Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
"నీ కోసం"
#2
నువ్వెవరో తెలీదు, ఎక్కడున్నావో తెలీదు, ఎప్పుడొస్తావో తెలీదు, వచ్చాక నా ఇంట్లో దీపం వెలిగిస్తావని, నా జీవితంలోకి ఆనందం తీసుకొస్తావని మాత్రం నమ్ముతున్నాను. ఆ నమ్మకమే పునాదిగా నీ కోసం చూస్తున్నాను.

తెలీదు ఇలా నీ కోసం వెతకాలని, ఇలాంటి ఆనందం పొందాలని. జీవితం గమనం తప్పడంతో, మార్గం మారడంతో నువ్వు కావాలనే విషయం మర్చిపోయాను. అందరూ వెతుకుతుంటే, వాళ్ల గురించి ఏమనుకున్నానో మరి, నేను కూడా వెతకాలని, ఎదురుచూడాలని మాత్రం అనుకున్నట్టు గుర్తులేదు.

ఇప్పటికి నాకా అవకాశం వచ్చింది. నాకు నేనే ఆ అవకాశం ఇచ్చుకున్నాను.

ఆలస్యమైంది నిజమే, కానీ జీవితం ముగిసిపోలేదు కదా. నేను ఒడిసిపట్టుకోగలిగిన నీటిచుక్కలే నాకు దక్కేది అనుకుంటాను. కొందరికి వాన దక్కుండచ్చు, కొందరి కుండలు నిండుడచ్చు, నాకు కూడా అలానే జరిగేది, పర్లేదు, ఈ చుక్కలన్నా ఉన్నాయి, నాకు బానే ఉంది.

గతం అనవసరం, మన భవిష్యత్తే నాకు ముఖ్యం, నీతో పంచుకునేవే ముఖ్యం, ఇలా అన్నీ పంచుకోగలిగితే నా జన్మ ధన్యమైనట్టే, నా జీవితం సార్థకమైనట్టే, జరుగుతుందనే నా నమ్మకం.

నమ్మకాల పట్ల పెద్దగా నమ్మకం లేని మనిషిని నేను, నిజానికి దగ్గరగా బతుకుతూ చేదుగా ఉన్నా స్వచ్ఛత ఉందని ఆ చేదుని అమృతంగా స్వీకరిస్తూ గడుపుతున్నవాడిని నేను.

కానీ నీ విషయంలో నమ్మకమే పునాదిగా అడుగు ముందుకు వేస్తున్నాను, నిన్ను నమ్ముతున్నందుకు నన్ను మోసం చెయ్యవు కదా.

ఇప్పటిదాకా ఎన్నయినా జరగనీ, అవి నాకొద్దు. మన కలిసాక మాత్రం నువ్వు గతాన్ని తవ్వద్దు, నాకా బాధ కలిగించద్దు. నేను చెయ్యను, నువ్వు కూడా చెయ్యద్దు.

వెలవెలబోతున్న జీవితాన్ని తిరిగి రంగుల్లో నింపుతావని, మిణుకుమిణుకుమంటున్న దీపాన్ని నిండుగా వెలిగిస్తావని, అర్థం కోల్పోయిన జీవితానికి పరమార్థం నువ్వే అని తెలియజేస్తావని, స్వరాలు మరచిన కోయిల చేత మళ్ళీ రాగాలు పలికిస్తావని, నా హార్డ్ డిస్క్ నిండుగా నువ్వే నిండిపోతావని, ఇలా ఎన్నో, ఎన్నెన్నో కలలు, కథలు, అన్నీ నీ గురించే, అన్నీ నీ కోసమే.

నేననుకున్నట్టుగానే ఉంటావని, నా నిర్ణయం తప్పలేదు అని నేననుకునేలా చేస్తావని, నువ్వు పైకి ఎలా ఉన్నావో, లోపల కూడా అలానే ఉంటావని, నా ఊహ, నా ఆలోచన, నా నమ్మకం వమ్ము కావని అనుకుంటున్నాను, నిజమే కదా.

నీకు ఎండ తగలనివ్వనని చెప్పను, నీకు నీడనిస్తానని మాత్రం చెప్పగలను. నిన్ను పూల మీద నడిపిస్తానని చెప్పను, నీ మనసుకి ముల్లు గుచ్చనని మాత్రం చెప్పగలను. నిన్ను కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటానని చెప్పను, నీ కళ్ళలోంచి నీరు రప్పించనని మాత్రం చెప్పగలను.

నువ్వెప్పుడు కావాలంటే అప్పుడు స్టార్ హోటల్ డిన్నర్ రెడీ అని చెప్పను, తినడానికి ఒక బిస్కెట్ ఉన్నా, సగం కన్నా ఎక్కువ నీకు పెడతానని మాత్రం చెప్పగలను. వేలు ఖర్చు పెట్టి క్యాండిల్ లైట్ డిన్నర్ చేద్దాం అని చెప్పను, వెన్నెల్లో కూర్చుని మరమరాలు తిందాం అని మాత్రం చెప్పగలను. ప్రతి మూడేళ్ళకి కార్ మారుస్తాను అని చెప్పను, నువ్వెక్కడికి వెళ్ళాలన్నా నీ పక్కన నేనుంటానని చెప్పగలను. అబ్బో నాకు ఎన్నిస్తున్నాడో అని నువ్వు నీ ఫ్రెండ్స్ దగ్గర చెప్పేలా చేస్తానని చెప్పను, ఏదిచ్చినా అందులో దాపరికం ఉండదని, ఇచ్చేది ఏదైనా అది మనసుతో, ప్రేమతో ఇస్తాడు అని నువ్వు అనుకునేలా చెయ్యగలను అని చెప్పగలను.

ఇతన్ని చేసుకున్నందుకు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో అని నువ్వు అనుకునేలా చేస్తాను అని చెప్పను, ఇతన్ని ఎంచుకుని తప్పు చెయ్యలేదు అని అనిపించేలా ఉంటానని మాత్రం చెప్పగలను.

అన్నిటికీ మించి, నువ్వు వచ్చాక, స్వర్వలోక సుందరీమణులే ఎదురుగా ఉండనీ, వాళ్లని కన్నెత్తి కూడా చూడనని చెప్పగలను. ఈ జన్మకి నువ్వే, ఇది నిజం.

నువ్విచ్చేవి నువ్విస్తావు, నేనిచ్చేవి నేనిస్తాను, అలా నీకు ఇవ్వడానికే నా శక్తి మొత్తం ధారబోస్తాను.

విడిగా కుక్కని కూడా తరమలేని వాడిని, నీ కోసం సప్తసముద్రాలు ఈది వస్తానని చెప్పగలను. చిన్న దెబ్బకే భయపడే నేను, నీ కోసం చివరి రక్తపు బొట్టు కూడా ఇస్తానని చెప్పగలను.

ఒక్కడినే జీవితం కష్టంగా ఉంది, నువ్వుంటే ఇంకా కష్టపడతాను, ఆ కష్టం ఒక్కడినే పడలేను, నాకా శక్తి ఇప్పుడు లేదు, ఆ శక్తి నీతో వస్తుంది, ఆ శక్తి నువ్వే.

పూల మీద నువ్వు నడిచి రావడానికి నేను నిప్పుల మీద నడవడానికి సిద్ధంగా ఉన్నాను. నేను నీకు సరిపోతాను అని నువ్వు అనుకునేలా చేస్తాను. నన్ను చేరితే నీ ఆనందం పెరుగుతుందే కానీ తగ్గదని నీకు అనిపించేలా చేస్తాను.

వయసు కరిగిపోతోంది, జీవితం మనకబారుతోంది, అడుగులు భారమవుతున్నాయి, రా, చెయ్యివ్వు, కలిసి నడుద్దాం, మన నందనవనం చేరుకుందాం.

ఎక్కడున్నా తొందరగా రా, కొన్ని రోజుల ఎదురుచూపుకే నాకు యుగాలలా ఉంది, కాలం ఇంకా ముందుకు వెళ్తుంటే భారం ఇంకా పెరుగుతుంది, అందుకే తొందరగా వచ్చెయ్.

Waiting for you, with all my heart. Heart
[+] 4 users Like earthman's post
Like Reply


Messages In This Thread
"నీ కోసం" - by earthman - 03-06-2023, 07:22 AM
RE: "నీ కోసం" - by earthman - 03-06-2023, 07:23 AM
RE: "నీ కోసం" - by Uday - 03-06-2023, 12:54 PM
RE: "నీ కోసం" - by earthman - 04-06-2023, 12:02 PM
RE: "నీ కోసం" - by Foreplayerr - 03-06-2023, 01:58 PM
RE: "నీ కోసం" - by earthman - 04-06-2023, 12:01 PM
RE: "నీ కోసం" - by ANUMAY1206 - 03-06-2023, 03:54 PM
RE: "నీ కోసం" - by earthman - 04-06-2023, 12:04 PM
RE: "నీ కోసం" - by rasikaraju - 03-06-2023, 05:12 PM
RE: "నీ కోసం" - by sri7869 - 03-06-2023, 07:25 PM
RE: "నీ కోసం" - by Uday - 04-06-2023, 04:35 PM
RE: "నీ కోసం" - by ramd420 - 04-06-2023, 09:43 PM



Users browsing this thread: 1 Guest(s)