Thread Rating:
  • 4 Vote(s) - 2.25 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller ఓ గూఢచారిణి ప్రేమకథ
#1
Video 
నాకు ‘‘హోమ్‌లాండ్‌’’ టీవీ సీరియల్‌ చాలా యిష్టం. టెర్రరిజం, గూఢచర్యం నేపథ్యంతో అల్లిన కల్పితకథ, పాత్రల మధ్య హైఓల్టేజి హ్యూమన్‌ డ్రామా, అనుక్షణం కలిగే ఉత్కంఠ, వాస్తవంగా జరుగుతోందనిపించే లొకేల్స్‌, తారల అభినయం, పెర్‌ఫెక్ట్‌ చిత్రీకరణ - దేనిలోనూ వంక పెట్టడానికి వీల్లేదు. ప్రస్తుతం హాట్‌స్టార్‌లో లభ్యమయ్యే తొమ్మిదేళ్ల కితం నాటి యీ సీరియల్‌ చాలామంది చూసే వుంటారు. చూడనివారి కోసం దాని కథాంశాన్ని పరిచయం చేద్దామని యీ ప్రయత్నం. పేర్లు రాసేటప్పుడు వాళ్ల అసలు పేరు (ముందు వస్తుంది), యింటిపేరు (తర్వాత వస్తుంది) రెండూ చెపుతున్నాను. తరచుగా వాడేదాన్ని బ్రాకెట్‌కు బయట, వాడనిదాన్ని బ్రాకెట్‌ లోపల సూచిస్తున్నాను.
ఇది నచ్చితే ఆ సీరియల్‌ తప్పక చూడండి. ఆ పాత్రలు మిమ్మల్ని వెంటాడతాయి. వేర్వేరు డైరక్టర్లు డైరక్ట్‌ చేసినా ఎపిసోడ్స్‌లో హెచ్చుతగ్గులుండవు. కానీ దిగంబర దృశ్యాలు, సంభోగ సన్నివేశాలు, బూతుమాటలు యిబ్బంది పెట్టవచ్చు, డైలాగ్సు అర్థం కాని నా బోటి వాళ్లు సబ్‌టైటిల్స్‌ చదవాల్సి రావచ్చు. ఈ చికాకు వద్దనుకునేవారికి యీ రచన ఉపకరిస్తుంది. ఈ సీరీస్‌లో మొదటి రెండు సీజన్లలో జరిగిన కథను చెప్తాను. పాఠకుల స్పందన బాగుంటే తక్కిన వాటి గురించి ఆలోచించవచ్చు.

నిజానికి యీ సీరీస్‌కు మూలం - ఇజ్రాయిలీ టివిలో ప్రసారమైన ‘హెతుఫిమ్‌’’ (ప్రిజనర్స్‌ ఆఫ్‌ వార్‌) అనే సీరియల్‌. జిడియన్‌ రాఫ్‌ సృష్టించారు. దీన్ని హోవర్డ్‌ గార్డన్‌, అలెక్స్‌ గాన్సా అనే వారు అమెరికన్‌ టివికై మలుచుకుంటూ అమెరికాలోని గూఢచారి సంస్థలో జరిగినట్లు మార్చుకున్నారు. అమెరికాలో గూఢచారి ఏజన్సీలు రెండు. ఎఫ్‌బిఐ (ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌) దేశంలో గూఢచర్యం చేస్తే, సిఐఏ (సెంట్రల్‌ ఇంటెలిజన్స్‌ ఏజన్సీ) విదేశాల్లో గూఢచర్యం నెరపుతుంది. దేశాధ్యక్షుడుండే వైట్‌హౌస్‌కు 9 మైళ్ల దూరంలో వర్జీనియా రాష్ట్రంలో ఫెయిర్‌ఫాక్స్‌ కౌంటీలో ఉన్న లాంగ్లీ అనే ప్రాంతంలో జార్జి బుష్‌ సెంటర్లో సిఐఏ హెడ్‌క్వార్టర్స్‌ ఉంది. దాని విభాగాల్లో ఒకటైన కౌంటర్‌`టెర్రరిజం శాఖ వ్యవహారాల గురించి యీ కథ నడుస్తుంది.

మన కథానాయిక క్యారీ (ఇంటిపేరు మాతిసన్‌) ఆ శాఖలోనే ఎనలిస్ట్‌గా పని చేస్తోంది. దానికి డైరక్టరుగా ఉన్నతను డేవిడ్‌ (ఎస్టెస్‌) తన కొలీగ్స్‌ నందరినీ అత్యవసర సమావేశానికి పిలవడంతో కథ ప్రారంభమైంది. కథాకాలం నాటికి ఒసామా బిన్‌ లాడెన్‌ మరణించాడు. అతని స్థానంలో వచ్చిన ఆబు నజీర్‌ తన టెర్రరిస్టు కార్యకలాపాలతో అమెరికాను ఎదుర్కుంటున్నాడు. అయితే గత కొద్దికాలంగా స్తబ్దంగా ఉన్నాడు. ఎక్కడ దాగున్నాడో తెలియకుండా ఉంది. సిఐఏలో మెరికల్లాటి వారితో తయారు చేసిన డెల్టా ఫోర్స్‌ మధ్య ప్రాచ్య దేశాలన్నిటిలో అతని కోసం గాలిస్తోంది.

వాళ్లు యీ మధ్యే అఫ్గనిస్తాన్‌లో టెర్రరిస్టులకు చెందిన కాంపౌండుపై దాడి చేశారు. అక్కడి బిల్డింగులోని నేలమాళిగలో ఒక ఖైదీ దొరికాడు. వీళ్లను చూడగానే ‘నన్ను కాల్చకండి. నేను అమెరికన్ని’ అన్నాడు. అతను (నికొలస్‌) బ్రాడీ. యుఎస్‌ మెరీన్స్‌లో సార్జంటుగా పనిచేసేవాడు. 2003లో ఇరాక్‌పై యుద్ధం చేసే రోజుల్లో సిరియా సరిహద్దుల్లో సద్దాం హుస్సేన్‌ సేనలకు యుద్ధఖైదీగా పట్టుబడ్డాడు. ఇతనితో బాటు టామ్‌ (వాకర్‌) అనే కొలీగ్‌ కూడా పట్టుబడ్డాడు. వీళ్లిద్దరినీ అల్‌ ఖైదా కమాండర్‌ అయిన అబు నజీర్‌కు వాళ్లు అమ్మేశారు. అతను వీళ్లని డమాస్కస్‌లో బంధించి వుంచాడు. వాళ్లిద్దరూ  చచ్చిపోయారని అమెరికా ప్రకటించడం కూడా జరిగిపోయింది. టామ్‌ను చంపేశారని, తనను మాత్రం 8 ఏళ్లగా బందీగా ఉంచారని బ్రాడీ చెప్పుకున్నాడు.

డెల్టా వాళ్లు అతన్ని రక్షించి, డీబ్రీఫ్‌ చేయించి, అంటే యిన్నాళ్లూ ఏం జరిగిందో ప్రశ్నలూ అవి వేసి సమాచారం రాబట్టి, వాషింగ్టన్‌ డిసిలో ఉన్న అతనింటికి పంపించడానికి నిశ్చయించుకున్నారు. ఆ విషయం చెప్పడానికే డేవిడ్‌ తన శాఖ వారందరినీ పిలిచాడు. విషయం విన్న వెంటనే సూక్ష్మగ్రాహి ఐన క్యారీకి ఓ విషయం గుర్తుకు వచ్చింది. ఎవరికీ తట్టని సంగతలు కూడా ఆమెకు తడతాయి. సాహసే కానీ దూకుడు ఎక్కువని కొలీగ్స్‌ అభిప్రాయం. మిడిల్‌ ఈస్ట్‌లో చాలాకాలం పనిచేసింది. స్థానికులలో కొందర్ని గుర్తించి వారిని తన ఇన్‌ఫార్మర్లగా (రహస్యంగా సమాచారం అందించేవారు), ఏజంట్లగా మార్చేది. తర్ఫీదు యిచ్చేది.

ఆమె ఇరాక్‌లో సిఐఏ కేస్‌ ఆఫీసరుగా పనిచేసే రోజుల్లో అవతలి పక్షాన బాంలు తయారీ చేసే ఒకణ్ని ఇన్‌ఫార్మర్‌గా మార్చింది. అది తెలిసిపోయి అవతలివాళ్లు అతన్ని ఉరి వేసేస్తున్నారు. ఒక ముఖ్యమైన సమాచారం చెప్తానని అతను జైలు నుంచి యీమెకు కబురంపాడు. ఈమె వెళితే ‘నా కుటుంబాన్ని కాపాడాలని షరతు విధించి ‘మీ యుద్ధఖైదీల్లో ఒకడు మా వైపు తిరిగిపోయాడు’ అని చెవిలో చెప్పాడు. ఈలోగా అతన్ని గార్డులు లాక్కుని పోయారు. ఈమె అనుమతులు లేకుండా అక్కడకి వచ్చినందుకు పెద్ద వివాదమైంది. శిక్షగా ఆమెను ఇరాక్‌ నుంచి వెనక్కి రప్పించి, హెడ్‌క్వార్టర్స్‌లో ప్రొబేషన్‌లో ఉంచారు.

అతను చెప్పిన ఫిరాయింపుదారు యీ బ్రాడీయేమోనని క్యారీకి అనుమానం వచ్చింది. నజీరే కావాని డెల్టా ఫోర్స్‌ వచ్చే సమయానికి తన నేలమాళిగలో అతను దొరికేట్లు చేసి, అమెరికాకు పంపిస్తున్నాడేమో, ఇతను యిక్కడకు వచ్చి మిలటరీ రహస్యాలన్నీ అల్‌ ఖైదాకు రహస్యంగా అందచేస్తాడని ఆమె సంశయం. అతనిపై కొంతకాలం రహస్యంగా నిఘా పెట్టి నిగ్గు తేల్చాలని ఆమె ఉద్దేశం. దాన్ని డిపార్టుమెంటులోనే తన గురువు, హితైషి ఐన సాల్‌ (బెరెన్సన్‌)కి చెప్పింది.

అతను మిడిల్‌`ఈస్ట్‌ (మధ్యప్రాచ్య దేశాలు) డివిజన్‌కు చీఫ్‌గా ఉన్నాడు. అక్కడ చాలా ఏళ్లు పనిచేశాడు. క్యారీని రిక్రూట్‌ చేసి, తర్ఫీదు యిచ్చినది అతనే. క్యారీని అర్థం చేసుకునే అతి తక్కువ మందిలో ఒకడు. సోదరిలా భావించి మాటిమాటికీ సాయపడుతూ ఉంటాడు. ప్రస్తుతం యీ శాఖలో పని చేస్తున్నాడు. అంతా విని ‘అబ్బే, దీనికి మన బాస్‌ డేవిడ్‌ ఒప్పుకోడు. బ్రాడీని పెద్ద హీరోగా చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నువ్విలా సందేహాలు వ్యక్తం చేస్తే పిచ్చిదానివని ముద్ర కొడతారు జాగ్రత్త.’ అన్నాడు.

దేశంలో రాజకీయ వాతావరణం ఏమిటంటే - (విలియం) వాల్డెన్‌ అనే అతను సిఐఏకు డైరక్టరుగా పని చేసి టెర్రరిజాన్ని అణచాడని పేరు తెచ్చుకుని వైస్‌ ప్రెసిడెంటుగా ఎన్నికయ్యాడు. త్వరలో రాబోయే ఎన్నికలలో అధ్యక్షుడిగా పోటీ చేద్దామని చూస్తున్నాడు. ప్రస్తుత అధ్యక్షుడికి టెర్రరిజాన్ని ఎదుర్కొనే శక్తిసామర్థ్యాలు లేవని, దానికి తనే తగునని చెప్పుకోవాలని అతని రాజకీయ ఎజెండా. అయితే నజీర్‌ యీ మధ్య చల్లారి వుండడంతో టెర్రరిజం పెద్ద అంశంగా చూడటం లేదు జనాలు. ఇప్పుడీ బ్రాడీ దొరికాడు కాబట్టి యితన్ని చూపించి ‘టెర్రరిజం యింకా సజీవంగానే ఉంది. దాని కోరల్లోంచి బయట పడిన యితన్ని చూడండి, ఇతను నేషనల్‌ హీరో. ఇతనికి తగిన హోదా కల్పించి, నజీర్‌ను పట్టుకునేవరకూ మన పోరాటం సాగుతూనే ఉండాలి. అది నా వల్లనే అవుతుంది.’ అని చెప్పుకోవాలని అతని ప్లాను.

ఈ వాల్డెన్‌కు క్యారీ బాస్‌ అయిన డేవిడ్‌ తొత్తు. అతను సిఐఏలో వుండే రోజుల్లో యితనికి బాగా లిఫ్ట్‌ యిచ్చాడు. ఒకప్పుడు సాల్‌కి రిపోర్టు చేసే స్థాయిలో ఉన్న డేవిడ్‌ను యిప్పుడు సాల్‌కు సీనియరుగా చేసిన ఘనుడు వాల్డెనే. డేవిడ్‌ అతని మాట జవదాటడు కాబట్టి, బ్రాడీపై నిఘాకు ఒప్పుకోడని సాల్‌ అవగాహన. క్యారీ తనంత తనే ఎవరికీ చెప్పకుండా నిఘా పెడదామనుకుంది. సిఐఏకు కాంట్రాక్టు నిఘా పనులు చేసి పెట్టే వర్జిల్‌ అనే అతనికి పరిమిత బజెట్‌లో బ్రాడీ యిల్లంతా వైరింగ్‌ చేసి, కెమెరాలు, మైకులు పెట్టి, నిరంతర నిఘా చేసి పెట్టమని కోరింది. అతను వాళ్ల తమ్ముడు మాక్స్‌ని వెంట తెచ్చుకుని బ్రాడీ కుటుంబం అతన్ని రిసీవ్‌ చేసుకోవడానికి ఎయిర్‌పోర్టు వెళ్లిన టైములో ఆ ఏర్పాటు చేస్తానన్నాడు.

బ్రాడీ కుటుంబానికి వస్తే - అతను మెరీన్స్‌లో చేరడానికి ముందే జెసికా అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వాళ్లకు డానా అనే కూతురు, క్రిస్‌ అనే కొడుకు ఉన్నారు. ఇరాక్‌ వెళ్లే సమయానికి డానాకు 8, యిప్పుడు 16. తండ్రి బాగానే గుర్తున్నాడు. క్రిస్‌కు 4, యిప్పుడు 12. తండ్రి బొత్తిగా గుర్తు లేడు. బ్రాడీ యుద్ధంలో తప్పిపోయాడని తెలిసినపుడు జెసికా కలతపడింది కానీ నిబ్బరంగానే ఉంది. వేరే ఎవరితోనూ సంబంధం పెట్టుకోకుండా పిల్లల్ని పోషిస్తూ వచ్చింది. ఆరేళ్ల తర్వాత అతను పోయాడని ప్రభుత్వం ప్రకటించింది.

ఇక అప్పుడామె మైక్‌ (ఫెబర్‌) అని భర్త కొలీగ్‌, ఆప్తమిత్రుడుతో ప్రేమలో పడింది. శారీరక సంబంధం కూడా పెట్టుకుంది. అతను పిల్లల్ని ఒక తండ్రిలా చూసుకునేవాడు. నేడో రేపో, అతన్ని యింటికి తీసుకుని వచ్చి పిల్లల ఎదుట తన పునర్వివాహం గురించి ప్రకటిద్దామని అనుకుంటూండగా బ్రాడీ సజీవంగా ఉన్న వార్త బయటకు వచ్చింది. అతను బయటకు వస్తూనే భార్యకు ఫోన్‌ చేసి మాట్లాడాడు. సరిగ్గా ఆ సమయానికి ఆమె మైక్‌తో శృంగారంలో ఉంది. ఎలా రియాక్టవాలో కాస్సేపు తెలియలేదు. ఎయిర్‌పోర్టుకి వచ్చి రిసీవ్‌ చేసుకుంటామంది. పిల్లలతో సహా వెళ్లింది.

బ్రాడీ ఏదో ఘనకార్యం చేసివచ్చినంత హడావుడి జరిగింది ఎయిర్‌పోర్టు వద్ద. ఇంటికి వచ్చాక కూడా లోపకి వెళ్లకుండా యింటి బయటే విలేకరులు చుట్టుముట్టారు. ఇన్నాళ్ల బందిఖానా ఎలా వుందని, బతికి వచ్చినందుకు ఎలా ఫీలవుతున్నావనీ బ్రాడీని, తిరిగిరాడనుకున్నవాడు తిరిగి వచ్చినందుకు ఎలా ఫీలవుతున్నావని జెసికాను అడిగారు. ఆమె బాధ వర్ణనాతీతం. ఆమె యీపాటికి అతన్ని మనసులోంచి తుడిచేసి మైక్‌తో వివాహానికి సిద్ధపడింది.

ఇప్పుడితను తిరిగి వచ్చాడు కాబట్టి మైక్‌తో నీ దారిన నువ్వు పో అనడం అన్యాయంగా తోచింది. పిల్లలకూ అంతే, మైక్‌యే వాళ్లను ఆటలకు తీసుకెళ్లి, కాలేజీ ఫంక్షన్‌కు తోడుగా వచ్చి అన్నీ చేశాడు. ఈరోజు అతన్ని వేరే వ్యక్తిగా చూడడం కష్టం. కూతురు డానాకు 16 ఏళ్లు కాబట్టి ఆమెకు తల్లి భావాలు అర్థమౌతున్నాయి. ఈ సంఘర్షణ మధ్య బ్రాడీ పునరాగమనం జరిగింది. ఈ హడావుడి అంతా జరుగుతూండగానే బ్రాడీ యింట్లో వర్జిల్‌ టీము కెమెరాలు, స్పీకర్లు అమర్చేసి సమయానికి బయటపడింది. నిరంతర నిఘాకు క్యారీ, వర్జిల్‌ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. బ్రాడీ యింట్లో ఏ గదిలో ఏం జరిగినా క్యారీ యింట్లో స్క్రీన్లలో అది కనబడుతుంది, వినబడుతుంది.

క్యారీకి పెళ్లి కాలేదు. తల్లి ఎక్కడికో దూరంగా వెళ్లిపోయింది. తండ్రి దగ్గర్లోనే వేరే ఊళ్లో ఉన్న పెద్దకూతురు మ్యాగీ, ఆమె పిల్లల దగ్గర ఉంటున్నాడు. క్యారీ తన తిండితిప్పల గురించి పట్టించుకోదు. ఎప్పుడూ పని ధ్యాసే. ఇంట్లో వండుకోదు. తినడానికి ఏమీ ఉండదు. ఇదంతా చూసి వర్జిల్‌కు చికాకేసింది.

క్యారీకి కాలేజీ రోజులనుంచీ బైపోలార్‌ డిజార్డర్‌ ఉంది. అది ఆమెకు తండ్రి నుంచి సంక్రమించింది. దాని కారణంగా కొన్ని సమయాల్లో డిప్రెషన్‌కు లోనవుతుంది, మరి కొన్ని సమయాల్లో అత్యుత్సాహంగా ఉంటుంది. రెగ్యులర్‌గా మందు వేసుకోకపోతే ఆ మూడ్స్‌ ఉన్మాదస్థాయికి చేరతాయి కూడా. తన జబ్బు గురించి డిపార్టుమెంటులో ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతుంది. సైకియాట్రిస్టుగా పని చేస్తున్న అక్క తన ఆఫీసు నుంచి దొంగతనంగా తెచ్చి యిస్తున్న మందు ఎప్పటికప్పుడు తెచ్చుకుంటూ వేసుకుంటూంటుంది. ఆ విషయం వర్జిల్‌ తమ్ముడు గమనించాడు కానీ ఎందుకులే అని క్యారీని అడగలేదు.

మర్నాడు బ్రాడీని సిఐఏ ఆఫీసుకి పిలిపించారు. డేవిడ్‌ అతని టీము అల్‌ఖైదా ఖైదీగా అతని అనుభవాల గురించి అడిగారు. అందరూ హీరోగా చూస్తున్నా క్యారీ మాత్రం అనుమానంగా చూస్తూ ‘అబు నజీర్‌ను స్వయంగా చూశారా?’ అని అడిగింది. అబ్బే లేదన్నాడతను. కానీ నిజానికి అతను నజీర్‌తో మాట్లాడివున్నాడు. (ఇలాటివన్నీఫ్లాష్ కట్ ల ద్వారా మనకు దృశ్యరూపంగా చూపిస్తారు) క్యారీకి నమ్మకం చిక్కక, మళ్లీ అడిగింది. డేవిడ్‌ ప్రశ్నలాపు అన్నాడు.

క్యారీ ప్రతిభ చూసి అందరూ అసూయ పడుతూంటారు - డేవిడ్‌తో సహా! డేవిడ్‌కు, ఆమెకు గతంలో ప్రేమ వ్యవహారం నడిచింది. దాని కారణంగా అతని వైవాహిక జీవితం భగ్నమై, భార్య దూరంగా వెళ్లిపోయింది కూడా. ప్రస్తుతం క్యారీకి ఏ ఘనతా దక్కకుండా చూడడమే డేవిడ్‌ పని. తనని వదిలేస్తే ఏదో ఒక తిక్క పని చేసి, నెత్తిమీదకు తెస్తుందని అతని భయం.

ఈ సమావేశం తర్వాత బ్రాడీ పార్కులో ఎవరినో కలవడానికి వెళ్లాడు. అల్‌ఖైదా తాలూకు మనిషినే కలుస్తున్నాడనుకుని క్యారీ, వర్జిల్‌, మాక్స్‌ అతన్ని వెంటాడారు. తీరా చూస్తే అతను కలిసినది తన తోటి ఖైదీగా ఉన్న టామ్‌ భార్య హెలెన్‌ను. తన భర్త మాయమయ్యాక ఎక్కువకాలం వేచి చూడకుండా వేరేవాణ్ని పెళ్లి చేసేసుకుందని జెసికాకు ఆమెపై చిన్నచూపు. అందుకని యింటికి రాకుండా పార్కులో కలవమని కబురు పెట్టిందామె. ‘మా ఆయన చనిపోయిన మాట వాస్తవమేనా?’ అని అడిగిందామె. ‘అవును, చచ్చేదాకా కొట్టేరట’ అన్నాడు బ్రాడీ. ‘అతను చనిపోయినపుడు నువ్వు ఉన్నావా?’ అని అడిగిందామె. లేదని చెప్పాడు కానీ నిజానికి అతనే నజీర్‌ ఆదేశాలపై టామ్‌ను చావబాదాడు.  

క్యారీ యింటికి తిరిగి వెళ్లేసరికి సాల్‌ అక్కడున్నాడు. నిఘా సామగ్రి చూసి ‘ఏమిటిదంతా? చట్టవిరుద్ధంగా చేస్తున్నావని రిపోర్టు చేస్తాను’ అని బెదిరించి వెళ్లిపోయాడు. క్యారీ మనసు చెడిపోయింది. మతి పోయింది. ఏం చేయాలో తోచక ఓ క్లబ్‌కు వెళ్లి కూర్చుంది. అక్కడ ఓ గిటారిస్టు తీగలపై లయబద్ధంగా తన వేళ్లు కదిలించడం గమనించింది. అదే పద్ధతిలో బ్రాడీ కెమెరా ఎదుట తన వేళ్లను లయబద్ధంగా ఆడించిన సంగతి గమనించింది. అంటే అల్‌ఖైదా స్లీపర్‌ సెల్స్‌ ఎవరికో వేళ్ల కదలిక ద్వారా రహస్య సంకేతాలు అందిస్తున్నాడన్నమాట. సాల్‌ యింటికి వెళ్లి పేపరు క్లిప్పింగులు, వీడియోలు అన్నీ చూపించి యిప్పుడేమంటావ్‌ అంది. ఎవరైనా దీన్ని డీకోడ్‌ చేయగలిగితే మర్మం బయట పడుతుంది అంది. 
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
ఓ గూఢచారిణి ప్రేమకథ - by అన్నెపు - 26-10-2020, 10:31 PM



Users browsing this thread: