Thread Rating:
  • 8 Vote(s) - 1.88 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy ప్రియాతి ప్రియమైన వారికి అప్రియాతి అప్రియమైన లేఖ
#12
ప్రియమైన వారికి అప్రియమైన లేఖ


"ఏరా లేచావా?" ఉదయం 8 గంటలకి 3గంటల వరకు ఫోన్లో అడ్డమైనవన్నీ కెలుక్కుని గాఢ నిద్రలో ఉన్న నాకు ప్రకాశరావు గారి ఫోను.

ప్రకాశరావు గారు నా క్లోజ్ ఫ్రెండ్ శ్రీనివాస్ వాళ్ళ నాన్నగారు. వాడికి ఇంకొక 5 రోజుల్లో పెళ్ళి. 

"హా వస్తున్నా అంకుల్ గారూ. ఇంట్లో ఉన్నాను."

" ఇంట్లో ఏం చేస్తున్నావ్? ఈ నాలుగు రోజులైనా 2,3 కాకుండా తొందరగా పడుకోరా"

"వచ్చేస్తున్నా అండీ. అరగంటలో మీ దగ్గర ఉంటాను" అని చెప్పి అన్నీ ముగించుకుని అరగంటకి ఇంకో అరగంటన్నర కలిపి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. 

దానికి ముందు రోజే గణేశుడి బియ్యం కట్టి పెళ్లి పనులు మొదలుపెట్టారు. పల్లెటూరు, అందులోనూ చిన్నప్పటి నుండి వాళ్ళ ఇంట్లో ఒకడిలా కలిసి మెలసి పెరగడంతో వాళ్ళ ఇంట్లో వాడికన్నా నాకే చనువు ఎక్కువ. 

పెళ్లి పనులు అన్నీ నేను, మా ఫ్రెండ్స్ కలిపి మా భుజాల మీద వేసుకుని చేస్తున్నాం. అందరూ ఏదొక ఉద్యోగం చూసుకుని పెళ్లిళ్లు చేసుకున్నా ఇంకా ఖాళీగానే తిరుగుతున్న 28 సంవత్సరాల నేను ఉదయం లేవడం, రాత్రి పడుకోవడం తప్ప మిగిలిన పనులన్నీ వాళ్ళ ఇంట్లోనే చేస్తున్నాను.

అలా సాగిపోతున్న పెళ్లి పనుల్లోకి మెల్లిగా మా వాసు గాడి తరపు బంధువులు అందరూ రావడం మొదలయ్యింది. అందరూ నాకు దాదాపు తెలిసిన వారు, వాడి అక్క పెళ్ళిలో పరిచయం ఉన్నవాళ్లే అవ్వడంతో నేను కూడా ఏ ఇబ్బంది లేకుండా చక్కగా నా పని చేసుకుపోతున్నారు. 

పెళ్లి ఇంకో 4 రోజులు ఉందనగా దిగారు మా వాసుగాడి అక్కలు. వాళ్ళందరూ నాక్కూడా సొంత అక్కలే అన్నట్టు నేను కూడా ఉత్సాహంగా వాళ్ళతో కలిసిపోతూ సంగీత్, జీ తెలుగులో బాపూ బొమ్మకు పెళ్ళంటా, రాజస్థాన్ రాజమహల్ లో పెళ్లి ఏర్పాట్లు లాంటి గ్రాండ్ ఈవెంట్లు జరగకపోయినా నిహారిక పెళ్ళికన్నా ఆనందంగా పెళ్లి రోజులు జరుగుతున్నాయి.

అలాంటి ఆనందకర పరిస్థితుల్లో నిశ్చలమైన నీటిలో రాయిలా, వేడి పాలలో తోడు చుక్కలా, ఆరోగ్యకరమైన మనుషుల మధ్యలో మాస్క్ పెట్టుకోని కరోనా పేషంట్ తుమ్ములా నా మెదడులో మా ఫ్రెండ్ గాడి పెద్దమ్మ గారి అమ్మాయి జ్యోతి ఆలోచనలు మొదలయ్యాయి. 

"జ్యోతి" ఒక 32 సంవత్సరాల అందమైన ప్రౌఢ. తెల్లని శరీరఛాయా, తేనె రంగు కళ్ళు, 5 అడుగుల 4 అంగుళాల ఎత్తు, మెడకు కాస్త కిందకు దిగిన నల్లటి రాగిరంగు కృష్ణుడి గిరిజాల జుట్టు, నా మనసనే చేపను ప్రశాంతత అనే నీటిలోంచి నవ్వు అనే గాలం వేసి ఊపిరాడకుండా చేసేంత అందమైన ముఖవర్ఛస్సు, నా అనుభవాలు నేర్పిన పాఠాలతో మోయలేని బాధను నవ్వు అనే ముసుగు కప్పి మొండిగా బ్రతుకుతుందేమో అనిపించే ముఖ కవళికలతో తన ఆలోచనల బ్రిటిష్ వాడు నా మనసు భారతదేశంలో మెల్లిగా విస్తరించసాగాడు. 

తను ఎంతలా నా మనసుని అక్రమించిందంటే తన కోసమే ఆ ఇంటికి వెళ్ళేవాడ్ని. బయట పనులు ఉంటే ఫ్రెండ్స్ కి, ఇంట్లో పని ఉంటే నాకు. తన చూపుల స్పర్శ కోసం పరితపిస్తూ తన చుట్టే తిరిగేవాడ్ని. తన చూపు, నవ్వు నన్ను పిచ్చివాడ్ని చేసేవి. నిద్రపోయే ముందు ఆ పిచ్చివాడు కాస్తా తన ఆలోచనల అగ్నిలో కాలి పిచ్చి నా కొడుకు అయిపోయేవాడు. ఎంతలా అంటే పెళ్ళిలో స్టిల్ ఫోటోగ్రాఫర్ దగ్గర ఎక్స్ట్రా ఉన్న కెమెరా తీసుకుని కేవలం తన ఫోటోలు మాత్రమే తీసుకునే అంత. 

నాకు ఎవరేం అంటారో అనే భయం లేదు, తర్వాత తాను ఎక్కడ కనుమరుగు అయిపోతుందో అనే భయం తప్ప

నాకు నిద్ర లేదనే భాధ కూడా లేదు, నిద్రపోవడానికి ఇంటికి వెళ్తే తనకి దూరంగా వెళ్లిపోతున్నాననే భాధ తప్ప

తన చూపే మధురం
తన సన్నిధిలో ప్రతి క్షణం అమరం
తనని చేరే వరకు నా మదిలో సమరం
తన అదరం జార్చే ప్రతి పలుకూ అతి మధురం.

తనని చూస్తూ తుళ్ళే ప్రతి క్షణం కాంతి వేగంతో ముందుకు కదులుతూ పోయి నా గుండెకు క్షణమొక యుగంలా గడిపే తన వీడ్కోలు సమయం వచ్చింది. చూస్తున్నా తనతో మాట్లాడే సమయం కొరకు. 

పలకరించగానే నయగరా జలపాతంలా దూకే నా వాక్ ప్రవాహ ఝరి సహారా ఎడారిలో వర్షంలా గగనమైపోవడంతో  తను కూడా నన్ను రెట్టించలేదు. 

మౌనంగా తన బట్టలు, తన పిల్లల బట్టలు బ్యాగ్ లో సర్దుకుంది. 

అసలుకే పెళ్ళిలో పరోపకారి పాపన్న పాత్ర పోషిస్తున్న నేను వాళ్ళ అమ్మ, నాన్న బండి మీద వెళ్ళడానికి అనువుగా వాళ్ళ అందరి బట్టలు బండి మీద వేసుకుని జ్యోతిని బండి ఎక్కించుకున్నా వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చెయ్యడానికి.

నా మనసు అర్థమయ్యిందో, తనకి కూడా అలాగే ఉందో తెలీదు కానీ తాను కూడా మౌనంగా అలాగే నా వెనుక కూర్చుని ఉంది. సగం దూరం వెళ్ళాక నేనే మెల్లిగా పెదవి విప్పాను.

"జ్యోతి గారూ మీతో ఒక 10 నిమిషాలు మాట్లాడొచ్చా?"

"చెప్పండి"

"నాకు మీరంటే చాలా ఇష్టమండి"

"ఏం మాట్లాడుతున్నారు మీరు?"

"అలా కాదు. మీరు కోప్పడకండి. సరిగ్గా నేను చెప్పాలనుకుంది ఒక్క పది నిమిషాల్లోపే పూర్తి చేసేస్తాను. పూర్తిగా విన్నాక మీరు ఏం చెప్పాలనుకుంటే అది చెప్పండి. ఏం చెప్పక్కర్లేదు అనుకుంటే వెళ్ళిపోవచ్చు. కానీ ఒక్క పది నిమిషాలు మాత్రం వినండి. ప్లీజ్"

"......"

"మనం మన తల్లికి ఐ లవ్ యూ చెప్పొచ్చు, తండ్రికి చెప్పొచ్చు, అక్కకి చెల్లికి అందరికీ చెప్పొచ్చు. కానీ మనతో ఒక రిలేషన్ అంటూ లేని వాళ్ళకి చెప్పాల్సి వస్తే అది అందరికీ తప్పుగానే అనిపిస్తుంది. అందులో పెళ్ళైన వాళ్ళకంటే దాన్ని అందరూ తప్పుగానే భావిస్తారు. ఈ పరిస్థితుల్లో ఇంకొకళ్ళు ఉంటే నేను కూడా అలాగే అనుకుంటాను. కానీ నా వైపు నుంచి ఒక్కసారి వినండి. ఈ పెళ్లికి ముందు నేనే ప్రాణంగా బ్రతికి నేను చేసిన పనికి ఛీ కొట్టి వెళ్లిపోయిన అమ్మాయి నా జీవితంలో ఉంది. నేను సిన్సియర్ గా తనని ప్రేమించినప్పుడు కూడా నాకు ఇలాంటి అనుభూతి కలగలేదు."

"ఎలాంటి అనుభూతి?"

"ప్లీజ్ జ్యోతిగారు ఒక్క నిమిషం మాట్లాడకండి. నాకు మాట్లాడటమే వెంటిలేటర్ మీద ఊపిరి పీల్చినంత కష్టంగా ఉంది. మీరు ప్రశ్నలు వేస్తే ప్రాణం పోయినంత బాధగా అనిపిస్తుంది. కష్టమో నష్టమో చెప్పేది పూర్తిగా వినండి. మిమ్మల్ని చూస్తూ నా మనసులో ఒక ఉద్దేశం పెట్టుకుని బయటకు నటించలేకపోతున్నాను."

"చెప్పండి ఇంక మాట్లాడను"

"ఇందాక ఎక్కడ ఆపాను? ఆహ్.. నాకు ఇలాంటి అనుభూతి ఎప్పుడూ కలగలేదు. అది ఎలాంటి అనుభూతి అంటే ఇలాంటి అనుభూతి అని ఒక్క మాటలో చెప్పగలిగితే నాకు ఇన్ని తిప్పలెందుకు చెప్పండి? మొదట్లో మీ తమ్ముడి పెళ్ళిలో మిమ్మల్ని చూసినప్పుడు అందరిలో మీరు కూడా ఒకరిలా కనిపించారు. వాసు గాడికి అక్క అంటే నాకు కూడా అక్కే అనుకున్నాను. కానీ మీ తేనె రంగు కనుపాపలు, మీ ఉంగరాల జుట్టు, మీరు చూసే చూపు, మీ పని తప్ప దిక్కులు చూడని మీ మనస్తత్వం, మీరు గొంతులోంచి తన్నుకొచ్చే నవ్వుని పెదాలతో బిగపట్టే తీరు, మీ మాట, మీ నడక ఇవన్నీ కలిపి మీ పక్కన ఉంటే చాలు గాల్లోకి సర్రున దూసుకుపోయే తారాజువ్వని వెలిగించి ఒక డబ్బాలో పడేసి మూతపెట్టినట్టు మనసంతా అల్లకల్లోలం అయిపోతుంది కానీ ఆ బాధ మాత్రం డ్రగ్స్ కి బానిసలా పదేపదే కావాలంటుంది. ఇదంతా మిమ్మల్ని ఒప్పించి జీవితాంతం మీతో పడుకోవాలని చెప్పట్లేదు. ఈ ఆనందాన్ని గుండెల్లో దాచుకోలేక ఇలా బయట పెట్టేస్తున్నా. మీరు ఇలా నా మనసుకి అలవాటు అయిపోయాక గంటైనా మిమ్మల్ని కలవరించకుండా నా మెదడు నిద్రలోకి వెళ్ళట్లేదు. దీనికి నేను ప్రేమని, దోమని, చచ్చిపోయిన మా మామని పేరు పెట్టాలనుకోవట్లేదు కానీ ఇంత అందమైన ఫీలింగ్ ఎవరికి ఎవరిమీదైనా కలుగుతుందనే నమ్మకం లేదు అందుకే మీకు చెప్పాలనిపించింది. ఈ పెళ్లి తర్వాత మీరు ఎక్కడ ఉంటారో కూడా నాకు తెలీదు. మీ ఫోన్ నెంబర్ కూడా నేను కావాలని ఎవరినీ అడగలేను. అలా మీ గురించి తెలుసుకుని సంతోషంగానో,  భాదగానో నాకు తెలీదుకానీ మొత్తానికి ఏదొకలా అయితే సాగుతున్న మీ జీవితంలోకి ప్రవేశించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకే అసలు ఇష్టం లేదు. దీని తర్వాత మిమ్మల్ని ఎప్పుడు చూసినా, చూడకపోయినా మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు చిమ్మ చీకటిని చూసినా, పూసిన పువ్వుని చూసినా, నా ఖాళీ బుర్రలోకి చూసినా ఎక్కడ చూసినా మీరే, మీ నవ్వే గుర్తుకు వస్తుందండీ. నిన్నటి వరకు మీ తమ్ముడి అక్కల్ని అక్కా అని పిలిచినా పిలవకపోయినా వాళ్ళ భర్తల్ని మాత్రం బావగారు అని నోరారా పిలిచే నేను మిమ్మల్ని చూసినప్పటి నుండి ముగబోయాను. మీ ఆయన ఇంటి పేరుతో ఉన్నోళ్లు నాకు అన్నదమ్ములు అవుతారని తెలిసి రేసుగుర్రంలో శృతి హాసన్ లా గుండెలోపలే గంతులేసాను. కానీ దాని అర్థం నాకు మీ మీద ఏదో తప్పుడు ఉద్దేశం ఉందని కాదు. అలా అని మీ మీద అసలు ఏ ఉద్దేశం లేదని కూడా కాదు. కానీ మిమ్మల్ని చూసే ముందు వరకు నీకు ఎలాంటి అమ్మాయితో పెళ్లి కావాలంటే రంగు, ఎత్తు, అస్తిపాస్తులు అని ఆలోచించాను కానీ ఇప్పుడు మాత్రం మీ లాగా ఎవరు నా ముందు నిలబడితే నా ప్రమేయం లేకుండానే నా గుండె ఆనందంతో చప్పుడు చేస్తుందో, ఎవరి కనుచూపుల పరిధి దాటి వెళ్ళాలి అనిపించదో, ఎవరి నున్నటి బుగ్గలు అరచేతుల్లోకి తీసుకుంటే వదలాలి అనిపించకుండా అలా కళ్ళలోకి చూస్తూనే ఉంటామో అలాంటి అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని ఉంది. నాకంటూ ఇష్టానికి నిర్దుష్టంగా కొన్ని అభిప్రాయాలు ఏర్పడేలా చేశారు. దానికి మీకు చాలా చాలా థాంక్స్. ఇప్పటి వరకూ సాగిన గమ్యం లేని నా జీవితమనే ప్రయాణంలో జీవితాంతం మర్చిపోలేని ఒక అందమైన మజిలీ మీరు. అందుకు మీకు చాలా చాలా చాలా థాంక్స్. ఇది చెప్పాలనే ఇంత సమయం తీసుకున్నాను. చెప్పాలనుకుంటే ఏదైనా చెప్పండి. చెప్పుచుకుని కొట్టాలనుకున్నా నాకు బాధ లేదు. కానీ నా జీవితంలోకి మీ లాంటి భార్య వస్తే మాత్రం అన్నిటికన్నా ముందు అంటే మాట్లాడటానికన్నా కూడా ముందు తనని గట్టిగా కౌగిలించుకుని నిజమో కాదో ఒకసారి గిల్లుకుని నా గుండె చప్పుడు నేనే వింటూ కాసేపు అలాగే ఉండిపోతా. ఇది చెప్పాలనే మీ పది నిమిషాల టైం అడిగింది. మీకు నచ్చినా నచ్చకపోయినా నా మనసులో ఏముందో తెలియక మీరు ఈ పెళ్ళిలో నాతో ఉన్న చాలా గంటల సమయం కంటే నా మనసులో మీరేంటో చెప్తున్న ఈ పది నిమిషాలు నా జీవితంలో మరుపురానివి, మర్చిపోలేనివి." నా మాట పూర్తయ్యే సరికి తను దిగే గమ్యం వచ్చేసింది.

అన్నీ విన్న తను మాత్రం చివరికి సమాధానం చెప్పకుండా వెనుదిరిగింది. నేను కూడా వెనుదిరిగాను

 "కళ్ళ నిండా తన రూపంతో, గుండె నిండా తన భావంతో"

 నా కథలు
Thriller 
 Fantasy

Mind what you say to people.
Heart Heart
Like Reply


Messages In This Thread
RE: ప్రియాతి ప్రియమైన వారికి అప్రియాతి అప్రియమైన లేఖ - by naresh2706 - 24-12-2020, 12:21 AM



Users browsing this thread: 1 Guest(s)