05-12-2021, 07:28 AM
(01-07-2020, 06:57 PM)sarit11 Wrote:సార్,మన తెలుగు గురించి కొంత తెలుసుకుందాము
వేరొక site లో చదివిన ఈ ఆర్టికల్ నాకు చాలా నచ్చింది. అది మీతో పంచుకోవాలని ఇక్కడ పెడుతున్నాను.
చిన్నయ సూరి – గిడుగు రామమూర్తి
చిన్నయ సూరి, గిడుగు రామమూర్తి ఈ రెండు పేర్లూ ఆధునిక కాలంలో తెలుగు భాష చరిత్రలో చాలా పెద్ద పేర్లు. వీళ్లిద్దరి రచనలూ ఏ సందర్భంలో ప్రచారం లోకి వచ్చాయో పరిశీలించడం, వాటివల్ల ఆధునిక వచన రచనకి లాభం కలిగిందా, నష్టం కలిగిందా? అన్న విషయం చర్చించడం, ఈ వ్యాసంలో ఉద్దేశించిన పని. సూరిగారి అభిప్రాయాలు, రామమూర్తి పంతులుగారి అభిప్రాయాలు ఒకదానికొకటి విరుద్ధంగా ఉంటాయి.
ఈ వైరుధ్యం ఆధునిక కాలంలో గ్రాంథిక, వ్యావహారిక భాషా వైరుధ్యంగా వ్యక్తమయింది. చిన్నయ సూరిగారు గ్రాంథిక భాషావాదిగా, రామమూర్తిగారు వ్యావహారిక భాషావాదిగా మన మనస్సుల్లో స్థిరపడిపోయారు. ఈ మాటలు ఈ కాలంలో ప్రచారం లోకి వచ్చిన మాటలు. ఈ రెండు రకాల భాషలకీ వైరుధ్యం ఏర్పడిన రోజులలో అమలులో ఉన్న మాటలు ఒకసారి చూద్దాం. చిన్నయ సూరి ఉద్దేశంలో వ్యాకరణ యుక్తమైన భాష లాక్షణిక భాష (భాషకి లక్షణాన్ని చెప్పేది వ్యాకరణం కాబట్టి). లక్షణ విరుద్ధమైన భాష గ్రామ్యము. గిడుగు రామమూర్తి పంతులుగారి దృష్టిలో ఈ లాక్షణిక భాష పాత పుస్తకాల్లోనే కనిపిస్తుంది. పుస్తకాలకే పరిమితమైన భాష కాబట్టి అది గ్రాంథిక భాష. ఆయన కోరుకున్న భాషకి ఆయన పెట్టిన పేరు వ్యావహారిక భాష.
20వ శతాబ్దిలో భాష విషయంలో తీవ్రమైన వాగ్యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఈ రెండు జంటల మాటలూ అమలులో వుండేవి.
లాక్షణికభాష X గ్రామ్య భాష
గ్రాంథిక భాష X వ్యావహారిక భాష
ఈ రెండు జంటల పేర్లలో రెండవ జంట పేర్లే ప్రచారంలోకి వచ్చి మొదటి జంట పేర్లు కనుమరుగయి పోయాయి. అంటే లాక్షణిక భాషావాదులు ఓడిపోయారని అర్థం.
ఈ కాలానికి పూర్వం తెలుగుకి వ్యాకరణాలు సంస్కృతంలో ఉండేవి. నన్నయ రాశాడని చెప్పబడుతున్న ఆంధ్రశబ్దచింతామణి (దీనికే నన్నయభట్టీయం అని పేరు), త్రిలింగశబ్దానుశాసనము, అహోబల పండితీయము, ఆంధ్రకౌముది, మొదలైనవి అన్నీ సంస్కృతంలో రాయబడ్డాయి.
తెలుగులో వచ్చిన ఒకే ఒక్క వ్యాకరణం కేతన ఆంధ్రభాషాభూషణం. దీనికి శాస్త్రగౌరవం కలగలేదు. 19వ శతాబ్దిలో కుంఫిణీ ప్రభుత్వం వాళ్ళు తమ ఉద్యోగస్తులకు తెలుగు నేర్పాలి అనుకున్నారు. కాబట్టి, ఇంగ్లీషులో రాసిన తెలుగు వ్యాకరణాలు వచ్చాయి. ఉదాహరణకి, విలియం కేరీ (William Carey, 1814), కేంప్‌బెల్ (A.D. Campbell, 1816), విలియం బ్రౌన్ (William Brown, 1820), మారిస్ (J.C. Morris, 1823), సి.పి.బ్రౌన్ (C.P. Brown, 1840) రాసిన వ్యాకరణాలు. వీళ్ళల్లో బ్రౌన్ ముఖ్యమైనవాడు. అప్పటి కచేరీల్లోనూ, కోర్టుల్లోనూ, అర్జీల్లోనూ, ఇతర పరిపాలనా వ్యవహారాల్లోనూ వాడుకలో వున్న తెలుగు భాష బ్రౌన్ వ్యాకరణంలో కనిపిస్తుంది.
వేదం పట్టాభిరామరావు లాంటి తొలినాటి పండితులు తెలుగులో రాసిన తెలుగు వ్యాకరణాలలో ఆ రకమైన భాష కనిపించదు. బ్రౌన్ వ్యాకరణంలో వున్న భాషకి ఒక పేరు లేదు. నిజానికి పండితులు ఆ భాషే మాట్లాడేవారు. కాని, ఇంగ్లీషు ఉద్యోగస్తులు తెలుగు నేర్చుకోవాలని ఈ పండితుల దగ్గరకి వెళ్తే వాళ్లు ఈ తెల్లదొరలకి ఆంధ్రశబ్దచింతామణి చెప్పేవాళ్లు. నిత్య వ్యవహారంలో వున్న భాష పండితుల దృష్టిలో వ్యాకరణం వున్న భాష కాదు. అంటే వాళ్ల దృష్టిలో ఈ భాషకి వ్యాకరణం లేదు. వేరే మాటల్లో చెప్పాలంటే ఈ పండితులకి తాము మాట్లాడే తెలుగు ఎలా నేర్చుకున్నారో తెలియదు. వాళ్లు నేర్చుకున్న భాషే వాళ్లు నేర్పగలరు. అంటే వ్యాకరణమే నేర్పగలరు. (ఇప్పటికీ తెలుగు పరిస్థితి ఇదే.)
పండితుల పాఠాలతో విసిగిపోయిన బ్రౌన్ లాంటి తెల్లవాళ్ళు తమ అనుభవం లోకి వచ్చిన తెలుగుకి కావలసిన వ్యాకరణాలు. నిఘంటువులు వాళ్లే రాసుకున్నారు. వ్యాకరణాలు, నిఘంటువులు తయారు చేసినందుకు కుంఫిణీ నుంచి వారికి చక్కటి పారితోషికం లభించేది కూడా. తెలుగు సొంతభాషగా మాట్లాడుతున్న తెలుగు వాళ్ళకి ఈ వ్యాకరణాలు అక్కరా లేదు, ఇంగ్లీషులో రాసిన అవి వీళ్ళకి అర్థమూ కాలేదు. ఈ పరిస్థితుల్లో మెకాలే’స్ మినిట్ (Macaulay’s minute) అని మనకందరికీ పరిచయమైన పత్రంలో ఉన్న కొత్త ఆలోచన ఇంగ్లీషు పాలకులకి నచ్చింది. మొత్తం పరిపాలన అంతా ఇంగ్లీషులోనే జరపాలని, తెలుగు వాళ్లకే ఇంగ్లీషు నేర్పి వాళ్ళని ఒక రకమైన ఇంగ్లీషు వాళ్లుగా తయారు చేయాలని ఈ కొత్త అభిప్రాయం సారాంశం. దీని ఫలితంగా ఇంగ్లీషు వాళ్లు తెలుగు నేర్చుకోవడం మానేశారు. దానితో పాటు ఇంగ్లీషులో రాసిన తెలుగు వ్యాకరణాలు మరుగున పడిపోయాయి.
మమ్మల్నందరినీ...
ఆనందులు...గా...
మార్చినందులకు...
మిక్కిలి ధన్యవాదములు...