04-06-2023, 05:57 PM
(This post was last modified: 16-11-2023, 02:09 PM by అన్నెపు. Edited 1 time in total. Edited 1 time in total.)
తేడా
ఈ రోజు ఆఫీసులో బాగా ఆలస్యం అయిపోయింది. బయటకు వచ్చేసరికి చీకటి ఎంతగా అలుముకుందో తీక్షణంగా వెలుగుతున్న వీధి దీపాలు చెబుతున్నాయి.
కురుస్తున్న మంచు తెరలను చెదరగొట్టేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి.
కారు ముందున్న అద్దం తుడిచి స్టార్ట్ చేయబోతుంటే కాలేదు. బహుశా బ్యాటరీ వీక్ అయ్యిందేమో. నిన్న కూడా ఆఫీసుకు బయల్దేరుతుంటే స్టార్ట్ చేయడం కొంచం కష్టమైంది. ఆఫీసుకి వెళ్ళాక లంచ్ అవర్లో వర్క్షాప్కి తీసుకెళ్దామనుకున్నా కానీ పని తీవ్రతలో ఆ మాటే మరిచాను. ఇప్పుడు ఎంతకీ స్టార్టు కాకపోవడంతో ఓలా బుక్ చేయక తప్పదని మొబైల్ తీసాను. టైము పదిన్నర కావస్తోంది.
అదృష్టం. ఓలా ట్యాక్సీ వెంటనే దొరికింది. అయిదు నిమిషాల్లో నన్ను పిక్ అప్ చేసేందుకు వచ్చేసాడు. డోర్ తీసి ఓటీపీ చెప్పి కూర్చున్నానో లేదో డ్రైవర్ ఫోన్ మోగింది. బహుశా కారు స్టీరియోకి తన ఫోను కనెక్ట్ చేసాడనుకుంటాను. చిన్న పిల్ల గొంతు "నాన్నా!" అంటూ వినిపించింది. ఈలోగా డ్రైవర్ "సారీ సార్" అని స్టీరియో కనెక్షన్ కట్ చేసి ఫోనులో మాట్లాడుతున్నాడు. నిశ్శబ్దంగా ఉండడంతో పిల్ల మాటలు వినిపిస్తున్నాయి. బహుశా మాట్లాడే అమ్మాయి డ్రైవర్ కూతురేమో కాస్త దెబ్బలాడుతున్నట్లు మాట్లాడుతోంది. డ్రైవర్ ప్రేమగా "ఈ సారి మరిచిపోనమ్మా. ఎస్సెమ్మెస్ చేస్తానులే! ఒట్టమ్మా! అయినా లాస్ట్ ట్రిప్ దొరికింది మెంటి వైపుగానే అరగంటలో వచ్చేస్తాను" అని కాల్ కట్ చేసాడు.
"మీ అమ్మాయా?" ఉండబట్టలేక అడిగాను.
డ్రైవర్ నవ్వుతూ "అవున్సార్! రాత్రి ఎనిమిది దాటితే నేను ఆఫ్ లైన్ అయి ఇంటికి చేరేంత వరకూ అరగంటకోసారి కాల్ చేయమనో లేదా ఎస్సెమ్మెస్ చేయమనో కండీషన్ పెట్టింది. ఈరోజు ఒకరి వెంట మరో ప్యాసెంజర్లు దొరికేసరికి ఆ పని చేయలేదని నా మీద కోప్పడుతోంది సార్!" అన్నాడు.
"ఏ క్లాసు? అమ్మాయి" అని అడిగాను. డ్రైవర్ "అవును సార్! ఆరో క్లాసు" అని ఆగకుండా " అసలు మా అమ్మాయికి పొద్దున్నే లేచి చదువుకోవడం ఇష్టం సార్! కానీ నేను రాత్రులు ట్యాక్సీ నడుపుతానని ఇప్పుడు రాత్రి భోజనం చేసాక నేను ఆఫ్ లైన్ అయి ఇంటికొచ్చేదాకా చదువుకుంటూ ఉంటాది సార్." అన్నాడు కాసేపు మా మధ్య మౌనం రాజ్యం చేసింది.
కారు మా హౌసింగ్ కాలనీ చేరుకోగానే దిగి మా ఫ్లేట్ వైపు చూసాను. హాలులో లైటు వెలుగుతున్నట్లు కిటికీ నుంచి తెలుస్తోంది. లిఫ్ట్లో పైకెళ్ళి ఫ్లేట్ దగ్గరకొచ్చి కాలింగ్ బెల్ నొక్కాను.
"డోర్ లాక్ చెయ్యలేదు. కొంచం తోసేసి వచ్చేయండి" సోఫా మీద నుంచే నా శ్రీమతి కంఠం మోగింది. డోర్ తీసుకుని లోపలికి వచ్చేసరికి శ్రీమతి టీవీలో, కాస్త దూరంలో నా కూతురు మొబైల్లో బహుశా ఏదో కార్టూన్ చూస్తూ నిమగ్నమై ఉన్నారు. కనీసం ఒక్కరైనా ఫోన్ కాదు "లేటు అవుతుందా" అని ఎస్సెమ్మెస్ అయినా చేయలేదు. "తేడా" అనుకుంటూ ఫ్రెష్ అయ్యేందుకు బయలుదేరాను.