11-08-2022, 08:51 AM
(This post was last modified: 19-10-2022, 10:28 PM by Pallaki. Edited 3 times in total. Edited 3 times in total.)
20
కావేరి ముందుకు నడుస్తూ...
సరిగ్గా ఇరవై సంవత్సరాల క్రితం నేను పెళ్లి చేసుకుని అత్తారింటికని ఈ ఊరికి వచ్చాను వచ్చిన నెల రోజులకే తెలిసింది నేను మా ఆయన వాళ్ళ కుటుంబం చేతిలో మోసపోయానని.
ఆయనకి పిల్లలు పుట్టరని ముందే తెలిసి కూడా నాకు చెప్పకుండా నన్ను పెళ్లి చూసుకున్నాడు, ఎన్ని రోజులని కప్పిపుచ్చుతారు చివరికి నాకు తెలిసి కోపంలో మా ఇంటికి బైలుదేరాను.
రోడ్ మీదకి వచ్చి బస్సు కోసం ఎదురు చూస్తుండగా ఒకావిడ యూనిఫామ్ లో తల నిండా రక్తంతొ పసికందును ఎత్తుకుని పరిగెత్తుకుంటూ వచ్చి పిల్లోడిని నాకిచ్చి నా కాళ్ళు పట్టుకుని ఏడుస్తూ మళ్ళీ వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది తన వెనకాలే పది మంది కత్తులు పట్టుకుని తన వెనక పడుతున్నారు, నాకేం చెయ్యాలో అర్ధం కాలేదు పిల్లోడిని తీసుకుని మా ఇంటికి వచ్చేసాను ఎందుకో నాకు దేవుడు ఇచ్చిన ప్రసాదం అనిపించింది.
ఎంత మంది చెప్పినా వినలేదు వాడిని నా కొడుకుని చేసుకున్నాను, ఎందుకంత పట్టుబట్టాను అంటే ఆవిడ చూసిన చూపు అలాంటిది, పది మంది కత్తులతో వెంటపడుతున్నా తన కళ్ళలో భయంలేదు తన కొడుకు మీద బెంగ తప్ప, తను శివని నా చేతిలో పెట్టి నా కాళ్ళు పట్టుకుని ఏడుస్తూ వెళ్ళిపోయింది తిరిగి వెళ్ళేటప్పుడు చూసాను నాకింకా గుర్తే నా చేతుల్లో ఉన్న తన కొడుకుని ఒక్క క్షణం చూసి ఏడుపు ఆపేసి కోపంగా పరిగెత్తింది.
ఆ మొహం చూస్తేనే చెప్పొచ్చు ఎంతో నిజాయితీగా మంచిగా ఉంటే తప్ప అలాంటి ఒక గర్వం, తెగింపు మొహంలోకి రావు.
అదీ జరిగింది, తన కొడుకు కోసం ఎప్పటికైనా తిరిగి వస్తుందేమో అన్న చిన్న ఆశతొ ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాను తిరిగి మా అత్త వాళ్ళతో కలిసిపోయినా వాళ్ళ మాట వినకుండా శివని నేనే పెంచుకున్నాను, అని కళ్ళు తుడుచుకుని ముగించింది.
ముస్కాన్, మీనాక్షి కూడా ఏడ్చేశారు.
మీనాక్షి : మరి ఈ అనాధఆశ్రమం?
కావేరి : అది నా ఆలోచనే, ఎప్పటికైనా జాబ్ చెయ్యాలనుకున్నాను కానీ మా అమ్మ వాళ్ళు నా మాట వినకుండా నాకు పెళ్లి చేసేసారు, ఆ తరువాత పది సంవత్సరాలకి ఇదే రోడ్డులో ఐదుగురు పిల్లలు అన్నానికి అల్లాడటం చూసి తట్టుకోలేక చేరదీసాను డబ్బు సరిపోక ఇలా చిన్న ట్రస్ట్ లాంటిది తెరిచి చాలా కష్టాలు పడితే చివరికి ఇలా ఆశ్రమంగా మారింది.
శివకి పదేళ్లు నిండే వరకు నా దెగ్గరే పెరిగాడు, కానీ అది మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు. శివ ఇక తను కూడా ఆశ్రమంలోనే ఉండి చదువుకుంటానని నన్ను బలవంతంగా ఒప్పించి చివరికి తను ఎలా నా చేతుల్లోకి వచ్చింది తెలుసుకున్నాడు. ఆ తరువాత కొన్ని సంవత్సరాలకి ఆశ్రమం నడపడం నా వల్ల కావట్లేదని నా మాట వినకుండా బైటికి వచ్చేసి హోటల్లో జాయిన్ అయ్యాడు అక్కడ నుంచి మీకు తెలుసు.
ముస్కాన్ : పెద్దమ్మా.. మరి మిమ్మల్ని భయ్యా పెద్దమ్మ అని పిలుస్తాడు.
కావేరి : నేనే అలా పిలిపించుకున్నాను, అమ్మా అని పిలిపించుకోవాలని ఉండేది కానీ నాకు శివ వాళ్ళ అమ్మ గుర్తొచ్చి ఆ కోరికని అణుచుకున్నాను.
మీనాక్షి : తను మీకు మళ్ళీ కనిపించలేదా, తన కోసం వెతకలేదా?
కావేరి : లేదు, తను శివని నా చేతుల్లో పెట్టేటప్పటికే చావు బతుకుల్లో ఉంది. ఆ తరువాత తను బతికి ఉంటుందని నేను అనుకోలేదు అందులోనూ నాకు తనని వెతికే సమయం లేకపోయింది.
మీనాక్షి : శివ మీరు ఒంటరిగా ఉంటున్నారని చెప్పాడు?
కావేరి : రెండేళ్ల క్రితం మా ఆయన చనిపోయాడు, నాకు పిల్లలు లేరు ఉన్న ఒకేఒక్క దారం మా ఆయన. ఆయన కూడా లేకపోయేసరికి మా ఆయన వాళ్ళ కుటుంబం వాళ్లు నన్ను వదిలించున్నారు. మా అమ్మ వాళ్లతొ నాకు ఉండాలనిపించలేదు అందుకే ఒంటరిగా ఉంటున్నాను.
ఇప్పుడు డబ్బు శివ పంపిస్తున్నాడు, అప్పుడప్పుడు చిన్న చిన్న డొనేషన్స్ వస్తాయి, ఈ ఆశ్రమం చూసుకుంటూ బతికేస్తున్నాను.
మీనాక్షి : మీరు ఒంటరిగా ఉంటున్నారు కదా అయినా శివ మీ దెగ్గర కాకుండా వేరేగా ఎందుకు ఉంటున్నాడు?
కావేరి : అది నాకు కూడా తెలీదు, బతిమిలాడినా శివ ఒప్పుకోలేదు నన్ను వదిలి వెళ్ళేటప్పుడు వాడు ఎంతగా ఏడ్చి ఉంటాడో నాకు తెలుసు కానీ ఎందుకు నాకు దూరంగా ఉంటున్నాడో నాకూ తెలీదు, వాడు ఎప్పుడు ఏం ఆలోచిస్తాడో ఏ మూడ్ లో ఉంటాడో మనకి తెలీదు. ఏడుపు వచ్చినా వాడి మొహం మీద చిరునవ్వు చెరిగిపోదు అంత నిబ్బరంగా ఎలా ఉండగలుగుతాడో.. బహుశా వాళ్ళ అమ్మ జీన్స్ అయ్యి ఉంటుంది.
ఇంతలో శివా, సందీప్ లు ఇద్దరు రావడం చూసి కావేరి మాట్లాడడం ఆపేసింది, మీనాక్షి ముస్కాన్ లు కళ్ళు తుడుచుకుని మాములు అయిపోయారు.