12-03-2023, 08:31 AM
(This post was last modified: 10-06-2023, 11:53 PM by Pallaki. Edited 1 time in total. Edited 1 time in total.)
•22•
వాదనలు ప్రతివాదనలు విన్న తరువాత కేసు ఎక్స్టెండ్ చేశారు జడ్జి గారు. చిరంజీవి దెగ్గర చదువుకున్న కొంతమంది ఆడపిల్లలు వచ్చి పలకరించారు. తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు చాలా మంది వచ్చారు అయినా చిరంజీవి మౌనంగా వెళ్ళిపోయేవాడు.
ఇంతవరకు చిన్నా ఒక్కసారి కూడా అక్షిత వంక చూసింది లేదు, అందరితో మాట్లాడాడు, అందరినీ పలకరించాడు కానీ అక్షిత వంక కన్ను కూడా ఎత్తలేదు. లావణ్య బతిమిలాడినా చిన్నా వినిపించుకోలేదు.
కోర్టు చుట్టూ తిరిగి అందరూ అలిసిపోయిన రోజు : చీకటి పడింది
లావణ్య : వాడికేం కాదే, ఇంద ఒక్క ముద్ద తిను అని తినిపించింది.
అక్షిత కళ్ళు తుడుచుకుని నోరు తెరిచింది.
లావణ్య : ఏమైనా మనుసులో వాడికి చెప్పుకోవాలనిపిస్తే అదిగో నిండు చందమామ, దానికి చెప్పు వాడికి చేరుతుంది. మనం మధు అమ్మతో మాట్లాడేవాళ్ళం గుర్తుందా అని అన్నం తినిపిస్తుంటే లావణ్య మాటలు వింటూ అన్నం తిన్నది అక్షిత.
అందరూ పడుకున్నాక ఒక్కటే లేచి మేడ మీదకి వచ్చింది అక్షిత, తల ఎత్తి చూసింది. పచ్చని చంద్రుడిని చూస్తూ ఉండిపోయింది.
ఇటు చిన్నా జైల్లో కూర్చుని కళ్ళు మూసుకుంటే చంద్రుడి వెలుగు వెంటిలేటర్ ద్వారా కళ్ళ మీద పడి నిద్ర చెడి లేచి కూర్చుని తల ఎత్తి చూసాడు.
మధు : పిలిచావా నాన్నా
చిన్నా : వచ్చావా
మధు : ఆహా.. అలా చంద్రుడిని చూస్తుంటే.. ఒకప్పుడు నాకోసం చూసేవాడివి.. మరి ఇప్పుడు ఎవరికోసమో అనీ..
చిన్నా : ఎందుకు వచ్చావ్
మధు : అదేంట్రా అలా అంటావ్..
చిన్నా : ఇన్ని రోజులు కనపడకపోతే నా పిచ్చి తగ్గిపోయిందేమో అనుకున్నా..
మధు : ఏదో నువ్వే గొడవలో ఉన్నావ్ కదా మధ్యలో నా గొడవ ఎందుకులే అని గ్యాప్ ఇచ్చా
చిన్నా : నన్ను వదలవా అయితే
మధు : అది నా చేతుల్లో లేదు నాన్న.. నీ చేతుల్లోనే ఉంది.. అయినా నేను వచ్చింది అందుకు కాదు.
చిన్నా : మరి
మధు : ఇన్ని రోజుల్లో ఒక్క క్షణం కూడా దాన్ని చూడలేదు, అంత ప్రేమెంట్రా అది అంటే నీకు..?
చిన్నా : నేను చెప్పానా.. నేను చెప్పానా.. కోపంగా అరిచాడు
మధు : మరి ఎందుకు చూడట్లేదు దాని వంక
చిన్నా ఏం మాట్లాడలేదు
మధు : నేను చెప్పనా.. భయం నీకు..
చిన్నా : నాకా
మధు : అవును..
చిన్నా : లేదు..
మధు : అవును..
చిన్నా : లేదు.. లేదు.. లేదు..
మధు : అవును.. అవును.. అవును.. నువ్వెన్ని సార్లు చెప్పినా అవుననే అంటాను..
చిన్నా అరుస్తూనే గట్టిగా చెవులు మూసుకున్నాడు, ఆ తరువాత కళ్ళు తిరిగి పడిపోయాడు.
రోజులు గడుస్తున్నాయి, ఇటు చిన్నగా కేసు ప్రాధాన్యం సంతరించుకుంది. బాలికా గృహంలో చదువుకున్న అమ్మాయిలు ఒక్కొక్కరుగా బైటికి వచ్చారు.. అందరూ చిరంజీవికి అండగా నిలబడ్డారు. ఏవో రెండు మీడియా ఛానెల్లు, కొంతమంది రాజకీయ నాయకులు తప్ప అందరూ చిరంజీవికి మనస్ఫూర్తిగా మద్దతు తెలిపారు.
నెల రోజుల్లో పరిస్థితి ఎలా మారిందంటే ఇండియాలో ఉన్న ప్రతీ మ్యాగజైన్ ఫ్రంట్ కవర్ మీద చిరంజీవి బొమ్మ పడింది. యుకే వంటి ప్రముఖ బీబీసి ఛానెల్లో చిరంజీవి గురించి డాక్యుమెంటరీ ప్రసారం చేశారు. ప్రధానమంత్రి ఢిల్లీలో అడిగిన ప్రశ్నలకి రాష్ట్రం మొత్తం వేడెక్కి పోయింది. తమిళనాడు ముఖ్యమంత్రే స్వయంగా దిగారు.
విపరీతమైన ఒత్తిడి వల్ల కేసు సిబిఐ చేతుల్లోకి వెళ్ళింది. నెల రోజుల్లో కేసు ఓ కొలిక్కి వచ్చింది. ఆ తరువాత ఇరవై రోజుల్లో చిరంజీవిని నిర్దోషిగా కోర్టు ప్రకటించింది. రేపే చిరంజీవి విడుదల.