03-07-2022, 02:34 PM
(This post was last modified: 19-10-2022, 09:33 PM by Takulsajal. Edited 6 times in total. Edited 6 times in total.)
1
తెల్లవారక ముందే లేచి కూర్చున్నాను, అస్సలు రాత్రంతా నిద్ర పడితే కదా ఒకటే భయం, ఇవ్వాల్టితొ నా ఈ ప్రపంచంలోనుంచి బైటికి వెళ్తున్నాను, వెళ్ళాలి. నా పేరు శివ, ఈ అనాధ ఆశ్రమం నడిపే కావేరి పెద్దమ్మ పెట్టింది నాకా పేరు.
ఈ ఆశ్రమం మొదలయ్యింది నాతోనే, నేను తనకి దొరికాకే పెద్దమ్మకి అనాధ ఆశ్రమం పెట్టాలన్న ఆలోచన వచ్చింది. పెద్దమ్మ చేతుల్లోనే పెరిగినా తన ఇంట్లో ఉండలేక బైటికి వచ్చేసాను. అందరికంటే నన్ను కొంచెం ముద్దు చేసినా అందరికంటే పెద్దవాణ్ని అవటం వల్ల పనులు, బాధ్యతలు కూడా ఎక్కువగానే ఉండేవి.
ఇప్పుడు నేను ఈ ప్రపంచంలోనుంచి బైటికెళ్లే సమయం వచ్చింది, ఇప్పటికే ఇక్కడ వందకు పైగా పిల్లలు ఉన్నారు. పెద్దమ్మకి ఇప్పటికే చాలా కష్టంగా ఉంది ఇక నేను ఇక్కడ ఉండదలుచుకోలేదు అందుకే నిన్నే వెళ్లి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో చేరాను, ఆ కాలేజీ పక్కనే ఉన్న హోటల్లో పని కూడా దొరికింది.
ఆయన పేరు ఖాసీం, నా వృత్తాంతం అంతా ఆయనకి వివరిస్తే ఒప్పుకుని నన్ను పనిలో పెట్టుకున్నాడు. ఉండటానికి చిన్న హాస్టల్ కూడా చూసుకున్నాను, నెలకి మూడు వేలకి చిన్న రూమ్ ఇచ్చారు. రూములో నాతో పాటు ఇద్దరు, భోజనం వాళ్లదె, ఆదివారం మాత్రం మధ్యాహ్నం చికెన్ రాత్రికి మాములు భోజనం విత్ స్వీట్. పెద్దమ్మ దెగ్గర తీసుకున్న ఐదు వేలలో మూడు వేలు కట్టేసి జాయిన్ అయ్యాను.
మెలుకువ వచ్చి కళ్ళు తెరవగానే ఇవే నాకు గుర్తొచ్చిన నిన్నటి విషయాలు. లేచి పక్క మడతేసి, చెట్లకి నీళ్లు పట్టి అలానే కొన్ని కొత్త మొక్కలు నాటి శుభ్రంగా స్నానం చేసి పెద్దమ్మ రాకకోసం ఎదురు చూస్తున్నాను.
ఎనిమిదింటికల్లా పెద్దమ్మ వచ్చింది, నన్ను చూసి నా దెగ్గరికి వచ్చింది. ఇద్దరం కలిసి టిఫిన్ చేసాం.
పెద్దమ్మ : వెళుతున్నావా?
శివ : అవును పెద్దమ్మ.
పెద్దమ్మ : నా మాట వినవా నువ్వు, నువ్వు లేకుండా
శివ : లేదు పెద్దమ్మ ఇప్పటికే నీకు చాలా కష్టంగా ఉంది నిన్ను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు, ఇప్పుడు ఈ ఆశ్రమానికి ఇంకో చెయ్యి అవసరం ఉంది, ఆ చెయ్యి నేనే కావాలని ఆశీర్వదించు పెద్దమ్మా అంటూ కాళ్ళు పట్టుకున్నాను.
పెద్దమ్మ : ఆయుష్మాన్భవ అంటూ నన్ను ఆశీర్వాదించి జాగ్రత్త అంటూ నా నుదిటి మీద ముద్దు ఇచ్చింది.
పెద్దమ్మ కళ్ళలో నీళ్లు చూడలేక ఇక అక్కడ నుంచి సెలవ తీసుకుని పిల్లలందరికి చివరి సారి జాగ్రత్తలు, వాళ్ళు చెయ్యవలసిన పనులు అన్నీ చెప్పి బైటికి బైలుదేరాను చిన్న బ్యాగుతొ.
ఇన్ని సంవత్సరాలు నాతో కలిసి ఉన్న పిల్లలు కదా కొంచెం బాధ పడ్డారు, అప్పుడప్పుడు వస్తానని మాట ఇచ్చి ఆశ్రమం నుంచి మొదటి అడుగు బైటికి వేసాను అలానే ఒక సారి వెనక్కి తిరిగి కావేరి అనాధ ఆశ్రమం అన్న బోర్డు చూస్తూ.