Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
గ్రీకు పురాణ గాథలు
#18
గ్రీకు పురాణ గాథలు 7
 

కసాండ్రా (Cassandra) కథ

కసాండ్రా గ్రీసు దేశపు పురాణ గాథలలో వచ్చే శాపగ్రస్తురాలైన ఒక వ్యక్తి. భవిష్యత్తులో ఏమి జరగబోతోందో చెప్పగలిగే శక్తి ఉన్న వ్యక్తి ఈమె, ఈ శక్తిని ఈమె అపాలో (Apollo) దగ్గర నేర్చుకుంది. కానీ అపాలో ఇచ్చిన శాపం వల్ల ఈమె మాటని ఎవ్వరూ నమ్మరు. అదెంత ప్రమాదానికి దారితీసిందో ఈ కథలో చూద్దాం.

కసాండ్రా గ్రీసు దేశపు పురాణ గాథలలో వచ్చే ట్రాయ్ నగరపు రాకుమారి. ఈ ఉదంతం ట్రాయ్ సంగ్రామం జరగడానికి ముందు జరిగిన కథ. కసాండ్రా ట్రాయ్ నగరాన్ని పాలిస్తున్న రాజు ప్రియమ్‍కీ (Priam) రాణి హెకూబాకీ (Hecuba) పుట్టిన కవల పిల్లలలో ఆడపిల్ల; ఈమె కవల అన్నదమ్ముడు హెలెనస్ (Helenus). నల్లటి కురులు, కలువ రేకుల లాంటి కళ్ళతో ఎంతో అందంగా ఉండేదని పేరు! అందమైన అమ్మాయిల కోసం అదేపనిగా వేటలో ఉన్న (దరిదాపు ఒలింపియా కొండ మీద ఉన్న దేవతలంతా చేసేపని ఈ రకం వేటే!) అపాలో దృష్టి కసాండ్రా మీద పడింది. ప్రేమలో పడ్డాడు. వెంటపడ్డాడు. ప్రేమలో పడ్డ దేవతలని నిరాకరించే మనుష్యులు ఉంటారా? కానీ అదేమి విడ్డూరమో అపాలో అవస్థని చూసి కసాండ్రా నవ్వుకుంది; అతని ప్రేమని నిరాకరించింది.

[Image: cassandra.jpg]


కసాండ్రా మనస్సుని ఎలాగో ఒకలాగ గెలవాలనే తపనతో ఆమెకి అపూర్వమైన కానుకని ఇవ్వడానికి ప్రయత్నించేడు అపాలో. అన్నీ ఉన్న రాకుమారికి తను కొత్తగా ఏమి ఇవ్వగలడు? ఆమెకి అందం ఉంది. ఐశ్వర్యం ఉంది. కాని ఆమెకి లేనిది, తన దగ్గర ఉన్నది ఒకటి ఉంది. అది దివ్యదృష్టి. భవిష్యత్తులోకి చూడగలిగే శక్తి. ఇంత ఆసక్తికరమైన ప్రేమబహుమానం ఎదురైనప్పుడు కసాండ్రా కాదనలేకపోయింది. ప్రతిఫలం మీద ఆశతో అపాలోతో ‘వీపు గోకుడు బేరానికి’ కస్సాండ్రా ఒప్పుకుంది. తన వంతుగా అపాలో దివ్యదృష్టి ఇచ్చే మంత్రాన్ని కసాండ్రాకి ఉపదేశించేడు. మంత్రం నేర్చుకున్న తరువాత అపాలోకి ముట్టవలసిన ‘పారితోషికం’ ఇవ్వకుండా ఎగ్గొట్టింది; అపాలో ఎగబడుతూ చేస్తూన్న పురోగమనాలని కసాండ్రా నిరాకరించింది.

ఆత్మాభిమానం దెబ్బతిన్న అపాలో ఉగ్రుడయాడు. తను కసాండ్రాకి నేర్పిన మంత్రాన్ని తిరిగి వెనక్కి తీసుకోలేడు! తను చెయ్యగలిగిందల్లా ఆ మంత్రం వల్ల కసాండ్రాకి లాభం లేకుండా చెయ్యడం. అందుకని ‘నువ్వు దివ్యదృష్టితో చూసి చెప్పగలిగే జోస్యాన్ని ఎవ్వరూ నమ్మరు’ అని శపించేడు. చెయ్యగలిగేది ఏమీ లేక కసాండ్రా తను నేర్చుకున్న దివ్యదృష్టి మంత్రాన్ని తన కవల అన్నదమ్ముడు హెలెనస్‌కి ఉపదేశించింది. (కచ-దేవయాని కథ ఇలాగే నడుస్తుంది!)

కసాండ్రా చాలా సందర్భాలలో జోస్యం చెప్పింది; కాని ఎవ్వరూ నమ్మలేదు. అదే విషయాన్ని హెలెనస్ చెబితే నమ్మేవారు! ఒకసారి కసాండ్రా తన దివ్యదృష్టితో చూసి పేరిస్ ‘తప్పిపోయిన’ తన అన్నదమ్ముడే అని గుర్తించింది. పేరిస్ స్పార్టా రాణీ హెలెన్‌ని దొంగిలించి వివాహం చేసుకుని ట్రాయ్ తీసుకు వస్తాడనిన్నీ, ఆ సంఘటన ట్రాయ్ నగరపు విధ్వంసానికి కారణభూతం అవుతుందనిన్నీ, కనుక పేరిస్‌ని స్పార్టా వెళ్ళవద్దని బ్రతిమాలుతుంది. ఎవ్వరూ వినిపించుకోరు. ట్రాయ్ నగరం మీదకి దండెత్తి వచ్చే గ్రీసు దేశపు సేనాధిపతి అగమెమ్నాన్ యుద్ధంలో చనిపోతాడని జోస్యం చెబుతుంది. ఎవ్వరూ పట్టించుకోరు. తను కూడా ఆ యుద్ధంలో చచ్చిపోతానని చెబుతుంది. అంతా ‘పిచ్చి వాగుడు’ అని పెడచెవిని పెడతారు. చిట్టచివరికి గ్రీకులు రణరంగంలో వదలిపెట్టి వెళ్లిన కర్రగుర్రం ప్రమాదానికి దారి తీస్తుంది, దానిని లోపలికి తీసుకురావద్దని కసాండ్రా హెచ్చరిస్తే ఎవ్వరూ వినరు.

ఈ రోజుల్లో అయితే కసాండ్రా లాంటి వ్యక్తిని ‘శకున పక్షి’ అని గేలిచేసి ఉండేవారు. మనకి అవగాహనలో లేని ఏదైనా శక్తివంతమైన ప్రభావం వల్ల మనకి ఏదో కీడు కలగబోతోందని జోస్యం చెప్పేమనుకోండి. ఉదాహరణకి ‘పర్యావరణం వెచ్చబడడం వల్ల పల్లపు ప్రాంతాలు ముంపుకి గురవుతాయి’ అని ఒక శాస్త్రవేత్త జోస్యం చెప్పేడనుకోండి. మనకి వెంటనే నమ్మబుద్ది కాదు. రాబోయే ప్రమాదం నుండి తప్పించుకుందికి కానీ, ఆ ప్రమాదం వల్ల కలిగే హానిని తగ్గించడానికి కానీ వ్యయ ప్రయాసలు, కాలయాపన కావచ్చు. మన రాజకీయ నాయకులకి రాబోయే ఎన్నికల మీద ఉన్న దృష్టి ఎప్పుడో పాతిక సంవత్సరాల తరువాత రాబోయే ముంపు మీద ఉండదు. ఇటువంటి సందర్భాలలో శాస్త్రవేత్తలు చెప్పే జోస్యానికి కసాండ్రా చెప్పిన జోస్యానికి పట్టిన గతే పడుతుంది.*

Like Reply


Messages In This Thread
RE: గ్రీకు పురాణ గాథలు - by WriterX - 04-09-2021, 11:06 PM



Users browsing this thread: 3 Guest(s)