04-06-2023, 07:56 AM
(This post was last modified: 16-11-2023, 01:37 PM by అన్నెపు. Edited 1 time in total. Edited 1 time in total.)
దాత
అనసూయ కన్నెగంటి
రాఘవాపురం అనే ఊర్లో రామయ్య అనే ఒక రైతు ఉండేవాడు. ఆ రైతుకి ఒక అలవాటు ఉండేది. అదేమిటి అంటే తన పొలంలో ఏ రకమైన పంట పండినా అందులో పదవ వంతు పంటను పేదలకు పంచిపెట్తటం. అలా పంచిన తర్వాతే మిగతా పంటను తన కుటుంబ అవసరాలకు వాడుకునే వాడు.అతనికి ఉన్న ఈ అలవాటుని భార్యాపిల్లలూ కూడా ఇష్టపడేవారు.
అయితే ఒకసారి పంట కోతకు వచ్చే సమయానికి బాగా వర్షాలు పడి పంటంతా నీట మునిగి నాశనమై పోయింది. దాంతో చాల బాధపడిపోయాడు రామయ్య.
తన కుటుంబం గురించి అతనికి చింత లేదు. మంచినీళ్ళు త్రాగి అయినా బ్రతికెయ్యవచ్చు అనుకునేవాడు. అతని బాధ అంతా తను పేదలకు పంచే పంట గురించే.
“ అంతగా బాధపడకండి. పంట మునిగిపోయింది కాబట్టి పంచలేకపోయారు. మునిగి ఉండకపోతే పంచేవాళ్లమే కదా! “ అంది రామయ్య భార్య.
“ మనకు పండలేదని వాళ్లకు ఆకలి లేకుండా పోదు కదా. ఆకలి ఆకలే. అయినా పండితేనే ఇస్తాము అనేది అంత సమంజసం కాదేమో అనిపిస్తుంది.”
“ మీరు చెప్పింది నిజమే. కానీ” తనదు మాలిన ధర్మము మొదలు చెడ్డ బేరము “ అన్నారు పెద్దలు. మనకే లేనప్పుడు మనమెలా దానధర్మాలు చేయగలము . ముందు మన ఆకలి తీరే మార్గం ఆలోచించండి. మన కంటే లేని వాళ్లకు మనం మన పంటలో కొంత ఇస్తున్నాము. మన కంటే ఉన్న వాళ్ళు ఇప్పుడు మన ఆకలి గురించి ఆలోచించాలి. కానీ ఎవరు ఆలోచిస్తున్నారు మన గురించి..? కాబట్టి ఉన్నప్పుడు, సరిపడా పండినప్పుడు..మనకున్న దానిలో కొంత పేదలకు అనుకున్నాము. మనకే లేనప్పుడు మీరిలా బాధ పడటం అర్ధం లేనిది. ఇప్పుడు మనం పేదల కింద లెక్క.” అంది భార్య.
“ అవునమ్మా! నువ్వన్నది నిజం “ అన్నాడు రామయ్య కొడుకు తల్లి మాటలను బలపరుస్తూ..
భార్యా పిల్లల మాటలు విన్న రామయ్య..
“ మనకు ఉన్న ధైర్యం మన పొలం. ఇప్పుడు కాకపోతే తర్వాత పండుతుంది అనే నిశ్చింత మనకు ఉంటుంది. కానీ ఆ పేదవారికి మనమే ధైర్యం. మనకు పంట పండనీ, పండక పోనీ. వాళ్ల ఆకలికి మనమే భరోసా. మనం వాళ్ల భవిష్యత్తు. “ అన్నాడు ప్రశాంతంగా.
“ అవును నాన్నా..! మీరన్నదీ నిజమే! అయితే ఇప్పుడు ఎక్కడి నుండి తెచ్చి ఇద్దాం వాళ్లకు? “ అన్నాడు కొడుకు.
“ అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుంది రా..చూద్దాం” అన్నాడు రామయ్య.
ఇంతలో ఎవరో తలుపు కొట్తారు.
భార్య వెళ్ళి తలుపు తెరిచి చూసేసరికి ఎదురుగా నిలబడి ఉన్నారు..ఏ పేదలకైతే తన పంటలో భాగాన్ని ఇచ్చేవారో వాళ్ళు.
వాళ్ల భుజం మీద ధాన్యంతో నిండిన బుట్తలు. వాళ్లని చూస్తూనే తెల్లబోయారు అంతా.
అయితే ఇదేమీ పట్టించుకోకుండా గబ గబా అంతా లోపలికి వచ్చి ఏడాదికి సరిపడా ధాన్యాన్ని రామయ్య ఇంటిలో కుమ్మరించి వెళ్ళిపోతూ..
“ అయ్యా..! ఇన్నేళ్ళూ మీకు పండిన పంటలో కొంత మాకు పంచుతూ వచ్చారు. మీలా ఇచ్చిన వాళ్లందరివీ ఒకచోట చేర్చి మా అవసరాలకు సరిపడా కావాల్సినవి ఉంచుకుని మిగతావి అమ్మగా వచ్చిన సొమ్ముతో కొంత పొలం కొని సాగు చేస్తూ వస్తున్నాము. అలా సాగు చెయ్యగా వచ్చిన పంటను ఇలా నష్టపోయిన రైతులను ఆదుకోవటానికి వినియోగిస్తున్నాము.
ఈ ఏడాది మీరు వర్షం వల్ల నష్టపోయారని విని మీ కోసం వీటిని తీసుకు వచ్చాము.
దానం చెయ్యటమే కాదు..తీసుకోవటమూ గొప్ప విషయమే. మీరు తీసుకున్నార్రు. మాకు సంతోషం ” అంటూ వెళ్ళిపోయారు. అది విన్న రామయ్య కుటుంబం సంతోషంతో చప్పట్లు చరుస్తూ..
“ అవును. మీరన్నట్టు.. దానం తీసుకోవటమే కాదు..ఇవ్వటమూ చాలా గొప్ప విషయము “ అంటూ సంతృప్తి నిండిన హృదయంతో వాళ్ల ముందు చూపుకి చేతులెత్తి నమస్కరించారు.