05-09-2021, 12:46 AM
గ్రీకు పురాణ గాథలు 11
పంకజ ప్రాదుర్భావం
The basic theme of mythology is that the visible world is supported and sustained by an invisible world.
– Joseph Campbell
ఎన్నో గ్రీకు పురాణ గాథలలో కొన్నింటిని మాత్రమే ఇంతవరకు మచ్చు చూసేం. ఇక్కడ ప్రస్తావించకుండా దాటేసిన కథలు ఇంకా చాలా ఉన్నాయి. ఈ కథలు అన్నిటిలోను ఉమ్మడిగా కనిపించే అంశాలు: సృష్టి జరిగిన విధానం, ఆ సృష్టిలో మూడు తరాల అమరులు అధికారం కోసం ఒకరితో మరొకరు పోటీ పడడం. ఈ పోటీలో కేవలం ఒక ఆటవస్తువుగా మానవుడి స్థానం.
అమరులలో మొదటితరంవారు ప్రకృతి శక్తులకు అమూర్త్యప్రతీకలుగా (amorphous symbols) కానీ అపరావతారాలుగా (personified concepts) కానీ మాత్రమే కనిపిస్తారు. ఇవే భూమి, ఆకాశం, వాటి కలయిక వల్ల పుట్టిన సముద్రాలు, కొండలు, వింతప్రాణులు, వగైరా. క్రమేపి మూడవ తరానికి వచ్చేసరికి ఒలింపస్ పర్వతం మీద స్థిరనివాసం ఏర్పరచుకున్న అమరులకు అతీంద్రియ శక్తులతోపాటు మానవ ఆకారాలు, మానవ బలహీనతలు వస్తాయి.
ఇలా పురాణ గాథల మీద ఆధారపడ్డ తత్త్వజ్ఞానంతో మన చుట్టూ ఉన్న ప్రపంచం ఇలానే ఎందుకు ఉందో చెప్పడానికి ప్రయత్నం చేసింది అలనాటి ఆ సమాజం. అంటే, ఎదురుగా జరుగుతున్న కార్యానికి వెనకనున్న కారణం ఏమిటో విశదీకరించడానికి ప్రయత్నం చేసింది. ఈ కారణం మానవాతీత శక్తుల ప్రభావం కూడా అయి ఉండవచ్చనే గట్టి నమ్మకం ఒకటి వారిలో ఉండేది. అనగా ప్రతి కర్మ వెనక కర్త ఒకటి ఉంటుందనిన్నీ, ఆ కర్త మానవుడైనా కావచ్చు, అమరలోకంలోఉన్న దేవుడైనా కావచ్చనిన్నీ.
ఉదాహరణకి సముద్రాలకి అధిదేవత అయిన పొసైడన్ (Poseidon) సంగతి చూద్దాం. పెద్ద సముద్రతీరం ఉన్న ప్రాంతం కనుక గ్రీకులకి సముద్రదేవుడు చాల ముఖ్యుడు. ఈ ప్రాముఖ్యత చూపడానికి పొసైడన్ ఆయుధం త్రిశూలం. పొసైడన్‌కి కోపం వచ్చినప్పుడు ఆ త్రిశూలం పట్టుకుని నేలని గట్టిగా గుద్దుతాడు. ఆ తాకిడికి భూమి కంపిస్తుంది. అదే భూకంపం. గ్రీకుల కార్య-కారణ చయనికలో దేవుళ్ళ పాత్ర ఇలా ప్రవేశిస్తుంది. కనుక గ్రీకుల దృక్పథంలో పొసైడన్ సముద్రదేవుడు అవడమే కాకుండా భూకంపాలకి కారకుడు కూడా! ఈ కోణంలో చూస్తే ప్రాచీన కాలపు గ్రీసు దేశస్థులకి ఎదుట కనిపిస్తున్న దృగ్విషయం వెనుక ఏదో కారణం ఉండాలనే నమ్మకం ఉండబట్టే ఆ కారణం ఏదో తెలియక కంటికి కనపడని దేవుడిని ఆశ్రయించారు.
ఈ సందర్భంలో హోమర్ తత్త్వజ్ఞానం గురించి మరికొంచెం తెలుసుకుందాం. హోమర్ రచించిన ఇలియడ్, ఆడెసి గ్రంథాలు ప్రాచీన గ్రీకు సంస్కృతికి అద్దం పడతాయి కనుక ఈ రెండింటిని అధ్యయనం చేయడం గ్రీకుల ఆలోచనావిధానాన్ని అర్థంచేసుకోవడానికి కీలకం; ఆ మాటకి వస్తే పాశ్చాత్య నాగరికతని, సృష్టిలో మానవుని స్థానం గురించి వారి ఆలోచనా విధానాన్ని అర్థంచేసుకోవడానికి కూడా కీలకం. భారతీయ విలువలకి, సంస్కృతికి రామాయణ మహాభారతాలు ఎలాంటివో పాశ్చాత్య విలువలకి, సంస్కృతికి ఇలియడ్, ఆడెసిలు అలాంటివి అంటే అతిశయోక్తి కాదు.
ఇలియడ్ లోని ఒకటి, రెండు ముఖ్యమైన అంశాలని తీసుకుని ఆ రోజులలో సృష్టి యొక్క నిజ స్వరూపం వారికి ఎలా అర్థం అయిందో చూద్దాం.
ఒక ప్రశ్నతో మొదలుపెడదాం. ట్రోయ్ యోధుడు హెక్టర్ ఎందుకు చచ్చిపోయాడు? ఏఖిలిస్ చంపేడు కనుక హెక్టర్ చచ్చిపోయాడు!
ఏఖిలిస్ ఎందుకు చంపేడు? స్థూలంగా చెప్పుకోవాలంటే గ్రీసు దేశానికీ ట్రోయ్ దేశానికి మధ్య యుద్ధం జరిగింది కనుక. ప్రత్యేకించి కారణం కావాలంటే పట్రోక్లస్ మరణానికి ప్రతీకారంగా ఏఖిలిస్ హెక్టర్ని చంపేడు.
ఇలా వెతుకుతూ పోతే ప్రతి సంఘటనకి, ప్రతి కార్యానికి వెనక ఒక కారణం కనిపిస్తుంది. లేదా, ఒక కార్య-కారణ చయనిక కనిపిస్తుంది. మరొక మెట్టు పైకి వెళ్లి చూద్దాం.
గ్రీసు దేశం, ట్రోయ్ దేశం ఎందుకు యుద్ధం చెయ్యవలసి వచ్చింది? పేరిస్, హెలెన్ ప్రేమలో పడ్డారు కనుక. తన భార్య మరొకని యెడల అనురాగం చూపుతున్నదని ప్రతీకార జ్వాలలతో మెనలౌస్ మండిపడుతున్న కారణంగా. ఆగమెమ్నాన్ అధికారదాహం ఎక్కువ అయిన కారణంగా. ఏఖిలిస్‌కి కీర్తి కాంక్ష ఎక్కువయి.
ఇలా ఈ జాబితాని పొడిగించుకుంటూ పోవచ్చు. హోమర్ దృక్‌క్షేత్రంలో మానవుడు చేసే కృత్యాలకి ప్రేరణ కారణాలు అనేకం: ప్రేమ, ప్రతీకారం, అధికారదాహం, కీర్తి.
పైన ఉదహరించిన కార్య-కారణ చయనిక మానవ ప్రపంచంలో సహజం అని మనం సంతృప్తి పడవచ్చు. ఒక సంక్లిష్టమైన అంతర్నాటకంలో మానవుల కోరికలు, వాటి ప్రేరేపణలు, తద్వారా జరిగే చర్యలు, ప్రతిచర్యలు కారణంగానే ట్రోయ్ యుద్ధం లాంటి సమరాలు, హెక్టర్ మరణం లాంటి సందర్భాలు ఎదురవుతాయి. కానీ హోమర్ చెప్పిన కథ ఇంత సజావుగా సాగదు; ఎందుకంటే ఆ కథ అల్లికలో దేవుళ్ళకి కూడా ప్రముఖమైన పాత్ర ఉంది. హెక్టర్‌కి ఏఖిలిస్‌కి మధ్య భీకరపోరాటం జరగబోయే ముందు హోమర్ కథాగమనాన్ని దేవుళ్ళ వైపు తిప్పుతాడు. వారంతా జరుగుతున్న కార్యక్రమాన్ని స్వర్గంలో కూర్చుని చూస్తూ ఉంటారు, ఇద్దరు ప్రత్యర్థుల మధ్య జరుగుతున్న చదరంగపు పోటీని బయట నుండి ప్రేక్షకులు చూస్తున్నట్లు. కానీ తటస్థంగా ఉండరు; ఇరు పక్షాలని సమర్థిస్తూ, వాళ్ళకి సలహాలు ఇస్తూ, వారి ఆటలలో కలుగజేసుకుంటూ ఉంటారు. హెక్టర్‌ని తరుముతున్న ఏఖిలిస్‌ని చూసి జూస్ ఒక పక్క ఏఖిలిస్ ధైర్య సాహసాలని మెచ్చుకుంటూ, మరొక పక్క ప్రేమానుబంధంతో హెక్టర్‌ని సమర్థిస్తూ ఉంటాడు. తాను ఎవరి పక్షం కాయాలి? తన్యతని భరించలేక ఇతరులని సలహా ఇమ్మని కోరతాడు.
Quote:“Come you immortals, think this through. Decide.ఎథేనా సలహా మేరకు హెక్టర్ చావుకే సమ్మతిస్తాడు, జూస్.
Either we pluck the man from death and save his life
or strike him down at last, here at Achilles’ hands.” (22:206-209)
Quote:“Go. Do as your own impulse bids you. Hold back no more.”
So he launched Athena already poised for action —
down the goddess swept from Olympus’ craggy peaks. (22: 200-223)
ఇలా గ్రీకు దేవతలు మానవులని చదరంగంలోని పావులలా వాడుకుని ఆటలు ఆడుకున్నారు. వారికి శక్తియుక్తులు ఉన్నాయేమో కాని శీలసంపద ఉన్నట్లు కనిపించదు. అటువంటి దేవతలకి సహజాతీతమైన, ఆధిదైవిక (supernatural) శక్తులు ఉన్నాయని నమ్మి, వారిని ఆరాధించిన గ్రీకు ప్రజానీకానికి మంత్రమహిమల మీద, దేవుళ్ళు ఇచ్చే వరాల మీద, శాపాల మీదా నమ్మకం ఉన్నట్లు కనిపిస్తుంది.
ఈ కాలపు ఆధునిక వైజ్ఞానిక, హేతువాద దృక్పథంతో చూస్తే వారిది చాల వెనకబడ్డ సమాజంలా అనిపిస్తుంది. ఇటువంటి ‘వెనకబడ్డ’ సమాజం అకస్మాత్తుగా సా. శ. పూ. 5వ శతాబ్దం వచ్చేసరికి ఒక్కసారి ఉలిక్కిపడి మేలుకున్నదా అనిపిస్తుంది. ఎందుకంటే నేడు ప్రపంచం నలుమూలల ప్రజ్వరిల్లుతున్న ఆధునిక, శాస్త్రీయ, తార్కిక దృక్పథానికి పునాదులు గ్రీసు దేశంలోనే పడ్డాయి. పంకిలమైన బురద భూమిలో ఈ పద్మం ఎలా పుట్టుకొచ్చింది? ఈ మార్పు ఏ పరిస్థితులలో జరిగిందో ఇటుపైన విచారిద్దాం.