాపు ఊడ్వటం, అవేమీ లేకుంటే కస్టమర్లకు సహాయం చెయ్యడం లాంటి పనులన్నీ చేస్తుండాలి.
ఒక రెండు నిమిషాలు ఖాళీ దొరికితే వెళ్ళి ఓనర్ తో మాట్లాడాలి అని ఎదురుచూస్తుంది కృష్ణవేణి. కష్టం మీద రెండు నిముషాలు కల్పించుకొని ఓనర్ రూంలోకి వెళ్ళింది.
“ఏంటి కృష్ణవేణి? అంత మంది కస్టమర్లు అక్కడ ఉంటే ఇటొచ్చావు?” బిల్ల్స్ ముందేసుకున్న ఓనర్ తల పైకి ఎత్తకుండానే అడిగాడు.
“నాకు హాఫ్ డే లీవ్ కావాలి సార్.” సమయం వృథా చెయ్యకుండా అడిగేసింది కృష్ణవేణి.
ఇప్పుడు తల ఎత్తాడు.
“అదేంటి. ఆదివారం రోజు. ఆరోగ్యం బానే ఉందా?”
“ఉంది సార్. కాని కొంచం పని ఉంది బయట. తప్పలేదు.”
“సరే. ఎప్పుడూ అడగవు కదా. ఎదో అవసరం ఉండే ఉంటుంది లే. ఊరికే సరే అన్నాను అని చెప్పకు వేరే స్టాఫ్ కి. మళ్ళా అందరూ ఆదివారం కావాలి అని అడగడం మొదలు పెడతారు.”
హమ్మయ్య అనుకుంటూ బయటికి నడిచింది కృష్ణవేణి.
“ఆ పప్పులు స్టాక్ నింపేసి వెళ్ళు. అసలే నిన్న ఒకటో తారీకు.” అని ముగించాడు మేనేజర్.
డబల్ ఫాస్ట్ గా పని చెయ్యడం మొదలు పెట్టింది కృష్ణవేణి. తను అంత హుషారుగా ఉండడం గమనించింది చంద్రకళ. ఇద్దరూ గత పది సంవత్సరాల నుంచి అక్కడే కలిసి పని చేస్తున్నారు. కష్టం సుఖం పంచుకోవడం అలవాటు. దాని వల్ల చనువు, సఖ్యత ఏర్పడ్డాయి. ఇద్దరిమధ్యా రహస్యాలు లేనంతగా.
“ఏంటే కృష్ణా? చాలా హుషారుగా చేస్తున్నావు పని.” అడిగింది చంద్రకళ.
“మధ్యాహ్నం నించి ఇంటికి వెళ్ళిపోతా అని చెప్పాను ఓనర్ గారికి. అందుకే.”
చంద్రకళ ఇంకో ప్రశ్న అడగముందే ఏం చేయ్యబోతుందో కూడా చెప్పింది.
“మా అబ్బాయి బయటికి వెళ్దాం అని ఖచ్చితంగా ఒచ్చేయమన్నాడే. వారం నించి చెప్తున్నాడు. ఆదివారం రోజే వాడికి కుదురుతుంది.” కృష్ణవేణి గొంతులో ఆనందం.
“అంత స్పెషల్ ఏముంది?”
“వాడు ఉద్యోగంలో జాయిన్ అయ్యి నెల అయింది కదా. జీతం ఒచ్చింది.”
“అవును కదా. అప్పుడే నెల అయిపోయిందా? జీతం రాగానే అమ్మ కోసమే ఆలోచిస్తున్నాడు. పాపం మంచోడు. ఫ్రెండ్స్ తో వెళ్ళకుండా.”
“నేనూ అదే అన్నా... ఈసారికి మీ ఫ్రెండ్స్ తో వెళ్ళు నాన్నా అని. అస్సలు వినడే. ఒకటే పట్టు. అది కూడా ఇవ్వాళే వెళ్ళాలట.”
“నువ్వు ఇన్నేండ్లు పడ్డ కష్టం చూశాడు కదే వాడు... పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి దాకా వాడికోసమే తపించావు. ఇప్పుడు నీ వంతు వచ్చింది...ఇప్పుడన్నా సుఖపడు.”
కృష్ణవేణి కళ్ళల్లో నీళ్ళు. 20 ఏళ్ళ జీవితం గిర్రున కళ్ళముందు తిరిగింది.
* * *
20 ఏళ్ళ క్రితం ఇక్కడికి 5 నిమిషాలు దూరం కూడా లేని బస్టాప్ లో సూర్యాపేట నించి ఒక బస్సు ఒచ్చింది. క్రిష్ణవేణి, భర్త దామోదరం, కొడుకు సందీప్, సంచీలో ఇరవయి వేల రూపాయలు, కృష్ణవేణి గుండెల్లో ఎన్నో ఆశలు, అన్నీ ఆ బస్సులోనే హైదరాబాదుకి చేరాయి.
పెళ్ళైన మొదటి అయిదేళ్ళు కృష్ణవేణి కాపురం సూర్యాపేటలోనే జరిగింది. నలుగురు అన్నదమ్ముల ఉమ్మడి కుటుంబంలో చిన్నవాడు దామోదరం. అన్నయ్యలు వ్యవసాయం చేస్తారు. ఇతన్ని కూడా రమ్మంటారు కాని ఒకరోజు వెళ్తే నాలుగు రోజులు వెళ్ళడు. ఊర్లో చిన్న చిన్న అప్పులు, బాధ్యత తెలియకుండా తిరగటం ఇలాంటి అల్లరి చిల్లర పనులు చేస్తూ ఉండేవాడు. పెళ్ళయినా, సందీప్ పుట్టినా ఏం మారలేదు. తల్లిదండ్రులు ఉన్నంత వరకూ అన్నలు భరించారు. వాళ్ళు పొయ్యాక దామోదరం అన్నలకు బరువయ్యాడు. పైగా అప్పటికే సాయి పుట్టాడు. ఒక కుటుంబాన్ని మనం ఊరికే పోషిస్తున్నాం అని వాళ్ళకి అనిపించడం మొదలయ్యింది. ఈ విషయం ముందే పసిగట్టింది కృష్ణవేణి. ఆమెకి కోపం రాలేదు. వాళ్ళు అనుకునేది నిజమే కదా అని మొగుడికి పని మీద శ్రద్ధ పెట్టమని బ్రతిమాలేది. కాని అతను వినిపించుకునే వాడు కాదు.
ఇంట్లో రెండు మూడు చిన్న గొడవలు అయ్యేసరికి కట్టు బట్టలతో బయటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఒచ్చింది. ఊళ్ళో పెద్దమనుషులంతా కలిసి దామోదరం ఆస్థి మీద హక్కు వదిలేసుకున్నందుకు గాను అన్నయ్యలల్తో ఓ యిరవై వేలు ఇప్పించారు. దామోదరం ఉన్న ఊళ్ళోనే ఉందాం అన్నాడు. కాని కృష్ణవేణికే సహించలేదు. తన తల్లిగారిల్లు విజయవాడలో. ఒక తమ్ముడు ఉన్నాడు. పేరు రాజు. అక్కంటే అభిమానం. రాజు అందరినీ అక్కడికి రమ్మన్నా వెళ్ళలేదు. అక్కడికి వెళ్తే మళ్ళీ దామోదరం బాధ్యత అంతా వాళ్ళ పైన వదిలేసి అల్లరి చిల్లరగా తిరుగుతాడు అని భయం వెసింది. హైదరాబాదు వెళ్లి ఎలాగో అలాగ బ్రతుకుదాం అన్నది. మొగుణ్ణి ఒప్పించింది. పొద్దు తిరగకుండా బస్సు ఎక్కారు. సిటీలో దిగేసరికి ఎక్కడ ఉండాలో తెలియదు. ఎవరిని అడగాలో తెలియదు. కాని సిటీ హైదరాబాదు అన్నీ అదే నేర్పుతుంది అనే నమ్మకం మాత్రం ఉంది.
· * *
చంద్రకళ పిలుపుతో ఒక్కసారి ఈ లోకంలోకి ఒచ్చింది కృష్ణవేణి. అలోచనలోనే కందిపప్పు ప్యాక్ చేసేసింది. ప్యాకెట్ల మీద స్టికర్లు వేసి అంటిస్తుంది.
“ఇంతకి ఎక్కడికి వెళ్తున్నారే మరి?” అడిగింది చంద్రకళ
“ట్యాంక్ బండ్ పక్కన థియేటర్ ఉందంట కదా, మంచిది. ఎప్పటినుంచో ఉండే అక్కడికి పోవాలని. మనకి ఎక్కడ కుదురుతుంది. కుదిరినా అక్కడ ఉండే రేట్లు మనం భరించలేం. అప్పుడెప్పుడో నువ్వు కూడా చెప్పావు కదా బాగుంటుంది అని. అక్కడికే తీసుకెళ్తా అన్నాడు సందీప్.”
“ఓ ప్రసాద్... పాతదే కదా. మేము చూసే చాలా ఏండ్లు ఐతుంది. అక్కడ ఖర్చు పెట్టకపోతే సరిపోయే. ఊరికే చూసి రాకపోయిన్రు ఎప్పుడయినా.”
“హ్ం.. ఎప్పుడూ కుదరలేదు అంతే.”
“కాని చాల బాగుంటదే. మాల్ అంటారంట. నా కొడుకు చెప్పిండు. ఆ మెట్లు ఉంటాయి చూడు. అవ్వే పైకి కిందికి పోతయి. ఎస్కలేటర్ అంటారంట. అది మొదలు అక్కడే చూశ్న. అక్కడనే ఎక్కినా. మస్తుంటది.”
ఎప్పటినుంచో కడుపులో దాచుకున్న భయం మేలుకున్నట్టు అనిపించింది కృష్ణవేణికి.
“అదంటే నాకు చాలా భయమే. మేము హైదరాబాదుకి ఒచ్చిన కొత్తల్లో మా ఆయన తీసుకెళ్ళారు. కాచిగూడలో మహేశ్వరి థియేటర్ కి. అక్కడ ఉండింది అది. ఇరవయిదు రూపాయల టికెట్టు కొంటేనే ఎక్కనిస్తా అన్నాడు వాడు. ఆయనకీ ఇలాంటివి అంటే సరదా కదా. ఒద్దని చెప్తున్నా కొన్నారు ఆయన. తీరా ఎక్కుదాం అనే సమయానికి నాకు చాల భయం వేసింది. వాళ్ళంతా చమటలు పట్టాయి. చివరికి ఎక్కకుండా మామూలు మెట్ల మీద వెళ్ళా. చాలా తిట్టారు ఆయన దానికి.”
ఈ మాటలు వినగానే చంద్రకళ మొఖంలో ఒక్కసారిగా నవ్వు మాయమయి కోపం ఒచ్చింది.
“మీ ఆయనకేంది? పూల రంగడు. అట్లాంటి సరదాలు ఉంటయి, ఇంకెట్లాంటి సరదాలైనా ఉంటయి. ఈసారి ఎన్ని రోజులయింది. మాట్లాడిండా మల్ల?” అడిగింది చంద్రకళ.
“లేదే. రెండేళ్ళయింది. ఎక్కడున్నాడో ఎమో మరి..? ఈసారి నేను కూడా కనుక్కోడానికి ప్రయత్నించలేదు.”
ఇద్దరి మధ్యా కొంచంసేపు నిశ్శబ్దం.
ఎంతైనా దామోదరాన్ని గురించి చంద్రకళ అలా మట్లాడడం నచ్చలేదు క్రిష్ణవేణికి. అందుకే తనే మాట మార్చింది.
“సరే కాని. ఆ ఎస్కలేటర్ ఏంటో అదంటే నాకు చాలా భయమే. ఇప్పుడు ఎట్లా. ఒద్దన్నా వినడు సందీప్. మొండోడు వాడు.”
“ఏం కాదులేవే. మరీ పల్లెటూరు దాన్లాగా.” నవ్వింది చంద్రకళ.
“ఏమో. చీర ఇరుక్కుపోతుందేమో దాంట్లో... లేకపోతే ఎక్కేటప్పుడో, దిగేటప్పుడో పడిపోతే అందరూ చూస్తారు. నాకు భయం బాబు.”
“మరీ చాదస్తం నీది... ఏం కాదు... సరే చాలా సేపయ్యింది, స్టాక్ కూడా బానే నింపినం, ఇంక బయల్దేరు మరి.”
“సరేలే. ఉంటా మరి. ఈ నాలుగు ప్యాకెట్ల మీద ధర రాసెయ్యి.” అని చెప్పి మెల్లగా బయటికి ఒచ్చేసింది కృష్ణవేణి.
ఇంటికి వెళ్తున్న కృష్ణవేణిని ఆలోచనలు ముంచెత్తాయి. దామోదరం గుర్తొచ్చాడు. చూసి రెండేళ్ళయింది. కొడుక్కి ఉద్యోగం ఒచ్చిందని అతనికి చెప్పలేదు. చెప్పాలా? ఇంతకీ దామోదరం ఎలా ఉన్నాడో. ఒక్క క్షణం అతను చేసిన పనులన్నీ గుర్తొచ్చాయి.
* * *
కొత్తగా హైదరాబాదులో దిగగానే మలక్ పేటలో ఒక చిన్న ఇల్లు వెతుక్కొని దిగారు. రెండే గదులు. ఊళ్ళో పెద్ద ఇంట్లో ఉన్న వాళ్లకి ఇది ఇబ్బందిగానే అనిపించింది. కాని తప్పదు.
దామోదరానికి సహజంగా కలుపుగోలుతనం ఎక్కువ. తొందరగా స్నేహం చెయ్యడం అలవాటు. చుట్టుపక్కల వాళ్ళతో త్వరగానే సఖ్యత ఏర్పడింది. వారం తిరిగేసరికి కృష్ణవేణి తమ్ముడు రాజు ఒచ్చాడు. కొన్ని రోజులు ఇక్కడే ఉండి బావకి ఏదో ఒక వ్యాపారం పెట్టించి వెళ్దామని. దామోదరం తనంతట తాను ఆ పని చెయ్యడు అని అతనికి నమ్మకం. రెండు రోజులు అయ్యాయి. రాజు చుట్టు పక్కల కనుక్కోవడం మొదలు పెట్టాడు. చిన్న కిరాణా షాపు పెట్టుకుంటే బాగుంటుంది అనిపించింది అతనికి. అదయితే కృష్ణవేణి కూడా కూర్చోవచ్చు. దామోదరాన్ని కూడా కనిపెట్టుకున్నట్టు ఉంటుంది. మరునాడు మెల్లిగా ఇదే మాట కదిలించాడు.
“ఏంటి బావ. ఏమనుకుంటున్నారు మరి? ఏం చేద్దామని.?”అన్నాడు భోజనం చేసేటప్పుడు.
“మీ అక్కనే అడుగు. ఉన్న ఊరు ఒదిలి ఈ సిటీకి తెచ్చింది కదా. నా మాట వినకుండా” నిష్ఠూరంగా మాట్లాడాడు దామోదరం.
“ఇప్పుడు అవన్నీ అనుకొని ఏం లాభం లెండి. ఒచ్చేశారు కదా. ఎదో ఒకటి చేసి బతకాలి కదా. ఇది కొత్త మొదలు అనుకోండి.”
“సరే. అదేదో నువ్వు చెప్పు మరి. ఉపన్యాసం ఇవ్వకుండా.” అన్నాడు దామోదరం చిరాగ్గా.
“మీకు ఇష్టం లేకుండా నేను ఏమీ చేయ్యమనటం లేదు బావ. కాని చూస్తూ ఉంటే ఉన్న కాస్త డబ్బు ఇట్టే కరిగిపోతుంది. తరవాత బాధపడాలి.” దామోదరం విషయంలో రాజు ఎప్పుడు ఓపికగా ఉంటాడు. తన అక్క మొఖం చూసి.
భోజనం అయిపోయింది.
“ఈ పక్కింట్లో ఒకాయన ఉంటాడు. రామారావు. చాలా మంచివాడు. ఆయన దెగ్గర ఒక స్కీం ఉంది. మనం ఒక యాభై వేలు కట్టాలి. తరవాత ఒక ముగ్గురిని చేర్పించాలి. అంతే నెల నెలా డబ్బు ఒచ్చి పడుతుంది. మనమేం చెయ్యక్ఖర్లేదు.” కుర్చీలో హాయిగా తల వెనక్కి వాల్చి చెప్పాడు దామోదరం
“అవన్నీ నమ్మకండి బావ. ఏమీ చెయ్యకుండా ఊరికే డబ్బు ఎవరూ ఇవ్వరు. అక్క ఏమంటుంది?”
“మీ అక్కా. ఏమంటది. నేను అన్న ప్రతీ దానికి కాదు అంటది.”
కృష్ణవేణి పక్కన్నే మౌనంగా నిలబడి వింటుంది. ఈ మాటకి ఏమీ అనబుద్ధి కాలేదు ఆమెకి. రాజు ఒకసారి ఆమెని చూశాడు. చెప్పు అన్నట్లు సైగ చేసింది.
“అలా కాదు బావ. నేను చుట్టుపక్కల కనుక్కున్నాను. కృష్ణవేణితో మాట్లాడాను. ఒక చిన్న కిరాణా కొట్టు పెట్టుకుంటే బాగుంటుంది. ఇంట్లో సరుకులకి కూడా ఇబ్బంది కూడా ఉండదు. హోల్ సేల్ మార్కెట్ కూడా దెగ్గరే. మీరు అక్కడనించి తెచ్చుకోవచ్చు. కృష్ణవేణి కూడా మీకు సాయంగా ఉండొచ్చు.”
దామోదరం ఏమీ మాట్లాడలేదు. ఒక నిట్టూర్పు విడిచి మళ్ళీ రాజే మాట్లాడాడు.
“ఏమంటావు బావా. ఆ పని ఏదో చూడమంటావా నన్ను.”
“మీరు మీరు మాట్లాడుకున్నాక ఇంక నన్ను అడగడం ఎందుకు. సరే కానియ్యండి.” అని అక్కడనించి వెళ్ళిపోయాడు దామోదరం.
“ఈ ఒక్క సహాయం చేసి పెట్టు రా రాజు. చచ్చి నీ కడుపున పుడతా.” అన్నది కృష్ణవేణి.
“అదేం మాటక్కా. అసలు నేను మనూరికే రమ్మన్నా కదా. మీరే రానన్నారు. అక్కడయితే మిమ్మల్ని కనిపెట్టుకొని ఉండొచ్చు.”
“నిజమే రా. కాని నాకు ఇష్టం లేదు. అప్పుడు నీ మీద పూర్తిగా ఆధారపడిపోతాం. ఆయనకి బాధ్యత రావాలనే కదా నా బాధ.” కృష్ణవేణి కంట్లో కన్నీరు.
ఆ రోజునించి రాజు అదే పనిలో పడిపోయాడు. ఒక చిన్న చోటు చూసి షాపు పెట్టించాడు. కృష్ణవేణి వాళ్ళ దెగ్గర ఉన్న డబ్బు చాలదు కాబట్టి తాను ఒక యిరవై వేలు కలిపాడు. అది అప్పా లేక ఊరికే ఇచ్చావా అని కూడా అడగలేదు దామోదరం.
సరుకులు అన్నీ కొనిచ్చి. ఏవి ఏ ధరకు అమ్మాలో చెప్పి, బావని షాపు జాగ్రత్తగా చూస్కోమని, కృష్ణవేణిని బావని చూస్కోమని మరీ మరీ చెప్పి బయల్దేరాడు.
రోజూ దామోదరంతో పాటు కృష్ణవేణి కూడా షాపుకి వెళ్ళింది. పని నేర్చుకుంది. షాపు కూడా మెల్లి మెల్లిగా పుంజుకుంది. కొంచం కొంచం కూడపెట్టడం కూడా మొదలు పెట్టారు.
సందీప్ ని స్కూల్లో చేర్పించారు.
· * *
నాలుగేళ్ళ తరవాత ఒక రోజు. అదే ఇల్లు. అదే మనుషులు.
“సందీప్ ఎక్కడున్నాడక్కా?” అడిగాడు రాజు.
“ఇక్కడెందుకు అని ఆడుకొమ్మని బయటికి పంపాను రా.” కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పింది కృష్ణవేణి.
“ఇన్ని రోజులనించి నాకు ఎందుకు చెప్పలేదు. కొంచం ముందే చెప్తే బాగుండేది. ఇంత గొడవ అవ్వకుండా చూసుకునేవాడిని.”
కృష్ణవేణి ఏడుపు ఎక్కువయింది.
“నిన్ను ఏడిపించడానికి కాదక్కా. నేనోకిడిని ఉన్నాను సహాయం చెయ్యడానికి అని మరిచిపోకు ఎప్పుడైనా. బావేం చేస్తున్నాడు?”
“ఇప్పుడే పడుకున్నారు. దెబ్బలు బాగా తగిలాయి రా. వీపు మీద వాతలు కూడా పడ్డాయి.”
“అసలేం జరిగింది. ఎవరు వాళ్ళు? కోర్చోబెట్టి మాట్లాడుకోవాలి గాని ఇదేం పద్ధతి. అడిగేవాళ్ళు లేరనుకున్నారా?”
కాస్త ఊపిరి పీల్చుకొని కృష్ణవేణి చెప్పింది.
“అంతా నా ఖర్మ రా. ఒకాయన మాత్రం బాగా పరిచయం. షాపుకి ఒస్తూ పోతూ ఉండేవాడు. వాళ్ళకి మన దెగ్గర పద్దు కూడా ఉంది. నేనూ రోజూ షాపుకి ఒస్తూ పోతూ ఉన్నాను. ఆయన బావగారికి డబ్బు ఎప్పుడు ఇచ్చారో, ఎంత ఇచ్చారో అసలు తెలియనే తెలియదు. మిగితా ముగ్గురు అప్పులాళ్ళు ఉన్నారని కూడా నిన్న వాళ్ళు ఆయన్ని పట్టుకెళ్ళాకే తెలిసింది. నాకు ఏదీ చెప్పరు. గట్టిగా అడిగితే గొడవ. యిలా తీస్కెళ్ళి కొడతారని తెలిస్తే నీకెందుకు చెప్పను రా. నువ్వు కాకుండా మాకు మాత్రం ఎవరున్నారు. ఈ ఊరికి ఒచ్చాక అత్తగారింటితో పూర్తిగా తెగిపోయింది. అటు వైపైనా ఇటు వైపైనా మమ్మల్ని కాస్త కనిపెట్టుకు ఉండేది నువ్వొక్కడివే.”
“అది సరేలేవే. కాని బాగా నడుస్తున్న షాపు కదా అసలు అప్పు ఎందుకు చెయ్యవలసి ఒచ్చింది. అది కూడా అలాంటి మనుషుల దెగ్గర. ఈ మధ్య నడవట్లేదా, లేక ఎమన్నా అవసరం ఉండి అప్పు చేశారా?”
“షాపు బాగానే నడిచేదిరా. ఒక రెండు మూడేళ్ళు చేతిలో డబ్బులు ఆడేసరికి ఆయనకి ఈ పని మీద విసుగొచ్చినట్టుంది. నన్ను షాపులో కూర్చోబెట్టి ఆయన బయటికి వెళ్ళడం మొదలు పెట్టారు. సామాన్లు అయిపోతే నేను చెప్పేదాన్ని. అవ్వి తేవడానికి కూడా బద్ధకం. ఎంత మంది ఎన్ని సార్లు షాపుకి ఒచ్చి కావాల్సింది లేదని తిరిగి వెళ్ళిపోయారో చెప్పలేను. నాకు గుండెల్లో పిండేసినట్లుండేది అలా జరిగినప్పుడల్లా. చేజేతులా లక్ష్మిని తిప్పి పంపుతున్నట్టు అనిపిస్తుంది.”
“మరి ఈ అప్పేంటీ. ఎందుకు చేశారు తెలియదా నీకు?”
తెలియదన్నట్లు తల అడ్డంగా ఊపింది కృష్ణవేణి.
“అదేంటక్కా. ఒక్క ఇంట్లోనే ఉంటున్నారా అసలు మీరు?”
ఈ అలికిడికి దామోదరం లేచినట్టున్నాడు. బయటికి ఒచ్చి రాజు పక్కన కూర్చున్నాడు. ఏమీ మాట్లాడలేదు.
“ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది బావా.” మెల్లగా అడిగాడు రాజు.
“నాకేం అయిందయ్యా. బానే ఉన్నాను. సిటీలో ఇవన్నీ మామూలే. మీ అక్కే పెద్ద గొడవ చేసి నిన్ను పిలిపించింది.”
“అదేంటి బావా. వాళ్ళెవరో ఇంటి మీదికి ఒచ్చి నిన్ను తీస్కెళ్ళి కొట్టి పంపిస్తే అది భయపడదా?”
“ అదే చెప్తున్నా. అంత భయపడాల్సిన పని లేదు. నువ్వు హాయిగా ఊరికి వెళ్ళు.” అసలేమీ జరగనట్టే మాట్లాడాడు దామోదరం.
“మరి వాళ్ళు రేపు మళ్ళీ ఒస్తే? అదంతా ఎందుకు? అసలు అప్పెందుకు చేశావు? ఎంత చేశావు? అదంతా ఏం చేశావు?” కుండ బద్దలు కొట్టినట్టు అడిగేశాడు రాజు.
“అవసరం ఉండి తీస్కున్నానయ్యా. కుటుంబాన్ని పోషించే బాధ్యత లేదా నాకు. ఇంట్లోకి ఇవన్ని ఎట్లా తెస్తున్నా అనుకున్నావు. మీ అక్కకి ఖర్చు కాదా, మీ మేనల్లుడికి ఖర్చు కాదా?”
“దానికి షాపు ఉంది కదా బావా. ఇంకా డబ్బు అవసరం అయితే నన్ను అడగాల్సింది. రౌడీల్లాగా ఉన్నట్టున్నారు. వాళ్ళనెందుకు అడగడం?”
“అదెక్కడ నడుస్తుంది. నడిచినా మనింటి ఖర్చులకి అదేo సరిపోతుంది. అయినా అదేదో సరదా కోసం చేసింది కాదు. వేరే వ్యాపారం చేద్దామని తీస్కున్నాను.”
రాజుకి కోపం ముంచుకొస్తుంది. కాని మొదటినుంచి అక్క కోసం దామోదరంతో నిగ్రహంగా మాట్లాడడం అలవాటు.
“ఏంటది? ఆ వ్యాపారం?.”
“సరే చెప్తే కాని వదిలేట్లు లేరు మీ అక్కా తమ్ముళ్ళు. నేను తీస్కుంది అయిదు రూపాయల వడ్డీకి. కాని ఈ సిటీలో చాలా మంది ఇంకా ఎక్కువ వడ్డీకి తీస్కునే వాళ్ళు ఉన్నారు. వీళ్ళ దెగ్గర తీస్కోని వాళ్ళకి ఇవ్వడమే మనం చేసేది. వీళ్ళ దెగ్గర తీస్కున్న డబ్బు వేరే వాళ్ళకి పది రూపాయల వడ్డీకి ఇచ్చాను. పని తక్కువ, లాభం ఎక్కువ. సంవత్సరం నుంచీ చేస్తున్నాను. ఈసారే కాస్త ఇబ్బంది ఒచ్చింది.”
ఆ మాట వినేసరికి ఇద్దరికీ మతి పోయింది. కృష్ణవేణి నోరు తెరిచింది. ఒక్క మాట తనతో చెప్పుంటే ఇదెంత పిచ్చి పనో భర్తకి చెప్పేదాన్ని కదా అనుకుంది. అందుకే చెప్పలేదు అని ఆమెకి అర్ధం అయ్యింది.
“ఎంత పని చేశావు బావ. ఎవరయినా అలాంటి వ్యాపారం చేస్తారా? పది రూపాయలు వడ్డీకి ఒప్పుకునేవాడు అసలు తిరిగి కడతాడా? కట్టకపోతే మనం అప్పుల్లో మునిగిపోమా?”
“రెండేళ్ళనుంచి చేస్తున్నాను. ఇప్పుడేదో కాస్త ఇబ్బంది అయిందని వ్యాపారమే తప్పంటే ఎలా?”
“సరేమరి రెండేళ్ళనుంచీ చేస్తే ఇప్పుడు అప్పులు ఎందుకు అయ్యాయి. సంపాదించలేదా ఇన్నాళ్ళు?” గొంతు పెంచాడు రాజు.
“ఈసారి నేను అప్పు ఇచ్చిన ఇద్దరిలో ఒకడు చచ్చాడు. ఇంకొకడు ఊరు వదిలి పారిపోయాడు.” చావు కబురు చల్లగా చెప్పాడు దామోదరం.
కృష్ణవేణి గట్టిగా ఏడవడం మొదలు పెట్టింది.
“ఇప్పుడేం చేస్తావు మరి?” తను సహాయం చెయ్యడానికి సిద్ధంగా ఉన్నా, ఊరికే ఒప్పుకోకబుద్ది కాలేదు రాజుకి.
“చూద్దాం. నా దెగ్గరైతే లేవని చెప్తాను. ఏం చేస్తారు తల తీసి మొలేస్తారా.”
దామోదరం ధైర్యం చూసి రాజుకి ఆశ్చర్యం వేసింది.భార్య ఉంది, అయిదేళ్ళ కొడుకు ఉన్నాడు, ఇంత బాధ్యత లేకుండా ఈ మనిషి ఎలా ఉండగలడు. ఉన్నా అతనితో తన అక్క ఎలా కాపురం చేస్తుంది ఇన్నాళ్ళనుంచీ.
అదే కోపంలో లేచాడు.
“సరే మరి మీ వ్యాపారం మీరు చూస్కోండి.” అని గబగబా బయటికి వెళ్ళాడు.
ఆ వెంటనే కృష్ణవేణి వెళ్ళింది.
“ఒరేయ్ తమ్ముడు. ఇదొక్క సహాయం చేసి పెట్టరా. ఆయన నా మాట వినరు. ఈ గండం మాత్రం గట్టెక్కించు. ఆయన్ని ఎప్పుడు తీస్కెళ్ళి ఏం చేస్తారో అని నేను ఛస్తూ బతుకుతున్నాను.” అని రాజు చేతులు పట్టుకుంది. ఆమె కళ్ళల్లోనుంచీ నీళ్ళు ధారగా కారిపోతున్నాయి.
అక్కడే ఉన్న సందీప్ ఇది చూశాడు. రాజు కాని, కృష్ణవేణి కాని అది పట్టించుకునే పరిస్థితిలో లేరు.
“సరే అక్కా. నీ కోసం.” అని మళ్ళీ లోపలికి వెళ్ళాడు. బావ పక్కన కూర్చున్నాడు.
“ఏమవుతే అది అవ్వుద్ది అని నువ్వు ఉన్నంత ధైర్యంగా మేము ఉండలేకపోతున్నాం బావా. చెప్పు. ఇప్పుడు ఈ పీడా పోవాలంటే ఎంత కట్టాలి వాళ్ళకి.” అని అనునయంగా అడిగాడు.
“నిన్ను నేను అడగలేదోయ్ బావ. మీ ఊరు వెళ్ళి హాయిగా నీ పని నువ్వు చేసుకో.” నవ్వుతూ అన్నాడు దామోదరం.
రాజు నిట్టూర్చాడు.
“అబ్బే. నువ్వు అడగలేదు బావా. నాకే డబ్బెక్కువయ్యి ఇస్తున్నా. చెప్పు ఎంత కట్టాలి.”
“ఒక రెండు లక్షలు మల్లయ్యకి. లక్షా యాభై గణేష్ కి. ఒక నలభై వేలు సింగ్ కి.” ఎప్పటినుంచో చెప్పాలి అనుకుని జ్ఞాపకం పెట్టుకున్నట్టు టకటకా చెప్పేశాడు.
“మరి ఒచ్చేవి ఎన్ని ఉన్నాయి దీంట్లో?”
“అవన్నీ కలుపుకునే చెప్పానోయ్. ఇప్పుడు తగ్గిన డబ్బు ఇది, అప్పు ఇది. ఇది కట్టేస్తే నన్ను ముట్టుకునే ధైర్యం ఎవ్వడికీ లేదు.”
రాజు నోరు తెరిచాడు. ఇంట్లో తెలియకుండా ఇంత అప్పు ఎలా చేశాడు. ఒక మాట గట్టిగా అనడానికి కూడా లేదు. బావగారు మరి...
ఒక్కసారి కృష్ణవేణిని చూశాడు. శక్తి కూడగట్టుకున్నాడు. చెప్పబోయేది వాళ్ళకు నచ్చదని తెలుసు.
“చూడక్కా. నీకు నచ్చినా నీకు నచ్చకపోయినా నేను చెప్పేది ఇదే. ఆ డబ్బంతా నేను కడతా. బావ చేతికి ఇవ్వను. ఆ అప్పుల వాళ్ళను పిలిచి నేను స్వయంగా కడతా. ఈ షాపు మూసెయ్యండి. మీ వాలకం చూస్తే అందులో సరుకులు కూడా ఏమీ మిగిల్చినట్టు లేదు. నాతోపాటు మనూరికి వచ్చెయ్యండి. అక్కడ బావకి ఒక ఉద్యోగం చూస్తా. మంచిదే. సందీప్ ని స్కూల్లో చేర్పిస్తా, వాడు జీవితాంతం ఎంత చదువుతానంటే అంతా నేనే చదివిస్తా. ఇదే చెప్తున్నా బావా... ఈ షరతులు అన్నిటికీ ఒప్పుకుంటేనే నేను డబ్బు ఇచ్చేది. నేను స్నానం చేసి, గంటలో బస్సు ఉంది, దానికి వెళ్ళిపోతాను. అంత లోపల మీ నిర్ణయం చెప్పండి.” అని లేచి పక్కనే ఉన్న సందీప్ తల నిమురుతూ వెళ్ళిపోయాడు. అతని గొంతులో కోపంకన్నా బాధే ఎక్కువ ధ్వనించింది కృష్ణవేణికి.
ఒక్కసారి కృష్ణవేణిని చూశాడు. శక్తి కూడగట్టుకున్నాడు. చెప్పబోయేది వాళ్ళకు నచ్చదని తెలుసు.
“నేను వెళ్తున్నా బావా. ఏం నిర్ణయించుకున్నారు మరి ఇద్దరూ?” అక్కని కూడా కలిపినట్టు అడిగాడు.
“అది నిర్ణయించేదేంటి? నాలుగు రూపాయలకోసం ఎవడికిందా ఊడిగం చేసే అవసరం లేదు నాకు. ఇల్లరికం వెళ్ళే అవసరం అంతకంటే లేదు.” అన్నాడు.
రాజు కృష్ణవేణికి చెప్పకుండానే వెళ్ళిపోయాడు.
నాలుగు రోజులు గడిచాయి. కృష్ణవేణి భయం భయంగా ఉంది. ఒక్కసారి రాజుకి ఫోన్ చేద్దాం అనుకుంది. కాని అలాంటిదేమీ చెయ్యొద్దని దామోదరం చెప్పాడు.
ఇంకో రెండు రోజులు ఆగి ఒకతను ఒచ్చాడు. రాజు పంపించాడు అని చెప్పి అణా పైసలతో సహా మొత్తం డబ్బు దామోదరం చేతుల్లో పోసి వెళ్ళిపోయాడు. కృష్ణవేణి ఆనందంగా తన తమ్ముడిని పొగిడింది. తన ఊరికి ఒకసారి వెళ్లి వద్దాం అంది. దామోదరం ఒప్పుకోక ఆగిపోయారు. ఒక సారి ఫోన్ చేసి మాట్లాడమంది. అతను ససేమిరా అన్నాడు.
గత్యంతరం లేక కృష్ణవేణే అతనికి తెలియకుండా తమ్ముడికి ఫోన్ చేసింది. తనని ఊరు వచ్చెయ్యమన్నాడు. ఆమె ఒచ్చేస్తే బావ కూడా కొన్ని రోజులకి ఒస్తాడని అతనికి తెలుసు. కాని అందుకు ఆమె రానన్నది. సందీప్ తో కాసేపు మాట్లాడి పెట్టేశాడు. ఆ తరవాత వాళ్ళ మధ్య అంతకు ముందున్న బంధం కాస్త పలుచబడింది. రాకపోకలు ఆగిపోయాయి. మాటలు కూడా తగ్గాయి. డబ్బు ఇచ్చాడని పొగరు వల్లే రాజు మాట్లాడడం మానేసాడని దామోదరం కొందరితో చెప్పాడు.
· * *

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: హైదరాబాద్ కథలు - by k3vv3 - 09-08-2023, 09:13 AM



Users browsing this thread: 1 Guest(s)