Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Non-erotic చిన్న కథలు
#7
 రండి... మళ్ళీ పుడదాం
రచయిత - జొన్నవిత్తుల శ్రీరామచంద్ర మూర్తి

చుట్టూ ఆకాశాన్నందుకోవడానికి చేతులు చాస్తున్న పచ్చని చెట్లు. అయినా అందనంటున్న ఆకాశం... అప్పటికీ ఆగకుండా ప్రయత్నం కొనసాగిస్తున్న ఆకుల కుంచెలు... గాలికి గలగలలాడుతున్న ఆ కుంచెల కొసల నించీ నేల మీదకి జారడానికి నిరంతరం ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాల్లో వైన వైనాలుగా రంగులు మార్చుకుంటున్న రశ్మి.
కింద, నేల కనపడితేగా...
నేలంతా మెత్తని తివాచీ పరిచినట్టుగా రాలిపడిన ఆకులు.
ఆ ఆకుల్లోంచీ పరిగెత్తుకుంటూ పోయి చెట్టెక్కిందో తొండ.  ఒక కొమ్మ రక్షణలో నిలబడి నిటారుగా నిగిడి గర్వంగా తలెగరేసింది. ఎంత తలెత్తుకు తిరిగే మొనగాడయినా తొండంత రాజసంగా తల తిప్పలేడని నరసింహానికి తెలియదు. అందుకే దానితో పోటీ పడ్డాడు.
అది తలవంచింది.
తనూ దానిలాగే తల వంచాడు.
అది వంచిన తలని వంచినట్టే వుంచి, " ఏదీ ఇప్పుడు నాలా తలెగరెయ్యి చూద్దాం " అని సవాలు చేస్తున్నట్టుగా ఒక్క సారిగా తల విదిల్చింది.తనూ దానిలాగే తల విదిల్చాలనే ప్రయత్నంలో నడుం పైభాగాన్ని నిటారుగా నిలబెట్టి.., వంచిన తలని వంచినట్లే వుంచి.., సరిగ్గా దానిలాగే తల విదల్చబోయాడు. అలవాటులేని ప్రయత్నాన్ని సహించలేని  బొంగరపు కీలు కలుక్కుమనడంతో మెడ పట్టుకుని ముందుకి తూలాడు. ఉన్నట్టుండి అలా తూలడంతో ఏటవాలుగా వున్న ఆ ఉపరితలం మీద కాలు పట్టు తప్పి ఆరడుగులు కిందకి జారాడు. అదృష్టం బాగుండి చేతికందిన చెట్టుకొమ్మని పట్టుకుని నిలదొక్కుకోగలిగాడు.
అలా నిలదొక్కుకోగానే అతను చేసిన మొట్టమొదటి పని చుట్టూ అనుమానంగా చూడటం. ఆ అనుమానానికి కారణం, అతను పెరిగిన వాతావరణంలోని నాగరీకపు జంకు. అయినా తను జారిపడిన సంగతి చూడ్డానికీ, చూసి వెక్కిరించడానికీ, అక్కడ ఎవరున్నారు గనకా అనుకుంటూ ధైర్యంగా జుట్టు సవరించుకున్నాడు.    
నేనున్నానుగా అన్నట్టు మళ్ళీ తలెగరేసింది తొండ.    
నరసింహానికి నసాళానికి అంటింది. దాంతో కోపంగా చేతికందిన రాయి తీసుకుని దానిమీదకి విసిరాడు. అది ఒక్కసారిగా పరుగందుకుంది.   
అలా పరిగెడుతున్న దాని మేని రంగులు మారుతుంటే ఆ రంగులు దానివో లేక దానిమీద పడుతున్న కిరణాలవో అర్ధం కాక గందరగోళం పాలయ్యాడు.
ఇంతకీ అది తొండా ఊసరవెల్లా అని శంకిస్తూ అతి జాగ్రత్తగా అడుగులేస్తూ లోయలోకి దిగడం మొదలు పెట్టాడు.
ఆరు ఋతువులూ ఆమని కోయిలా ఆలమందలూ అన్నీ పుస్తకాల్లో చదివి ఆనందించడమే తప్ప, తనకి ఏనాడూ ప్రత్యక్షంగా చూసే అవకాశం రాలేదు. ఆ అవకాశం కోసమే ఎవరికీ కనీసం మాట మాత్రమైనా చెప్పకుండా తనొక్కడే ఒంటరిగా బయలుదేరి వచ్చాడు. అయితే అలా ఒంటరిగా రావడంలో ఇంతటి ఆనందం వుంటుందని అతను ఊహించ లేదు.
నరసింహం జిల్లా విద్యా శాఖాధికారి.
ఈ మధ్యనే ఆ జిల్లాకి బదిలీ అయి వచ్చాడు.    
ఆ బదిలీకి ఓ బలమైన కారణం వుంది.   
అతను గతంలో పని చేసిన చోట ఉపాధ్యాయుల్లో బోధనా సామర్ధ్యాన్ని పెంపొందించడం కోసం ప్రతి యేటా పరీక్షలు నిర్వహించి అందులో ఉత్తీర్ణులు కావడాన్ని తప్పనిసరి అర్హతగా పరిగణించాలని ప్రతిపాదించాడు...     
అంతే..,
ఏదో జన్మానికి ఓ శివరాత్రిగా ఉద్యోగార్హతా పరీక్షలు రాయమంటే రాయగలరేమోగానీ.., ఏటా పరీక్షలు రాసి సామర్ధ్యాన్ని నిరూపించుకోవడం అంటే అంత సులభం కాదు. ఒకవేళ ఆయా పరీక్షలు రాసి ఉత్తీర్ణులైనవారికి జీతాలు పెంచి పదోన్నతులిస్తామంటే ఒప్పుకునేవారేమోగానీ కేవలం బోధనా ప్రమాణాల్ని పెంపొందించుకోవడానికి క్రమం తప్పకుండా ఏటా కష్టపడమంటే ఈ ప్రజాస్వామ్యంలో ఎవరు మాత్రం ఒప్పుకుంటారు గనక ? అందుకే.., దాన్ని ఉపాధ్యాయ సంఘాలన్నీ ఏకగ్రీవంగా వ్యతిరేకించాయి... అయినా అతను పట్టు వదల లేదు... దాంతో రాజకీయ వత్తిళ్ళు నానాటికీ పెరిగిపోయాయి... చివరికి అన్నీకలిసి అతని బదిలీకి దారితీశాయి...అయినప్పటికీ అతని వృత్తి పరమైన నిబద్ధతలో పెద్ద మార్పులేమీ రాలేదు.
ఆ స్థాయి అధికారి మందీ మార్బలం లేకుండా అంత దూరం ఒంటరిగా రావడానికి మూల కారణం ఓ హాజరు పట్టీ. అది హంసల కోన ఏకోపాధ్యాయ పాఠశాలలో పని చేసే అయ్యవారిది. ఆరోజు అనుకోకుండా నరసింహం కంట పడింది. దాన్ని యధాలాపంగా తిప్పి చూశాడు. అందులో ఏడో పుటలో గతేడాది రెండో నెల నాలుగోతారీకు శనివారం అని రాసుంది. కానీ ఆ రోజు శుక్రవారమని తనకి బాగా తెలుసు. ఎందుకంటే, ఆనాడు తన కూతురి పుట్టిన రోజు.  
అయినా సరే, అనుమానాన్ని నివృత్తి చేసుకోవడం కోసం తన సంచారవాణిలోఆనాటి తేదీని సరిచూసుకున్నాడు. తన అనుమానమే నిజమని తేలింది.        
దాంతో హాజరు పట్టీలో పుటలన్నిటీనీ పరీక్షగా చూశాడు. అందులో శుక్రవారాలన్నీ శనివారాలుగా నమోదై వున్నాయి. అంటే ఆ అయ్యవారు, ప్రతీనెలా జీతాల ముందు రోజు హాయిగా ఇంట్లోనే కూర్చుని ఆ నెలంతటికీ దర్జాగా సంతకాలు పెట్టేసేవాడన్నమాట. లేకపోతే, ఒకనాడు కాకపోతే మరోనాడైనా జరిగిన తప్పు అతని దృష్టికి వచ్చి వుండేది. అలా జరగలేదూ అంటే..,
అది అలవాట్లో పొరపాటు కాదు..! పొరపాటైన అలవాటు..!!
మరి పై అధికారులంతా ఏమైనట్టు ?పై అధికారులెప్పుడూ పై అధికారులే..! కాబట్టీ వారికి పై పై చూపులే తప్ప తరచి చూసే అలవాటు వుండదు. అందుకే, " చూడు, ఏదో నీమీద నమ్మకం కొద్దీ సంతకం పెడుతున్నాను. ఏమాత్రం తేడా వచ్చినా అంతా నీ మెడకే చుట్టుకుంటుంది జాగ్రత్త " అంటూ ఉత్తుత్తి బెదిరింపు చూపులతో సంతకాలు కానిచ్చేస్తూ వుంటారు. అందుకే సామాన్యంగా ఇలాంటివి బైట పడవు. ఒకవేళ ఇలా కాలం చెల్లిపోయాక బయట పడ్డా పెద్ద నష్టం వుండదు. ఎందుకంటే అధికారులంత నిక్షేపరాయుళ్ళు కేవలం అధికారులు మాత్రమే. కాబట్టీ   ఇలా ప్రతి చిన్న విషయాన్నీ పట్టించుకునేంత చాదస్తం వుండదు. ఈ విషయం నరసింహానికి తెలియందేం కాదు.
         
   ఇలా వారానికో పదిరోజులకో చుట్టం చూపుగా బడికి వెళ్ళొచ్చే అయ్యవార్లు అక్కడక్కడా తారసపడుతూనే వుంటారు. కానీ, అలాంటివాళ్ళని శిక్షించడం అంత సులభం కాదు. ఎందుకంటే, వారి బలం వారికుంటుంది. ఎలాంటి అండదండలు లేనివాడికైతే ఇంతటి ధైర్యం వుండదు. అయినా సరే, ఆ అయ్యవారిని ఓసారి చూసి రావాలనే కోరిక కలగడానికి కారణం... ఆ అయ్యవారు పనిచేసే ఊరి పేరు...   
   హంసల కోన    
   ఎంత అందమైన పేరు... 
   ఆ పేరు వెనక వున్న కథ కూడా అంతే ఆసక్తికరమైనది.   
   ఒకానొకప్పుడు విద్యాధిదేవత అయిన సరస్వతీమాత భూలోక సందర్శనార్ధం తన హంస వాహనంమీద బయలుదేరింది.   
   ఆ ప్రాంతానికి రాగానే ఆ ప్రకృతి సౌందర్యానికి పరవశురాలై అక్కడే విడిది చేసింది. సరిగ్గా అదే సమయంలో అక్కడికి పన్నెండామడల దూరంలో ఒక పిట్టని కూల్చిన బోయవాడు పుట్టెడు దుఃఖంతో బాధ పడుతూండగా ఆ  శోక గీతం అమ్మవారి చెవిన పడింది. వెంటనే ఆ బోయని ఓదార్చడానికి తనే స్వయంగా వెళ్ళింది. ఆ నిషాదుని ఊరడించి రామాయణ కథా రచన చేయవలసిందిగా ప్రబోధించి మాయమైపోయింది.    
   ఆ బోయవాడే వాల్మీకి.
   ఆయనకి అమ్మవారు ప్రత్యక్షమై ప్రేరణనిచ్చిన ప్రదేశమే వాల్మీకి పురం.   
   అమ్మవారు తనమాట మరచి అటునించటే బ్రహ్మ లోకం చేరిన విషయం తెలియని హంస ఇంకా అక్కడే తిరుగుతూ వుందనీ అందుకే దానికి హంసల కోన అనే పేరు వచ్చిందనీ అంటారు. అంతే కాదు, అక్కడి ప్రకృతి సౌందర్యం వర్ణనాతీతమనీ ఎంత చూసినా కూడా తనివి తీరదనీ చెప్పుకుంటారు. తనకి జనారణ్యాలే తప్ప నిజారణ్యాలని చూసిన అనుభవం లేదు. కానీ చూడాలనే కోరిక మాత్రం కొండంత. ఒకవేళ బంధు మిత్రులతో విహారయాత్రగా వస్తేగనక ప్రకృతి ఒడిలో ఏకాంతంగా గడపడంలోని ఆనందానుభూతులు అనుభవంలోకి రావు. అందుకే ఒంటరిగా బయలుదేరాడు.   
   చిత్తూరు నించీ బయలుదేరి మదన పల్లె, వాల్మీకి పురం మీదుగా ముష్టూరు వెళ్ళాడు. అక్కడినించీ హంసల కోనకి బండి బాట వుందిగానీ చుట్టు తిరిగి వెళ్ళడానికి కనీసం అయిదు గంటలు పడుతుంది. అదే బండాకొండమీంచీ లోయలోకి దిగితే రెండు గంటల నడక, అంతే..! 
   అందుకే బండా కొండమీంచీ లోయలోకి దిగడం మొదలు పెట్టాడు.     
   అలా నడుస్తూ పోతూ వుంటే ప్రకృతి మాత ఒడిలోకి తప్పటడుగులు వేస్తున్నట్టనిపిస్తోంది.  
   ఎంత అందమైన అనుభవం...    
   అంతటి అద్భుతమైన అనుభవానికి కారణమైన ఆ హాజరు పట్టీ అయ్యవారికి మనసులోనే కృతజ్ణతలు తెలియజేసుకుంటూ అడుగులో అడుగులేసుకుంటూ జాగ్రత్తగా దిగుతున్నాడు. అలా తనలో తాను ఆలోచించుకుంటూ దిగుతున్నవాడల్లా అప్రయత్నంగా ఓసారి కిందకి చూశాడు. పైనించి చూసినప్పుడు, బొమ్మరిళ్ళ కొలువులా అద్భుతంగా కనపడ్డ ఊరు ఉన్నట్టుండి మాయమైపోయింది.  
   కంగారుగా చేతి గడియారం చూసుకున్నాడు.
   తను బయలుదేరి అప్పుడే రెండు గంటలు దాటింది.   
   అంటే తను దారి తప్పాడన్నమాట. 
   ఒక్కసారిగా గుండెల్లో మొదలైంది గుబులు.
   వెంటనే వెనక్కి వెళ్ళిపోదామనిపించింది. కానీ.., వెనక్కి తిరిగి చూస్తే వచ్చిన దారి కనిపిస్తేగా... 
   నేలంతా పచ్చపచ్చగా పరుచుకున్న ఆకులు...పైనంతా పచ్చి పచ్చిగా విచ్చుకున్న చెట్లు... ఏది ముందో ఏది వెనకో తెలియని ఆ వాలులో తనకి మిగిలింది రెండే దారులు...ఎక్కితే పైకి..! దిగితే కిందికి..! పైకి వెళితే మళ్ళీ బండా కొండ రావచ్చు...లేదా కొండా బండ రావచ్చు...అదే కిందికి దిగితే..? హంసల కోన తప్ప మరో జనావాసం లేదు... అందుకే కిందికి దిగడానికే నిశ్చయించుకున్నాడు.   
   అలా నాలుగడుగులు వేశాడో లేదో
   ఎదురుగా...  నాలుగు మూరల నల్ల నాగు.   
   పచ్చటి ఆకుల మధ్య నల్లగా నిగ నిగలాడుతూ రెండు దోసిళ్ళ పడగ విప్పి నాలుకలు చాస్తూ బుసలు కొడుతోంది.
   అంతే... ఎక్కడివాడక్కడే కొయ్యబారి పోయాడు.    
   నల్లనాగు ఎదురుపడితే.., అదైనా మిగలాలి లేదా ఎదురు పడ్డవారైనా మిగలాలి.    
   ఈ మాట గుర్తు రాగానే కనీసం వణకడానిక్కూడా ధైర్యం చాల్లేదు.    
   అది మాటి మాటికీ పడగని అటూ ఇటూ తిప్పుతూ తననే గమనిస్తోంది.    
   తనిప్పుడు ఏమాత్రం బెసిగినా కాటు వెయ్యకుండా వదిలిపెట్టదు.   
   ఒకవేళ వదిలినా తరవాత పగపట్టకుండా వదిలిపెట్టదు.    
   నల్లనాగు పగనించీ నారాయణుడు కూడా తప్పించుకోలేడంటారు.  
   నరసింహానికి ఎంత భయం వేసిందంటే ఆ భయంతో కనీసం దాన్నించి తప్పించుకు పారిపోదామనే ఆలోచన కూడా రాలేదు.     
   ఆ ఆలోచన రాకపోవడమే అతని ప్రాణాలని కాపాడింది.   
   ఒకవేళ ఆ సమయంలో ఏమాత్రం కదిలినా.., అతను తన మీద దాడి చెయ్యడానికి ప్రయత్నం చేస్తున్నాడని భావించేది. దాంతో, అతనికా అవకాశం ఇవ్వకుండా తనే అతని మీద ఎదురుదాడికి దిగుండేది. కానీ ఎంతసేపటికీ అతని వైపునించీ ఎలాంటి అపాయకర ప్రతిచర్యా కనపడకపోవడంతో మెల్లగా పడగ దించి తనదారిన తను వెళ్ళిపోయింది. 
   అది కనుమరుగయ్యేంతవరకూ ఊపిరిబిగబట్టి అలా చూస్తూనే ఉండిపోయాడు.
   దానివల్ల తనకేప్రమాదమూ లేదనే ధైర్యం చిక్కగానే తన చుట్టూ కరడు కట్టిన నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ బలంగా వదిలాడు ఊపిరి. అంతవరకూ కొట్టుకోవడం మర్చిపోయిన గుండె ఒక్కసారిగా ఉలిక్కి పడిలేచి దడదడా కొట్టుకోవడం మొదలుపెట్టింది.
   అంతలోనే గుండె లోతుల్లోంచీ "మళ్ళీ పుట్టిన మొనగాడా ముందడుగెయ్యి." అంటూ గుసగుసలు. ఆ  గుసగుసల వెనకే, " నువ్వు శానా గొప్పోనివి పెద్దాయనా" అనే పొగడ్త.
   నిజంగా తనా ప్రశంసకి అర్హుడేనా ?
   అంతలోనే మరో పొగడ్త, "దైర్నం అంటే అట్టుండాల" 
   అదేం ధైర్యం..? ఉత్త పిరికితనం..! 
   "ఆగు పెద్దాయనా"
   ఇందాకటి గొంతే...
   గుండెల్లోంచీ కాదు..!
   ప్రకృతిలోంచీ..!!
   పలకరించిందెవరా అని చుట్టూ చూశాడు.  
   ఎవరూ కనపడలేదు.
   "ఆడ కాదు పెద్దాయనా ఈడ"
   తల పైకెత్తి చూస్తే బొమ్మకొయ్య మాను కొమ్మ మీద నిలబడి ఉలింజకాయలు కోసుకుంటున్న ఓ పన్నెండేళ్ళ అమ్మాయి కనిపించింది.  
   చెట్టు దిగి నరసింహం దగ్గరకి వచ్చింది.  
   "నల్ల నాగు వచ్చి పడగెత్తి వరమిచ్చినాదంటే నువ్వు సుమారుపాటి  పెద్దాయన కాదు పెద్దాయనా" 
   "దాన్ని నువ్వు చూశావా ?"  
   "నీకు ముందే చూసినా"
   "మరి నాకెందుకు చెప్పలేదు ?
   "నేనుగానీ ఎచ్చరిస్తే, నువ్వు నాకెల్లా చూసేటోనివి. నువ్వు కిముక్కుమన్నా అది ఆపాట్నే అంటుకునుండేది. నల్ల నాగు గానీ ముట్టినాదంటే, నాలుగు నిమిసాలే  ?"
   ఆ అమ్మాయి సమయ స్ఫూర్తికి ఆశ్చర్యపోయాడు నరసింహం.
   "నాగుపాము ఎదురు పడితే కదలకూడదని నీకెలా తెలుసమ్మా ?"
   "ఐవేరు జెప్పినాడులే "
   "బావుంది.., అంటే నువ్వు రోజూ బడికెళ్తావన్నమాట."
   "లేదు బడే మా ఇంటి కాడికొస్తాది."
   "ఏమిటీ బడే మీ ఇంటికొస్తుందా ? గుడ్ జోక్"
   "ఇట్స్ నాటె జోక్ . అయాం సీరియెస్"
   ఒక్కసారిగా నరసింహానికి గుండాగినంత పనైంది.
   ఈ చీమిడి ముక్కు చింపిరి జుత్తుల పిల్ల నించీ ఇంత చక్కటి  ఇంగ్లీషా ? అనే ప్రశ్న వెనకే మరో ప్రశ్న పొడుచుకొచ్చింది. ఇలా ఇంగ్లీషులో వాగితే తప్ప మీ విద్యాధికుల గొప్పదనం జన సామాన్యానికి అర్ధం కాదనే పిచ్చి భ్రమలనించీ మీరెప్పుడు బయట పడతార్రా వెర్రి మేధావుల్లారా ?
   వెంటనే అతని నోరు ఠప్పున మూత పడిపోయింది.
   "ఏం పెద్దాయనా గొమ్మునైపోయినావు ?"
   "ఏం లేదమ్మా బడి మీ ఇంటికెలా వస్తుందా అని అలోచిస్తున్నాను."
   "బడొస్తాదంటే ఆపాట్నే బడే వచ్చేస్తాదనుకుంటే ఎట్టా ? మేం యాడుంటే ఆడికే వచ్చి బడి చెవుతాడు మా అయ్యవారు."
   "అంటే ట్యూషనా ?"
   "ట్యూషనా.. అంటే ?"
   "అదే, ఇంటికొచ్చి ప్రైవేట్లు చెప్పడం."
   "ప్రైవేట్లా ?"
   "అదేనమ్మా ఇంటికొచ్చి చదువు చెప్పి జీతం తీసుకోవడం."
   "ఏందీ సదూచెప్పిందానికి దుడ్లియ్యాల్నా ?"
   ఆ అమ్మాయలా ఎదురు ప్రశ్నించవచ్చని ఊహించని నరసింహం ఆశ్చర్యంగా అన్నాడు. "అంటే చదువు చెప్పినందుకు ఆయనకీ ఎంతో కొంత లాభం వుండాలి కదా..."
   అంతకంటె ఆశ్చర్యంగా అడిగిందా పిల్ల ,"ఏందీ సదూ చెప్పిందానికి లాభమా ? లాభం అనేది యాపారం చేస్తేగానీ రాదని చెప్పినాడే మా అయ్యవారు ? మా ఐవేరికాడ సదూ చెప్పిందానికి దుడ్లు తీసుకునే అలవాటు లేదు. నాకేంది మా అన్నకూ మా అమ్మకూ మా నాయనకూ ఎవురికి ఎంత సదూ చెప్పినా దుడ్లనే మాటే లేదు."
   ఈసారి నరసింహానికి ఆశ్చర్యం కలగలేదు. ఆనందం కూడా కలగలేదు. అయ్యవారి పట్ల అపారమైన గౌరవం కలిగింది. ఎవరీ అయ్యవారు ? ఎక్కడిదీ అద్భుత సేవాభావం ? ఏనాడూ వినలేదు ! ఎక్కడా కనలేదు ! నిజమే... వృత్తినే దైవంలా భావించే అంకిత భావం కలిగిన అయ్యవార్లకి చదువుకునే పిల్లలు మాత్రమే విద్యార్ధులు కారు. చదువుకోవాలనుకునే ప్రతి వ్యక్తీ విద్యార్ధే. అలాంటి అయ్యవార్లకి హాజరు పట్టీలూ సంతకాలూ పెద్ద విషయాలేం కావు. అలాంటి కర్తవ్య దీక్షా తత్పరులైన వారికి ప్రభుత్వం ఇచ్చే జీతం అనేది కేవలం జీవిక కోసం మాత్రమే.
   చూస్తూంటే తానొక అద్భుత వ్యక్తిని కలవబోతున్నాననిపించింది.
   అంతే కాదు.., ఆనాడు సరస్వతీ మాత మరచిపోయి వెళ్ళిన హంసే ఈ అయ్యవారి రూపంలో తిరుగుతోదేమో అనికూడా అనిపించింది. అలా అనిపించగానే ఆయన్ని ఎప్పుడెప్పుడు చూస్తానా అనే ఆతృత కలగసాగింది.
   "ఏం పెద్దాయనా, దుడ్లిస్తేనే సదువా?"
   "అలాంటిదేం లేదు.  మీ ఇంట్లో మాత్రమేనా లేక మీ ఊళ్ళో పెద్దలందరూ కూడా చదువుకుంటారా?"
   "అంతా సదూతారు."
   "మరి మీ అయ్యవారు?" నవ్వుతూ అడిగాడు నరసింహం.
   "వాయన సదవకుండా మాకెట్లా సెప్తాడు?" అంటూ ఎదురు ప్రశ్నించిందా పిల్ల.
   మళ్ళీ ఆలోచనలో పడిపోయాడు నరసింహం. నిజమే...అయ్యవార్లు నేర్చుకోవడం మానేసిన మరుక్షణంలోనే ఎదుగుదల ఆగి పోతుంది. ఆ మరుక్షణమే వికాసానికీ దారులు మూసుకుపోతాయి. దురదృష్టవశాత్తూ విద్యని వ్యవస్థీకరించే క్రమంలో బోధన అనేది కేవలం ఉద్యోగం స్థాయికి దిగజారిపోయింది. లేకపోతే తనకిలా బదిలీ అయ్యే పరిస్థితి వచ్చేదే కాదు.
   ఇద్దరూ హంసల కోనలోకి దిగుతున్నారు.
   దగ్గరలో జల జలమనే జలపాతం హోరు వినిపించింది. మరికొంత దూరంలో కనిపించింది జలపాతం. కొండమీంచీ బండలని సానపడుతూ జారి పడుతున్న నీళ్ళు చిన్న మడుగు కట్టాయి.
   ఇద్దరూ ఆ మడుగులోకి దిగి ముఖాలు కడుక్కున్నారు. దోసిట్లోకి నీళ్ళుతీసుకుని తాగబోతూ అడిగాడు నరసింహం , "నీ పేరేంటమ్మా?"
   "హంస"
   "మీ అయ్యవారు పెట్టిందేనా ఈ పేరు?"
   "అవునే, నీకెట్టా తెల్సు పెద్దాయనా?"
   "తెలీదు. ఊహించానంతే..."
   "మా అయ్యవారు కూడా అంతే... తెలుసుకునేదానికి ముందు ఊహించుకోమని చెప్తావుంటాడు."
   "అవునమ్మా... లేనిదాన్ని ఉందని ఊహించుకుంటేగానీ ఉన్నదాని గురించి తెలుసుకోలేం."
   "ఏం పెద్దాయనా సరింగా మా అయ్యవారి మాదిర్తోనే మాట్లాడతాండావు... నువ్వుకూడా అయ్యవారేనా ఏంది?"
   నరసింహం జవాబివ్వలేదు. చిరునవ్వు నవ్వాడు.
   ఊరు దగ్గర పడింది. పేరుకి తగ్గట్టుగానే అందంగా... అపురూపంగా... కదిలివచ్చిన కలగా... కనుల పండువగా... హంసల కోన..!
   ఊరి మొగదల ఎడం పక్కన కనపడిందో బావి. బావి గడ్డన ఒకాయన కాడెడ్లతో కపిల తోలుతున్నాడు. హంసనడిగి కపిల గురించిన వివరాలను తెలుసుకున్నాడు. కాడి కిందికి దిగ్గానే కపిల బాన పైకి రావడం, నీళ్ళని కాలువలోకి వదలడాన్ని ఆసక్తికరంగా చూస్తూ.., ఆమె ఆరిందాలా చెప్తూంటే తను బుద్ధిమంతుడిలా విన్నాడు.
   ఊరిలోకి ప్రవేశించగానే "మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, హంసల కోన, ముష్టూరు పంచాయితీ, కలకడ మండలం. చిత్తూరు జిల్లా " అనే మట్టి కొట్టుకుపోయిన చెక్క పేరు పలక కనిపించింది. ఒకవైపు కొక్కెం ఊడిపోయి రెండో కొక్కానికి వేళ్ళాడుతూ.., ఆ పాడుపడిన బండల మిద్దే ఆ వూరి పాఠశాల అనే విషయాన్ని దీనంగా చాటుతోంది. ఆ బడికి ఓ తుప్పట్టిపోయిన తాళం వేళ్ళాడుతోంది. కిటికీ లోంచీ లోపలికి చూస్తే అదో పాత సామాన్ల గదిలా వుంది.
   ఇక్కడి బడి అవతారానికీ అయ్యవారి గురించి హంస చెబుతున్నదానికీ ఎంతమాత్రం పొసగడం లేదు. అందుకే అనుమానంగా అడిగాడు, "మీ అయ్యవారీ బడికి రారా ?"
   "రాడు పెద్దాయనా..."
   "ఎందుకు?"
   "అది నన్నడిగితే ఎట్లా?"
   ఆ ప్రశ్నకి నరసింహం దగ్గర జవాబు లేదు. అందుకే మౌనంగా ఆమెని అనుసరించాడు.
   ఆ బండలు పరిచిన వీధులూ.., వారగా నిలబెట్టిన ఎడ్ల బళ్ళూ.., గోడలకి చేరేసిన కాడిమాన్లూ.., ఇంటికి ముందు గదిలా పశువుల కొట్టాలూ.., కుటుంబ సభ్యుల్లా కలిసిపోయిన పసరాలూ చూస్తూంటే నరసింహానికి మొదటి సారిగా ప్రాణముబికే పరిసరాల్లోకి అడుగు పెట్టినట్టనిపించింది.
   అంతలోనే, ఇల్లు రావడంతో లోపలికి పరిగెత్తింది హంస.
   అబ్బురంగా చుట్టూ చూస్తూ లోపలికి అడుగు పెట్టాడు. ఎడం వైపు చంద్రికలూ వాటినిండా పట్టు పురుగులూ ఆపక్కనే వాటికి ఆహారంగా కోసుకొచ్చిన రేష్మి ఆకులూ ఉన్నాయి. నడవ దాటి లోపలికి వెళితే ఓపక్క వడ్ల మూటలూ వాటి పక్కనే శనగ విత్తనాల మూటలూ మరో పక్క వరసగా పేర్చిన పుస్తకాలూ కనిపించాయి. అతనలా కలియజూస్తూండగానే రాగుల దిండూ దుప్పటీ తెచ్చింది హంస. గోడవారగా వున్న బల్లమీద దుప్పటి పరిచి గోడకి రాగుల దిండు ఆన్చి నరసింహాన్ని కూర్చోమనిచెప్పి మళ్ళీ లోపలికి పరిగెత్తింది.
   తనలోని సహజమైన ఆసక్తితో పుస్తకాల దగ్గరకి వెళ్ళి చూశాడు నరసింహం. అన్నీ సేద్యానికీ బుద్ధి వికాసానికీ  శాస్త్ర విజ్ణానానికీ జీవన మౌల్యాలకీ సంబంధించిన పుస్తకాలే తప్ప వాటిలో పాఠ్య పుస్తకాలు లేక పోవడం గమనించాడు. అయినా పాఠాలన్నీ కూడా ఆ పుస్తకాలనించీ ఎంపిక చేసినవేగా అనుకున్నాడు. అంతలోనే, చల్ల కడవ నీళ్ళలో నిమ్మకాయ పిండి యాలక పొడి వేసి బెల్లం పానకం కలుపుకుని వచ్చింది హంస తల్లి. ఆవిడ పేరు వాణి.
   నరసింహం అయ్యవారిని కలవడానికి వచ్చినట్లు తెలుసుకొని చాలా సంతోషించింది.
   మీ అమ్మాయేం చదువుతోందంటే ఆవిడ నవ్వేస్తూ ఆ పల్లెలో చదువేగానీ దానికి తరగతుల్లేవంది. 
   నరసింహానికి ఎందుకోగానీ వాణి కూడా హంస లాగే నర్మగర్భంగా మాట్లాడుతోందనిపించింది. 
   అందుకే నెమ్మదిగా వివరాలడగడం ప్రారంభించాడు. ఆవిడ చెబుతున్న మాటలు వింటున్న కొద్దీ నరసింహానికి అయ్యవారిని ఎప్పుడెప్పుడు చూద్దామా అనే కోరిక క్షణ క్షణానికీ పెరిగిపోసాగింది.
   ఎందుకంటే,  విద్యాబోధనలో ఆయన అనుసరించే విధానాల గురించి ఆవిడ చెబుతున్న విషయాలు ఎంత ఆశ్చర్యకరంగా ఉన్నాయో అంతే ఆసక్తి దాయకంగానూ ఆలోచనలు రేకెత్తించేవిగానూ ఉన్నాయి. అంతేకాదు.., ఆచరణాత్మకంగా అవి సాధించిన విజయాలు కూడా అతని కళ్ళముందే కనపడుతున్నాయి.
   అయ్యవారు చేసినవాటిలో అన్నిటి కంటే కష్ట సాధ్యమైనది పిల్లలకి చదువు చెప్పడం కాదు. పిల్లలు చదువుకోవలసిన అవసరం గురించి వారి తల్లిదండ్రులకి అర్ధమయ్యేలా తెలియజెయ్యడం కూడా కాదు. తమ పిల్లలు ఏం చదవాలని వారు భావిస్తున్నారో దాన్ని వారి పెద్దలు కూడా చదివేలా చెయ్యడం. అలా చదవడం ద్వారా తమకి ఎదురయ్యే సమస్యలని గుర్తించడం, ఆయా సమస్యల గురించి చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా అందరూ సమష్టిగా ఆలోచించడం, ఆయా సమస్యల్ని అధిగమించే ప్రయత్నంలో తమవే అయిన పరిష్కారాల్ని కనుక్కోవడం, తద్వారా తమ స్వంత విధానాలని తామే రూపొందించుకోవడం...ఇవన్నీ అంత సామాన్యమైన విషయాలు కావు.  
   అవన్నీ అక్కడి సామాజికుల సామూహిక చైతన్యానికి నిలువెత్తు నిదర్శనాలు.
   ప్రతి సమస్యకీ ఒక పరిష్కారం వున్నట్టుగానే ప్రతి పరిష్కారమూ మరిన్ని సమస్యలని సృష్టిస్తుందనే విషయాన్ని ఊరు ఊరందరికీ అర్ధం అయ్యేలా చెయ్యడం, ఆ సమస్యా పరిష్కారాన్వేషణల నిరంతర మహా యజ్ణంలో అందరూ పాలు పంచుకునేలా ప్రోత్సహించడం అద్భుతం. అందరికీ ఎవరి పరిధిలో వారు విద్యావంతులయ్యే వాతావరణాన్ని కల్పించడం అపూర్వం. ఆ చైతన్య స్ఫూర్తిని వాడనివ్వకుండా కాపాడుకుంటూ రావడం అనితర సాధ్యం. కేవలం అయిదేళ్ళ కాలంలో ఊరు ఊరంతా విద్యావంతులుగా రూపొందడం అనూహ్యం.
   అక్కడ...
   అందరూ విద్యార్ధులే..! అందరూ అయ్యవార్లే..!
   అక్కడ...
   నేర్పడం నేర్చుకోవడం నిరంతర ప్రక్రియ.
   అక్కడ...     
   బడంటే కేవలం బడి మాత్రమే...
   నాగరీకుల చదువుల బళ్ళలోలా అది భవిష్యత్తుకి పెట్టు "బడి" కాదు.., నవ చైతన్యానికి కట్టు "బడి" అందుకే అక్కడ వైవిధ్యాలున్నాయిగానీ వైరుధ్యాల్లేవు... అదే నిజమైన వివేక వాణి.     
   అంతటి అద్భుత విజయాన్ని సాధించిన అయ్యవారికి ప్రభుత్వం ఎంతగా ఋణపడిందంటే దాన్ని తీర్చుకోవడానికి దేశాద్యంతం ఆయన బోధనా విధానాలని అమలు పరిచేలా చర్యలు తీసుకున్నా ఋణం  తీరదు. అలాంటిది హాజరు పట్టీలో ఎక్కడో దొర్లిన చిన్న పొరపాటు కారణంగా తనో పెద్ద దొంగని పట్టుకునే మొనగాడిలా బయలుదేరి రావడం తలుచుకుంటే నరసింహానికి నవ్వొచ్చింది. అదే సమయంలో తనావిధంగా బయలుదేరి రావడం వల్లే ఇంతటి అద్భుతమైన సామాజిక ప్రయోగ శాలని చూసే అదృష్టం కలిగిందని కూడా అనిపించింది.    
   తనని వెంటనే అయ్యవారి దగ్గరకి తీసుకువెళ్ళవలసిందిగా ఆవిడని కోరాడు. దాంతో అతన్ని వెంటబెట్టుకుని బయలుదేరింది వాణి.
   దారిలో ఆవూరికి బడిని రప్పించడం కోసం ఆవూరి పెద్దయన పడ్డ పాట్ల గురించి చెప్పడం మొదలు పెట్టింది, " మడిసి బతికేదానికి గాలీ నీల్లూ తిండీ తీర్తం గుడ్డా గుడుసూ ఎంత ముఖ్యమో సదువు కూడా అంతే ముఖ్యమనే మాట మా పల్లె పెద్దాయనకి బాగా తెల్సు. కానీ ఈ పల్లె కొంపలో సదూకునేదానికి వల్ల పడదనే మాట కూడా ఆయనకు బాగా తెల్సు. అంతే కాదు, మనకి లేనిది మన పిల్లకాయలకైనా చిక్కితే బాగుంటాదని అందరి మాదిరే ఆయప్ప కూడా అనుకునె. అంతలోకే, అమర నాతరెడ్డప్ప కలికిరికి అమ్మను పిలవనంపినాడనే మాట తెలిసె.      
   ఆపాట్నే మా అంచల కోనకి బడి కావాల అంటా అర్జీ రాపిచ్చుకొని పాయె. అమ్మ చేత బెట్టె. 
   అమ్మ పాయె..! అర్జీనూ పాయె..!! 
   మల్లా పదైదేండ్లకు అన్న కలకడకు వస్తాండాడని తెలిసె. ఆపాట్నే అర్జీ రాపిచ్చుకొని పాయె. అన్న చేత బెట్టె.    
   అన్న పాయె..! అర్జీనూ పాయె..!!    
   మల్లా పదైదేండ్లకు అల్లుడు గుర్రం కొండకు వస్తాండాడని తెలిసె. ఆపాట్నే అర్జీ రాపిచ్చుకొని పాయె. అల్లుని చేతబెట్టె.    
   అల్లుడు పాయె..! అర్జీనూ పాయె..!!
   మల్లా పదేండ్లకు అప్ప ముష్టూరికి వస్తాండాడని తెలిసె. ఆపాట్నే అర్జీ రాపిచ్చుకొని పాయె  
   అప్ప పాయె..! అర్జీనూ పాయె..!!  
   పాయె పాయె పాయె అనుకుంటా వుండంగానే ఎట్టొచ్చినాదో ఎప్పుడొచ్చినాదో తెలవదుగానీ మా పల్లెకు బడొచ్చె... "     
   అంతలోనే ఎప్పుడొచ్చిందో గానీ హంస, " అమ్మ పోయి అన్న వచ్చె ఢాం ఢాం ఢాం ఢాం... అన్న పోయి అల్లుడొచ్చెఢాం ఢాం ఢాం ఢాం...  అల్లుడుపోయి అయ్య వచ్చెఢాం ఢాం ఢాం ఢాం... అయ్య పోయి అయ్యోరొచ్చె  ఢాం ఢాం ఢాం ఢాం... " అని పాడ్డం మొదలు పెట్టింది.  
   ఆ పిల్లని అల్లరి చెయ్యద్దని గదిరింది వాణి.   
   అంతలోనే అయ్యవారిల్లు వచ్చింది.     
   ముగ్గురూ లోపలికి అడుగు పెట్టారు.     
   అక్కడ దాదాపు తొంభై సంవత్సరాల పెద్దాయన నలుగురు పిల్లల్నేసుకుని గోలీలాడుతున్నారు. సోడా గోలీతో కొట్టగానే...ఎర్రగోలీ వేగంగా ముందుకి వెళ్ళింది. సోడా గోలీ మళ్ళీ వెనక్కి  తిరిగి వచ్చింది. స్థిరంగా ఉన్న ఎర్ర గోలీ ముందుకెళ్ళడం, సోడా గోలీ తిరిగి వెనక్కి రావడాలని కేంద్రంగా చేసుకుని చలన సూత్రాల్ని వివరించి చెబుతున్నాడు. ఆ చెప్పడంలో వాళ్ళని మరిన్ని ప్రశ్నలడగడం ఆప్రశ్నల, ద్వారా పిల్లలే జవాబుల గురించి ఆలోచించించేలా చెయ్యడం చూస్తూంటే, నరసింహానికి తను చూస్తున్నది కలో నిజమో అర్ధం కాలేదు. 
   ఆ పెద్దాయనలోనే అంతటి ఉత్సాహాన్ని వెలిగించాడంటే, ఆ అయ్యవారు సామాన్యుడు కాదు. అలాంటి ఒక అయ్యవారు తన పరిధిలోనే ఉపాధ్యాయుడిగా పని చేస్తూండటం నిజంగా గర్వకారణం అనుకున్నాడు. తను చిత్తూరు వెళ్ళగానే ముందు, ఆ అయ్యవారిని జిల్లా తరఫున రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి సిఫార్సు చెయ్యాలనుకున్నాడు.   
   వాణి చెబుతూనే వుంది, "వాండ్లాడతా వుండేది తోకా తొంబై. మా పల్లెలో ఇంతే. ఆడినా సదువే. పాడినా సదువే. పనికి పోయినా సదువే. సేద్యం చేసినా సదువే." 
   ఆమె చెబుతున్న మాటల్లో ఏమాత్రం అతిశయోక్తులు లేనని నరసింహానికి అర్ధం అవుతూనే వుంది.      
   "అది సరేగానీ మీ అయ్యవారెక్కడమ్మా "  
   "సంకన సట్టి పెట్టుకొని నేతి సుక్క కోసం ఊరంతా తారాడినట్టుండాది. వేరే ఐవేరు ఏడుండాడు..?ఆయనే మా పల్లె అయ్యవారు."     
   "మరి పెద్దాయన ?"   
   "అదీ ఆయనే"  
   "మరిందాకా ఆయనకి చదువు రాదన్నారు..?"     
   "రాదు... కానీ నేర్చినాడు... అర్జీలు పెట్టీ పెట్టీ అల్సిపోయినంక, మా పల్లెకి మీ బడితోగానీ మీ అయ్యవార్లతోగానీ, మీ పనికి మాలిన రాజకీయాల్తోగానీ పనిలేదనుకున్నాడు. మన మడక మనం కడతావుండాం... మన గింజలు మనమే పండించుకుంటా వుండాం... మన బిడ్డల్ని మనమే సాక్కుంటా వుండాం...  అట్లాంటిది మన బిడ్డల సదువుకోసం కన్నోళ్ళ కాళ్ళు పట్టేది దేనికనుకున్నాడు. మన దావ మనమే తారాడుకునేది మేలనుకున్నాడు. దానికే మా పెద్దాయన సదువు నేర్చినాడు... మా కోసం  సదువు నేర్చినాడు... మా పిల్లకాయల కోసం సదువు నేర్చినాడు... మా పల్లె కోసం సదువు నేర్చినాడు...ఆయనే మాకు అయ్యవారైనాడు. ఈ పొద్దు మా పల్లెలో సదువు లేని మనిసే లేడు తెల్సా?" 
   వ్యక్తిలో ప్రారంభమైన చైతన్యం వ్యవస్థనే అబ్బుర పరచేంతగా విస్తరించిన వైనం నరసింహాన్ని చకితుణ్ణి చేస్తోంది. ఇక్కడ హంసల కోనలో వాలిన అమ్మవారి హంస గురించి ఇంతకాలంగా బయటి ప్రపంచానికి ఎందుకు తెలియలేదన్నది మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది. అందుకే అడిగాడు నరసింహం, "అయిదేళ్ళుగా ఇంత మంది ఇన్ని అద్భుత విజయాలు సాధిస్తున్నా బయటి ప్రపంచానికి ఏమాత్రం తెలియలేదంటే..."    
   "తెలిసేదానికేముంది? మా అయ్యవారు ఒక్కమాట అంటే చాలు పేపరోల్లూ టీవీలోల్లూ వచ్చి పడతారు. కానీ అయ్యవారే ఇప్పుటి దంకా ఎవుర్నీ దగ్గరకి రానియ్యలా. అయ్యవారికి కావలసింది సదువు రావటం. అంతేగానీ పేరు రావటం కాదు."   
   "పోనీ నన్ను మీ బడిలో చేర్చుకుంటారా?"      
   "మీయట్లా సదూకున్నోల్లు మా బడిలో చేరే దానికి వల్ల పడదు."        
   "ఎందుకో?" చిరునవ్వుతో అన్నాడు.      
   "దేనికంటే, మీరు పట్టాలకోసం సదూతారు. పట్టాలు కొలువులిస్తాయి. కొలువులు జీతాలిస్తాయి. మనుసులను జీతగాల్లను చేస్తాయి. జీతగాల్లకి జీతాలు ఎగేసుకునేదెట్లా అనేదే గానీ మందికి మంచి చేసేది ఎట్లా అనేది సచ్చినా మతికిరాదు." వాణి మాటలు వింటుంటే నరసింహానికి తనీ జిల్లాకి బదిలీ అయి రావడానికి గల కారణం గుర్తొచ్చింది.    
   అతనేం మాట్లాడకుండా వుండటంతో తన మాటలు వింటున్నాడో లేదో పరీక్షించాడానికా అన్నట్టు, "ఏం సామీ గొమ్మునైపోయినావు. ఈయమ్మేంది అన్నీ తెలిసిందాని మాదిరి పెద్ద పెద్ద మాటలు చెప్తావుందనా?"     
   "కాదు. మీరు మాలా బళ్ళలో చదువుకోక పోవడం వల్లే మీకు నిజమైన చదువంటే ఏమిటో ఇంత స్పష్టంగా తెలిసిందేమో అనుకుంటున్నాను."      
   "దానికే మా అయ్యవారు ఏమంటాడో తెలుసునా మీయట్లా సదివినోల్లంతా మల్లా పుడితే కానీ సదువంటే ఏంటనేది తెలవదు అంటాడు."    
   అదీ నిజమే అనిపించింది నరసింహానికి.   
   అంతలోనే అయ్యవారు అతిధుల్ని గమనించి.., ఆటలాపి నరసింహం వైపు చూశారు.     
   ఆ చూపులు అద్భుత చైనన్యదీప్తులై అతన్ని ఆప్యాయంగా తడుముతూ కర్తవ్య బోధచేస్తున్నట్టనిపించింది.    
   ఎవరైనా సరే... అనుకున్న పనిని సాధించే ఏకైక మార్గం...  ఆ పనిని చెయ్యడం మాత్రమే అనే  దివ్యమైన సందేశాన్నిస్తున్నట్టనిపించింది.   
   అందుకే..,    
   అయ్యవారు చదువనే మాటకి నిలువెత్తు భాష్యంలా లేచి నిలబడగానే...    
   వినమ్రంగా చేతులు జోడించాడు నరసింహం.

[+] 3 users Like అన్నెపు's post
Like Reply


Messages In This Thread
RE: చిన్న కథలు - by అన్నెపు - 04-06-2023, 08:09 AM
RE: చిన్న కథలు - by k3vv3 - 04-06-2023, 10:03 AM
RE: చిన్న కథలు - by Pallaki - 04-06-2023, 06:04 PM
RE: చిన్న కథలు - by sri7869 - 10-06-2023, 08:38 PM
RE: చిన్న కథలు - by K.R.kishore - 16-11-2023, 10:00 AM
RE: చిన్న కథలు - by Rajeraju - 16-11-2023, 10:25 AM
RE: చిన్న కథలు - by km3006199 - 19-11-2023, 06:31 AM



Users browsing this thread: 3 Guest(s)