Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
గ్రీకు పురాణ గాథలు
#19
క్రీసస్ ఉదంతం


ద్వాదశ ఒలింపియను దేవతలలో అపాలో ఒకడు. అతనికి వచ్చిన అనేక విద్యలలో దివ్యదృష్టి ఒకటి; అతను భవిష్యత్తులోకి చూసి ఏమి జరగబోతోందో చెప్పగల సమర్థుడు. ఒలింపియను దేవతలలో చాలమందికి ఈ రకం దివ్యదృష్టి ఉంది కానీ ఒక్క అపాలో మాత్రమే ఈ విద్యని మానవులతో పంచుకోడానికి సుముఖత చూపేవాడు. ఇందుకని అపాలో అనేక మందిరాలు స్థాపించి, ప్రతి మందిరంలోనూ ఒరాకిల్ (Oracle) అనే ఒక దివ్యవాణిని ప్రతిష్ఠ చేసేడు. ఒరాకిల్ అంటే సర్వజ్ఞుడు, ద్రష్ట, ప్రవక్త అనే అర్థాలు చెప్పుకోవచ్చు. ఈ ఒరాకిల్ అనేది ఒకరి ఒంటి మీదికి ఆవహించి వారి నోట పలికే భవిష్యవాణి. మన దేశంలోనూ గణాచారుల ఒంటి మీదికి అమ్మవారు రావడం (పూనకం రావడం), ఏదైనా చెప్పడం ఉన్నాయి. ఇప్పటికీ సమ్మక్క జాతరలో ఇలా అమ్మవారు ఒంటి మీదకు వచ్చి ప్రజలకు సందేశం ఇవ్వడం జరుగుతూనే ఉంది. అపాలో స్థాపించిన ఇటువంటి మందిరాలలో డెల్ఫైలో (Delphi) ఉన్న మందిరం ప్రసిద్ధి చెందినది. ఈ డెల్ఫై మందిరంలో ఉన్న గణాచారిణి పేరు పైథియా (Pythea). పెద్దలు, పిన్నలు, రాజులు, పేదలు, ఇలా అనేక మంది డెల్ఫైకి వచ్చి వాళ్ళకి భవిష్యత్తులో ఏమి ‘రాసిపెట్టి ఉందో’ చెప్పమని దివ్యవాణిని అర్థించడం, దివ్యవాణి వారి కోరికని పైథియా వాక్కు ద్వారా మన్నించడం జరుగుతూనే ఉంటుంది.

[Image: delphi.jpg]


ఇలా డెల్ఫైలో ఉన్న ఒరాకిల్‍ని సంప్రదించడానికి వచ్చిన వారిలో సాక్షాత్తూ లిడియా దేశపు రాజు క్రీసస్ (Croesus) ఒకడు. హిరాడటస్ (Herodotus) రాసిన చరిత్ర ప్రకారం లిడియా రాజ్యాన్ని క్రీసస్ 14 సంవత్సరాలు పరిపాలించేడు (సుమారు సా. శ. పూ. 595 నుండి 546 వరకు). అనగా క్రీసస్ నిజంగా చరిత్రలో ఒక మానవుడు. క్రీసస్ అత్యంత ధనవంతుడు. అతను ఎంత ధనవంతుడంటే ఇప్పటికీ ‘వాడు క్రీసస్ అంత ధనవంతుడు’ అనే నానుడి పాశ్చాత్య భాషలలో ఉంది.

క్రీసస్ అంత ధనవంతుడు అవడానికి రెండు కారణాలు ఉండే సావకాశం ఉంది. లిడియా రాజ్యానికి ముఖ్యపట్టణం అయిన సార్డిస్ గుండా పాక్టోలస్ (Pactolus) అనే నది ప్రవహిస్తోంది. ఆ నదీ గర్భంలో ఉన్న ఒండ్రుమట్టిలో వెండి, బంగారం కలిసిన మిశ్రమ లోహం దొరుకుతుంది. రాజు మైడస్ (Midas) ఈ పాక్టోలస్‌లో స్నానంచేసి తాను పట్టిందల్లా బంగారంగా మారుతున్న ‘వరం’ నుండి విముక్తి పొందేడు అనే ఒక కథ ఉంది. అదే ఈ బంగారానికి కారణం అంటారు. నిజానికి క్రీసస్ అంత ధనవంతుడు అవడానికి అతని సామంతులు కట్టే కప్పాలు కూడా కారణం కావచ్చు.

క్రీసస్ తనకున్న ఐశ్వర్యంతో తృప్తి పొందలేదు. ఎందుకు పుట్టిందో, ఎలా పుట్టిందో కానీ పశ్చిమ ఆసియాలో ఏకఛత్రాధిపత్యంతో అలరారుతున్న పారశీక సామ్రాజ్యంపై దండెత్తి ఆ రాజ్యాన్ని తన వశం చేసుకోవాలనే బుద్ధి అతని పుర్రెలో పుట్టింది. ఈ రోజుల్లో అమెరికా ఎలాంటిదో ఆ రోజుల్లో సైరస్ (Cyrus, the Great) చక్రవర్తి పరిపాలనలో ఉన్న పారశీక సామ్రాజ్యం అంత శక్తిమంతమైన దేశం!

బుద్ధి పుట్టడం పుట్టింది కానీ క్రీసస్ మనస్సు పీకుతోంది. యుద్ధం ముగిసే వరకు పర్యవసానం ఎలా ఉంటుందో తెలియదు కదా. అందుకని డెల్ఫైలో ఉన్న ఒరాకిల్‍ని అడిగి తెలుసుకురమ్మని కానుకలు ఇచ్చి ప్రత్యేక ప్రతినిధిని పంపేడు. క్రీసస్ డెల్ఫైలో ఉన్న ఒరాకిల్‍కి ఇచ్చిన కానుకలు ఆ ఆలయంలో హెరాడొటస్ కాలం వరకు ఉన్నాయిట! క్రీసస్ తరఫున రాయబారులు డెల్ఫైలో ఉన్న ఒరాకిల్‍ని అడిగిన ప్రశ్న: పారశీక దేశం మీదకి క్రీసస్ దండయాత్ర జరిపితే పర్యవసానం ఎలా ఉంటుంది?

ఈ ప్రశ్నకి సమాధానంగా పిథియా ద్వారా ఒరాకిల్ ఇచ్చిన సమాధానం: క్రీసస్ ఒక అద్భుతమైన సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేస్తాడు.

‘దేవుడు మన పక్షం. దండయాత్రకు సంసిద్ధం అవండి!’ అని క్రీసస్ ఆజ్ఞ జారీ చేసేడు. క్రీసస్ సేనావాహిని గట్లు తెంచుకుని పెల్లుబికి ప్రవహించిన నదిలా ఒక్కుమ్మడిగా పారశీక సామ్రాజ్యం మీద విరుచుకుపడింది. పారశీక చక్రవర్తి సైరస్ సైన్యం క్రీసస్‌ని చిత్తుచిత్తుగా ఓడించి క్రీసస్‌ని బందీగా తీసుకుపోయింది. చిట్టచివరికి చావు తప్పి కన్ను లొట్టపోయిన చందాన సైరస్ కొలువులో క్రీసస్ చిన్న గుమస్తా ఉద్యోగం చేస్తూ శేష జీవితం గడిపేడు.

తనని ఈ విధంగా ఓరకిల్ పచ్చి మోసం చేస్తుందని క్రీసస్ కలలో కూడా అనుకోలేదు. ఓరకిల్‌ని ఊరకనే సలహా ఇమ్మని అడగలేదు. బిళ్లకుడుములులా పారితోషికం (లంచం) సమర్పించుకున్నాడు కదా! పట్టపగలు బహిరంగంగా ఇంత పచ్చి మోసమా? మునుపటిలా ఇప్పుడు ఆస్తులు, అంతస్తులు లేవు. అయినా ఉన్న దాంట్లో కాసింత గోకి గోకి చిన్న పారితోషికంతో తోటి గుమస్తాని పంపేడు – జరిగిన అన్యాయానికి కారణం ఏమిటో తెలుసుకు రమ్మని.

తాను రాసిన హిస్టరీ అనే గ్రంథంలో హిరాడొటస్ జరిగిన అన్యాయానికి కారణం ఈ విధంగా చెబుతాడు: డెల్ఫైలో ఉన్న ఒరాకిల్ చెప్పిన జోస్యం ప్రకారం క్రీసస్ పారశీక దేశం మీద దండయాత్ర చేస్తే ఒక మహా సామ్రాజ్యం సర్వనాశనం అయిపోవాలి. ఆ నాశనం అయిపోబోయే సామ్రాజ్యం ఎవరిది? తనదా? శత్రువుదా? అని అడగవలసిన కనీసపు బాధ్యత క్రీసస్‌ది. అధికారంలో ఉన్న పాలకులకి సలహాదారులు సలహాలు ఇచ్చినప్పుడు, ఆ సలహా అమలుపరచితే పర్యవసానం ఎలా ఉంటుంది? అని అడగకుండా ‘లేడికి లేచిందే పయనం’ అన్న రీతిలో రాజ్యం ఏలితే ఇలానే ఉంటుంది. ఇది స్వయంకృతాపరాధం.
క్రీసస్ పరాజయం గ్రీసు దేశపు చరిత్రలో విస్మరించడానికి వీలులేని మైలురాయి.

ప్రచ్ఛన్న అర్థ సందిగ్ధతలతో మాట్లాడడం ఈ నాటి జ్యోతిష్కుల ఆయుధం ఎలాగయిందో అలాగే అలనాటి ఒరాకిల్‌లకి కూడా ఆయుధం అయి ఉండాలి. ఎంత సర్వజ్ఞుడిని అయినా సరే మనం అడిగే ప్రశ్నలు అర్థవంతంగా ఉండాలి, నిర్ద్వంద్వంగా ఉండాలి. సరి అయిన గురి పెట్టి అడగాలి. అదే విధంగా నిష్ణాతులు ఇచ్చే సలహాలని విధివిధానాలుగా మార్చి అవలంబించే ముందు ఆ సలహాల పర్యవసానాన్ని సరిగ్గా అర్థంచేసుకోవడం నేర్చుకోవాలి.

ఈనాటి ప్రభుత్వాలకి ఒరాకిల్‌లు ఎవరు? శాస్త్రవేత్తలు, స్మరణ తటాకాలు, విశ్వవిద్యాలయాల్లో ఉన్నత ఆసనాలు అధిష్టించిన ఆచార్యులు, వగైరాలు. ఈ పిదప కాలపు ఒరాకిల్‌లను ప్రభుత్వాలు అప్పుడప్పుడు, అయిష్టంగానే, సంప్రదిస్తాయి. కొండకచో కొన్ని ఒరాకిల్‌లు అడిగినా, అడగకపోయినా వారి విలువైన అభిప్రాయాలని ఉచితంగా జారీచేస్తూ ఉంటారు: ఆకాశంలో ఓజోన్ పొరలో చిల్లుపడడం వల్ల పర్యావరణం దెబ్బతింటోంది. పర్యావరణం వేడెక్కిపోవడం వల్ల ధ్రువప్రాంతాలలో మంచు కరిగిపోయి దాని వల్ల తీర ప్రాంతాలు ముంపుకి గురి అవుతాయి, వగైరా.

ఈ అభిప్రాయాలైనా సరళమైన, నలుగురికీ అర్థం అయే భాషలో ఉంటాయా? ఉండవు. శాస్త్రీయ పరిభాషలో, సంభావ్యతలు, శాతాలు, గంట ఆకారంలో ఉన్న చిత్రపటాల రూపంలో ఉంటాయి. రాజనీతి తంత్రజ్ఞులు విధివిధానాలని జారీచేసే ముందు ఈ పరిభాషని అర్థం చేసుకుని అప్రమత్తతతో మెలగాలి. ఆ అప్రమత్తతకి శాస్త్రీయ పరిజ్ఞానం, అవగాహన అత్యవసరం. మనం ఎన్నుకున్న ప్రతినిధులలో ఎంతమందికి ఈ రకం శాస్త్రీయ అవగాహన ఉంటోంది?*
Like Reply


Messages In This Thread
RE: గ్రీకు పురాణ గాథలు - by WriterX - 04-09-2021, 11:15 PM



Users browsing this thread: 2 Guest(s)