18-01-2023, 11:07 PM
(This post was last modified: 15-02-2023, 10:58 PM by Pallaki. Edited 1 time in total. Edited 1 time in total.)
56
అరణ్యకి దారిపొడవునా జంతువులు తోడుగానే ఉన్నాయి, తనకి అవసరం వచ్చినప్పుడల్లా ఏదోరూపంలో సాయం చేస్తూనే ఉన్నాయి. కొంతసేపు కుక్కల రూపంలో కొంతసేపు పక్షుల రూపంలో ఇక అడవి మార్గల్లో అయితే ఒక అడవి నుంచి ఇంకో అడవి సరిహద్దు వరకు జింకలు, కుందేళ్లు, నెమళ్ళు ఇలా అన్ని జంతువులు సాయం చేస్తూనే ఉన్నాయి.
నిశితమైన అడవిలో బైట ఎండ విజృంబిస్తున్నా లోపల మాత్రం చల్లగా నీడగా ఉంది, గుర్రం వేగం తగ్గించి చిన్నగా నడుస్తుంటే అరణ్యకి ఆకలిగా అనిపించి చుట్టూ ఏదైనా తినడానికి దొరక్కపోదా అని చూస్తుంది.. కొంత దూరం వెళ్ళాక ఒకటి సపోటా చెట్టు కనిపించింది దాని నిండా పళ్లే కానీ పండలేదు, గుర్రం మాత్రం ఆపకుండా తినేస్తుంటే అరణ్య ఒకటి తీసుకుని తినగా చేదు కొట్టింది, అయినా తప్పక ఒక రెండు తినేసి చెట్టుకి ఆనుకుని సేద తీరుతూ కళ్ళు మూసుకుంది.
ఇంకోవైపు టీవీల్లో అందరూ ఎదురు చూస్తూ కూర్చున్నారు అమ్మాయి ఎటు వెళుతుందా అని వీడియోల్లో తనకి కాపలాగా ఉంటున్న జంతువులని, అరణ్య వేగవంతమైన ప్రయాణాన్ని చూసి కొంతమంది ఆశ్చర్యపోతే ఇంకొంతమంది మాత్రం అందులో ఏముంది భూమ్మీద ఎంతో మంది ఉన్నారు ఇందులో ఆశ్చర్యం ఏముంది అని కొట్టివేశారు ఇంకొంతమంది అయితే అరణ్యని దేవత అని దైవ కార్యం కొరకు వెళుతుందని తనని వెంబడించడం ఆపమని కోప్పడ్డారు ఇలా ఎవరి స్పందన వారిది.
ఇంకో వైపు సుశాంత్ మరియు ప్రదీప్ కూడా ట్విట్టర్ ని, మీడియా ఛానెల్స్ ని ఫాలో అవుతూ అరణ్యని వెంబడిస్తున్నారు.. అరణ్యని ఆపే శక్తి తనని ఇంటికి తీసుకొచ్చే పవర్ రెండూ ఉన్నా అస్సలు అరణ్య ఎక్కడికి వెళుతుందా అన్న కుతూహలం మొదలయ్యి.. అరణ్య పరుగు ఎక్కడి వరకు వెళ్లి ఆగుతుందో తెలుసుకుని ఆ తరవాత తనని ఇంటికి తీసుకురావడానికి అరణ్య వెళుతున్న వైపే తమ మనుషులని పంపించారు.
పెద్ద ఏనుగు ఒకటి ఘీంకరించేసరికి అటు గుర్రానికి ఇటు అరణ్యకి మెలుకువ వచ్చి లేచారు, అరణ్య పక్కన అరటి గెల ఒకటి పెట్టి వెళుతున్న ఏనుగుకి నమస్కరించి దానికి కృతజ్ఞతలు తెలిపింది.
రాత్రి వరకు అక్కడే విశ్రాంతి తీసుకుని ఇద్దరు మళ్ళీ ఆకాశంలో మెరుస్తున్న తారని చూస్తూ ముందుకు వెళుతున్నారు. చీకటిలో వర్షం పడేసరికి మళ్ళీ ఆగాల్సి వచ్చింది. ఎక్కడుందో తనకే తెలీదు తను నమ్ముకుందల్లా ఆ గుర్రాన్ని, తన చేతిలో ఉన్న మచ్చని, బతికే ఉన్నాడు కానీ ఎక్కడున్నాడో తెలియని తన బావని.. గుడ్డిగా వెళుతుంది.. కొంత దూరం నడిచిందో ఏమో సున్నితమైన తన పాదాలు మంట పుడుతుంటే గుర్రం తన కాళ్ళని చూస్తూ పక్కనే నడుస్తుంది. అరణ్య అది గమనించి గుర్రంతో మాట్లాడుతూ తన మీద చెయ్యి వేసి నిమురుతూ వర్షంలో తడుస్తూ వెళుతుంటే అరటి చెట్లు కనపడ్డాయి.. పెద్ద పెద్ద ఆకులని తన ఒంటి మీద కప్పుకుని ఇంకో ఆకు తన తల మీద పెట్టుకోగా గుర్రం కూర్చోమని వంగింది.. అర్ధమైన అరణ్య ఎక్కి కూర్చుని అరటి ఆకులని గట్టిగా గొడుగులా పట్టుకొగా గుర్రం నెమ్మదిగా పరిగెడుతూ ఉంది.
ఐదు రోజుల ప్రయాణం తరవాత అర్ధరాత్రి మిణుగురు పురుగుల సాయంతో అడవిలోనుంచి బైటికి వచ్చి చూస్తే దూరం నుంచి సముద్రం కనిపిస్తుంది. ఆకాశంలో నక్షత్రం మాత్రం వెలుగుతూనే ఉంది.ఇంత వరకు అరణ్య తన బావతో మాట్లాడ్డమే కానీ ఒక్కమాట కూడా అటు వైపు నుంచి వినపడలేదు.
మెయిన్ రోడ్డు దాటి బీచ్ వైపు కాకుండా గుర్రం సముద్రం వైపు అడుగులు వేస్తుంటే అరణ్యకి ఏమి అర్ధంకాక గుర్రం మీద కొడుతూ అడుగుతుంటే గుర్రం మాత్రం పట్టించుకోకుండా వెళుతుంది. అప్పటికే అరణ్యని చాలా మంది చూసేసారు.. వెంటబడి ఫోటోలు వీడియోలు తీస్తుంటే గుర్రం వేగం పెంచి అక్కడ నుంచి పారిపోయి మనుషులు లేని చోట ఇసుకలో సముద్రం వైపు నడుచుకుంటూ వెళుతుంది.