11-06-2022, 03:37 PM
(This post was last modified: 11-06-2022, 03:40 PM by Pallaki. Edited 1 time in total. Edited 1 time in total.)
అమాయక పిచ్చి కష్టజీవి
సాయంత్రం నాలుగు గంటలు అవుతుంది బీచ్ లో తల కింద రెండు చేతులు పెట్టుకుని కాలు మీద కాలు వేసుకుని, మొహానికి ఎండ తగలకుండా న్యూస్ పేపర్ అడ్డం పెట్టుకున్న నన్ను లేపడానికి విశ్వప్రయత్నం చేస్తున్నాడు.
కిషోర్ : రేయ్ కార్తీ లేవరా నీకోసం ఏంచిన పల్లీలు తెచ్చాను లే..
కార్తి : "దానికి నన్ను లేపడం దేనికి, ఇదిగో నా చెయ్యి" అని చెయ్యి ఎత్తాను "ఇందులో పోయి" అంటూ.
వాడు పల్లీలు పోసిన వెంటనే మొహం మీద ఉన్న న్యూస్ పేపర్ తీసి నోట్లో పోసుకుని మళ్ళీ కప్పేసాను.
కిషోర్ : ఇంకెంతసేపు రా బాబు ఇవ్వాళ, అస్సలే ఇవ్వాళ మా బాబు బర్తడే మంచి గిఫ్ట్ ఒకటి ఇచ్చి రిటర్న్ గిఫ్ట్ గా ఆస్తి అడగాలి, మంచి ఐడియా ఉంటే చెప్పు.
కార్తి : మీ నాన్న బర్తడే నా ఇవ్వాళ, నా తరపున కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పు మీ నాన్నకి.
కిషోర్ : ఎంట్రోయ్ ఇవ్వాళ తెలుగు తెగ పలుకుతుంది నీ నోటి నుంచి.
కార్తి : పలకనీ ఈ తెలుగు మన జీవితానికి వెలుగు లాంటిది ఎంత పలికితే అంత మధురం.
కిషోర్ : అలాగే వేమన గారు, కొంచెం ఆ న్యూస్ పేపర్ పక్కన పెడితే మా నాన్నకి గిఫ్ట్ ఏమివ్వాలో ఆలోచించు.
కార్తి : గిఫ్ట్ దేముంది ఏదిచ్చినా తీసుకుంటారు అమాయక పిచ్చి కష్ట జీవులు.
కిషోర్ : ఏంట్రా అంత మాట అన్నావ్?
కార్తి : మరీ...
నిలబెట్టి నడిపిస్తాడు
వంగోని వీపు మీద ఎక్కించుకుంటాడు
అమ్మ కొట్టబోతే అడ్డం పడతాడు
తప్పు చేస్తే కనీసం గట్టిగా మందలించలేడు
ఆస్తులు ఆనందాలు మనకిస్తాడు
కష్టాలు నష్టాలు తనే భరిస్తాడు
ఎంత కష్ట పడినా నవ్వుతూ ఏదోరొచ్చిన బిడ్డని చూస్తే అన్నీ మర్చిపోతాడు
చిన్న ర్యాంకు సాధిస్తే తెగ ఆనంద పడిపోతాడు
వయసు మీద పడ్డా తన బాధలు తనలోనే దాచుకుంటాడు
పోయేటప్పుడు కూడా నన్ను చిరునవ్వుతోనే చూసి పోయాడు
ఆ నవ్వులో నీకేం కాదు నేను లేకపోయినా అన్నీ సర్దుకుంటాయి అన్న భరోసా ఇచ్చి పోయాడు
ఆ మహానుభావుడు
కిషోర్ : ఏంట్రా ఏదేదో మాట్లాడుతున్నావ్?
కార్తి : నేను మా నాన్న గురించి మాట్లాడుతున్నాను, మీ నాన్న కూడా అలానే అయితే వెళ్లి ఒక హాగ్ ఇవ్వు చాలు.
కిషోర్ : ఐడియా చెప్పమంటే ఏదేదో సొల్లు వాగుడు వాగుతావేంట్రా?
కార్తి : ఐడియాస్ ఏం లెవ్వు ఐడియాలాజి మాత్రమే ఉంది నీకు అర్ధంకాడానికి కొంచెం టైం పడుతుంది.
కిషోర్ : ఏంటో వీడు మాట్లాడే ఒక్క మాట కూడా అర్ధం కాదు, నేను వెళ్తున్నా నా పాట్లేవో నేనే పడతా బాయ్..
కార్తి : మళ్ళీ కలుద్దాం.
తిరిగి న్యూస్ పేపర్ మొహానికి అడ్డు పెట్టుకుని కళ్ళు మూసుకుని పడుకున్నాను.