07-07-2022, 09:59 AM
(This post was last modified: 19-10-2022, 09:40 PM by Pallaki. Edited 4 times in total. Edited 4 times in total.)
5
రోజులు గడుస్తున్నాయి, బుద్ధిగా పని చేసుకుంటూ క్లాసులు వింటూ ఆదివారాలు ఆశ్రమానికి వెళ్ళొస్తూ ఉండేవాడిని తప్ప అనవసరమైన విషయాలు, గొడవల జోలికి అస్సలు వెళ్ళేవాడిని కాదు.
లెక్కలు బాగా చెయ్యగలడం వల్లేమో గగన్ సార్ తో కొంచెం చనువు ఏర్పడింది, అప్పుడప్పుడు మాట్లాడేవాడిని.
ఖాసీం చాచా కూడా బాగా చూసుకునే వాడు, హాస్టల్ లో సందీప్ వాళ్లందరూ చనువుగానే ఉండేవాళ్ళు. అప్పుడప్పుడు కొంచెం డబ్బుకి ఇబ్బంది పడ్డా నా కష్టం ఎవ్వరికీ తెలియనివ్వలేదు.
ఎన్నో సార్లు బైట అందరిలా తిరగాలని, సినిమాలకి వెళ్లాలని బైట తినాలని అనుకునేవాడిని కానీ డబ్బులు లేక నోరు కట్టేసుకునేవాడిని. రోడ్డు మీద వెళ్లే పెద్ద పెద్ద కార్లు చూసి అస్సలు ఏం చేస్తారు వీళ్ళు అంతంత డబ్బు ఎలా సంపాదిస్తారు అనుకునేవాడిని. అలా నా ఆలోచనల్లోనే నెల దాటింది ఖాసీం చాచా మొదటి నెల జీతంగా ముందు చెప్పినట్టే పదివేలు చేతిలో పెట్టాడు. ఒక రోజు సెలవ అడిగాను.
ఖాసీం : చూడు బేటా.. ఇలా చెపుతున్నాని తప్పుగా అనుకోకు అందరూ జీతం రాగానే పని ఎగ్గొట్టి ఎంజాయ్ చెయ్యాలని చూస్తారు అని చెప్తుండగానే మధ్యలో దూరాను
శివ : లేదు చాచా, నేను సెలవ అడిగింది బ్యాంకులో అకౌంట్ తెరిచి అందులో వెయ్యడానికి అలానే ఇందులో ఐదువేల ఐదు వందలు ఆశ్రమంలో ఉన్న పెద్దమ్మకి ఇవ్వాలి. ఇంత డబ్బు నా చేతిలో పట్టుకోడం ఇదే మొదటి సారి అందుకే భయం వేసి బ్యాంకులో వేద్దామని.
ఖాసీం : అలాగా, అయితే తీసుకో బేటా. ఎలాగో ఈ నెలలో నువ్వు ఒక్క సెలవ కూడా పెట్టలేదు.
తెల్లారే కాలేజీకి కూడా వెళ్ళలేదు బ్యాంకుకి వెళ్లి అకౌంట్ ఓపెన్ చేసి మూడు వేలు అందులో డిపాజిట్ చేసాను మిగిలినవి తీసుకొని ఆశ్రమానికి వెళ్లి పెద్దమ్మకి ఇవ్వాల్సిన డబ్బులు వద్దని వారించినా తన చేతిలో పెట్టాను.
మిగిలిన పదిహేను వందల్లో ఐదు వందలు డొనేషన్ బాక్స్ లో వేసి వెయ్యి నా ఖర్చులకి ఉంచుకున్నాను ఒక ఐదు రోజులకి మిగిలిన ఆ మూడు వేలు కూడా విత్ డ్రా చేసి రెంట్ కట్టాను మళ్ళీ బ్యాంకు అకౌంట్ కాళీ. నిరాశగా అనిపించినా వచ్చే నెల నుంచి ఐదువేలు దాచి పెట్టొచ్చని గుర్తొచ్చాక కొంచెం ఊరట కలిగింది.
ఒకరోజు ఖాసీం చాచా పని మీద బైటికి వెళ్తూ నన్ను కౌంటర్ చూసుకోమని చెప్పి వెళ్ళాడు, నేను కౌంటర్ లో కూర్చున్నాను కొంత సేపటికి లతీఫ్ వచ్చాడు నన్ను చూసి కొంచెం కోపంగా "శివా కౌంటర్ నేను చూసుకుంటాను నువ్వెళ్ళి పని చేసుకో" అన్నాడు.
కొంచెం బాధేసినా నాకు నేనే సర్దిచెప్పుకుని పనిలో పడ్డాను, రాత్రి హోటల్ కట్టేసేటప్పుడు రోజూ లాగే ఖాసీం చాచా లెక్క చూసుకున్నాడు రెండు వేలు తేడా వచ్చింది.
పిలిచి అడిగాడు. భయం వేసింది, నా మొహం చూసి నేను భయపడుతున్నానని అర్ధం చేసుకుని ఏం జరిగిందో తెలుసుకోడానికి cc కెమెరా ఫుటేజ్ చూసి నన్ను చూసాడు.
ఖాసీం : అనుకున్నాను ఇది వీడి పనే అని. చూడు బేటా నేను నీకు కౌంటర్ అప్పగించింది నిన్ను చూసుకోమని అంతే కానీ వేరే వాళ్ళకి ఇవ్వమని కాదు. లతీఫ్ రాగానే ఎందుకు పక్కకి వెళ్లిపోయావ్ ఆ మాత్రం ఆలోచన నాకు లేకా అంతెందుకు ఇంట్లో నా ఆడది లేదు అయినా నిన్నెందుకు కూర్చోపెట్టాను?
బాధ పడకు లతీఫ్ ఇంతక ముందు కూడా ఇలానే చేసాడు ఇక నుంచి జాగ్రత్తగా ఉండు. రేపటి నుంచి కౌంటర్ లో కూర్చుని లెక్కలు చూస్తూ అన్నీ పనులు చేపించు, నువ్వే చూసుకో నేను బిర్యానీ వండేసి వెళ్ళిపోతాను.
శివ : అదేంటి చాచా?
ఖాసీం : వేరొక చోట కొత్త హోటల్ మొదలెట్టబోతున్నాను ఇక్కడ నువ్వు చూసుకో అక్కడ కొత్త కాబట్టి నేను చూసుకుంటాను. (నేనేమి మాట్లాడకపోయేసరికి) ఓకే నా బేటా?
శివ : ఇంకోసారి మీ నమ్మకాన్ని అస్సలు పోగొట్టుకొను చాచా.
ఖాసీం : ఖుషి కా బాత్.. సరే వెళ్ళు ఇప్పటికే ఆలస్యం అయ్యింది.
హాస్టల్ కి నడుచుకుంటూ వెళ్తున్న నాకు కొంచెం గర్వంగా కొంచెం బాధగా అనిపించింది, అస్సలు ఇవన్నీ పక్కకి పెడితే ఎందుకో నాకొక ఫ్యామిలీనో ఒక ఫ్రెండో ఏమో ఏమి కావాలో తెలియడంలేదు కానీ మనసు ఒక తోడు కోరుకుంటుంది. పెద్దమ్మ దెగ్గరికి వెళ్ళిపోదాం అనిపించింది.