29-08-2020, 02:20 PM
తెలుగు పాఠాలలో తరవాత పరిస్థితి
కాని తెలుగు పాఠాలు మాత్రం ఇంకా ఆ గూడుకట్టుకున్న భాషలోనే వుండేవి. నాన్-డిటెయిల్డ్ స్టడీ (Non-Detailed Study) అనే పేరుతో ఏదో ఒక వచన గ్రంథం ఉండేది. ఇది కూడా తెలుగు సాహిత్యంలో పేరున్న రచయితల వచన గ్రంథం కాకుండా చిన్నయసూరి వ్యాకరాణనికి లోబడి రాయబడిన వచన గ్రంథం అయి వుండేది. తరవాత తరవాత గ్రాంథికమైన తెలుగులో మంచి వచన రచనలు కనిపించకపోతే ఆంధ్ర విశ్వవిద్యాలయం నవలల పోటీలు పెట్టి ఆ పోటీలలో బహుమానాలు వచ్చిన పుస్తకాలనే నాన్-డిటెయిల్డ్ స్టడీగా పెట్టేవారు. ధూళిపాళ శ్రీరామమూర్తి గృహరాజు మేడ, మల్లాది వసుంధర–తంజావూరి పతనము, సప్తపర్ణి, వంటి పుస్తకాలే ఉండేవి! అలాగే మోడర్న్ పొయెట్రీ (Modern Poetry) అనే విభాగం కింద ఏదో ఒక పుస్తకం నిర్ణయించబడేది. అంతే కాని, తెలుగు సాహిత్యంలో వస్తున్న పెద్ద మార్పులు గమనించి కాని, నిజంగా ఆధునికులు కవులు అయినవాళ్ల పుస్తకాలు పరిశీలించి కాని, టెక్స్ట్ బుక్ కమిటీవాళ్లు పుస్తకాలు పెట్టేవాళ్లుకాదు.
ఆధునిక సాహిత్యంలో గొప్ప రచయితలయిన శ్రీశ్రీ, పఠాభి, చలం, కుటుంబరావు, గోపీచంద్, కృష్ణరావు, ఇలాంటి వాళ్ల పుస్తకాలేవీ విద్యార్థులు చదివేవాళ్లుకారు. చిన్నయ సూరి వ్యాకరణం ప్రకారం రాసిన, అంత పెద్ద పేరు లేనివాళ్ల పుస్తకాలు ఆధునిక కవిత్వం పేరుతో పాఠం చెప్పబడేవి. క్రమంగా తెలుగు శాఖల్లో నేర్పే తెలుగుకి బయట లోకంలో తయారవుతున్న తెలుగుకి ఏ రకమైన సంబంధం లేని ఒక పెద్ద అగాధం యేర్పడింది. ఇది కేవలం భాషకి సంబంధించిన విషయమే కాదు. భాషలో చెప్పే ఆలోచనలకి, విజ్ఞానానికి, సృజనాత్మకతకి సంబంధించిన విషయం. తెలుగు పాఠం చెప్పే పండితులు కేవలం చిన్నయ సూరి వ్యాకరణం ప్రకారం అరసున్నలు, బండి ర(ఱ)లు ఉన్నాయా? సంధులు యడాగమాలు ఉన్నాయా? సరళాదేశాలు గసడదవాదేశాలు పాటింపబడ్డాయా? అనే చిన్న చిన్న విషయాలు మాత్రమే ప్రధానంగా చూసి దిద్ది వ్యాస రచనల్ని తిరిగి విద్యార్థులకి ఇచ్చేవారు. లాక్షణిక భాష అన్న పేరుతో భాష లోకానికి దూరమైపోవడం మూలంగా వచ్చిన దుస్థితి ఇది.
గిడుగు రామమూర్తి ఆంధ్రపండిత భిషక్కుల భాషా భేషజం చూస్తే ఆయన వాదనంతా చిన్నయ సూరి వ్యాకరణం ప్రకారం అసాధువులు అని చెప్పిన మాటలు తిక్కన మొదలుకొని పూర్వ కవులు అందరూ వాడారని రుజువు చేయడమే. ఆ మాటకొస్తే చిన్నయ సూరి కూడా తన వ్యాకరణం ప్రకారం తానే రాయలేకపోయాడు. అందుచేత శిష్టవ్యావహారికం వాడటం భాషకి మంచిది. ఇదీ రామమూర్తిగారి వాదం. ఈ సంగతి సూచనగా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాం.
కాకపోతే వ్యావహారికం అనే మాటని రామమూర్తిపంతులు చాలా ఉదారంగా వాడారు. ఆయన వ్యావహారికానికి చూపించే ఉదాహరణల్లో ఒకే రకమైన వ్యావహారికం లేదని, అనేక రకాలైన వ్యావహారికాలు వున్నాయని ఆయన పట్టించుకోలేదు. అన్నమయ్య పాటల్లో ఒక రకమైన వ్యావహారిక భాష ఉంటుంది. సారంగపాణి పాటల్లో ఇంకో రకమైన వ్యావహారికం వుంటుంది. పండితులు రాసే వ్యాఖ్యానాల్లో ఇంకో రకమైన వ్యావహారికం వుంటుంది. కరణాలు రాసే దస్తావేజుల్లో మరొక రకమైన వ్యావహారికం వుంటుంది. ఈ వ్యావహారికాలు వాడేవాళ్లు అందరూ శిష్టులే అయినా వాళ్ల భాషలు వేరువేరుగా వుంటాయి. వీటినన్నిటీ కలిపి వ్యావహారికం అనే పేరు పెట్టటం వల్ల చిన్నయసూరి వ్యాకరణానికి విరుద్ధమైనది వ్యావహారికం అనే అభిప్రాయం బలపడింది. ఇన్ని రకాల వ్యావహారికాలకి వాటి వాటి సందర్భాలలో ఏకత్వం వుందని, ఆ ఏకత్వాలకి ఒక నియమం వుందని, వాళ్లందరూ శిష్టులే అయినా శిష్ట వ్యావహారికం అంటూ ఒకటి లేదని అది అనేక రకాలుగా వుందని రామమూర్తి గమనించారు కానీ వాటిని గురించి చర్చించలేదు. శిష్టులంటే ఎవరు అని ఎన్నిసార్లు అడిగినా ఆ మాటని కూడా ఆయన నిర్ధారించలేదు.