Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Maguva - Maya
#15
ఈ భారాన్ని దించుకోవడానికి బాధను వెళ్లగక్కడానికి నీకొక మార్గం కావాలి. అందుకు నీ మనసు ఎంచుకున్న ప్రత్యామ్నాయం ఈ పారనోయిడ్ స్కీజోప్రినియా. ఇది నీకున్న జబ్బు, దీనికి నువ్వు పూర్తిగా సహకరించి మందులు వాడుతూ తరచుగా థెరపీ చేయించుకుంటే నిన్ను పూర్తి ఆరోగ్యవంతుడిని చేసే పూచి నాది అని చెప్పి వెళ్లిపోయారు.

 
ఇదంతా విన్నాక మొద్దుబారిపోయింది నా మెదడు అంతా. కాసేపు మిన్నకుండిపోయాను, చెప్పినదంతా ఆలోచించుకోవడానికి అర్ధం చేసుకుని అంగీకరించడానికి సమయం కావాలి నాకు, కాసేపు పడుకుంటాను కావ్య అని చెప్పాను కానీ నిద్ర రావట్లేదు.
ఆలోచిస్తుంటే నిజమే అనిపిస్తుంది, ఆ రోజు ఫ్లైట్లో ఇక్షిక తన ప్రేమ కథ చెప్తూ, విడిపోవడనికి కారణాలు చెప్పినప్పుడు, నా ఇక్షిక చెప్పిన అవే విషయాలు, అవే మాటలు ఇక్కడ ఈ ఇక్షిక కూడా చెప్పింది, ఇదంతా నేను ఊహించుకున్నదేనా?
 
వారం రోజులు హాస్పిటల్ లోనే ఉన్నాను. రోజు హిప్నోసిస్ ట్రీట్మెంట్ చేస్తున్నారు, ఏవేవో టాబ్లెట్స్ ఇస్తున్నారు. అన్ని బానే జరిగాయి. ఇప్పుడు పరిస్థితి కాస్త పర్లేదు అనిపించి డిశ్చార్జ్ చేశారు. ఈ వారం రోజులు ఇంటి నుంచి ఒకటే ఫోన్ లు. ఎప్పటికప్పుడు మీటింగ్ లో ఉన్నాను పనిలో ఉన్నాను అని నెట్టుకొస్తున్నాను. వెళ్లి అమ్మానాన్న ని చూడాలి అనిపించింది. కార్ తీసుకుని బయలుదేరాను.
చాలా కాలం తర్వాత వచ్చాను ఇంటికి, రెండు రోజులు ఉన్నాను. నాకు నచ్చినవి అన్ని చేసి వద్దు అంటున్నా కూడా పెడుతూనే ఉంది అమ్మ. నాన్న మాత్రం గంభీరంగానే ఉన్నారు. మూడో రోజు బయటకు వెళ్ళాలి అనిపించింది. కార్ తీసుకుని బయలుదేరాను, ఇక్కడికి అంటూ ఏమి అనుకోలేదు, స్టీరింగ్ ఎటు తిప్పాలి అనిపిస్తే అటు తిప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను, ఆకలేసినప్పుడు ఆగుతున్నాను, తింటున్నాను, కార్ రోడ్ పక్కకు ఆపి కాసేపు పడుకుంటున్నాను, మళ్ళి ప్రయాణమవుతున్నాను. మూడో రోజు నా ప్రయాణం లో ఒక ఊరు చివర ఆగాను.
 
ఒక చెట్టు, దాని చుట్టూ అరుగు ఉంది, అక్కడికి వెళ్లి కూర్చున్నాను, ఆకాశం మబ్బులు పట్టి జోరు వాన కురవడానికి సిద్ధంగా ఉంది, ఒక పెద్దాయన ఆవులు కాచుకుంటూ తిరుగుతున్నాడు, ఆవుల్ని మేతకు వదిలి నేను కూర్చున్న అరుగు దగ్గరకు వచ్చి కూర్చున్నాడు, గిన్నె లో సద్దన్నం అనుకుంట, తీసుకుని తింటున్నాడు. తింటావా అని అడిగాడు. వద్దు అన్నాను. నేను మూడు రోజులు నుంచి తిరుగుతున్నాను, ఇప్పుడు నేను ఉన్నది ఖచ్చితంగా ఆంధ్ర తెలంగాణ కాదు, వేరే ఏదో రాష్ట్రం. ఇక్కడ తెలుగు మాట్లాడుతున్నాడు అనే సందేహం తీర్చుకోవడానికి మీరు తెలుగు వాళ్ళా అని అడిగాను, అవును అన్నాడు. మీరేంటి ఇక్కడ అని అడిగాను. యుక్త వయసులో ఇక్కడికి వచ్చి స్థిరపడ్డంలే అని సమాధానమిచ్చాడు. నువ్వు ఏంటి కార్ వేసుకుని బయలుదేరావు, జీవితాన్ని చదివెయ్యడానికా అని అడిగాడు, ఒకింత ఆశ్చర్యం కలిగింది, బయలుదేరే ప్రతి ఒక్కడు జీవితాన్ని చదవడానికేనా, పని మీద వెళ్లే వాళ్ళుకూడా ఉంటారు కదా అన్నాను. మరి ఆ పని చూసుకోకుండా ఇక్కడేం పని నీకు నాతో కబుర్లాడుతున్నావు అన్నాడు. కొంచెం కోపం వచ్చింది, మీకెందుకు, ఈ స్థలం మీదా? మీది అయితే చెప్పండి వెళ్ళిపోతాను, నేను ఎక్కడ ఆగితే మీకెందుకు అన్నాను..
 
ఎక్కడికి వెళ్ళిపోతావు? నీకంటూ ఒక గమ్యం కూడా ఉందా అని నవ్వాడు. నిర్ఘాంతపోయాను, మీకెలా తెలుసు అన్నాను. ఇక్కడ విషయం నాకు ఎలా తెలుసు, ఏమి తెలుసు అని కాదు, నీకేం కావాలి అనేదాని పైన దృష్టి పెట్టు అన్నాడు. ఒక్క క్షణం ఆలోచించాను, సంతోషం కావాలి, ఆ సంతోషం ఇక్షిక అనే అమ్మాయి తీసుకెళ్ళిపోయింది, తిరిగి పొందాలి అన్నాను. సంతోషం బాధ కోపం క్రోధం ఇవన్నీ నీ ఆలోచనల రూపాలు, నీలోనే ఉన్నాయి, ఒకళ్ళు తీస్కెళ్ళేది, తీసుకొచ్చేది కాదు అన్నాడు. నిజమే, కానీ ఆ మనిషి ఉన్నపుడు ఉండే భావన మనిషి లేకపోతే ఉండదు కదా అన్నాను.
 
చిన్నప్పుడు నీకు బొమ్మలు ఉంటె సంతోషం, అమ్మ బుజ్జగిస్తుంటే సంతోషం, నాన్న భుజాల మీద ఎక్కి ఆడుకోవడం సంతోషం, కొంచెం పెద్దయ్యాక స్నేహితులతో ఆడుకోవడం సంతోషం, బయట తిరగడం సంతోషం. ఇంకొంచెం పెద్దయ్యాక మగువలను చూడడం లో వాళ్ళతో మాట్లాడడంలో, ముట్టుకోవడంలో, అంటిపెట్టుకుని ఉండడంలో సంతోషం.. ఇంకాస్త పెద్దయ్యాక, ఒక అమ్మాయిని ప్రేమించడం లో, బలాన్ని, శక్తి ని, కోరుకున్నది దక్కించుకోవడం లో సంతోషం. తర్వాత, సంపాదించడంలో, భాద్యతలు తీసుకోవడంలో, ఒక ఇంటి వాడివి అవ్వడంలో, అమ్మ నాన్నలని సాకడంలో సంతోషం. ఆ తర్వాత పిల్లల్ని ప్రయోజకులని చెయ్యడంలో, సమాజంలో మంచిని స్థాపించడంలో సంతోషం. ఆ తర్వాత చిరకాల కోరికలని తీర్చుకోవడంలో, ఆరోగ్యాంగా ఉండడంలో, మనవళ్లు, మనవరాళ్లతో ఆడుకోవడంలో, వాళ్లకు నడవడిక నేర్పడంలో, నీ అనుభవాలని పాఠాలుగా పక్కవాళ్ళకు చెప్పడంలో సంతోషం. ఇలా ఒక్కో వయసులో ఒక్కో పనిలో సంతోషం ఉంటుంది. ఒక్కో వయసులో ఒక్కో మనిషి మీద ప్రేమ, ఒక్కో మనిషి మీద వ్యామోహం, వస్తువుల మీద వ్యామోహం, ఇవేవి సుస్థిరం కావు.
నువ్వు ఇప్పుడు మధ్యలో ఉన్నావు, ముందువి బానే అనుభవించావు, తర్వాతవి చూడవా? జీవితం నీకు దొరికింది మధ్యలో ఒక కష్టాన్ని చూసి చాలించాడానికా?
 
ఇదంతా ఒక చక్రం లాగా అనిపిస్తుందా? దాన్నుంచి బయటకు రావాలి అనిపిస్తుందా? బయటకు వచ్చి ఎం చేస్తావ్? కోరికలను జయించాలి అనుకోవడం కూడా ఒక కొరికే కదా, దాన్ని ఎలా తప్పించుకుంటావు? అసలు నీకు ఏమి కావాలి? ఎం పొందడానికి ఇలా బయలుదేరావు? ఎక్కడికి వెళ్తే నీకు కావాల్సింది దొరుకుతుంది? కావాల్సింది ఇదే అని నీకు ఎలా తెలుస్తుంది? వెతుకు, వెతకడమే జీవితం, దొరికితే జీవితానికి అర్ధం దొరికినట్టు, దొరక్కపోతే ప్రయత్నించాను అని సంతృప్తి లభిస్తుంది, ఏదైనా మంచి బేరమే కదా అని చెప్పి చెయ్యి కడుక్కుని ఆవుల్ని తోలుకుంటూ వెళ్ళిపోయాడు.
 
ఆయన మాటల ప్రభావం చాలా గట్టిగా పడింది నా మనసు మీద. నాకు కావాల్సింది ప్రశాంతత, నిశ్శబ్దం, నిశ్చలం. అది ఎక్కడ లభిస్తుందో తెలియదు, మనిషిలో ఉంటుందా, నా చుట్టూ ఉన్న వాతావరణంలో ఉంటుందా? నాలోనే ఉందా? నేనే గ్రహించలేకపోతున్నానా? ఇలా ఆలోచనల ప్రవాహం పుట్టింది. కార్ వేగం పెరిగింది, పెట్రోల్ ఎంత ఉందొ కూడా చూసుకోలేదు, ఆ ఆలోచన కూడా రాలేదు. ఎక్కడో ఒక కొండ లోయలో ఆగిపోయింది పెట్రోల్ అయిపోయి. దిగాను, నడుచుకుంటూ వెళ్తున్నాను. లోయలు దిగుతున్నాను, కొండలు ఎక్కుతున్నాను. పండ్ల తోటలు దాటుతూ చేతికి దొరికినవి తింటూ, వాగుల్లో నీళ్లు తాగుతూ ప్రయాణిస్తున్నాను.
 
మంచు కొండలు కనిపిస్తున్నాయి, ఏదో సాక్షాత్కరించిన భావం మొదలయింది. శిఖరాన్ని అధిరోహించాను, చుట్టూ చెట్లు, మోకాళ్ళ లోతుకు మంచు, అరచేతులు, పాదాలు వణుకుతున్నాయి, ఇంక నడక ఆపాల్సిన తరుణం వచ్చింది అని చెప్తున్నాయి. ఒక చెట్టు దగ్గర చేరాను. వీపు వాల్చి పడుకున్నాను, ప్రయాణ బడకలి వల్ల ఇట్టే నిద్ర పట్టేసింది. ఎంతసేపు పడుకున్నానో తెలియదు. మెల్లగా మెలకువ వచ్చింది, కళ్ళు తెరిచాను, కింద మంచు, పైన తెల్లటి మబ్బులు, అక్కడక్కడ చెట్లు, చాలా భాగం తెల్లగానే ఉంది, ఆకాశం నేల కలిసిపోయినట్టు.
 
 
గుండె శబ్దం తెలుస్తుంది, చాల నిదానంగా కొట్టుకుంటుంది, శ్వాస నెమ్మదించింది, రక్త ప్రవాహం మందగించింది, కళ్ళు చేతులు బిగుసుకుపోయాయి, శరీరం గాలిలో తేలుతున్నట్టు చాల తేలికగా ఉంది. మనసులో ఎటువంటి ఆలోచనలు లేవు, నిశ్శబ్దం, నిర్మానుష్యం, మంచు గాలి, చాలా చల్లగా, చాలా నెమ్మదిగా శరీరాన్ని తాకుతుంది. అమ్మ నాన్న, ఇక్షిక, కావ్య, ఉద్యోగం, పెళ్లి, పిల్లలు, కోరికలు, డబ్బు, సమాజం, ముసలి వాళ్ళం అవడం, ఏ ఆలోచన లేదు. ఆ పెద్దాయన చెప్పిన ఏ కోరిక లేదు, ఇలానే ఉండిపోవాలి అనిపిస్తుంది. స్వతంత్రం దొరికినట్టు ఉంది. నేను కోరుకున్న ప్రశాంతత, నిశ్చలం నాకు దొరికాయి. ఇదేనా మోక్షం అంటే? ఇదేనా అచంచల స్థితి అంటే? ఇదేనా నిర్వాణ అంటే? ఇదేంటి ఇంత బాగుంది, ఇన్నాళ్లు సమాజంలో భాగంగా మనుషుల్లో వస్తువుల్లో వెతికి సంపాదించుకున్న దానికంటే కొన్ని కోట్ల రెట్లు ఎక్కువగా ఉంది. చుట్టూ కలియతిరగాలి అనిపిస్తుంది, సంతోషంతో ఎగిరి గంతులు వెయ్యాలి అనిపిస్తుంది. లేవడానికి ప్రయత్నిస్తున్నాను, లేవలేకపోతున్నాను.
 
 
 
 
అమ్మ గొంతు వినిపిస్తుంది, ఎవరితోనో మాట్లాడుతుంది, పార్థసారధి గారి గొంతు మాట్లాడుతుంది. నన్ను క్షమించండి, మీ అబ్బాయి ఎక్కువసేపు బ్రతకడు. మనోవైకల్యం తార స్థాయికి చేరింది, నిజమేదో అబద్ధమేదో తెలుసుకోలేని స్థితికి పడిపోయాడు. ఊహలే నిజం అనుకున్నాడు, ఊహల్లోనే ఉండిపోయాడు. తన శరీరం ట్రీట్మెంట్ కి స్పందించడం మానేసింది. అవయవాలు దానం చేస్తానని అగ్రిమెంట్ రాసాడు, మీరు సహకరిస్తే అవి తీసుకెళ్లడానికి ఆసుపత్రి సిబ్బంది వచ్చారు, మీరు త్వరగా ఏదొక విషయం చెప్పాలి, కాసేపు ఆగితే మొత్తం వృధా అవుతుంది అన్నారు.
 
ఏంట్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావా, ఒళ్ళు మదమెక్కిందా అని అరుచుకుంటూ బెడ్ రూమ్ లో నుంచి బయటకు వచ్చాను, నన్ను ఎవరు చూడట్లేదు, నా మాటలు ఎవరికీ వినిపించట్లేదు, అమ్మ అమ్మ అని గట్టిగా అరుస్తున్నాను, ఎం జరుగుతుందో నాకేం అర్ధం కావట్లేదు, నాన్న ఎక్కడ అని అంత తిరుగుతున్నాను, నా బెడ్ రూమ్ లోనే ఒక మూల కుర్చీలో కూర్చుండిపోయారు, నాన్న ఏడవడం చూడడం అదే మొదటిసారి, గుండెలు పగిలిపోయినట్టు అయిపోయింది నా పరిస్థితి, బెడ్ వైపు నిరాశగా చూస్తున్నారు, బెడ్ వైపు చూసాను, నా బాడీ బెడ్ మీద పడి ఉంది, రెండు చేతులకి సెలైన్ బాటిల్స్ ఎక్కించి ఉంచారు. ఉలిక్కిపడ్డాను, అంటే నేను...  ఆత్మనా? ఊపిరి ఆడుతుంది, ఇంకా బ్రతికే ఉన్నాను కదా, అప్పుడే ఎలా బయటకు వచ్చాను?
 
 
 
 
 
 
సమాప్తం.
 
 
 
 
 
అని కధ ముగించాడు రవి.
 
అరేయ్, ఫైనల్ కాపీ రెడీ అయింది, ఎలా ఉందొ చదివి చెప్పు, ఈలోపు ఆలా బయటకు వెళ్ళొస్తాను అని బయలుదేరాడు రవి. రెండు గంటలు తర్వాత వచ్చాడు, ఎరా, ఇదేంటి నీ కథ కి దగ్గరగా ఉంది, నీ జీవితానికి చిన్న చిన్న మెరుగులు దిద్ది కథగా మార్చేసావా అని అడిగాడు.
 
ఇది చెప్తే నువ్వు నన్ను పిచ్చోడిలా చూస్తావేమో, కానీ చెప్తున్నాను. నమ్మడం నమ్మకపోవడం నీ ఇష్టం, చచ్చిపోయాను అనుకుని అంత సిద్ధం చేశాక బ్రతికాను కదా, అప్పటి నుంచి కలలో వేరే ప్రపంచాలు కనిపిస్తున్నాయి నాకు. శరీరాలు, మొహాలు, కవళికలు, చుట్టూ ఉండే జనాలు అంత ఒకటే కానీ, పేర్లు, ఊర్లు, నివాస స్థలాలు, భవనాలు ఇవే మారుతున్నాయి. మిగతా జీవితాలు ఇంచు మించుగా ఉంటున్నాయి, ఆశ్చర్యం ఏంటి అంటే, ఏ రోజు ఏ ప్రపంచాన్ని చూడాలి అనుకుంటే ఆ ప్రపంచం లోకి వెళ్తున్నాను, వాళ్ళ జీవితాలని పుస్తకాల్లాగా భూత భవిష్యత్ వర్తమానాలు చదివేస్తున్నాను. నేను చదివే వాటికి తగ్గట్టుగానే జరుగుతున్నాయి సంఘటనలు కూడా. నేను నిజంగా ఆత్మగా మారి విశ్వం అంత తిరుగుతున్నానా, చాలా స్పష్టంగా భ్రమ పడుతున్నానా అనేది తెలియట్లేదు. కానీ కొన్ని లక్షల కోట్ల ప్రపంచాలు, లక్షల కోట్ల రవి - విభా లు ఉన్నారు, ఈ ప్రపంచం లో నిత్య, ఆ ప్రపంచం లో ఇక్షిక. ఈ ప్రపంచంలో విన్య ఆ ప్రపంచం లో కావ్య, ఈ ప్రపంచం లో నవీన్, ఆ ప్రపంచంలో తేజ.
 
నిర్ఘాంతపోయి చూస్తున్నాడు నవీన్.
 
అంటే ఇంకో ప్రపంచంలో ఇక్షిక విభా కలిసిపోతారా? అని అడిగాడు నవీన్
 
ఒక ప్రపంచంలో విభా ఇక్షిక లు పెళ్లి చేసుకున్నారు, కావ్య అసలు వాళ్ళ జీవితాల్లోకి రాలేదు. ఇంకో ప్రపంచం లో విభా కావ్య ని ప్రాణంగా ప్రేమించి ఇక్షిక తో సహజీవనం చేసి కావ్య ని తలుచుకుంటూ చనిపోతాడు.
 
నవీన్ మోహంలో నెత్తురు చుక్క లేదు.
 
 
 
 
ఆ ప్రపంచంలో విభా అధ్యాయం ముగిసింది, ఇంకో ప్రపంచంలో ఇంకో విభా అలియాస్ రవి అధ్యాయం కొనసాగుతుంది.

twitter.com/moodyfyed
[+] 9 users Like moodyfyed's post
Like Reply


Messages In This Thread
Maguva - Maya - by moodyfyed - 26-07-2022, 02:29 AM
RE: Maguva - Maya - by moodyfyed - 26-07-2022, 02:31 AM
RE: Maguva - Maya - by moodyfyed - 26-07-2022, 02:34 AM
RE: Maguva - Maya - by moodyfyed - 26-07-2022, 02:36 AM
RE: Maguva - Maya - by ramd420 - 26-07-2022, 05:21 AM
RE: Maguva - Maya - by krantikumar - 26-07-2022, 06:12 AM
RE: Maguva - Maya - by appalapradeep - 26-07-2022, 08:08 AM
RE: Maguva - Maya - by DasuLucky - 26-07-2022, 05:20 PM
RE: Maguva - Maya - by DasuLucky - 26-07-2022, 06:22 PM
RE: Maguva - Maya - by BerlinLaCasa - 08-08-2022, 12:18 AM
RE: Maguva - Maya - by moodyfyed - 08-08-2022, 12:25 AM
RE: Maguva - Maya - by moodyfyed - 08-08-2022, 12:28 AM
RE: Maguva - Maya - by moodyfyed - 08-08-2022, 12:28 AM
RE: Maguva - Maya - by moodyfyed - 08-08-2022, 12:29 AM
RE: Maguva - Maya - by moodyfyed - 08-08-2022, 12:29 AM
RE: Maguva - Maya - by TheCaptain1983 - 08-08-2022, 02:10 AM
RE: Maguva - Maya - by neerathemall - 10-08-2022, 12:06 PM
RE: Maguva - Maya - by MrKavvam - 08-08-2022, 09:44 AM
RE: Maguva - Maya - by K.R.kishore - 08-08-2022, 01:52 PM
RE: Maguva - Maya - by appalapradeep - 08-08-2022, 06:12 PM
RE: Maguva - Maya - by Saikarthik - 08-08-2022, 06:58 PM
RE: Maguva - Maya - by Uday - 08-08-2022, 07:09 PM
RE: Maguva - Maya - by Rajanilatha - 09-08-2022, 09:47 PM
RE: Maguva - Maya - by ramd420 - 08-08-2022, 10:32 PM
RE: Maguva - Maya - by BR0304 - 09-08-2022, 12:13 AM
RE: Maguva - Maya - by Chakri bayblade - 09-08-2022, 12:50 AM
RE: Maguva - Maya - by Vallika sai - 09-08-2022, 03:24 PM
RE: Maguva - Maya - by Vivekananda - 09-08-2022, 11:22 PM
RE: Maguva - Maya - by neerathemall - 10-08-2022, 12:02 PM
RE: Maguva - Maya - by utkrusta - 10-08-2022, 01:05 PM
RE: Maguva - Maya - by narendhra89 - 11-08-2022, 05:12 AM
RE: Maguva - Maya - by moodyfyed - 12-08-2022, 07:29 PM



Users browsing this thread: 8 Guest(s)