29-08-2020, 02:30 PM
తెలుగు మీద సర్ ఆర్థర్ కాటన్ ప్రభావం
గిడుగు రామమూర్తిగారు శిష్టులు అంటే ఎవరో వివరించకపోయినా ఒక విచిత్రమైన రాజకీయ, సామాజిక కారణాల వల్ల శిష్టత్వం అనుకోకుండా యేర్పడింది. ఆధునిక కాలంలో తెలుగు భాషకి నన్నయకన్నా, చిన్నయసూరికన్నా, సర్ ఆర్థర్ కాటన్ ఎక్కువ కారణమయ్యాడని చెప్పాలి. కాటన్ గోదావరి మీద, కృష్ణ మీద ఆనకట్టలు కట్టకముందు ఆ ప్రాంతానికి ఆర్థికంగా ఇప్పుడున్న బలం లేదు. ఆ కాలంలో రాయలసీమ ఆర్థికంగా కృష్ణా, గోదావరి జిల్లాల కన్నా ముందుండేది. అక్కడ వున్న చెరువుల పద్ధతి వల్ల నీరు సమృద్ధిగా అంది పంటలు పుష్కలంగా పండేవి. కృష్ణా, గోదావరి జిల్లాల్లో ఒక డెల్టా భాగాన్ని మినహాయిస్తే మిగతా ప్రాంతాలలో పంటలు కేవలం వర్షాల మీదే ఆధారపడేవి. బ్రిటిష్‌వారి పుణ్యమా అని రాయలసీమలో చెరువులు ధ్వంసం అయిపోయాయి. అంచేత రాయలసీమ కరువు ప్రాంతమయింది. ఈ లోపున కాటన్ కట్టిన ఆనకట్టల వల్ల కృష్ణా, గోదావరి జిల్లాలు పంటలు పండే నేలలయ్యాయి. తాము రైతులకి కౌలుకిచ్చిన భూములవల్ల వచ్చిన డబ్బుతో అక్కడి బ్రాహ్మణ కులాలవాళ్లు మొట్టమొదట ఇంగ్లీషువాళ్లు పెట్టిన స్కూళ్లలో చదివి పై చదువులకు మద్రాసు వెళ్లి ఆధునిక విద్యావంతులయారు. పై చదువులు చదివినా చదవకపోయినా మద్రాసులో వుండే వావిళ్లవారి వంటి ప్రచురణాలయాల కారణంగాను, కొత్తగా పెట్టిన భారతి, ఆంధ్రపత్రిక వంటి పత్రికల కారణంగాను బ్రాహ్మణులు చాలామంది మద్రాసు చేరారు. వీళ్లు పత్రికల్లోను, ఆ తర్వాత ఏర్పడిన రేడియోలోను ఉద్యోగాల్లో చేరారు. రేడియో వచ్చిన తరువాత, పత్రికల ప్రచారం పెరిగిన తరువాత, పత్రికల భాష బ్రాహ్మణ వ్యావహారిక భాషకు దగ్గరకాక తప్పలేదు. అంటే చదువుకున్న బ్రాహ్మణులు మాట్లాడే భాషకీ సరళ గ్రాంథికానికీ మరీ దూరం కాని మధ్యస్థాయిలో పత్రికల భాష, రేడియో భాష వుండేది. పత్రికల్లో ఇంగ్లీషులో టెలీప్రింటర్ మీద వచ్చిన వార్తలు అనువాదం చేయవలసిన అవసరం వల్ల సంస్కృత పదాల ఉపయోగం ఒక పక్క పెరుగుతూ వచ్చినా క్రియాపదాలు మాత్రం బ్రాహ్మణ వ్యవహారంలో వున్నవే వుండేవి. ఈ రకంగా ఒక ఆధునిక రచనాభాష తయారయింది.
ఈ ఆధునిక రచనాభాషలో కూడా అలవాటు బలిమి వల్ల ‘వ్రాయు’ వంటి గ్రాంథిక వర్ణక్రమాలు, ‘చెప్పవలెను’,’ఏతెంచిరి’ లాంటి క్రియాపదాలు వాడుతూనే వచ్చారు. 1947 సంవత్సరంలో ఆంధ్రపత్రిక చూస్తే ఒక పక్క సరళ గ్రాంథికం, ఇంకొక పక్క బ్రాహ్మణ వ్యావహారికం రెండూ కనిపిస్తాయి. మేము సరిగా తైపారు వేసి చూడలేదు కానీ నార్ల వెంకటేశ్వరరావుగారి సంపాదకత్వంలో ఆంధ్రప్రభ పూర్తిగా బ్రాహ్మణ వ్యావహారిక భాష వాడుకలోకి తెచ్చిందని మా అంచనా. కాని ఇదే సమయంలో అదే ఆంధ్రప్రభ వాడుకలో ఎప్పుడూ లేని పెద్ద పెద్ద సంస్కృత సమాసాలు (ఉదా. సప్తతిమ జన్మదినోత్సవం), సంస్కృత వ్యాకరణం వొప్పుకోని ‘విలేఖరులు’ వంటి పదప్రయోగాలు వ్యావహారిక రచనాభాష లోకి పట్టుకొచ్చింది. ఈ రకంగా వ్యావహారికం అనే భాష నిజంగా వ్యవహారంలో పూర్తిగా లేదని, రచన కోసం ఏర్పడిన ఒక కొత్త రకమైన భాష అని, అయినా దీన్ని వ్యావహారికం అంటున్నారని బోధపడుతుంది.
ఇది ఇలా వుండగా వ్యావహారిక భాషకి ఏ రకమైన నియమాలు లేవు, ఎవరికి తోచినట్లు వాళ్లు రాయొచ్చు అనే అభిప్రాయం బలంగా అందరిలోనూ వేళ్ళూనుకుంది. ఇందువల్ల తెలుగు పత్రికల స్థితి క్రమేణా ఎలా అయిందో చూడడానికి కొద్దిగా ప్రయత్నం చేద్దాం. ఒకప్పుడు తెలుగు పత్రికల్లో తెలుగులో అంతో ఇంతో పాండిత్యం వున్నవాళ్లే సబ్-ఎడిటర్లుగా చేరేవారు. భారతిలోను, ఆంధ్రపత్రికలోను పనిచేసిన వాళ్లందరూ తెలుగు బాగా చదువుకున్నవాళ్లే. వీళ్లందరూ ఏ రోజుకారోజు తెలుగు వార్తలు రాయడానికి ఇంగ్లీషులో వున్న మాటలకి కొత్త అనువాదాలు సృష్టించి అవి పత్రికల్లో హెడ్‌లైన్లుగా (పతాక శీర్షిక అనే మాట ఈ కాలంలోనే అమలులోకి వచ్చింది) పెట్టినందుకు గర్వపడుతూ వుండేవాళ్లు. ఆల్ ఇండియా రేడియో కూడా ఇదే సమయంలో కొత్త కొత్త మాటలు, భాషలో కొత్త అలవాట్లు సృష్టించింది: నిలయ విద్వాంసులు, ఆకాశవాణి, ఇలాంటి మాటలు ఆల్ ఇండియా రేడియో కల్పించినవే. తెలుగు వార్తలు ఢిల్లీ నుంచి వచ్చేవి. ఢిల్లీ నుంచి ఉదయం, సాయంత్రం ఏడు గంటలకి చదివే వార్తలు ఇంగ్లీషులోనుంచి అప్పటికప్పుడు అనువాదం చేసేందుకు అక్కడి ఆకాశవాణి స్టూడియోలో తెలుగు సంపాదకులు కొందరు పనిచేసేవారు. వీళ్లందరి ఉమ్మడి ప్రయత్నం ఫలితంగా ఆధునిక తెలుగు రచనాభాష పైకి చెప్పబడని కొన్ని నియమాలతో, కాగితం మీద ఎక్కడా రాయని కొన్ని కట్టుబాట్లతో తయారవుతూ వస్తూ వుండేది.
గురజాడ అప్పారావుగారు తమ కన్యాశుల్కం రెండవ ముద్రణకి ఇంగ్లీషులో రాసిన ఉపోద్ఘాతంలో ఆధునిక తెలుగు వచన నిర్మాణానికి పుట్టబోయే మహాకవులు దారి చూపిస్తారని అని రాశారు. (‘A great writer must write and make it. Let us prepare the ground for him.’) ఆయన అప్పట్లో ఊహించినా, ఊహించకపోయినా ఆధునిక తెలుగు భాషని తయారు చేసినది గొప్పరచయితలు కారు. తెలుగు పత్రికల్లో వార్తలు రాస్తున్నవాళ్ళు, సంపాదకీయాలు రాస్తున్నవాళ్ళు, వ్యాసాలూ రాస్తున్నవాళ్ళు.
చిన్నయ సూరి సూత్రములఁ జిక్కి కృశించి, విషాదమొందుతూ
వున్న తెనుంగు, శృంఖలము లూడి, సుఖంబుగ మేడమీదఁ గూ
ర్చున్నది; నూత్నకాంతి గనుచున్నది, హాయిగ నేడు సంచరి
స్తున్నది, రామమూర్తి విబుధోత్తమ! నీ శ్రమకున్ ఫలంబుగాన్
అని భోగరాజు నారాయణమూర్తి కాస్త గ్రాంథికంలోను, కాస్త వ్యావహారికంలోను పద్యం రాసి (గ్రాంథిక రూపాలు లేకుండా పద్యాలు రాయడం కుదరదని ఇంతకు ముందు చెప్పాం.) గిడుగు రామమూర్తి పంతులుని ఎంత మెచ్చుకున్నా, ఆధునిక వ్యావహారిక భాష తయారయ్యింది రేడియోల వల్ల, పత్రికల వల్ల మాత్రమే. అయితే గిడుగు రామమూర్తిగారి గంభీరమయిన ఉద్యమం వల్ల ఒక గొప్ప మార్పు జరిగింది. తెలుగులో రాసేవాళ్లకి వ్యాకరణం అంటే భయం పోయింది. వ్యాకరణ విరుద్ధం అని పాత తెలుగు పండితులు అనే మాటకి గౌరవం పోయింది. పత్రికలలో రాసే తెలుగుకి గౌరవం వొచ్చింది.
కాలక్రమేణా పండితులు తగ్గి ఆధునిక కవులు, అంటే పాండిత్యంతో సంబంధం లేనివాళ్లు పత్రికల్లో చేరారు. వాళ్లకి ఏ రకమైన జర్నలిస్టు తర్ఫీదు వుండేది కాదు. అది కేవలం ఉద్యోగంలో చేరిన తరవాత నేర్చుకున్నదే అయివుండేది. కాని వచన పద్యంలో అయినా, గేయంలో అయినా, కేవలం వచనంలో అయినా సమర్థంగా భాషని వాడగల శక్తి వాళ్లకి వుండేది.
నార్ల వెంకటేశ్వరరావు దగ్గరనించి, నండూరి రామమోహనరావు దాకా, ముళ్లపూడి వెంకటరమణ దగ్గరనించి పురాణం సుబ్రహ్మణ్యరావు దాకా అప్పటికి పెద్ద పేరు లేకపోయినా అసాధారణ ప్రతిభావంతులు తెలుగు పత్రికల భాషకి ఒక గొప్ప గౌరవాన్ని కలిగించారు. కాని, వాళ్ల తరం ఒక పదిహేనేళ్లలో అయిపోయింది.