Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
కధా స్రవంతి ❤️
వ్యవసాయం 


మిట్ట మధ్యాహ్నం వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్లి బస్సు ఎక్కాను ఒళ్ళంతా చెమటలు పేరుకే టక్ వేసుకున్నాను కానీ నా లైట్ పచ్చ రంగు కాటన్ షర్ట్ మొత్తం చెమట వల్ల తడిచిపోయి కాలర్ దెగ్గర చికాకు పుడుతుంది, బస్సు మెట్ల మీద నిల్చొని ఒక సారి బైటికి మొహం పెట్టాను ఎదురోచ్చే ఈదురు గాలి వేడిగానే ఉన్నా చెమట వల్ల కొంచెం చల్లగా అనిపించింది కళ్ళు మూసుకున్నాను.

ఇంతలో కండక్టర్ "బాబు పైకి రావాలి అక్కడ నిలబడకూడదు ప్రతి ఒక్కరికి ఫాషన్ అయిపోయింది, సీట్లు కాలిగానే ఉన్నాయ్ కదా వచ్చి కూర్చో.... ఆ టికెట్.. టికెట్" అని అరుస్తున్నాడు, ఎందుకోచ్చిన గొడవ అని చేతిలో ఉన్న ఫైల్ తొ లోపలికి వెళ్లి కూర్చున్నాను.

కిటికీ సీట్లో కూర్చుని సిటీ చూస్తూ ఉండగా మా ఊరు గుర్తొచ్చింది, మాది గుంటూరు జిల్లా మాచర్ల మండలం అటు వెళ్లే దారిలో వచ్చే చిన్న ఊరు సిరిపురం, ఊర్లన్నిటికీ కలుపుకుంటూ ఒకే రోడ్డు, పెద్ద ఆటోలు ట్రాక్టర్లు tvs బండ్లు తప్ప ఇంకేం కనిపించవు, ఇక మా ఊర్లో వర్షా కాలం వచ్చిందంటే అది నరకమే అంతా బంక మట్టి నేల అవడం వల్ల కాలు వేస్తే మళ్ళీ తీయడానికి రాదు, ఇక ఎండలో ఆ తాటాకులతొ కప్పిన ఇళ్ళు అస్సలు ఉండలేము అందుకే ప్రతి ఇంటికి ముందరో లేక పక్కనో పంచ లాగ కట్టుకుంటాం, ఆ పంచలో మంచం వేసుకుని ఇంట్లో ఉన్న ముసలోళ్ళు విసినకర్రతొ ఊపుకుంటూ ఉంటారు.. కాళిగా ఉన్న కుర్రోళ్ళో మాత్రం వాగులో చెట్లకింద సేద తీరుతుంటారు.


గుంటూరు లోనే డిగ్రీ పూర్తిచేసుకుని, కొన్ని రోజులు గుంటూరులో తిరిగాను అందరూ కూలి పనులు చెప్పేవాళ్ళే కానీ నాకు సరైన ఉద్యోగం దొరకలేదు, ఇక్కడ కూలి పనులు చేసుకోడంకంటే ఇంట్లో నాన్నకి పొలం పనుల్లో సాయంగా ఉండటమే బాగు అని సంవత్సరం పొలం పనులు చేశా, ఒక రోజు మా నాన్న హైదరాబాదులో పని చేస్తున్న పద్మ పెద్దమ్మ వాళ్ళ ఆయనని కలవమన్నాడు నాకు ఎందుకో ఒక సారి కలిస్తే మంచిదేమో అనిపించింది, అయన కోసం నెల రోజులు వేచి చూసాను చివరికి ఒక రోజు అయన ఊళ్ళోకి వచ్చాడని తెలుసుకుని ఆయనని కలుసుకున్నాను.

ఉద్యోగం ఇప్పెంచే వాళ్ళు తనకీ తెలుసని కానీ రెండు వేలు కమిషన్ అడుగుతారని చెప్పాడు, ఇంటికి వెళ్లి నాన్నతో చెప్పాను తెల్లారే అమ్మ తన కమ్మలు తాకట్టు పెట్టి నాకు రెండు వేల ఐదు వందలు ఇచ్చింది, అవి పట్టుకునే ఇప్పుడు సికింద్రాబాద్ కి వచ్చి బస్సు ఎక్కాను, ఇంతలో కండక్టర్ అమీర్ పేట్ అని అరిచాడు, నేను దిగాల్సింది ఇక్కడే అని లేచి బస్సు దిగాను.

బాగా ఆకలిసింది ఏదైనా చిన్న హోటల్ కి వెళదామని నడుచుకుంటూ అలవాటుగా జోబు తడుముకున్నాను, తేడా కొట్టింది జేబులో చెయ్యి పెట్టి చూసుకుంటే డబ్బులు లేవు, ఏడుపు వచ్చింది ఇంత కష్టపడి ఇంత చేసి ఇలా డబ్బులు పోగొట్టుకుని ఎండలో నిలబడతాననుకోలేదు.

ఏం చెయ్యాలో తెలియక దిక్కులు చూస్తున్న నాకు పెద్ద బ్యానర్ మీద జాబ్ మేళా అని కనిపించింది అందరూ నా వయసు వారె గుంపులు గుంపులుగా మూగి ఉన్నారు, వెళ్లి అప్లికేషన్ నింపి అక్కడ తీసుకుంటున్న వాళ్ళకి ఇచ్చాను, ఒక్కొక్కరిని పిలుస్తున్నారు నాకు ఆకలి వేస్తుంది అక్కడే ఉన్న కుండలో మూడు గ్లాస్సుల నీళ్లు తాగి ఇంటర్వ్యూ లోపలికి వెళ్లాను.

అప్పటికే ఎండకి నా చొక్కా ఉప్పిరిసింది, ఎవరో ఆడామే చీర కట్టుకుని కూర్చుని ఉంది, స్టైల్ గా కూర్చుంది ఒక చేతికి బంగారు గాజు ఇంకొ చేతికి సన్నటి వాచి పెట్టుకుని ఉంది, వెళ్లి నమస్కారం పెట్టాను కూర్చోమని సైగ చేసింది కుర్చీలో కూర్చున్నాను, నా పేరు ఊరు వగైరా వగైరా అడిగి నా సర్టిఫికెట్లు తీసుకుని చూసింది.

నాది తెలుగు మీడియం అయ్యేసరికి మార్కులు బానే ఉన్న ఉద్యోగం ఇవ్వలేను అంది, బతిమిలాడాను కాళ్ళ వెళ్ళా పడి నాకొచ్చిన కష్టాలు చెప్పుకుని , నాకు ఉన్న అనుభవాలతో మొత్తానికి తన దెగ్గర ఉద్యోగం సంపాదించాను.

ఇవ్వాళ ఒక రోజు పని చెయ్యమంది, పని నచ్చితే తీసుకుంటాను లేకపోతే లేదు అంది, అలాగే అని ఒప్పుకున్నాను. ఉద్యోగం వస్తే నెలకి యేడు వేల జీతం వస్తుంది ఆ ఆశతోనే తను బెల్ కొట్టి చూపించిన వ్యక్తి వెనకాలే వెళ్లాను, సాయంత్రం వరకు ఊపు మీద పని చేసాను కానీ అన్ని అవమానాలు, నాకు కంప్యూటర్ అంటే ఏమిటో కూడా తెలియదు అందులో టైపు కొట్టమన్నారు ఇవన్నీ మా ఊర్లో కానీ గుంటూరు కాలేజిలో ఎక్కడా నేర్పించలేదు, గుంటూరులో టైపు నేర్పిస్తారు కానీ నాకు దాని అవసరం తెలీక నేర్చుకోలేదు, అన్ని తిట్లు తిన్నాను నాకు ఏడుపుతొ పాటు ఈ ఉద్యోగం కూడా సరి కాదు అనిపించింది.

అక్కడ నుంచి బైటికి వచ్చేసాను, బైటికి వచ్చేటప్పుడు ఇంకో పదిరోజులు ఇలానే కష్టపడితే నీకు అలవాటు అవుతుందని పొద్దున్న నన్ను కలిసిన వ్యక్తి నవ్వుతూ చెప్పాడు, బైటికి వచ్చాను ఆకలికి కడుపు నొప్పి పుడుతుంది బస్సు స్టాపు దెగ్గర కింద కూర్చున్నాను, అప్పుడే పొద్దున్న నన్ను ఇంటర్వ్యూ చేసిన ఆవిడ బస్సు ఎక్కడానికి వచ్చి నన్ను చూసి "ఏంటబ్బాయి ఇలా కూర్చుండిపోయావు" అంది, తనకి నాకు ఆకలేస్తుంది అని చెప్పడానికి నా మనసు ఒప్పుకోలేదు కానీ కడుపు నొప్పికి తట్టుకోలేక పొద్దున్న నుంచి సిటీకి వచ్చిన దెగ్గరనుంచి నా కష్టాలు వరకు అన్ని చెప్పాను.

పాపం నా మీద జాలి వేసిందేమో నాకు చేయిచ్చి లేపి పక్కనే ఉన్న హోటల్ కి తీసుకెళ్లి నాకు భోజనం పెట్టించింది, నేను ఆబగా తింటున్నాను... తింటున్న నాతో " చూడు అబ్బాయి కష్టాలు అనేవి ప్రతి మనిషికి సహజం అన్ని పనుల్లోను కష్టాలు ఉంటాయి ఎవరో అవమానించారని, ఇంకెవరో తిట్టారని ఆగిపోతే ఎలా, చేసే పని బట్టి వచ్చే డబ్బులు బట్టి కష్టాలు కూడా అలానే ఉంటాయి వాడెవడో ఉద్యోగం ఇప్పిస్తానంటే పరిగెత్తుకుంటూ వచ్చేసావ్ ఎక్కడ ఉంటావ్ ఏం తింటావ్ ఏం ఆలోచించలేదా ఇప్పుడు నీకు ఈ ఉద్యోగం వచ్చింది నేను లోపల మాట్లాడి అడ్వాన్స్ ఇప్పిస్తాను జాగ్రత్తగా చేసుకో" అంది.

ఈ సిటీలో నాకొక దేవతలాగ కనిపించింది, ఆమె చెప్పిన మాటలు వింటూ తింటూనే ఆలోచించాను, ఆవిడ మాటలకి కొంత ధైర్యం వచ్చింది.. అలానే నేనేం చెయ్యాలో నాకు స్పష్టంగా అర్ధమైంది.

మేడం ఇప్పించిన అడ్వాన్స్ డబ్బులతో వెళ్లి హాస్టల్లో జాయిన్ అయ్యి. నెల రోజులు కష్ట పడి పని చేసాను.. ఎక్సట్రా డ్యూటీల మీద అంతా కలిపి అడ్వాన్స్ పోగా ఐదు వేలు ఇచ్చారు.

ఆ ఐదు వేలు అందుకుని ఎక్కడివక్కడ వదిలేసి బస్సు ఎక్కి ఊరికి బైలుదేరాను, ఇప్పుడు నా మొహంలోకి మళ్ళీ నవ్వు వచ్చింది.

ధైర్యంగా మా నాన్న ముందుకి వెళ్లి చెపుతాను, నేను వ్యవసాయం చేస్తానని.. మా నాన్న నేను పుట్టినప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నాడు లాభాలు చూసాం నష్టాలు చూసాం, అక్క పెళ్లి చేసాడు కొంత పొలము కొనుక్కున్నాం అలాంటిది అంత కష్టపడే మా నాన్నకి నా లాంటి చదువుకున్న ఒక చెయ్యి తొడవుతే ఇంకా ఎదగ గలనన్న నమ్మకం వచ్చింది..
❤️
Like Reply


Messages In This Thread
RE: కధా స్రవంతి ❤️ - by Takulsajal - 23-07-2022, 05:08 PM



Users browsing this thread: 26 Guest(s)