Thread Rating:
  • 6 Vote(s) - 2.17 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Non-erotic మన తెలుగు గురించి కొంత తెలుసుకుందాము
#43
తెలుగు వచన రచనకి కావలసిన శిక్షణ

వ్యావహారిక భాష అనే పేరుతో చెప్పుకోదగ్గ కట్టుబాట్లు లేని ఒక ఆధునిక రచనాభాష 1940ల నాటికి తయారయింది. ఆ భాషలో చెప్పుకోదగ్గ మంచి వచన రచనలు చేసినవాళ్లు చాలామంది వున్నారు. వీళ్లలో చాలామంది కథలు, నవలలు రాసినవాళ్లయితే కొద్దిమంది మాత్రం వైజ్ఞానిక విషయాల మీద పుస్తకాలు రాసినవాళ్లు. ఇలాంటి వచనం రాసినవాళ్లందరూ ఇంగ్లీషు బాగా వచ్చినవాళ్లే. ఇంగ్లీషులో వచ్చిన వచనాన్ని అనుసరించి దాదాపు అదే తర్కంతో అదే ఆలోచనా విధానంతో తెలుగు వచనాన్ని సమర్థంగా రూపొందించినవాళ్లలో కొడవటిగంటి కుటుంబరావు పేరు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొ.కు. వ్యాసాలుగా వి.ర.సం. ప్రచురించిన సంపుటాలు చూస్తే వ్యాస నిర్మాణంలో కుటుంబరావు ఎంత శ్రద్ధ తీసుకున్నారో తెలుస్తుంది. దానితో పాటు వాక్యనిర్మాణంలో, ఆలోచనా తర్కంలో పైకి ఆడంబరంగా చెప్పకపోయినా, విమర్శకులు ప్రత్యేకంగా గుర్తించకపోయినా ఆయన తెలుగు వచనానికి, తెలుగు వ్యాసానికి యెంత గొప్ప నిర్మాణాన్ని ఇచ్చారో బోధపడుతుంది. కాకపోతే వచనాన్ని గురించిన చర్చలు మనకు లేవు కాబట్టి, మనకు ఎవరు ఏది రాసినా వచనమే ఎలా రాసినా వచనమే అనే అభిప్రాయం యేర్పడబట్టి తెలుగు రచనలో పొల్లు, నెల్లు కలిసిపోయి వుంటాయి. వీటిని విచక్షించి చూపించేవాళ్లు లేకపోవడంతో మనకు తెలుగు వచనం మీద ఆలోచన వృద్ధి పొందలేదు. ఒక పక్క తెలుగు పత్రికలు ఇంగ్లీషు మాటలు విచ్చలవిడిగా వాడేస్తూ, తెలుగులో వందల కొద్ది పుస్తకాలు దారీ తెన్నూ లేకుండా అచ్చు అవుతూ వున్నా కూడా, తెలుగు పుస్తకాల గతి ఏమిటి అని ఆలోచించేవాళ్లు ఇప్పటికీ కనిపించరు.

మల్లాది వెంకటరత్నం రాసిన పూర్తి తెలుగు పుస్తకం ఒకటి పై అట్ట మీద, Development of Telugu Prose – How to write Telugu అనే ఇంగ్లీషు పేరుతోనూ, లోపల తెలుగు వచన కావ్య వృద్ధి – తెలుగు వ్రాయుట ఎట్లు? (మద్రాసు, 1918) అన్న పేరుతోనూ ఉంది. ఈ పుస్తకం ఆ కాలంలో పెద్దగా చర్చించబడినట్టు లేదు. అందుచేత, దీనిలో వున్న ముఖ్య సూచనలని మాత్రం ఈ కింద ఇస్తున్నాం. అవి ఇవి:

1. సులభమయిన మాటలను వాడుట
2. పెద్ద సమాసములను వాడకుండుట
3. కొత్త మాటలను భాషలోనికి రానిచ్చుట
4. సంధులను విడగొట్టి వ్రాయుట
5. ‘య’డాగమమును విసర్జించుట
6. విభక్తుల చివరను ‘ను’గాగమమ్మును వదలివేయుట
7. అరసున్నలను విడిచివేయుట
8. బండి ‘ర’ను మానివేయుట

ఈ విషయాలని ఇంకా వివరంగా చెప్పటం కోసం పుస్తకంలో మిగతా పేజీలన్నీ గ్రంథకర్త ఉపయోగించారు. ముఖ్యభాగాన్ని నాలుగు పేజీల్లో చెప్పి ఉంటే ఈ పుస్తకానికి ఎక్కువ ప్రచారం వచ్చి ఉండేదేమో. దీర్ఘమైన చర్చల్లో పేజీలన్నీ నింపడం చేత కాబోలు ఈ పుస్తకానికి అంత ప్రచారం రాలేదు. ఆ మాటకొస్తే ఈ పుస్తకాన్ని గురించి ఎవరూ చెప్పలేదు, గిడుగు రామమూర్తిగారు ఈ పుస్తకాన్ని గురించి ఏమీ మాట్లాడలేదు. ఆ తరవాత వచ్చిన అనేకమంది వ్యావహరికవాదులు కూడా ఈ పుస్తకాన్ని గుర్తించలేదు.

‘తెలుగు యెప్పుడుగాని ఉత్తమ విద్యాద్వారంగా వుండలేదు’ అని అక్కిరాజు ఉమాకాంతంగారు అన్నారని ఈ వ్యాసం రెండవ భాగంలో చెప్పాం (చూ. ఫుట్‌నోట్ 14). ఒకప్పుడు, అంటే ఇంగ్లీషు మనదేశంలో రాజ్యం యేలక ముందు, మనం శాస్త్ర గ్రంథాలన్నీ సంస్కృతంలోనే రాశాం. ఒక్క దక్షిణాంధ్ర యుగంలో మాత్రం తెలుగు శాస్త్రభాష అయ్యింది అని నిడదవోలు వెంకటరావు అన్నారు అని ఈ వ్యాసం రెండవ భాగంలో చెప్పాం. అయినా మొత్తం మీద సంస్కృతానిదే శాస్త్రాధికారం. జగన్నాథ పండితరాయలు తెలుగువాడు అని మనం ఎంత గొప్పగా చెప్పుకున్నా ఆయన రసగంగాధరం సంస్కృతంలోనే రాశాడు. ఇవాళ ఆలోచనాశక్తిని పెంపొందించే పుస్తకాలు తెలుగు వాళ్లయినా ఇంగ్లీషులోనే రాయాలి. అంటే పూర్వపు సంస్కృతం స్థానాన్ని ఇంగ్లీషు ఆక్రమించింది. ఇప్పుడు ప్రస్తుత సమస్య తెలుగు వచనానికి శాస్త్రస్థాయి కల్పించగలమా అనేది. అలా కల్పించగలగాలి అంటే తెలుగు రాసే పద్ధతిలో రెండు మార్పులు రావాలి.

1. వాక్యనిర్మాణక్రమం: అచ్చులో వున్న ఆధునిక తెలుగు వచనం పరిష్కృత రూపంలో ఏర్పడడానికి పత్రికలు, ప్రచురణ సంస్థలు ఉమ్మడిగా పూనుకోవాలి. ప్రచురణ సంస్థలకి ప్రత్యేకమైన భాషా పరిష్కర్తలు వుండాలి. వాళ్లు ఆ ప్రచురణ సంస్థ వాడే భాషకి నియమాలు యేర్పరిచి ఆ నియమాలకి లోబడి రాసిన వచనాన్నే తాము ప్రచురిస్తామని నిక్కచ్చిగా చెప్పాలి. ఈ భాషా పరిష్కర్తల్నే ఇంగ్లీషు ప్రచురణ సంస్థలవారు కాపీ ఎడిటర్లు అంటారు. తెలుగులో ఏ ప్రచురణ సంస్థకీ పాఠపరిష్కర్తలు, కాపీ ఎడిటర్లు లేరు. ఈ విషయం మేము గతంలో తెలుగులో పుస్తక ప్రచురణ – ఆకారవికారాలు అన్న వ్యాసంలో చర్చించాం.

2. వచనం: ఒక్కసారి వెనక్కి వెళ్లి చూస్తే పూర్వం మనకి శాస్త్రగ్రంథాలు రాసేటప్పుడు అనుబంధ చతుష్టయం పాటించాలి అని ఒక నియమం ఉండేది. అనుబంధ చతుష్టయం అంటే ఈ నాలుగు; 1. విషయము, 2. ప్రయోజనము, 3. సంబంధము, 4. అధికారి. ఏ పుస్తకంగానీ రాసేవాళ్ళు ఈ నాలుగు ముందుగా చెప్పాలి. అంటే: 1. ఈ పుస్తకంలో విషయమేమిటి? 2. దీనివల్ల ప్రయోజనమేమిటి? 3. ఈ పుస్తకంలో విషయానికి చుట్టూ వున్న ఇతర విషయాలకి సంబంధం ఏమిటి? అంటే ఈ పుస్తకంలో చెప్పిన విషయం ఏ విధంగా ఈ శాస్త్రానికి సంబంధించిన ఇతర విషయాలతో సంబంధిస్తుంది? ఇందులో ఏది చెప్పబడుతుంది? ఏది చెప్పబడదు? 4. ఈ పుస్తకాన్ని చదవడానికి పాఠకులకి ఎటువంటి అర్హతలు కావాలి? ఈ నాలుగు విషయాల్ని ముందే చెప్పేస్తే చదివేవాళ్ళు ఆ పుస్తకం సరిగ్గా చదవగలుగుతారు. లేదా అందులో వున్న విషయంపై అధికారం లేకపోతే చదవడం మానేస్తారు. అంతేగానీ ఆ పుస్తకం తీసి తమకు తోచిన మాటలు చెప్పరు. తెలుగులో మనం రాసే పుస్తకాల్లో ఈ అనుబంధ చతుష్టయాన్ని పాటించాలని అనుకుంటే తెలుగు వచన సంప్రదాయం పటిష్టంగా, తార్కికంగా వుంటుంది.

ఆంగ్ల నిఘంటువుల సంప్రదాయం తెలుగులో కూడా వుంటే అందులోని పదాలకి వాటి వాడుక గురించిన గుర్తింపులు ఉండేవి: ఉదా. 1. కవిత్వోపయోగి, 2. పాండిత్య ప్రకర్షకం, 3. ప్రాచీనం, 4. కృతకం. తెలుగులో ఇప్పటికీ నిఘంటువులలో ఈ రకమైన గుర్తింపులు మనకు కనపడవు. ఈ గుర్తింపులు లేకపోవడం చేత తెలుగులో ఉత్తరం ముగించేటప్పుడు భవదీయుడు, విధేయుడు, అనే మాటలు గౌరవార్థంలోను, ప్రేమగా, ఆప్యాయంగా అనే మాటలు వ్యక్తిగతమైన ఉత్తరాలలోను ఉండటమే కాకుండా ఉద్యోగసంబంధమైన ఉత్తరాలలో ‘నమస్సుమనుస్సులతో’ లాంటి మాటలు రాస్తే ఎవరూ కాదనడానికి వీల్లేదు. ఏది ఆధునిక తెలుగు భాష, ఏది కాదు అనే విషయంలో మనకు ఒక నిశ్చితమైన అభిప్రాయం రావడానికి మనకు నిఘంటువులు, ప్రచురణకర్తలు తోడ్పడాలి. పైన చెప్పినట్లు పద్యాలు రాయడానికి కవిత్వాలు చెప్పడానికి పాటలు పాడడానికి ఎవరి తోడ్పాటు, పోషణ అక్కర్లేదు. అందులో యే భాష వాడినా దాన్ని తప్పు పట్టవలసిన అవసరం లేదు. అది కవిస్వేచ్ఛ. కాని, వచనం కొన్ని నియమాలకి లోబడి ఉండాలి, ఆ నియమాలు అందరూ అనుసరించాలి. వచనం రాయడం ఎలాగో, వ్యాసం రాయడం ఎలాగో చిన్నప్పటినుంచి తరగతి గదుల్లో నేర్పించాలి. ఈ రకంగా నేర్పకుండానే వచనం రాయడం వచ్చేస్తుందనే భ్రమ మనందరిలో ఇప్పటికీ వుంది. మంచి వచనం లేని జాతికి మంచి ఆలోచన కూడా వుండదు. అందుచేత మనం ఆలోచించవలసింది సాహిత్యాన్ని గురించి కాదు వచనాన్ని గురించి.
 horseride  Cheeta    
Like Reply


Messages In This Thread
RE: మన తెలుగు గురించి కొంత తెలుసుకుందాము - by sarit11 - 29-08-2020, 02:46 PM
చెప్పండి - by Mohana69 - 29-08-2020, 10:42 AM



Users browsing this thread: