Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Non-erotic చిన్న కథలు
#11
కథ
ప్రేమకు పరీక్షా!
- కర్లపాలెం హనుమంతరావు
( రచన - మాసపత్రిక - కథాపీఠం పురస్కారం )
( పాత పోస్ట్ కొత్తవారి కోసం )

అప్పుడే తెలతెలవారుతున్నది. ఆటో ఓ గుడి ముందు ఆగింది. 'ఇదేనా రామాలయం?'అనడిగాను ఆటోవాడిని బాడుగ ఇస్తూ.

ఇంటిముందుండాల్సిన పెంకుటింటి కోసం పరికించి చూసాను.
సగం కూలిన మట్టిగోడల ప్రహరీ. లోపల దుబ్బులా పెరిగిన పిచ్చి చెట్లు. కుంగిపోయిన వసారా. అవధాని చెప్పిన ఇల్లిదే!

ఇంటినెంబరు ఇంకోసారి సరిచూసుకుని తలుపు తట్టాను. రెండోసారికి సగం తెరుచుకుంది తలుపు. తలుపు వెనకాల ఆమే! ఫొటోలో చూసిన సావిత్రి.

'కృష్ణమూర్తి' అన్నాను నన్ను నేను పరిచయం చేసుకుంటూ. 'రండి!' అది తను కొద్దిగా పక్కకు తప్పుకుని.

చెప్పులు ఓ వారగా విడిచి లోపలికి వచ్చాను. ఆమె చూపించిన సోఫాలో కూర్చున్నాను. చాలా పాతకాలంనాటి సోఫా అది. తను లోపలికి వెళ్ళింది. అటువైపునుంచి ఏవో చిన్నగా మాటలు.

హాలుని పరికించి చూసాను. పెచ్చులూడిపోయిన గోడలు. వెల్ల వేయించి చాలా కాలమైంది. ఒక రకమైన పాతవాసన ఇల్లంతా. గోడలమీద రకరకాలఫొటోలు. కొన్ని దేవుళ్ళవి. బూజు కూడా దులుపుతున్నట్లు లేదు. ఒక మూల మాత్రం ఏదో ఫ్యామిలీ ఫొటో. కుర్చీలో ఉన్న పెద్దావిడకు వెనకున్న ఇద్దరిలో ఒకరు ఈ సావిత్రిలాగే ఉంది. కింద ఇద్దరు పిల్లలు కూర్చోనున్నారు.

'మొహం కడుక్కుంటారా? కాఫీ ఇవ్వనా?' అన్న ప్రశ్నలకు ఈ లోకంలోకొచ్చి పడ్డాను. 'మొహం కడుక్కుంటాను ముందు' అంటూ వెంటతెచ్చుకున్న బ్రీఫ్ కేసులోనుంచి బ్రష్షు, పేస్టు, షేవింగ్ సెట్టూ బైటికి తీసాను. వెనకవైపు ఆమె చూపించిన రేకుల బాత్ రూంలోకి దూరాను.

షేవింగు చేసుకుంటున్నానన్న మాటేకానీ.. మనసు మనసులో లేదు. అంతర్మథన. 'నేను చేస్తున్న పని సరైందేనా? నిజానికి ఈపాటికి నేను ఎప్పటిలాగా హైదరాబాదులో.. ఇందిరాపార్కు వినాయకుడి గుడిలో ఉండాలి. శారదకు ఆ గుడంటే చాలా ఇష్టం. ఏటా పెళ్ళిరోజు ఉదయాన్నే తనతో కలసి ఆమె చేసే మొదటి పని ఆ వినాయకుడి గుళ్ళో అర్చన చేయించడం. మధ్యాహ్నం తనకిష్టమైన వంటకాలతో సుష్టుగా విందు. సాయంత్రం ఏదైనా అనాథ శరణాలయానికి వెళ్ళి పిల్లలతో సరదాగా గడపడం. కేక్ కటింగు రాత్రి తొమ్మిదీ ఇరవైకి. నాలుగేళ్ళ కిందట జరిగిన మా పెళ్ళికి అప్పటి ముహూర్తం అది. తను కేండిల్ ఊదేస్తే, నేను కేక్ కట్ చేసి ఒక ముక్క ముందుగా తనకు తినిపించాలి. అసలైన వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్సు మొదలయ్యేది అప్పట్నుంచే. రాత్రంతా ఆ సంబరాలు సాగుతూనే ఉండేవి. రెండేళ్ళ కిందట బస్సు యాక్సిడెంటులో తను పోయేముందుదాకా క్రమం తప్పకుండా సాగిన కార్యక్రమం అది.

తండ్రి ఆరోగ్యం బాగోలేదని ఉయ్యూరు వెళ్ళిన శారద పెళ్ళిరోజు నాతో గడిపి తీరాలన్న పంతంతో తుఫాన్ను కూడా లెక్కచేయకుండా ప్రైవేట్ బస్సులో హైదరాబాద్ తిరిగివస్తోంది. విజయవాడ హైవేలో నకిరేకల్ దగ్గర బస్సు చీకట్లో చెట్టుకు గుద్దుకున్న దుర్ఘటనలో ప్రాణాలు పోయిన ముగ్గురిలో శారద ఒకతి. నా ఇంటిదీపాన్ని ఆర్పేసిన భయంకర సంఘటన అది.

శారదలేని జీవితం వెన్నెలలేని ఆకాశంలాగయింది. 'ఏమంత వయసు మీరిపోయింది. మళ్ళీ పెళ్ళి చేసుకో’మని అమ్మ శతపోరింది

శారదస్థానంలో మరొకరిని ఊహించుకోవడం కూడా నా వల్ల కాని పని. మరో ఆడపిల్ల బతుకు ఛిద్రం చేయదలుచుకోలేదు. అమ్మ ఆ దిగులుతోనే పోయినేడాది పోయింది.

ఎంత వంటరిజీవితానికి అలవాటు పడుతున్నా ఇలాంటి స్పెషల్ అకేషన్సప్పుడు మాత్రం మనసు ముళ్ళపొదల్లో పొర్లించినట్లుంటుంది ఇప్పటికీ.

ఏదో బాధ కొద్దీ అప్పుడప్పుడూ ఇంత మందు కొట్టడమేగానీ అంతకు మించి ముందుకు పోవాలన్న పాడాలోచన నాకేనాడూ రాలేదు. 'అన్నీ చేసిపెట్టే అర్థాంగి ఇంట్లో ఉన్నా పరాయి రుచులకు పాకులాడే మన అవధానిలాంటి వాళ్లే దండిగా ఉన్న ఈ రోజుల్లో కూడా నువ్విలా ప్రవరాఖ్యుడికి మల్లే మడి కట్టుకున్నావు చూడూ,. అందుకు నీకు హ్యాట్ సాఫ్ రా.. సోదరా!’ అన్నాడు ఈ మధ్య బార్ లో వెంకటరమణ మందుకొట్టే మధ్యలో.

అవధానిగాడు ఎగతాళికి దిగాడు. 'వీడసలు మగాడేనా అని నా డౌటురా రమణా!రుచి తెలీకగాని ఈ రుషి వేషం.. సావిత్రిలాంటి ఓ దేవకి తగులుకుంటే చాలదూ.. ఈ మునిముచ్చు.. విప్రనారాయణుణ్ని మించి రెచ్చిపోవడానికి!' అంటూ పనిగట్టుకుని మరీ నన్ను రెచ్చగొట్టేసాడు.

మందుదెబ్బలో ఉన్నానేమో ఎన్నడూ లేనిది రోషం ముంచుకొచ్చేసింది. పక్కనున్న వెధవలా మంటను మరింత ఎగదోసారు. చివరికి అవధానిగాడి వ్యూహంలో చిక్కుకుని ఈ పూట ఇక్కడ ఇలా తేలాను.

అవధానిగాడు అన్నాడని కాదుగానీ నిజంగా నాది పరాయి ఆడదాని వళ్ళు తగిలితేనే సడలిపోయేటంత బలహీనమైన ప్రేమా? కొన్ని పచ్చనోట్లకోసం ముక్కూ మొగం తెలీని పరాయి మగాడికి వళ్లప్పగించే సావిత్రిలాంటి ఆడది.. శారదవంటి అనురాగ దేవతనుంచి ఇంచికూడా నా మనసును మళ్ళించలేదని నా దృఢమైన అభిప్రాయం.

నిజం చెప్పాలంటే నన్ను నేను పరీక్షించుకోవడానికే నేనీ పాడు పందేనికి ఒప్పుకున్నది. పందెం ప్రకారం నేనొక రోజంతా ఈ సావిత్రి సన్నిధానంలో ఒంటరిగా గడపాలి. 'కార్యేషు దాసీ.. కరణేషు మంత్రీ..భోజ్యేషు మాతా.. శయనేషు రంబా' అనేదో అంటారే! అందులో ఆ 'కరణేషు' పనికి తప్ప మిగతా వాటన్నింటికీ సావిత్రి తరుఫున నాదీ పూచీ! అనుభవంతో చెబుతున్నా' అని కూసాడా అవధానిగాడు.

ఆఫీసుపనిమీద క్యాంపులకెళుతున్నప్పుడు రకరకాల రుచులకు వెంపర్లాడే వెధవీ అవధానని అందరికీ తెలుసు. ఎక్కడో తగిలుంటుందీ సావిత్రిపాప అవధానిగాడి వలకు.

బైట తలుపు తట్టిన చప్పుడుకి ఈ లోకంలోకి వచ్చిపడ్డాను. గబగబా స్నానం చేసి ఇస్త్రీ బట్టల్లోకి మారింతరువాతగానీ మనసులోని అలజడి కాస్తంత సద్దుమణగలేదు.

వేడి వేడి ఇడ్లీ కారప్పొడి.. కొబ్బరి చట్నీలో నంజుకుని తింటుంటే శారదే గుర్తుకొచ్చింది. శారదా ఇదే టిఫిను తయారు చేసేది పెళ్ళిరోజు ఉదయాన.

కాకతాళీయమా? అవధానిగాడు ముందే ఓ పథకం ప్రకారం ఏర్పాటు చేసిన కార్యక్రమాలా? మా ఫ్యామ్లీ ఫ్రెండు వాడు. నా ఇష్టాఇష్టాలన్నీ ముందే తెలుసు వాడికి. నన్నెట్లాగైనా బుట్టలో దింపాలని పెద్ద ప్రణాళికే రచించాడన్నమాట దుర్మార్గుడు!

సావిత్రి కలిపిచ్చిన ఫిల్టర్ కాఫీ తాగి పేపరు చూస్తూ కూర్చోనున్నాను.'భోజనంలోకి ఏమి చెయ్యమంటారు?' అని అడిగింది ఓ అరగంత తరువాత వచ్చి. అదీ అవధానిగాడు చెప్పుండాలే! మా పెళ్ళిరోజు మధ్యాహ్నం భోజనానికి వచ్చే ముఖ్యమైన అతిథుల్లో వాడూ ఒకడాయ! మంచివాడుగా శారద దగ్గర మంచిమార్కులే కొట్టేశాడు రాస్కెల్. నా అంచనా కరెక్టయితే ఇంకో గంటలో చిలకాకుపచ్చరంగు అంచున్న పాలనురుగు వర్క్ శారీలో ఈ సావిత్రీదేవి ప్రత్యక్షమవడం ఖాయం. పెళ్ళిరోజు శారద కంపల్సరీగా కట్టుకునే శారీ అది.

మెదలకుండా కూర్చున్న నన్ను చూసి 'మొహమాట పడుతున్నట్లున్నారు. అవధానిగారంటే ముందునుంచీ తెలుసు.మొదటిసారి వచ్చారు మీరు. చెబితేనే గదా నాకు ఏమైనా తెలిసేది మీ అభిరుచులు?' అంది సావిత్రి.

పెళ్ళిరోజు విందులో శారద తప్పకుండా చేసే వంటకం పొట్టు తీయకుండా నేతిలో వేయించే మినప్పప్పు గారెలు. అల్లం చట్నీలో వాటిని అద్దుకుని తింటుంటే స్వర్గానికి బెత్తెడు దూరంలో సంచరిస్తున్నట్లండేది. ఇల్లు చూస్తే ఈ తీరుగా ఉంది! ఈ ఇష్టాలన్నీబైటపెట్టి ఆమెను రొష్టు పెట్టడం భావ్యం కాదనిపించింది. 'ఏదో ఒకటి చేసేయండి! కడుపులోకూడా బాగా లేదు' అని బొంకేసాను.

'ఓ గంట ఆ గదిలో విశ్రాంతి తీసుకోండి. ఒంటిగంటకల్లా భోజనం వడ్డించేస్తాను' అంటూ పడకగది చూపించింది తను వంటగదిలోకి వెళ్ళిపోతూ.

పేరుకే అది పడక గది. పందిరిమంచం మూడొంతులు ఆక్రమించేసింది. పాతకాలం నాటిది లాగుంది. ఆ చెక్క నగిషీ పనితనం ఇప్పుడెక్కడ కనబడుతుంది? బాగా బతికిన కుంటుంబాల్లో తప్ప ఇలాంటి భారీ సామాను కనిపించవు. గదిని అప్పుడే శుభ్రం చేసినట్లుంది.. తేమ తేమగా ఉంది. ఫినైల్ వాసన ప్లస్ ఓ మూల వెలిగించి పెట్టున్న అగరొత్తుల వాసన.. కలగలసి పోయి ఓ విచిత్రమైన వాతావరణం గదంతాపరుచుకుని ఉంది.

పాతకాలంనాటి స్లీపింగు రికార్డుప్లేయరునుంచి మల్లీశ్వరి సినిమా పాట చిన్నగా వినిపిస్తున్నది. 'ఆకాశవీధిలో హాయిగా ఎగిరేవు! దేశ దేశాలన్నీ తిరిగి చూసేవు!..' భానుమతి గొంతులోనుంచి అలలు అలలుగా సాగివచ్చే ఆ సుస్వర మధుర వాయుతరంగాలు అలసిపోయిన మనసుకి జోలపాటలా హాయి గొలుపుతున్నాయి.

శారదకూ ఈ పాటంటే ఎంతో ఇష్టం. పాత చింతకాయపచ్చడని నేను తెగ ఆటపట్టించే వాణ్ణి..పాపం. ఇప్పుడా ఆ పాత మధురిమే ఆపాత మధురంగా ఉంది! కళ్ళు నాకు తెలియకుండానే మూతలు పడిపోయాయి చల్లగా.

'కావుఁ.. కావుఁ.. కావుఁ'

కాకి అరుపులకు మెలుకువ వచ్చేసింది. బైట ఎక్కడో దగ్గర్లోనే ఆ అరుపులు. ఎవరో ఆడమనిషి అదే పనిగా పిలుస్తుందో.. అరుస్తుందో అర్థం కాకుండా ఉంది.

టైము చూస్తే ఒంటిగంట దాటి పావుగంట అయింది. కడుపులో పేగులు ఆవురావురుమంటున్నాయు. భోజనానికి పిలుపు రావడంతో ప్రాణం లేచివచ్చినట్లయింది.

ఆలుగడ్డ కూర, దోసకాయ పప్పు, మునక్కాయ సాంబారు, ఆవపెట్టిన దబ్బకాయ చట్నీ, గడ్డపెరుగు.. మధ్య మధ్య నంజుకునేందుకు వూరుమిరపకాయలు.. పొట్టుతీయని మినప్పప్పుతో చేసిన నేతి గారెలు! నా అంచనా తప్పలేదు. అన్నీ నాకిష్టమైన పదార్థాలే!

ఏమాట కామాటే. అవధానిగాడి ప్లానింగు మొదట్నుంచీ అద్భుతమే! సావిత్రి చేతివంట శారద చేతివంటకు ఏమాత్రం తీసిపోదు. కష్టం కలిగించిందల్లా వడ్డించేటప్పుడు ఆమె కట్టుకున్న ముతక చీరే! వయసు మళ్ళిన ఆడవాళ్లు కట్టుకునే మడిబట్టలాగా ఉందా కట్టుకునే తీరు కూడా! నుదుటన బొట్టు దిద్దుకునేటంత తీరికకూడా లేనంతగా ఉందా ఇంటిపని!

అలవాటుకన్నా ఎక్కువగా లాగించేయడం వల్లనేమో భుక్తాయాసంగా ఉంది. ఎప్పుడు కట్టించి పెట్టుంచిందో.. మిఠాయికిళ్ళీ చేతికందించి 'కాస్సేపలా నడుం వాల్చండి. వంటిల్లు సర్దుకుని వచ్చేస్తే ఇంకీ పూటకు ఇంటిపని ఐపోయినట్లే' అని వెళ్ళిపోయింది సావిత్రి.మంచమెక్కీ ఎక్కగానే కళ్ళు మూతలు పడిపోయాయి.

ఎక్కడో పిడుగు పడిన చప్పుడు.గభాలున మెలుకువ వచ్చేసింది. గదంతా మసక చీకటి. ఒక మూల బీరువాముందు నిలబడి ఉంది సావిత్రి అటు తిరిగి. పైన వంటిమీద అడ్డుగా తువ్వాలు. కింద లోపలి లంగా. బీరువాలో దేనికోసమో వెదుకుతున్నట్లుంది. నేను మంచం దిగిన అలికిడికి ఇటు తిరిగింది. ఆ కంగారులో తుండు కిందికి జారిన మాట వాస్తవం. నా చూపుల్ని మరల్చుకోవడం చాలా కష్టమైంది.

'సారీ! డిస్టర్బ్ చేసినట్లున్నాను. నా బట్టలు బీరువాలో ఉండిపోయాయి.' అంటూ చేతికందిన చీరె తీసుకుని బైటికి వెళ్ళిపోయింది సావిత్రి. మూడు నాలుగు నిమిషాల వరకూ నా గుండె చప్పుళ్ళు నాకే వినిపించాయి. మనసుని మళ్ళించుకోవడానికి చూసిన పేపర్నే మళ్ళా మళ్ళా చూస్తూ గదిలోనే ఉండిపోయాను.

అరగంట తరువాత ఆమె తలుపు నెట్టుకుని గదిలోకి వచ్చింది. మల్లెపూల వాసన గుప్పుమంది. చేతిలో టీ కప్పు.

గంటకిందట చూసిన సావిత్రేనా ఈమె! చిలకాకుపచ్చరంగు అంచున్న పాలనురుగు వర్క్ శారీలో గంధర్వలోకంనుంచీ దొగొచ్చిన అప్సరసలాగుంది! నుదుటిమీది తిలకం ఆమె సొందర్యాన్ని రెట్టింపు చేస్తోంది. వదులుగా అల్లుకునీ అల్లుకోనట్లు వదిలేసిన ఆ వాలుజడలో తురిమిన మల్లెల మత్తువాసనలే ఇందాకట్నుంచీ నా మతిని పోగొడుతున్నవి.

అవధానిగాడి ప్రణాళిక అర్థమవుతూనే ఉంది. అప్పుడైతే ఏదో రెట్టించాడు కానీ.. వాస్తవానికి విషయవాసనాలౌల్యంనుంచీ బైట పడటం ఎంత కష్టమో ఇప్పుడు అర్థమవుతోంది.

అపార్థం చేసుకున్నట్లుంది సావిత్రి 'మీకు నచ్చినట్లు లేదు' అంది అదో రకంగా. 'లేదు. చాలా బాగుంది ఈ శారీ మీ వంటిమీద. చాలా బాగున్నారు మీరు. ఎప్పుడూ ఇలాగే చలాకీగా ఉండొచ్చుగా!' అన్నాను తడబడుతూ. ఆ ఉద్వేగంలో నేనేం మాట్లాడుతున్నానో నాకే అంతుబట్టడం లేదు.

' థేక్సండీ! మీ ఫ్రెండు అవధానిగారిలాగా కాదు మీరు. తగని మొహమాటం. ఇదంతా ఆయన ఐడియానే. నిజానికి నాకూ ఇదంతా ఏదోలా ఉంది' అంది. ఆమె మాటల్లో ఎక్కడో ఓ చిన్న గిల్టీనెస్!

'నేను అనుకుంటున్నంత ‘ఇది’కాదేమో ఈమె!'అనిపించింది.
'బలవంతంగా ఒప్పించాడా మా వాడు?' అనడిగాను ఆమె వాలకం చూసి.

'అలాగని కాదూ! మీ గురించి చెప్పింతరువాత నాకే ఇలా చేయడంలో పెద్ద తప్పేం లేదనిపించింది. ఆ టాపిక్ వదిలేయండి! బైట ఇప్పుడే వర్షం కాస్త వెలిసింది. కట్ చేయడానికి కేక్ ఉండాలిటకదా మీకు? వానలకు బేకరీలు తొందరగా మూసేస్తారేమో! ఇప్పుడే వెళ్ళి తెచ్చేసుకోరాదూ .. ఈ వీధి చివర్నే ఉంది మస్తాన్ బేకరీ!' అని టీ కప్పు తీసుకుని వెళ్ళిపోయిందామె.

రాత్రికి కేక్ కట్ చేయడం.. వెడ్డింగ్ యానివర్సిరీ సెలబ్రేషన్సు అన్నీ చెప్పేసినట్లున్నాడు అవధానిగాడు. ఈమె వ్యవహారం చూస్తే అన్నింటికీ తెగించినట్లే ఉంది.

'డబ్బెంత చెడ్డది! మంచివాళ్ళనుకూడా చెడగొటేస్తుంది కాబోలు! చెడటానికి ఈమెగారు సిద్ధంగా ఉన్నా నేనెంత సిద్ధంగా ఉన్నానో తెలీని అయోమయం. బయలుదేరినప్పుడున్న బింకం ఇప్పుడు లేదు. మరి ఇప్పుడున్న ఈ కాస్త బింకమన్నా రాత్రిదాకా మిగిలుంటుందా?

రెండేళ్ళబట్టీ సుఖానికి దూరమైన శరీరం. ఒంటరిగా ఈ సావిత్రిలాంటి అందమైన ఆడది .. అందుకునేటంత దూరంలో! పకృతికూడా పగబట్టినట్లంది. రెచ్చగొడుతోంది. వర్షం .. మంటబెట్టే చలి వాతావరణం. ఇన్నాళ్ళబట్టీ నేను గొప్పగా ఊహించుకుంటున్న శారదమీది నా ప్రేమకు నిజంగా ఇది పెను పరీక్షే!

నన్ను నేను పరీక్షించుకోవాలనే కదా ఈ పందేనికి వప్పుకుని ఇంతదూరం వచ్చింది? మధ్యలో పారిపోతే ఆ అవధానిగాడింక బతకనిస్తాడా? నా శారదను నేనే అవమానించినట్లవదా? ఏదేమైనా తెల్లారిన తరువాతే తిరుగు ప్రయాణం. గెలిస్తే శారదప్రేమకు విజయం. ఖర్మగాలి ఓడితే నేను నా భ్రమలనుంచి దూరం.

కేకుకోసం బట్టలు మార్చుకుని సావిత్రి చెప్పిన మస్తాన్ బేకరీ వెతుక్కుంటూ బైలుదేరాను. వీధి చివర్న కనబడిందది.

ఇలా కేక్ కావాలంటే పదినిమిషాల్లో ప్యాక్ చేసి ఇచ్చాడు. 'అప్పుడే రెడీ ఐపోయిందా?!' అని అడిగితే 'పొద్దునే ఆర్డరిచ్చారుగా! ఎంతసేపు సాబ్!' అని సమాధానం. అవధానిగాడు అన్నీ రడీ చేసే ఉంచాడన్న మాట! నా మడిని భగ్నం చేయాలని వాడికెందుకో అంత పట్టుదల!

సగం దారిలో ఉండగానే మళ్ళా వర్షం మొదలయింది. కుండపోతగా కురుస్తోందీ సారి ఆగకుండా! వీధిదీపాలుకూడా లేకపోవడంతో ఇల్లు గుర్తుపట్టడం కష్టంగా ఉంది. దారంతా రొచ్చు.వళ్ళంతా తడిసి ముద్దయిపోయింది ఒక్క నిమిషంలో. కేకు తడిస్తే పనికిరాకుండా పోతుంది. కాస్త తెరిపిచ్చిందాకా ఎక్కడైనా ఆగడం మంచిదనిపించింది. ఎదురుగా కనిపించిన గుడిమండపంలోకి పరిగెత్తాను.

నాకులాగానే ఇంకో ఇద్దరు పిల్లలు గుడిమండపంలో స్థంబాల చాటున మునగదీసుకుని కూర్చోనున్నారు. చలిగాలికి కాబోలు చిన్నపిల్లాడు వజవజా వణుకుతున్నాడు. పెద్దబ్బాయి వాడిమీద వానజల్లు పడకుండా అడ్డంగా నిలబడున్నాడు. ఏడుస్తున్న తమ్ముణ్ణి వాడు పెద్దరికంగా ఓదారుస్తున్న తీరు చూస్తుంటే 'పాపం' అనిపించింది. ఎవరి పిల్లలో ఏంటో? చీకట్లో వానజల్లులో చిక్కడిపోయినట్లున్నారు.

'ఎక్కడిదాకా వెళ్ళాలి బాబూ?' అనడిగాను పెద్దబ్బాయిని. సమాధానం లేదు. 'తడిస్తే తడిసారు. ఇంటికెళ్ళి పోవచ్చుగా?ఇంట్లో మీ అమ్మానాన్నావాళ్ళు ఎంత కంగారు పడుతుంటారో కదా!’ అన్నాను మళ్లీ ఉండబట్టలేక.

'అమ్మే మమ్మిల్నిక్కడ దింపి పోయిందంకుల్! మళ్ళా తనొచ్చిందాకా ఎక్కడికీ కదలవద్దంది' అన్నాడు పెద్దబ్బాయి. వాడికి పదేళ్ళు ఉంటాయేమో!

'పొద్దున్నుంచీ ఇక్కడే ఉన్నామంకుల్! చాలా భయమేస్తుంది.'అంటూ ఏడుపు పెద్దది చేసాడు చిన్నపిల్లాడు.

'ఇల్లెక్కడో చెప్పండి! నేనొచ్చి దించి పోతా! ఇంట్లో వాళ్ళెవరూ ఏమీ అనరులే!'అని ధైర్యం చెప్పబోతే 'వద్దులే అంకుల్! మాకిది అలవాటే! ఇంట్లోనుంచి అంకుల్ వెళ్ళిపోయింతరువాత అమ్మే వచ్చి తీసుకుపోతుంది!' అన్నాడు పెద్దబ్బాయి.

ఇదేదో వింతగా ఉందే!ఇంత వానలో పిల్ల్లల్ని ఇక్కడ కూర్చోబెట్టి ఆ తల్లి ఇంట్లో చేసే నిర్వాకమేంటి?! పిల్లలు కూడా చూడకుండా ఆ అంకుల్ చేసే వ్యవహారమేంటి?! నాకెందుకో సావిత్రి గుర్తుకొచ్చించి. కొంపదీసి ఆ అంకుల్ని నేనైతే కాదు గదా?!

సెల్ ఫోన్ టార్చి లైట్ పిల్లలమీదకు ఫోకస్ చేసాను. పొద్దున సావిత్రి నట్టింట్లో చూసిన ఫ్యామిలీ ఫొటోలోని పిల్లలాగా అనిపించారు.

అనుమాన నివృత్తికోసం అడిగాను 'మీ అమ్మ పేరేంటి బాబూ?' చిన్నబ్బాయి చెప్పాడు ఠక్కుమని 'సావిత్రీ దేవి'

నా గుండె ఒక్కసారి ఆగిపోయినట్లయింది. తేరుకోవడానికి చాలా టైం పట్టింది. ఉదయాన నేనా ఇంట్లో ప్రవేశించినప్పుడు వెనకగదిలోనుంచి చిన్నగా వినిపించిన మాటలు ఈ పిల్లలవేనన్నమాట!

నేనొచ్చానని తెలియంగానే ఈ పసివాళ్లను నిద్రమధ్యలోనే లేపి గుడిమండపంలో దింపి వచ్చిందన్న మాట ఆ తల్లి! ఉదయంనుండి ఎడాపెడా కొడుతున్న గాలివానలో ఈ ముక్కుపచ్చలారని పిల్లలు గుడిమండపంలో కాలక్షేపం చేస్తున్నారా!

ఇల్లుండీ.. తల్లుండీ దిక్కులేని వాళ్లకుమల్లే ఇలా ఇక్కడ పడుండటానికి కారణం నేనా?! ఇన్ని చెప్పిన అవధానిగాడు సావిత్రికి ఇద్దరు ఎదిగిన బిడ్డలునారని మాత్రం చెప్పలేదు. పిల్లలుంటే నేనీ పందేనికి ఒప్పుకోనని వాడికి తెలుసు. నా సంగతి సరే.. మరి సావిత్రి ఎందుకు తలొగ్గినట్లు?!

అమెనే అడిగి తేల్చుకోవాల్సిన విషయం. పిల్లలిద్దర్నీ బలవంతంగా లేపి చెరో చెయ్యి పట్టుకుని సావిత్రి ఇంటిముందుకొచ్చి తలుపు దబాదబా బాదాను. అప్పటికి వాన తెరిపిచ్చింది కొద్దిగా.

నిదానంగా తలుపు తెరిచి తొంగిచూసిన సావిత్రి నాకు ఒక వైపున్న బేకరీ కేకు, రెండో వైపున్న పిల్లలిద్దర్నీ చూసి అవాక్కయింది. పిల్లలిద్దరూ తల్లివైపు భయభయంగా చూస్తూ నిలబడి ఉంటే నేనే చొరవగా వాళ్ళతో సహా లోపలికి అడుగు పెట్టాను.
...
చాలాకాలం తరువాత మళ్ళీ నేను మనసారా నా వెడ్డింగు యానివర్శిరీ జరుపుకున్నాను సావిత్రి నట్టింట్లో. సరిగ్గా తొమ్మిదీ ఇరవైకి క్యేండిల్సు సావిత్రి చిన్నకొడుకుతో కల్సి ఊదేస్తే.. పెదకొడుకుతో కల్సి కేకు కట్ చేసాను తరువాత. పిల్లలిద్దర్తో కల్సి సావిత్రీ నా నోటికి కేకు ముక్క అందిస్తున్నప్పుడు ఆమె కళ్లల్లో తళుక్కుమన్న కన్నీటి తడిని గమనించక పోలేదు.

ఇద్దరు పిల్లలమధ్య పెళ్లిరోజు సంబరంగా జరుపుకోవాలని శారద కోరిక. పిల్లలిద్దర్నీ చెరోవైపు పడుకోబెట్టుకుని కథలు చెబుతూ వాళ్ళని నిద్రబుచ్చాలని నా కోరిక. ఈ రోజుతో ఆ రెండూ తీరిపోయాయి సావిత్రీదేవి పుణ్యమా అని.

పిల్లలు గాఢనిద్రలోకి జారుకున్నతరువాత బలవంత పెట్టిన మీదట సావిత్రి చెప్పుకొచ్చింది వాళ్లాయన ప్రసాదరావుని గురించి. 'ప్రేమించి చేసుకున్న కులాంతర వివాహం మాది. అటువైపునుంచి, ఇటువైపునుంచి ఆదరణల్లేవు మొదట్నుంచీ. ఆయన ఓ ప్రయివేట్ బస్సు ఆపరేటరు కింద పనిచేసే డ్రైవరు. రెండేళ్ల కిందట బెజవాడనుంచి హైదరాబాదుకు వెళ్తూ బస్సును నకిరేకల్లు దగ్గర చెట్టుకు గుద్దేసారు. ఆ ప్రమాదంలో పోయిన ముగ్గుర్లో ఆయనా ఒకరు. తాగి డ్రైవ్ చేస్తున్నట్లు తేలడంవల్ల నష్టపరిహారం ఏమీ రాదన్నారు. అవధానిగారి మధ్యవర్తిత్వం వల్ల చివరికో లక్ష ముట్టింది.అప్పట్నుంచీ ఈయనే ఈ ఇంటికి మగదిక్కు. అప్పుడప్పుడు వచ్చి పోతుంటారు. తను ఇక్కడున్నంత సేపూ పిల్లలు కంటబడకూడదని షరతు పెట్టారు. ఇవాళ జరిగిందంతా ఆయన డైరెక్షన్లోనే. ఆయన చెప్పారనే ఇలా ఒప్ప్పుకోవాల్సొచ్చింది. అదీగాక మా వారి తప్పిందంవల్లే మీరు మీ శ్రీమతిగారిని పోగొట్టుకుంటిరి…' కన్నీరు మున్నీరయిపోయింది సావిత్రి.

నాకు శారద ఎంతో సావిత్రికి ప్రసాద రావు అంత. ఇద్దరూ పోయింది ఒకే రోజు. ఒకే సందర్భంలో. శారదమీది ప్రేమను పరీక్షకు పెట్టి తప్పు చేయబోయాను నేను. రావుమీది ప్రేమతో చేయని తప్పుకు పరిహారం చెల్లించబోయింది సావిత్రి!

ఆడదాని దుస్థితిని అవకాశంగా మలుచుకునే అవధానిలాంటి వాళ్లు.. ఆ మాటకొస్తే నాలాంటి చపలచిత్తులూ ఉన్నంత కాలం ఇలాంటి చిత్రమైన కథలకు కొదవుండదేమో!

సావిత్రి చేతిలో ఓ పదివేలు పెట్టి 'ఇది మీ అవధానిగారి దగ్గర్నుంచీ నేను గెలుచుకున్న పందెం సొమ్ము. నీతులు చెప్పే అర్హత నాకెంతవరకుందో తెలీదు. నా దగ్గరా రాసులు పోసుకోనున్న నిధులేమీ లేవుకానీ.. మా పిల్లలకోసమని నేనూ శారదా కలసి చేసిన ఫిక్సుడ్ డిపాజిట్లున్నాయి. పిల్లల బాధ్యత నేను తీసుకుంటాను. నాకు చెల్లెలు లేని లోటు నువ్వు తీరిస్తే చాలు' అని ఆశీర్వదించి తెల్లారి లేచి వచ్చేసాను.

'మంచి పని చేసారు!' అని శారద మెచ్చుకున్నట్లు కల వచ్చిందా రాత్రి.

-కర్లపాలెం హనుమంతరావు
(రచన- సంచిక - కథాపీఠంలో ప్రచురితం)
[+] 3 users Like అన్నెపు's post
Like Reply


Messages In This Thread
RE: చిన్న కథలు - by k3vv3 - 04-06-2023, 10:03 AM
RE: చిన్న కథలు - by అన్నెపు - 04-06-2023, 11:45 AM
RE: చిన్న కథలు - by Pallaki - 04-06-2023, 06:04 PM
RE: చిన్న కథలు - by sri7869 - 10-06-2023, 08:38 PM
RE: చిన్న కథలు - by K.R.kishore - 16-11-2023, 10:00 AM
RE: చిన్న కథలు - by Rajeraju - 16-11-2023, 10:25 AM
RE: చిన్న కథలు - by km3006199 - 19-11-2023, 06:31 AM



Users browsing this thread: 1 Guest(s)