Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
గ్రీకు పురాణ గాథలు
#27
గ్రీకు పురాణ గాథలు 10
 

రాజుగారివి గాడిద చెవులు

నేను చిన్నప్పుడు పత్రికలలో (చందమామ, బాల, బాలమిత్ర) చదివిన కథలన్నిటిలోను నాకు స్పష్టంగా జ్ఞాపకం ఉన్న కథ ‘రాజుగారివి గాడిద చెవులు’ కథ అంటే అది అతిశయోక్తి అవదు. ఇది గ్రీకు పురాణ కథలలో ఒకటన్న విషయం నాకు ఈనాడే తెలిసింది!

గ్రీకు పురాణ కథలలో పేరెన్నికగన్న కథ ఫ్రిజియా (Phrygia) అనే రాజ్యానికి రాజు అయిన మైడస్ (Midas) కథ. గ్రీకు పురాణ కథా చక్రాలలో మైడస్ గురించి రెండు విభిన్నమైన కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఒవిడ్ (Ovid) రాసిన మెటమార్ఫసిస్‌ (Metamorphosis)లో మైడస్ గురించిన కథలు మనకి కనిపిస్తాయి. ఆ రెండు కథలు ఇక్కడ చెబుతాను.


[Image: silenus.jpg]


గ్రీకు పురాణ కథలలో కనిపించే సేటర్ (satyr) అనేది ఒక నరాశ్వం. అనగా కొంత భాగం మనిషి రూపం, కొంత భాగం గుర్రం రూపం. ఇలాంటి స్వరూపాలనే మన పురాణాలలో కిన్నరులు (అశ్వ ముఖము, నర శరీరము కలవారు), కింపురుషులు (నర ముఖము, అశ్వ శరీరము కలవారు) అని వర్ణించేరు. సిలెనస్ (Silenus) అనే పేరు గల ఒక నరాశ్వం గ్రీకు దేవుడు డయోనిసస్ (Dionysus) సహచర్యంలో కనబడుతూ ఉంటాడు. ఒక రోజు సిలెనస్ తప్పతాగేసి రాజుగారి తోటలో పడిపోతాడు. రాజభటులు అతనిని రాజు దగ్గరకి తీసుకెళతారు. మైడస్ సిలెనస్‌ని గుర్తుపట్టి పది రోజులపాటు సపర్యలు చేస్తాడు. మైడస్ చేసిన సహాయానికి ముగ్ధుడైన డయోనిసస్ ప్రతిఫలంగా మైడస్‌ని ఒక వరం కోరుకోమని చెబుతాడు. దూరాలోచన లేకుండా తాను పట్టిందల్లా బంగారం అయిపోవాలి అని కోరుకుంటాడు మైడస్.


[Image: midastouch.jpg]


ఇక్కడ నుండి కథని ఎవరికి నచ్చిన విధంగా వారు నడిపించవచ్చు. నథేనియల్ హాతోర్న్ చెప్పిన కథలో, మైడస్ స్పర్శ వల్ల ఉద్యానవనంలో గులాబీలు పరిమళం లేని పసిడి పువ్వులుగా మారిపోయాయని, అందువల్ల మైడస్ కూతురు ఏడిచిందని, ఏడుస్తున్న కూతురుని సముదాయించడానికి మైడస్ ఆమెని చేరదీసేసరికి ఆ అమ్మాయి బంగారు విగ్రహంగా మారిపోయిందని ఉంది. మరొక కథనంలో పళ్లెంలో ఉన్న భోజన పదార్థాలు ముట్టుకునేసరికల్లా భోజనం బంగారం అయిపోతుంది. మైడస్ ఆకలితో అలమటించిపోతాడు. కారణం ఏదయినా చేసిన తప్పు తెలుసుకుని మైడస్ పశ్చాత్తాపపడతాడు. డయోనిసస్ కనికరించి పాక్టోలస్ నదిలో గ్రుంకులిడితే వరం యొక్క ప్రభావం సడలిపోతుందని ఉపశమన మార్గం చెబుతాడు. (ఈ నది టర్కీలోని సార్డిస్ దగ్గర ఉంది.) మైడస్ ఆ నదిలో ములిగేసరికల్లా ఆ వరం యొక్క ప్రభావం మైడస్ నుండి నదిలోని నీళ్ళల్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పటికీ ఆ నదిలోని ఒండ్రుమట్టిలో బంగారం నలుసులు కనబడుతూ ఉండడానికి కారణం ఆనాటి మైడస్ స్పర్శే అని ప్రజలలో ఒక నమ్మకం ఉంది.


[Image: apollo_midas.jpg]


మైడస్‌కి సంబంధించిన కథ మరొకటి ఉంది. సువర్ణ స్పర్శ వల్ల జరిగిన పరాభవానికి ఒకింత చింతించి మైడస్ కోటగోడలు దాటి బయట ఉన్న పచ్చిక బయళ్లలో తిరుగుతూ ఉంటాడు. అడవులకి, కొండలకి, పచ్చిక బయళ్ళకి అధినేత అయిన పాన్ (Pan) అనే ఒక నరమేషం వాయిస్తున్న పిల్లనగ్రోవి సంగీతానికి మైడస్ ముగ్ధుడవుతాడు. ఒకసారి అపాలోకి పాన్‌కి మధ్య సంగీతం పోటీ జరుగుతుంది. ఈ పోటీలో గెలుపెవరిదో నిశ్చయించడానికి నియమించబడ్డ నిర్ణేతగణంలో మైడస్ ఒక నిర్ణేత. మిగిలిన నిర్ణేతలంతా అపాలో సంగీతమే గొప్పగా ఉందంటే మైడస్ మాత్రం వ్యతిరేకంగా వెళ్లి పాన్‌ని సమర్థించడంతో అపాలోకి కోపం వచ్చింది. ‘సంగీత జ్ఞానం లేని మైడస్ చెవులు గాడిద చెవులుగా మారిపోవాలి!’ అని శపిస్తాడు. ఇంకేముంది, మైడస్‌కి మాములు చెవుల స్థానంలో గాడిద చెవులు వస్తాయి. ఎంత అప్రతిష్ట! ప్రజలకి తెలిస్తే పరువు గంగలో కలసిపోతుంది కదా! మైడస్ తలపాగా ధరించడం మొదలుపెట్టేడు. ఎంత రాజైనా తలకాయని మంగలి చేతులలో పడకుండా దాచలేడు కదా. రాజుగారివి గాడిద చెవులు అని మంగలికి తెలిసిపోయింది. మూడో కంటివాడికి ఈ రహస్యం తెలిసిందంటే తల తీయించేస్తానని మైడస్ మంగలిని బెదిరించేడు. రాచరహస్యం! రచ్చకెక్కితే కొంపలంటుకుపోవూ? కడుపులో దాచుకోలేక మంగలి కడుపు ఉబ్బిపోతోంది. ఏమిటి చేస్తాడు? ఏమిటి చెయ్యగలడు? ఎవ్వరికో ఒకరికి చెప్పాలి. తనకి తెలిసిన రహస్యాన్ని ఒక పుట్టలో ఊదేశాడు!

కొన్నాళ్ళకి ఆ పుట్ట మీద వెదురు బొంగులు పెరగడం మొదలెట్టేయి. అవి గాలికి ఇటు అటూ ఊగినప్పుడల్లా, పిల్లనగ్రోవిలో గాలి ఆడినట్లు అయి, అవి ‘రాజుగారివి గాడిద చెవులు’ అని పాట ప్రసారం చెయ్యడం మొదలెట్టేయి!

ఇంతకీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మైడస్ అనే రాజు నిజంగా 3000 సంవత్సరాల క్రితం (అనగా, సు.సా.శ.పూ. 800లో) ఫ్రిజియా (Phrygia) అనే రాజ్యాన్ని పరిపాలించేడనడానికి ఆధారాలు ఉన్నాయి. ఈ ఫ్రిజియా రాజ్యం ప్రస్తుతం టర్కీ ఉన్న ప్రదేశంలో ఉండేది. ఇటీవల, అనగా సా. శ. 1957లో, పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంవారు గోర్డియన్‌లో (Gordion) జరిపిన తవ్వకాలలో మైడస్ తండ్రి గోర్డియోస్ (Gordios) యొక్క శ్మశానవాటిక కనబడింది. అక్కడ శవపేటికలో కనిపించిన అస్థిపంజరం, దానిచుట్టూ ఉత్తరక్రియలకి సంబంధించిన విందుభోజన సామాగ్రి కనిపించేయిట.

మరయితే మైడస్ పట్టినవన్నీ నిజంగా బంగారం అయిపోయేవా? ఆనాటి దుస్తుల్ని విశ్లేషించి చూస్తే వాటన్నిటికీ ఎరుపు డాలు ఉండడాన్ని బట్టి అవి మూడొంతులు అయోభస్మం (తుప్పు లేదా oxide of iron) రంగు అయి ఉండవచ్చని భావిస్తున్నారు. ఆ రంగుని చూసి బంగారం అనుకుని ఆ కథ సృష్టించి ఉండవచ్చు. మరి గాడిద చెవుల మాట? ఈ సంశయాన్ని తీర్చటానికి ఆధునిక శాస్త్రీయ పరిజ్ఞానం సరిపోదు.


[Image: gordian.jpg]


ఈ కథ ముగించేలోగా మైడస్ తండ్రి గోర్డియోస్ గురించి చిన్న పిట్టకథ ఒకటి అప్రస్తుతం కాదు. ఫ్రిజియా రాజ్యానికి ఒకప్పుడు రాజులేకుండా అయిపోయింది. అప్పుడు టెల్మిసస్‌లో (Telmissus) ఉన్న ఒరాకిల్, ‘రాజ్యంలోకి ఎవరైతే మొట్టమొదట ఎడ్లబండిని తోలుకుంటూ వస్తారో వారే ఫ్రిజియా రాజ్యానికి రాజు’ అని జోస్యం చెప్పింది. గోర్డియోస్ అనే పేరు గల ఒక రైతు ఎడ్లబండిని తోలుకుంటూ ఊళ్లోకి రాగానే అతనికి పట్టాభిషేకం చేసేసేరు. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనకి కృతజ్ఞతగా మైడస్ ఆ బండిని ఆ ఒరాకిల్ ఆలయంలో ఒక స్తంభానికి పెద్ద మోకుతో గట్టిగా ముడివేసి కట్టేసేడు. ముడి మీద ముడివేసి ఎంత గట్టిగా కట్టేడంటే దానిని విప్పడానికి ఎవ్వరి తరంకాలేదు. నాలుగు వందల సంవత్సరాల తరువాత, సుమారు సా.శ.పూ. 400లో, అలెగ్జాండర్ ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు ఆ బ్రహ్మముడి ఇంకా అలానే ఉంది. ఆ ముడి ఎవ్వరు విప్పుతారో ఆ వ్యక్తి ఆసియా అంతటికి సార్వభౌముడు అవుతాడని అక్కడ ఒరాకిల్ జోస్యం చెప్పింది. ఈ మాట విని అలెగ్జాండర్ ఆ ముడిని విప్పడానికి ప్రయత్నించి మొదట విఫలం అవుతాడు. అప్పుడు ‘ముడి విప్పడం ముఖ్యం కానీ ఎలా విప్పేమన్నది ప్రధానం కాదు’ అంటూ తన కరవాలం తీసుకుని ఒక్క వేటులో ఆ ముడిని రెండు ముక్కలు చేసి విప్పేడుట. ఎప్పటికీ పరిష్కారం దొరకకుండా ఏళ్ల తరబడి వేధిస్తున్న సమస్యని ఎవరైనా ఒక్క వేటులో పరిష్కరిస్తే ‘గోర్డియన్ ముడిని విప్పినట్లు’ (untying the Gordian knot) అనే నుడికారాన్ని వాడతారు.

[+] 1 user Likes WriterX's post
Like Reply


Messages In This Thread
RE: గ్రీకు పురాణ గాథలు - by WriterX - 05-09-2021, 12:27 AM



Users browsing this thread: 3 Guest(s)