06-06-2023, 08:48 AM
(This post was last modified: 16-11-2023, 01:03 PM by అన్నెపు. Edited 1 time in total. Edited 1 time in total.)
జీవితం
రచన:డబుర ధనలక్ష్మి
"రేయ్ నానా నీ కోసం అని చింత చిగురు పప్పు చేసి వడియాలు మజ్జిగ మిరపకాయలు వేయించా.కాస్త తిని పో నానా" అంటూ కొడుకు అవినాష్ ను బ్రతిమాలుతోంది అన్నపూర్ణ.
"తింటాను. అయితే ఒక కండీషన్. నాన్నతో నేను బెంగుళూరుకు పోవడానికి ఒప్పిస్తేనే తింటాను . లేకపోతే ముద్ద ముట్టేది లేదంతే" అన్నాడు అవినాష్
అప్పుడే ఇంట్లోకి అడుగుపెడుతున్న శంకర్రావు" ఏంటో తల్లీ కొడుకులు ఇద్దరూ తెగ రహస్యాలు మాట్లాడుకుంటున్నారు .ఈ మధ్య నా కొడుక్కి నాన్న కంటే అమ్మ మీదే ప్రేమ ఎక్కువైంది అన్నాడు శంకర్రావు.
"లేదు నాన్న .
నువ్వంటేనే ఇష్టం.
నేనెప్పుడూ నాన్న బిడ్డనే అంటూ తండ్రి భుజం చుట్టూ చేయి వేసాడు అవినాష్.
" నువ్వంటే నా ధైర్యం రా.
మా ఇద్దరి ప్రాణం నీలోనే ఉంది.
ఎదిగిన కొడుకు తండ్రికి భరోసా.
అందరూ ఏమంటున్నారో తెలుసా పాతికేళ్ళ వయసులో నేనెలా ఉన్నానో అచ్చం నువ్వు ఇప్పుడు అలానే ఉన్నావంట.
నువ్వు నా ప్రతిరూపం నానా" అంటుండగా శంకర్రావు గుండె గర్వంగా ఉప్పొంగింది.
" మాటలతోనే కడుపు నింపుకుంటే ఎలా. కాళ్ళుచేతులు కడుక్కు రండి.భోజనం వడ్డిస్తాను.అంటూ అన్నం కూరలు వడ్డించేందుకు తయారైంది అన్నపూర్ణ.
@@@@@@
అసలే వేసవికాలం.
ఆరుబయట తలా ఒక మంచమేసుకుని చీకటిలో ఆకాశంలో నక్షత్రాలు చూస్తు పడుకున్నారు శంకర్రావు అన్నపూర్ణ.
అవినాష్ మామిడితోట లో స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటున్నామని చెప్పి వెళ్ళడంతో ఇద్దరే మిగిలారు.
" ఏం ఆలోచించారు. బాబును బెంగళూరు కు పంపే విషయం అంది అన్నపూర్ణ.
శంకర్రావు" ఈ ఊరిలోనే ఏదైనా పని చూసుకోమంటే వాడూ వినడు .నువ్వూ వినవు. కళ్ళముందుంటాడుగా.
హాయిగా ఓ ప్రైవేటు కాలేజ్ పెట్టకోవచ్చు. కాలేజ్ పెట్టుకోవడానికి పెద్ద ఖర్చు కూడా అవ్వదు. ఆ మాట తల్లీ కొడుకులు ఇద్దరూ వినరు.అన్నాడు.
అన్నపూర్ణ " ఇంజనీరింగ్ చదివినోడు .వాడి ఆశలు వేరు.
ఆశయాలు వేరు. " అంది.
శంకర్రావు. " బెంగళూరు లో ఫ్యాక్టరీ అంటే మాటలా. అంత డబ్బు ఎలా సర్దమంటావే. నేనేమైనా పెద్ద ఉద్యోగస్తుడినా. సాదా సీదా బట్టలు కుట్టే టైలర్ ని. అక్కడ కుట్టు మిషన్ పై " నా " కాళ్ళాడితేనే ఏ పూటకాపూట మన కడుపు నిండుతుంది.
ఉన్న కొద్ది పొలంలోనే ఇన్నాళ్ళు ఏ కష్టం లేకుండా బాబును చదివించి సంతోషంగా ఉండగలుగుతున్నాం. ఇక అది అమ్మితే భవిష్యత్తులో పరిస్థితులు ఎలా వస్తాయో అని నా అలోచన
ఇరవై నాలుగేళ్ళొచ్చినా నా కొడుకు లో ఇంకా పసితనపు చేష్టలు పోలేదు.
ఎక్కడైనా పనికి కుదిరితే అంతో ఇంతో సంపాదన వస్తుంది.
అలా పనిచేయమంటే మనవాడికి చిన్నతనం గా ఉంటుందేమో అనిపిస్తాది. నాకు కూడా వాణ్ణి పనికి పంపడానికి మనసొప్పదు" అంది
అన్నపూర్ణ" చాల్లే సంబడం. వాడే మైనా పని చేయనన్నాడా.
ఏ పనికి పంపినా ఒక్కరోజే. మరుసటి రోజుకు వాడు పనికి పోతాను నాన్నా అంటే వద్దంటావు.వాడు కష్టపడితే చూడలేవు.సిటీలో చదువుకున్నాడు.వచ్చేనెలలో వాడి స్నేహితుడు బెంగళూరు లో ఏదో ఫ్యాక్టరీ పెట్టబోతున్నాడట. అందులో మనోడికి భాగస్వామ్యం ఇస్తున్నాడు. వచ్చే వారమే ప్రయాణం."
శంకర్రావు" ఉదయం చెప్పాడు. డబ్బులు కోసం కష్టపడకు నాన్నా. పెట్టుబడి నా స్నేహితునిదే. లాభాల్లో వాటా ఇస్తానన్నాడు."అన్నాడు. పొలం కూడా అమ్మవద్దన్నాడు"అన్నాడు
అన్నపూర్ణ" ఇప్పుడెళ్తే ఇక ఇప్పట్లో ఇంటికి రాడు. ఒక్కగానొక్క నలుసు. వాణ్ణి చూడకుండా ఉండడం కష్టమే"అంది.
శంకర్రావు"పిచ్చిదానా.రెక్కలొచ్చిన పక్షులు గూటిలో ఉండవు. స్వేచ్చగా ఎగరాలి.అబ్బాయి కూడా అంతే. నీ ఏడుపుతో వాడి ఎదుగుదలకు సంకెళ్ళు వేయకు"అంటూ సున్నితంగా చెప్తున్నాడు కానీ తన కొడుకు దూరంగా వెళ్తాడంటే తనకు కూడా మనసులో దిగులే.
అవినాష్ తల్లిదండ్రుల పాదాలను మొక్కి లగేజ్ తో బతుకు వేటకు బెంగళూరుకు బయలుదేరాడు.
రెండువైపులా మది భారం.
వేళకు కడుపు నింపి ఎన్నో కబుర్లు చెప్పి బుజ్జగించే అమ్మ.
తన ఎదుగుదలకు మురిసిపోయి తన కష్టాన్నంతా కొడుకు నవ్వులో సంతోషం లో మర్చిపోయే నాన్న.
ఇంత కంటే గొప్ప ప్రేమ త్యాగం ఏ బంధం లో అయినా ఉండదేమో అనిపించగానే అవినాష్ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
అవినాష్ బెంగళూరు చేరుకున్నాడు.
@@@@@@@
మొదట్లో అవినాష్ ప్రతిరోజూ తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడేవాడు .రాను రాను ఆ ఫోన్ మాట్లాడే సమయం కూడా తగ్గిపోయింది. నెల నెలా డబ్బు మాత్రం పంపేవాడు.
ఆరునెలల తర్వాత అవినాష్ ఫోన్ చేసి " అమ్మా కంపెనీ పని మీద దుబాయ్ వెళ్తున్నా. ఇక ఇప్పట్లో రాలేను.నువ్వు నాన్న జాగ్రత్త" అన్నాడు.
"ఒక్కసారి చూడాలిరా కన్నా. నా కళ్ళారా నిన్ను చూసుకోవాలి. నీకు ఎంతో ఇష్టమైన ఆవకాయ పెట్టా. వడియాలు పెట్టా. మజ్జిగ మిరపకాయలు కూడా చేసి పెట్టుకున్నా. నువ్వొస్తే మన దేవరకు పొట్టేలు ఇద్దామని మొక్కుకున్నా. నాకు ఆరోగ్యం అంతంత మాత్రమే.
నిన్ను ఒకింటి వాడిని చెయ్యాలని ఆశ .మీ మామ కూతురు దీప్తి నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొంది. నువ్వొప్పుకొంటే దీప్తితో నీ పెళ్ళి.నీకు నచ్చకపోతే మాత్రం బలవంతం చేయను.
మూడు వారాల కింద చానా చెడ్డ కల వచ్చింది. నువ్వు రక్తపు మడుగులో పడి ఉన్నట్టు. అది కలని తెలియక ఎంతో భయపడి ఏడ్చేశా. ఒకటే గుండెదడ. నా బంగారు తండ్రికి ఏమైనా అయితే తట్టుకునేంత గుండె ధైర్యం ఈ పిచ్చి తల్లికి లేదు. ఆ రోజు నుంచి నా ఆరోగ్యం దెబ్బతింది.
నా మనసెందుకో నిన్ను చూడాలంటోంది.ఒక్కసారి వచ్చి పోరాదూ"అంది.
అవతలి వైపు కాల్ కట్ అయింది.
అన్నపూర్ణ మనసు బాధతో కదిలిపోయింది.
కాసేపటికి శంకర్రావు తమ పొరుగింటి అబ్బాయి మొబైల్ లో అవినాష్ తో వాట్సాప్ వీడియో కాల్ మాట్లాడుతూ అన్నపూర్ణ చేతికిచ్చాడు.
అవినాష్ ను చూడగానే అన్నపూర్ణ లో సంతోషం.కొడుకుతో తృప్తిగా మాట్లాడింది.
ఆ రోజు రాత్రి అన్నపూర్ణ కు గుండెల్లో నొప్పి.ఒకటే గుండె దడ. మరునాటి ఉదయం అన్నపూర్ణ ఇక నిద్ర లేవలేదు. శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయింది.
అన్నపూర్ణ మరణవార్త చెబుదామని ఎంత ప్రయత్నించినా శంకర్రావుకు అవినాష్ ఫోన్ కలవలేదు. ఎంత ప్రయత్నించినా అవినాష్ అడ్రస్ కూడా దొరకలేదు.ఇక సమయం లేక శంకర్రావు తమ్ముడి కొడుకు చేతుల మీదుగా అంత్యక్రియలు జరిగాయి.
శంకర్రావు లో ఆశ్చర్యం.బాధ.
తన కొడుకు ఎందుకిలా చేశాడు.
ఎందుకిలా మారిపోయాడు.
అన్నపూర్ణ ను ఆఖరి చూపు గా చూసుకోలేక పోయాడు.
ఈ బాధ కాలం గడిచే కొద్దీ అవినాష్ పట్ల అసహ్యం లా మారింది.
కనీసం ఫోన్ కు కూడా దొరకట్లేదు.నెల నెలా డబ్బు మాత్రం పంపిస్తున్నాడు.ఇక ఆ డబ్బు కూడా తాకకూడదు అనుకున్నాడు.
అయినా ఎలాగోలా అవినాష్ అడ్రస్ సంపాదించాడు. "వాడు పంపిన డబ్బు వాడి మొహాన కొడతాను. "అనుకుంటూ బెంగళూరు కు వెళ్ళి ఫ్యాక్టరీ లో అడుగుపెట్టాడు. ఆఫీస్ లోకి వెళ్ళి అవినాష్ క్యాబిన్ లోకి వెళ్ళి కొడుకుని చూడగానే కుప్పకూలి పోయాడు శంకర్రావు.
కారణం అవినాష్ వీల్ చైర్ లో ఉన్నాడు.అవినాష్ కు మోకాళ్ళ వరకు రెండు కాళ్ళు లేవు.
ఇక శంకర్రావు ను ఆపడం అవినాష్ వల్ల కావడం లేదు.
శంకర్రావు గుండె చెరువైంది.కన్నీరు మున్నీరు గా తలకొట్టుకుంటు ఏడుస్తున్నాడు.
అవినాష్ " నాన్నా.ఏడవద్దు. నాకు మనవూరి నుండి వచ్చిన నెలకే ఆక్సిడెంట్ జరిగింది.అతి కష్టం మీద బతికా.ప్రమాదంలో కాళ్ళు నుజ్జయి తీసేసారు.
ఈ విషయం మీకు తెలియకూడదనే చెప్పలేదు.
ఎంతో ప్రేమించే మీరు నన్ను ఇలా చూస్తే తట్టుకోలేరు. అందుకే మీ ముందుకు రాలేకపోయా
అమ్మ చాలా గుర్తొస్తోంది నాన్నా. నా పరిస్థితి బాగుంటే నెలకో రెణ్ణెళ్ళకో ఓసారి మీకు ఎదురుగా వచ్చే వాణ్ణి.
నేను రాకపోవడమనే ఆలోచనే అమ్మ మనసును శరీరాన్ని
బలహీనం చేసింది. అమ్మ మనకు దూరమైంది. అమ్మ గుర్తుకు రాని రోజంటూ లేదు నాన్న. ఇక నన్ను వదిలి వెళ్ళకు నాన్నా
"అంటూ కన్నీటితో తండ్రిని హత్తుకున్నాడు అవినాష్.
జరగాల్సింది జరిగిపోయింది.విధిరాత.
ఎవరూ మార్చలేరు. అనుకుంటూ తండ్రీకొడుకులు మామూలు జీవితానికి అలవాటు పడ్డారు. దీప అవినాష్ తో పెళ్ళికి ఒప్పుకోలేదు.
కృత్రిమ పాదాలతో అవినాష్ జీవితం మళ్ళీ మొదలైంది. తన స్నేహితుని చెల్లికి తనలాగే రెండు కాళ్ళు లేవు. అమ్మాయి చదువుకుంది. ఉద్యోగం చేస్తోంది.పైగా అవినాష్ ను ఇష్టపడుతోంది. ఇద్దరికీ పెళ్ళి కుదిరింది. శంకర్రావు ఇక అవినాష్ తోనే ఉండిపోయాడు.
జీవితం మళ్ళీ మొదలైంది.మూడు సంవత్సరాల తర్వాత ఆ ఇంట్లో పుట్టిన చిన్నారి కీ "అన్నపూర్ణ" అని పేరు పెట్టుకున్నారు.
జీవితం లో సమస్యలు రాకూడదని ఆ భగవంతుని మొక్క కూడదేమో.
ఎలాంటి కష్టం ఎదురైనా తట్టుకుని నిలబడి ముందుకు సాగేలా ఆత్మవిశ్వాసం ను ఇవ్వమని ప్రార్థించాలి
జీవితాన్ని ఎంతలానో ఉన్నతంగా ఊహించుకుంటాం.ఒక్కోసారి అనుకోని అవాంతరాలతో చతికిలపడతాం. ఓడిపోతాం.
అసలు ధైర్యం అప్పుడే మనకు అవసరం.
ఇప్పట్లో ఎన్నో ఆత్మహత్య లు చూస్తున్నాం.వింటున్నాం.
చిన్న జీవితం.ఏదో ఒకరోజు చావు మనల్ని వెదుక్కుంటూ వస్తుంది.
సమస్యలకు భయపడో ఇంకే కారణాల వల్లనో మనం చావును వెతుక్కుంటూ పోవాల్సిన అవసరం లేదు.
ఉన్నన్ని రోజులు సంతోషంగా జీవితాన్ని మలచుకోవడమే ఉత్తమం.
సమాప్తం
సర్వేజనా సుఖినోభవంతు