Thread Rating:
  • 4 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నెరజాణల కథలు
#2
నెరజాణల కథలు – 01


కరోనా కారణంగా అందరూ భీతావహులై యిళ్లల్లోనే వుండిపోయినపుడు ఎన్నో జోకులు, కార్టూన్లు, చమత్కారాలు, ఫన్నీ వీడియోలు పుట్టుకుని వచ్చాయి. భయానక వాతావరణం ప్రజల సృజనాత్మకతను పెంచిందనుకోవాలి. మరో రకమైన సృజనాభిలాష కూడా పెరిగి శిశుజననాలు పెరగబోతున్నాయట. ఈ గృహనిర్బంధం టైములో పోర్నో కూడా రికార్డు స్థాయిలో చూశారట. ఒక పక్క మృత్యుభయం, అంతుపట్టని వ్యాధిభయం ముప్పిరికొంటూండగా కూడా మనుష్యులు యిలా వుంటారా అని ఆశ్చర్యం వేసేవారు బొకాచియో రాసిన ‘’ద డెకామెరాన్’’ కథాసంపుటి చదవాలి. తెలియనివారి కోసం  ఆ పుస్తకాన్ని పరిచయం చేస్తున్నాను.

ఈ ఇటాలియన్ రచయిత క్రీ.శ. 1313లో ఫ్లారెన్స్‌లో పుట్టాడు. 62 ఏళ్లు జీవించాడు. అతని 35 వ ఏట ఇటలీలో ప్లేగు వ్యాపించింది. అప్పట్లో దాన్ని బ్లాక్ డిసీజ్ అనేవారు. తూర్పు నుంచి వచ్చింది అనుకున్నారు. యూరోప్ ఖండమంతా మూడేళ్లపాటు స్వైరవిహారం చేసి, దాదాపు మూడోవంతు జనాభాను తుడిచిపెట్టేసి, ఆ తర్వాత తనంతట తానే తగ్గిపోయింది. ప్లేగు వ్యాధి లక్షణాలేమిటో, దాని విలయతాండవం ఎలా వుండిందో, అది వ్యాపిస్తున్నపుడు జనాభాలో వివిధ వర్గాల వారు ఎలా ప్రవర్తించారో బొకాచియో రాసుకుని వచ్చాడు -

‘ఇదంతా మానవాళి చేస్తున్న పాపాలపై భగవంతుడి ఆగ్రహమని అనుకుంటున్నారు. క్షమించమని భక్తులు మొరపెడుతున్నా, ఆయన వినిపించుకోవటం లేదు. అధికారులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రోగం సోకినవారిని నగరంలోకి రానివ్వటం లేదు. ప్రజల ఆరోగ్యం కాపాడడానికి తడవతడవకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. తూర్పు ప్రాంతాల నుంచి వచ్చిందంటున్నా అక్కడ కనబడిన రోగలక్షణాలు యిక్కడ కనబడటం లేదు, వేరే రకంగా చంకల్లో, గజ్జల్లో కోడిగుడ్డు సైజులో వాపులు వస్తున్నాయి. తర్వాత లక్షణాలు మారి, శరీరమంతా మచ్చలు వస్తున్నాయి.

రోగమూలం కనుక్కోలేక పోవడం చేత వైద్యులిచ్చిన ఏ మందులూ పని చేయటం లేదు. రోగుల నుండి యితరులకు అతి వేగంగా, దావానలంలా వ్యాపిస్తోంది. రోగులు దుస్తులు, వాడిన వస్తువులు ఏవి ముట్టుకున్నా యిట్టే పాకిపోతోంది. వాటిని బయట పారేస్తే వాటిని మూచూసిన జంతువులు కూడా చచ్చిపోతున్నాయి. దాంతో మనుషులంతా రోగులను చూడగానే పారిపోతున్నారు. వాళ్ల అతీగతీ పట్టించుకునేవారు లేరు.

ఇలాటి పరిస్థితుల్లో కొంతమంది ఆరోగ్యవంతులు ఒక బృందంగా ఏర్పడి, అందరికీ దూరంగా ఒక చోట ఉండసాగారు. అక్కడ మితంగా తింటూ, మితంగా తాగుతూ రోగులను దరి చేరనీయకపోవడమే కాదు, వారి గురించి వార్తలు కూడా వినకుండా సంగీతాది లలితకళలతో కాలక్షేపం చేస్తూ బతకసాగారు. మరి కొంతమంది, ఎలాగూ చావబోతున్నపుడు మిగిలిన నాలుగు రోజులు కులాసాగా గడిపేయవచ్చు కదా అనుకుని విపరీతంగా తిని, తాగి, తిరగసాగారు. జీవితంలో తీర్చుకోవాలని అనుకున్న కోరికలన్నీ ఒకేసారి తీర్చుకోసాగారు. ఈ రోగం, ఈ చావు అన్నీ ఓ జోక్‌లా తోచసాగాయి వారికి.

కొంతమంది ఎలాగూ బతకబోవటం లేదు కదాని తమ ఆస్తులను తమతో బాటు అనుభవించమని దారిన పోయేవాళ్లను కూడా అడగసాగారు. దాంతో ఎవరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ యింట్లోకైనా వెళ్లి కొన్నాళ్లు ఉండడం రివాజైంది. ఎల్లెడలా భీతావహ వాతావరణం ఆవరించడంతో ప్రజలు చట్టాలను, ధర్మసూత్రాలను పట్టించుకోవడం మానేశారు. చిత్తమొచ్చినట్లు ప్రవర్తించసాగారు. చట్టాలు అమలు చేసే అధికారుల్లో చాలామంది చచ్చిపోవడం చేత, మిగిలిన వారికి కూడా సిబ్బంది లేకపోవడం చేత వారిని అదిలించేవారు లేకపోయారు.

మధ్యేమార్గంగా బతకదలచిన కొందరు మరీ ఎక్కువగా తినకుండా, మరీ తక్కువగానూ తినకుండా, మరీ జాగ్రత్తలు పడకుండా, జనాల మధ్య తిరగసాగారు. శవాల కంపు తెలియకుండా ఔషధ మూలికలు, పరిమళపుష్పాలు గుప్పిట్లో పట్టుకుని మధ్యమధ్యలో పీల్చేవారు. చాలామంది ఊరొదిలి పోతే రోగం వెంటాడి రాదని నమ్మి, ఫ్లారెన్స్ నగరం వదిలిపెట్టి గ్రామాల బాట పట్టారు. కొంతమంది విదేశాలు వెళ్లిపోయారు.

ఈ వర్గాలన్నిటిలో బతికినవాళ్లు బతికారు, పోయినవాళ్లు పోయారు. చావకుండా మిగిలినవారిని పట్టించుకుని సేవ చేసే వారు ఎవరూ వుండేవారు కారు. డబ్బున్నవాళ్లు సేవకులను పెట్టుకుంటే వారు విపరీతంగా డబ్బు గుంజేవారు. బీదవాళ్ల యింట్లో చావు సంభవిస్తే శవాన్ని వీధిలో పడేసేవారు. ప్రభుత్వసేవకులు వచ్చి తీసుకెళ్లి గుట్టలుగా పోసి అంత్యక్రియలు చేసేవారు. మామూలు యిళ్లల్లో ఎవరైనా చస్తే శవం వెంట పదిమంది కంటె ఎక్కువమంది వచ్చేవారు కారు.

శవం మోయడానికి బంధువులెవరో రాకపోవడంతో నిమ్నవర్గాల ప్రజలను పిలుచుకుని వచ్చేవారు. వాళ్లు, అంత్యక్రియలు చేసే చర్చి పూజారులు విపరీతంగా ‌డబ్బులు వసూలు చేసేవారు. ఇక మంత్రాలు కూడా మరీ ఎక్కువగా ఏమీ చదవకుండా, ఎక్కువ కొవ్వొత్తులు వెలిగించకుండా చప్పున ముగించేసేవారు. గోతులు మరీ లోతుగా తవ్వకుండా పైపైనే కానిచ్చేసేవారు. అంత్యక్రియల సమయంలో చిత్రంగా హోస్యోక్తులు, చతురోక్తులు వినబడేవి. అకాలమరణాల ధాటి తట్టుకోవడానికి కాబోలు!’

ఈ వర్ణన చూస్తూంటే యిప్పటి పరిస్థితులు గుర్తుకు రావడంలో ఆశ్చర్యం లేదు. ఈ వాస్తవ వర్ణన తర్వాత బొకాచియో కథ మొదలుపెట్టాడు. ఫ్లారెన్స్‌లో వున్న ఒక చర్చిలో పనిచేసే ఏడుగురు మహిళలు, 18 నుంచి 27 ఏళ్ల వయసు మధ్యలో వున్నవాళ్లు, సమావేశమై చర్చించుకుని ఊరొదిలి, ఏదైనా గ్రామానికి వెళ్లాలని నిశ్చయించారు. తమతో బాటు ఎవరైనా తోడుగా వుంటే బాగుండుననుకుని మరో ముగ్గురు యువకులను కూడా తీసుకెళ్లారు. వెంట పనివాళ్లు కూడా వున్నారు.

మర్నాటి మజిలీలో ఒక నిర్ణయం తీసుకున్నారు. తాము పదిమంది వంతులవారీగా బృందం బాధ్యతలు స్వీకరించాలని, పనులు ముగించుకుని కూర్చున్నాక ఒక్కొక్కరు ఒక్కో కథ చెప్పాలని. అలా మజిలీలు చేస్తూ రోజుకి పది కథల చొప్పున పదిరోజుల్లో వంద కథలు చెప్పుకున్నారు. వాటి సంకలనమే యీ పుస్తకం. డెకా అంటే పది, మెరాన్ అంటే రోజు. అలా యీ పుస్తకానికి డెకామెరాన్ అనే పేరు వచ్చింది. తెలుగులో గుర్తు పెట్టుకోవాలంటే ‘దశదిన కథాశతం’ అనుకోవచ్చు. దీన్ని రాయడానికి ఆయనకు ఐదేళ్లు పట్టింది.

ఈ వంద కథలలో చాలా వెరైటీ వుంటుంది. ఆనాటి ఇటలీ సమాజం కళ్లకు కట్టినట్లు కనబడుతుంది. కథకులలో చర్చిలో పనిచేసే మహిళలు వున్నా వారు నిర్భయంగా చర్చి పూజారుల అక్రమాల గురించి, లాలసత గురించి, సాధారణ గృహిణుల రసికత గురించి కూడా కథలు చెప్తారు. ఈ పుస్తకం అనేక భాషల్లోకి అనువదితమైంది. చాలా మంది ప్రఖ్యాత రచయితలకు, కవులకు ప్రేరణ కలిగించింది.

షేక్‌స్పియర్ 1605లో రాసిన ‘‘ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్’’ దీనిలో ఒక కథను అనుసరించి రాసినదే. ఫ్రెంచ్ నాటకకర్త మోలియర్ రెండు నాటికలకు, టెన్నిసన్, కీట్స్, షెల్లీ, లాంగ్‌ఫెలో రాసిన కొన్ని గేయాలకు, జోనాథన్ స్విఫ్ట్ రాసిన ఓ కథకు మూలాలు యీ పుస్తకంలో కనబడతాయి. నా దగ్గరున్న పుస్తకం పెంగ్విన్ క్లాసిక్ సీరీస్‌లో భాగంగా 1975లో వెలువడినది. 825 పేజీలు. పీరియడ్ ఎఫెక్ట్ కోసం రాసిన పాతకాలపు ఇంగ్లీషులో వుంటుంది.

ఈ 100 కథల్లో కొన్నిటిని సరదా కథలను ‘‘నెరజాణల కథలు’’ పేర నేను సంక్షిప్తంగా పరిచయం చేస్తున్నాను. జాణ అనేది స్త్రీపరంగానూ, పురుషపరంగానూ కూడా వాడవచ్చు. సామాజికంగా స్వేచ్ఛ ననుభవించే పురుషులు అక్రమసంబంధాలు పెట్టుకున్నారంటే విశేషంగా ఏమీ అనిపించదు. కానీ ఎన్నో కట్టుబాట్ల మధ్య బతకవలసిన గృహిణులు తమకు నచ్చినవాడితో సంబంధం పెట్టుకోవాలంటే ఎంతో చాతుర్యం, సమయస్ఫూర్తి, జాణతనం కావాలి. అది మనకు చిరునవ్వు తెప్పిస్తుంది, అబ్బురపరుస్తుంది. ఆమె ఎలా సమర్థించుకుందో, ఎలా సంబాళించుకుందో తెలుసుకుంటే థ్రిల్ కలుగుతుంది. అందుకే శుకసప్తతి కథల వంటివి ఎన్ని శతాబ్దాలైనా పాఠకులను అలరిస్తున్నాయి.
ఇటాలియన్ మహిళల జాణతనం తెలుసుకునే అవకాశం మనకు వీటి ద్వారా కలుగుతుంది. అలాగే దేవుని ప్రతినిథులుగా పరిగణించబడే చర్చి పూజారులు కూడా తమ యిమేజికి భంగం కాకుండా శారీరకమైన కోరికలు తీర్చుకోవడానికి వేసే వేషాలు, చేసే మోసాలు కూడా నవ్విస్తాయి. అందుకే ఆ కథలను ఎంచుకున్నాను. 

క్రైస్తవ మతగురువుల గురించి గతంలో చెప్పినపుడు ‘పూజారి’ అనే పదం ఉపయోగిస్తే అది హిందూపదమంటూ కొందరు అభ్యంతరం చెప్పారు. పూజ అనేది అన్ని మతాల వారికీ వుంటుంది. పూజలు చేయించేవాడు పూజారి. క్రైస్తవంలో వివిధ స్థాయిల్లో పూజారులు వుంటారు. హోదా బట్టి, దేశం బట్టి పేరు మారుతుంది. అవన్నీ విపులంగా రాయడం అనవసరం. అందువలన సాధ్యమైనంతవరకు పూజారి అనే వాడేస్తున్నాను.

ఈ పరిచయం తర్వాత ప్రాటో నగరానికి చెందిన ఒక జాణ గురించి ఓ చిన్న కథ చెప్తున్నాను. (6-7, పేజీ 498)ఆమె పేరు మడోన్నా. కులీన కుటుంబానికి చెందిన వివాహిత స్త్రీ. చాలా అందంగా వుంటుంది. ఆ నగరంలో ఒక క్రూరమైన చట్టం వుండేది. ఎవరైనా  వివాహిత మహిళ డబ్బు కోసం కానీ, కేవలం ప్రేమ చేత కానీ అక్రమ సంబంధం పెట్టుకుంటే ఆమెను సజీవంగా దహనం చేయాలని ఆ చట్టం చెపుతోంది. చట్టం యింత కఠినంగా వున్నా ఆమె ఒక ప్రియుణ్ని చేరదీసింది. ఇద్దరూ ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు.

ఇది భర్తకు తెలిసింది. భార్యను స్వహస్తాలతో చంపేద్దామన్న కోపం వచ్చింది. అయినా ఆ పనికి చట్టం వుండగా తనెందుకు చేయిచేసుకోవడం అనుకున్నాడు. భార్య ప్రేమాయణం గురించి సాక్ష్యాధారాలు సేకరించి, కోర్టులో కేసు పెట్టాడు. మడోన్నా తన నేరాన్ని ఒప్పేసుకోవడానికి సిద్ధపడింది. ఆమె బంధువులు, స్నేహితులు వద్దని వారించినా వినలేదు. ధైర్యంగా కోర్టుకి హాజరయ్యింది. ఆమె ఏం సంజాయిషీ చెప్తుందో విందామని నగరంలోని స్త్రీపురుషులందరూ, ఊరిపెద్దలతో సహా కోర్టుకి హాజరయ్యారు.

ఆమె చాలా అందంగా, హుందాగా ఉందని, ఉన్నత వంశజురాలని గ్రహించిన న్యాయాధిపతి ఆమె తను అమాయకురాలని చెప్తే బాగుండునని, తన చేతుల మీదుగా ఆ క్రూరమైన తీర్పు యివ్వనక్కరలేకుండా పోతే మంచిదని ఆశించాడు. ‘‘నీపై అభియోగం విన్నావు కదా, నిజమా కాదా నువ్వే చెప్పు.’’ అని అడిగాడు.

మడోన్నా ధీమాగా ఆయన కళ్లలోకే చూస్తూ చెప్పింది – ‘‘న్యాయాధీశా, నా ప్రియుడి బాహువుల్లో వుండగా నా భర్త చూశాడన్నది నిజం. ఆ రోజే కాదు, అంతకుముందు అనేకసార్లు నేను అలా వుండడం సంభవించింది. ఇప్పుడున్న చట్టం ప్రకారం నేను శిక్షార్హురాలినని తెలుసు. కానీ ఆ చట్టమే అభ్యంతరకరం. న్యాయం దృష్టిలో స్త్రీపురుషులిద్దరూ సమానమే అని చెప్తారు. కానీ యీ చట్టం అలా లేదు. పురుషులను వదిలిపెట్టి స్త్రీలకు మాత్రమే శిక్ష విధిస్తోంది. ఈ చట్టాన్ని చట్టసభలో ప్రవేశపెట్టినపుడు ఏ స్త్రీని సంప్రదించలేదు, అనుమతి తీసుకోలేదు. అందువలన యిది పూర్తి ఏకపక్షంగా వుంది.

‘‘అలాటి చట్టాన్ని ఆధారం చేసుకుని నాకు శిక్ష విధిస్తానంటే మీ యిష్టం. కానీ దానికి ముందు నాదొక విజ్ఞప్తి – నీ భార్య నీ పట్ల ఎప్పుడైనా నిరాదరణ చూపిందా? నువ్వు తన శరీరాన్ని కోరినప్పుడు ఎన్నడైనా నిరాకరించిందా? ఏ సమయంలో కోరినా, ఎన్నిసార్లు కోరినా కాదు పొమ్మందా? అని నా భర్తను అడగండి.’’ అంది మడోన్నా.

న్యాయాధిపతి తనను అడిగేలోపే ఆమె భర్త ‘‘లేదు, లేదు. ఆమె నా కోర్కెలు తీర్చడంలో ఎప్పుడూ లోటు చేయలేదు.’’ అని చెప్పేశాడు.

మడోన్నా వెంటనే ‘‘నా ప్రేమలో ఆయన తనకు కావలసినంతా తీసుకుంటూ వచ్చాడు. మరి నా వద్ద మిగిలిపోయిన ప్రేమను ఏం చేసుకోవాలి చెప్పండి. మన వద్ద అదనంగా మిగిలినది యితరులతో పంచుకోమని సమస్త మతగ్రంథాలు ఘోషిస్తున్నాయి. నా భర్త అవసరం తీర్చగా యింకా నా వద్ద ప్రేమ మిగిలిపోతోంది. దాన్ని వీధిలో కుక్కలపాలు చేయనా? అంతకంటె నన్ను ప్రాణాధికంగా ప్రేమిస్తున్న ఒక యువకుడికి ధారాదత్తం చేస్తే తప్పా?

‘‘సరైన సమయంలో వాడుకోకపోతే పాలు మురిగిపోతాయి, అన్నం పాచిపట్టిపోతుంది.  వినియోగించి తీరాల్సిందే. ఇంట్లోవాళ్లను పస్తులు పెట్టి, బిచ్చగాళ్లకు ధారపోయటం లేదు. నా భర్త ఆర్తిని తీర్చిన తర్వాత మిగిలినదానినే నేను మరొక మానవుని కోసం వినియోగిస్తున్నాను. నాకు ఆ శక్తిని భగవంతుడు యిచ్చాడు. నేను చేస్తున్నది నేరమెలా అవుతుంది?’’ అని అడిగింది.

ఆమె వాదనకు, తర్కానికి అందరూ ఆశ్చర్యపడ్డారు, చప్పట్లు కొట్టారు. ఆమె చెప్పినది నిజమే కదా అని వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా స్త్రీలు విపరీతంగా హర్షించారు. న్యాయాధిపతికి కోర్టు వాతావరణం బోధపడింది. ‘‘ఆమె వాదన సమంజసంగా వుందని మీ అందరికీ తోస్తే, ఊరి పెద్దలంతా యిక్కడే వున్నారు కాబట్టి చట్టాన్ని మార్చండి. ఇకపై ఆ శిక్ష డబ్బు తీసుకుని అక్రమసంబంధం పెట్టుకున్న వివాహితలకే వర్తిస్తుందని అనండి. అప్పుడే యీ మహిళను వదిలిపెట్టగలుగుతాను.’’ అన్నాడు.

ఊరి ప్రజల మనోగతాన్ని అర్థం చేసుకున్న పెద్దలు వెంటనే ఆ మార్పు చేశారు. అది వింటూనే మడోన్నా భర్త మౌనంగా యింటికి వెళ్లిపోయాడు. అయితే మడోన్నా యిల్లు చేరడానికి కొంత సమయం పట్టింది. విజేతగా నిలిచిన ఆమెను ఆ వూరి స్త్రీలు ఊరేగింపుగా యింటికి తీసుకెళ్లారు. –
[+] 2 users Like అన్నెపు's post
Like Reply


Messages In This Thread
RE: నెరజాణల కథలు - by అన్నెపు - 26-10-2020, 10:09 PM
RE: నెరజాణల కథలు - by ram - 27-10-2020, 12:44 PM
RE: నెరజాణల కథలు - by Vakra - 29-10-2020, 12:02 AM
RE: నెరజాణల కథలు - by will - 29-10-2020, 09:06 PM



Users browsing this thread: 3 Guest(s)