12-03-2023, 08:28 AM
(This post was last modified: 17-04-2023, 04:29 PM by Pallaki. Edited 2 times in total. Edited 2 times in total.)
•16•
శృతి వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు పెళ్లింటికి వెళ్లి అక్షితకి లావణ్యకి కావాల్సిన ఏర్పాట్లు అన్ని చేసి వాళ్ళతో మాట్లాడి అందరికీ చెప్పేసి ఇంటికి బైలుదేరారు. దంపతులు ఇద్దరు ఎత్తుకున్న బాధ్యతని సమర్ధవంతంగా పూర్తి చేశామని కారులో కూర్చుని ఊపిరి పీల్చుకున్నారు.
అంకుల్ : అవును ఆ అబ్బాయి అస్సలు కనిపించనేలేదు
ఆంటీ : అదేనండి నేనూ అనుకుంటున్నాను, బహుశా బాదపడుతుండుంటాడు.. పాపం ఆ అబ్బాయి అక్షితని ఎంతగానో ప్రేమించాడు. ఆ అమ్మాయికి అది తెలియనేలేదు.. చిన్నప్పటి నుంచి కోరుకున్న అమ్మాయి దక్కాకపోతే ఎంత బాధ.. అందులోనూ ఆ అబ్బాయి అదేమి కనిపించకుండా మనస్ఫూర్తిగా పెళ్లి చేశాడు.. ప్రేమంటే ఇవ్వడమే కానీ తిరిగి ఆశించకూడదని తన పనులతో చెప్పకనే చెప్పాడు. ఎంత నిజాయితీ..
అంకుల్ : మరి శృతి విషయం.. మొన్నే ఎంగేజ్మెంట్ రోజే అడుగుదాం అనుకున్నాను కానీ ఎందుకో అడగలేకపోయాను
ఆంటీ : ఏవండీ.. అని తలని తన భర్త గుండె మీద పెట్టుకుని.. ఆ అబ్బాయికి మన శృతిని ఇచ్చి చేద్దామండీ.. చాలా మంచివాడు, కష్టపడతాడు, మన అమ్మాయి మనసుకి నచ్చినవాడు.. ఏ కులమో తెలీనప్పుడు అన్ని కులాలు తనవే కదండి.. కావాలంటే నేను మాట్లాడి మార్పించేస్తాను.. మన అమ్మాయిని అంతగా ప్రేమించేవాడు ఎక్కడా దొరకడు.. మన అమ్మాయిని బాధ పెట్టమాకండి.. ఇన్నేళ్ళ మన కాపురంలో ఇంతవరకు నేను మిమ్మల్ని ఏమి అడగలేదు.. ఈ ఒక్కటి నా మాట వినండి. శృతి ఆ అబ్బాయిని కోరుకుంటుంది.. దాని ప్రేమని మనమెందుకు కాదనడం
అంకుల్ : ముందు నన్ను ఒకసారి శృతితో మాట్లాడనివ్వు.. ఇక నీ కోరిక నెరవేర్చుతాలే.. ఇంతకీ ఆ అబ్బాయి ఒప్పుకుంటాడా
ఆంటీ : థాంక్యూ థాంక్యూ సో మచ్.. నా కూతురు ఇది వింటే ఎంత సంతోషిస్తుందో.. ఒప్పుకుంటాడు.. తెరుకోవడానికి కొంత సమయం పడుతుంది.. దెగ్గరుండి పెళ్లి చేసినవాళ్ళం.. మనం కోరితే కాదంటాడా.. బలవంతంగా చేసినా ఆ తరువాత వాళ్ళే వాళ్ళ కాపురాన్ని నిలబెట్టుకుంటారు. అంటూ భర్తకి దారిపొడవునా సర్ది చెపుతూ వచ్చింది.
శృతి అమ్మ కారు దిగి ఇంట్లోకి వెళ్లి నేరుగా శృతి రూంలోకి వెళ్ళింది, కానీ అక్కడ శృతి మంచం మీద పడుకుని ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తుంటే పరిగెత్తి తనని కౌగలించుకుని అడిగింది, ఏమైందంటూ
శృతి : చిన్నా ఫోన్ స్విచ్ ఆఫ్.. ఇల్లు కనీసం తాళం కూడా వెయ్యలేదు.. వాడు వెళ్ళిపోయాడు మా అని ఏడ్చేసింది గట్టిగా తన అమ్మ చేతిని పట్టుకుని.
అప్పటికి కానీ శృతి అమ్మకి గుర్తురాలేదు, చిన్నా తనకి వెళ్లిపోతానని మాట ఇచ్చాడని.. అదే విషయం కూతురికి చెప్పి బాధపడింది, ఆ వెంటనే తమ నిర్ణయం గురించి కూడా చెప్పింది. చిన్నాని వెతికించే బాధ్యత తనదంటూ భరోసా ఇచ్చి అప్పటికి తన కూతురి బాధని కొంత తగ్గించింది.
వారం గడిచింది.. ఇటు అక్షిత లావణ్యల ఇద్దరి కొత్త జీవితం కొత్త కుటుంబం, కలుగుతున్న ఆనందాన్ని సుఖాన్ని ఆస్వాదిస్తున్నారు.. ఇల్లంతా ఆనందంగా ఇద్దరు కోడళ్ల కాలి గజ్జలతో సందడిగా ఉన్నా ఆ ఇద్దరి కొత్త కోడళ్ల మోహంలో మాత్రం నవ్వు లేదు.
చిన్నా మొహం కనిపించక, వాడి నుంచి ఫోన్ రాక వారం గడిచింది. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్, ఇంటికి వెళ్ళొద్దాం అనుకున్నారు కానీ అత్తయ్య ఏమంటుందో అని ఆగిపోయారు. అదే రోజు రాత్రి లావణ్యకి ఫుల్లుగా చలి జ్వరం వచ్చేసింది. రాత్రంతా అక్షిత ఒళ్లోనే ఉంది.. ఒకటే కలవరింపు చిన్నా.. చిన్నా.. చిన్నా..
అక్షిత తెల్లారే కట్టుకున్న చీర కూడా మార్చుకోకుండా లేచి స్కూటీ తీసుకుని షెడ్ కి వెళ్ళింది, అది మూసేసి ఉండటంతో ఇంటికి వెళ్ళింది. గేట్ మూసేసి ఉంది, తలుపుకి తాళం వేసి లేదు పక్క డోర్ తెరిచే ఉండటంతో కోపంగా చిన్నాని కడిగిపారెయ్యాలని లోపలికి వెళ్ళింది. కానీ లోపల ఎవ్వరు లేరు, ఇంటి తలుపులు తెరిచే ఉండటం వల్ల త్వరగా లోపల బూజు పట్టేసింది. టేబుల్ మీద మధు అమ్మ ఫోటో వినాయకుడి బొమ్మ గాలికి పడిపోయి ఉన్నాయి. ఇల్లంతా పరికించి చూసి అనుమానంగా పక్కన శృతి ఇంటికి వెళ్లి తలుపు తట్టింది. శృతి వాళ్ళ అమ్మగారు తలుపు తీసి అక్షితని పలకరించి లోపలికి రమ్మని శృతి రూం చూపించింది.. లోపల శృతి ఏదో పెయింటింగ్ చేసుకుంటుంది. ఎవరో వచ్చారని తల ఎత్తి చూసి అక్షితని చూసి రమ్మని సైగ చేసింది. అక్షిత లోపలికి వస్తూనే చిన్నా.. అని దీర్ఘం తీసింది.
శృతి : చిన్నా మీ పెళ్ళైన తెల్లారి నుంచి కనిపించలేదు అక్షితా.. నేనూ వెతికాను.. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్.. ఎటు వెళ్ళాడో తెలీదు. మీకు చెప్పలేదా
అక్షిత : లేదు అంటూనే లేచి నిలబడింది పైట కప్పుకుంటూ
శృతి : నాకు చెప్పకుండా వెళ్లిపోయాడని కోపం వచ్చి నేను మీకు ఫోన్ చెయ్యలేదు.. మీకు తెలుసనుకున్నాను.. ఒకసారి నాతో అన్నట్టు గుర్తుకు.. మీ పెళ్లయ్యాక దుబాయి వెళ్తానని.. నిజంగానే మీకు చెప్పలేదా ?
అక్షిత తల అడ్డంగా ఊపి బైటికి వెళుతూనే నేనొకసారి ఆ ఆఫీస్ కి వెళ్ళొస్తానని చెపుతుంటే శృతి అలాగే అని సైగ చేసింది. అక్షిత ఇంటి నుంచి బైటికి వెళ్ళగానే శృతి మాటలు విన్న తమ అమ్మ లోపలికి వెళ్లి శృతిని అడిగింది. ఇటు బైటికి వచ్చిన అక్షిత స్కూటీ కీస్ లోపలే మర్చిపోవడంతో లోపలికి వెళ్లి శృతి రూం దెగ్గర శృతి అమ్మ మాటలు వినగానే ఆగిపోయింది.
ఎందుకు ఆ పిల్లకి అబద్ధం చెప్పావ్ ?
శృతి : వాళ్ళు బాధ పడకూడదనే కదా.. ఆ పిచ్చోడు వాడి ప్రేమని త్యాగం చేసి అందరికి దూరంగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు తనకి చెప్పి బాధ పెట్టడం ఎందుకు ?
నాకు ఒకటే అర్ధంకాని విషయం. చిన్నా అక్షితని అంతగా ప్రేమించాడు కదా కనీసం అక్షితకి అనుమానం కూడా రాలేదా, తనకి ఎప్పుడు అనిపించలేదా.. లేదా తెలిసే కావాలని దూరం పెట్టిందా
శృతి : ఎవరికీ తెలుసు.. కానీ అబ్బాయి ఒక అమ్మాయిని అంత పిచ్చిగా ప్రేమిస్తారని వాడిని చూసాకే తెలిసింది. ఒకప్పుడు వాడు దణ్ణం పెట్టుకున్నాడు అక్షిత దక్కాలని, ఇప్పుడు నేను పెట్టుకుంటున్నా చిన్నా నాకు దక్కాలని.. మా ఇద్దరి కోరికలు తీరావేమో అని ఏడ్చేసింది.
ఇలా ఇంకెన్ని రోజులు.. ఉద్యోగం మానేశావ్.. నీకు ప్రాణం అయిన గ్రాఫిక్స్ వదిలేసావ్.. ఇలా వాడి బొమ్మలు కుప్పలు కుప్పలుగా గీసి ఏం చేద్దామని.. పిచ్చిదానివి అయిపోతున్నావ్ శృతి.. నిన్నిలా చూడలేకపోతున్నాను.
శృతి : నేనేమి ఏడవటం లేదు, బాధ ఉంటుంది కదా.. ఇక జాబ్ విషయానికి వస్తే కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి, ఇదంతా నా ఒక్క దానికేగా. జాబ్ చేయడం నాకు ఇప్పుడు ఇష్టంలేదు..ఇక చిన్నా విషయానికి వస్తే, వాడు నా దెగ్గరికి వచ్చేదాకా ఎదురుచూస్తాను.
వాడు రాకపోతే
శృతి : వస్తాడు.. వచ్చేదాకా నేను చచ్చేదాకా ఎదురుచూస్తాను.. అని మళ్ళి చిన్నాకి తనకి పెళ్లి జరుగుతున్న బొమ్మని గీసే పనిలో పడింది శృతి.
శృతి వాళ్ళ అమ్మకి బైట ఎవరో ఉన్నారనిపించి రూం నుంచి బైటికి వచ్చి చూస్తే అక్కడ ఎవ్వరు లేరు.