04-06-2023, 08:02 AM
(This post was last modified: 16-11-2023, 01:44 PM by అన్నెపు. Edited 1 time in total. Edited 1 time in total.)
దేవుడికి విసుగెత్తింది
దేవుడికి బాగా విసుగెత్తింది. ఎప్పుడు చూసినా నాకది కావాలి ఇది కావాలి అని కోరికలతో వేధించి వెంటాడే మనుషుల కోర్కెలతాకిడికి ఆయన అలసిపోయాడు. వీళ్ళకి కనిపించకుండా అతి రహస్యస్థావరాని కి వెళ్ళిపోవాలని ధృఢంగా నిర్ణయించుకున్నా డు. తనకి బాగా సన్నిహితుడైన ఆంతరంగికు లని సంప్రదించాడు..
ఒకరు చంద్రమండలానికి వెళ్ళమన్నాడు.. మరొకడు ఎవరెస్ట్ శిఖరం మీద కూర్చోమన్నాడు.. మరొకడు ఎవరూ రాలేనంత దూరంగా భూమిని తొలుస్తూ వెళ్ళి దాక్కోమన్నాడు...
"లాభం లేదయ్యా ఏదో నాటికి మనిషి వీటన్నిటిని దాటి అక్కడికి కూడా దాపురించి అక్కడ కూడా నా ప్రాణం తీస్తాడు" అన్నాడు నిస్పృహగా...
అప్పుడు అత్యంత సన్నిహితుడైన ఆంతరంగికుడు ఒక అద్భుతమైన సలహాయిచ్చాడు...
"స్వామి నిన్ను మనిషన్నవాడు చూడలేని ప్రాంతం ఒకేఒక్కటుంది..అక్కడికి వెళ్ళు" అన్నాడు...
"ఔనా..ఎక్కడుంది" అని కుతూహలంగా అడిగాడు స్వామి..
"మనిషిలోనే స్వామి" అని ఓ చిరునవ్వు నవ్వి" అదే అతని మనసు" అన్న ఆ ఆంతరంగిక సలహాదారు వంక ఆశ్చర్యంగా చూసాడు..
"మనిషి అన్నీ చూడగలడు గాని తన మనసు లోపలికి తాను చూసుకోడు..అందువల్ల అంతకన్నా పదిలమైన చోటు నీకు ఎక్కడా దొరకదు స్వామి" అన్నాడు...
అంతే మరుక్షణం స్వామి అదృశ్యం..
ఇంకా మనుషులు దేవుడి కోసం బయటే వెదుకుతున్నారు...
ఆంతర్యంలో వున్న సర్వంతర్యామి చిద్విలాసంగా చిరునవ్వు నవ్వుతూ ఈ మనిషిని గమనిస్తూనే వున్నాడు.
దేవుడిని కలవాలంటే అంతః శుద్ధి కావాలి.
దేవాలయంలోకి వెళ్ళాలంటే బాహ్య శుద్ధి కావాలి.