04-06-2023, 07:53 AM
(This post was last modified: 16-11-2023, 01:34 PM by అన్నెపు. Edited 1 time in total. Edited 1 time in total.)
చిన్న కథ
రచన: కర్లపాలెం హనుమంతరావు
టీవీ సీరియల్ కమర్శియల్ బ్రేక్ లో రాంబాయమ్మగారికి గుండెపోటొచ్చింది. ఎపిసోడయిందాకా కదలనని మొండికేయడం వల్ల గుండెకొచ్చిన ప్రమాదం మరింత హెచ్చింది.
ఐదు నక్షత్రాల ఆసుపత్రి, అనుభవజ్ఞులైన వైద్యులు.. సంగతెలా ఉన్నా టీవీ సోపుల మీదున్న అకుంఠిత అభిమానం ఆమె ప్రాణాలని నిలబెట్టింది.
ఆపరేషన్ టేబుల్ మీదున్నప్పుడు రాంబాయమ్మగారికి దేవుడితో చిన్న భేటీ అయింది. దైవ దర్శనం కాగానే ఆమె దేవుణ్ణి అడిగిన మొదటి ప్రశ్న' నాకింకా ఎంతకాలం భూమ్మీద నూకులున్నాయ్ ? '
'నలభై మూడేళ్ల రెండునెల్ల మూడురోజులమీద నాలుగ్గంటలా ఐదు నిమిషాల ఐదు సెకన్లు' అన్నాదు దేవుడు.
దేవుడిమాటమీద గురితోనే రాంబాయమ్మగారు ఆపరేషను సక్సెసయిందనిపించి ప్రాణాలతో లేచికూర్చున్నారు.
'ఎలాగూ మరో అర్థశతాబ్దం బతకబోతున్నాం గదా! ఇంకా ఈ ముడతలుబడ్డ ముఖం, బాన కడుపు, ముగ్గుబుట్ట జుట్టు, బోసి నోరు, వంగిన నడుంతో ముసిల్దానిలాగా ఎందుకు బతుకు నిస్సారంగా గడపాలి? మానవజన్మ మళ్ళీ మళ్లీ రాబోతుందా? అందులోనూ ఆడజన్మే దొరుకుతుందన్న గ్యారంటీ ఉందా? అన్నీ ఉండి అనుభవించేందుకు కట్టుకుపోయినంత ఆస్తి తనకుమాదిరిగా ఎంతమందికి ఉంది? అడ్డుచెప్పే కట్టుకున్నవాడూ భూమ్మీదలేని అదృష్టం తనది.' అన్నివిధాలా అచ్చొచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న దృఢనిశ్చయానికొచ్చింది రాంబాయమ్మగారు.
గుండాపరేషనైన ఆసుపత్రిలోనే ఫేస్ లిఫ్టింగ్, ఫ్యాట్ సక్కింగ్, ప్లాస్టిక్ సర్జరీ, డెంటల్ రికవరింగ్, హెయిర్ ట్రాన్స్ ప్లాంటింగ్.. వగైరా వగైరా ఓ పది లక్షలు పారేసి టోటల్లీ బాడీ రీమోడలింగు చేయించేసుకుంది రాంబాయమ్మగారు.
పది లక్షలు పోతే పోయాయిగాని.. రాంబాయమ్మగారిప్పుడు రంభను తలదన్నే మోడల్ గా మెరిసిపోతోంది.
ఆ ఉత్సాహంలో ఆఖరి ఆపరేషన్ కూడా విజయవంతంగా ముగించుకుని ఆసుపత్రి బైటకొచ్చి రోడ్డు దాటుతుండగా లారీ ఒకటి దూసుకొచ్చి రాంబాయమ్మగారిని లేపేసింది.
మళ్ళీ దేవుదిగారితో భేటీ తప్పింది కాదు. భగవంతుణ్ణి చూడంగానే భగభగ మండింది రాంబాయమ్మగారికి.
కడుపులోని కోపాన్నంతా వెళ్లగక్కుతూ 'నలభైముడేళ్లకు పైగా ఆయుర్దాయం ఉదంటివే?మీ దేవుళ్ళూ మా లోకంలోని రాజకీయ నాయకులకు మల్లే మాటమీద నిలబడకపోతే ఎల్లాగయ్యా? ముల్లోకాలకింకేం గతి?' అని ఎడపెడా వాయించడం మొదలుపెట్టింది దేవుడు కంటపడీ పడకముందే రాంబాయమ్మగారు.
'సారీ!రాంబాయమ్మగారూ! లారీ గుద్దింది ఎవరో రంభననుకున్నాను.. రాంబాయమ్మగారిననుకోలేదు' అని నాలిక్కరుచుకున్నారు దేవుడు గారు!
***