06-07-2020, 01:05 AM
ఒక్కసారి వెనక్కి తిరిగి చూద్దాం.
తెలుగు ఎప్పుడైనా రాజభాష అయిందా అంటే (నిడదవోలు వెంకటరావుగారి మాట నమ్మాలంటే) ఒక్క నాయక రాజుల కాలంలోనే అయ్యింది. ఆ కాలంలోనే రాజ్యవ్యవహారాలు తెలుగులో నడిచాయి. అంతకుముందు సంస్కృతం రాజభాష. ఆ తరవాత పర్షియన్ రాజభాష. కృష్ణదేవరాయల కాలంలో ఏది రాజభాషో మనం నిక్కచ్చిగా చెప్పలేం. కృష్ణదేవరాయలు తను తెలుగులో కావ్యం రాసినా చాలా శాసనాలు నాలుగు భాషల్లో వేశాడు; సంస్కృతం, కన్నడం, తెలుగు, తమిళం. కృష్ణదేవరాయల కాలంలో మనం గొప్పగా చెప్పుకునే పెద్దన్న, తిమ్మన్న తెలుగు కావ్యాలే రాసినా, కృష్ణదేవరాయలది తెలుగు సామ్రాజ్యం అని మనం చెప్పుకున్నా, రాయలు ఆముక్తమాల్యద తెలుగులోనే రాశాడు కాబట్టి ఆయన తెలుగువాడే అని మనం పొగుడుకున్నా, కన్నడులు అంత గట్టిగాను కృష్ణదేవరాయలు కన్నడిగుడే అని నమ్ముతారు. ఆయన సామ్రాజ్యం కన్నడ సామ్రాజ్యమే అనుకుంటారు. అంచేత నిక్కచ్చిగా నాయక రాజుల కాలంలోనే తెలుగు భాష రాజభాషగా వర్ధిల్లిందని వెంకటరావు ఊహ. ఆ కాలంలోనే కవిత్వం ఒక్కటే కాకుండా తెలుగులో శాస్త్రగ్రంథాలు వచ్చాయి. ఖడ్గలక్షణ శిరోమణి, అశ్వశాస్త్రం, ఔషధ యోగములు, ధనుర్విద్యా విలాసము, ఇంకా ఇలాంటివి. తెలుగులో కవిత్వమే కాకుండా విజ్ఞానం అందించేవి కూడా వచ్చాయి అని వెంకటరావు సరిగానే గుర్తించారు.
ఈ పరిస్థితి ఇలా కొనసాగితే ఎలా వుండేదో మనం చెప్పలేం కాని దీనికి ఇంగ్లీషువాళ్ళు అధికారంలోకి రావడంతో పెద్ద అడ్డొచ్చింది. వాళ్ళు వచ్చిన తొలి రోజుల్లో తెలుగు నేర్చుకుని తెలుగులోనే పరిపాలన చేయాలి అని అనుకున్నారు. కాని పరాయి వాళ్ళకి తెలుగు ఎలా నేర్పాలో మన పండితులకి తెలియలేదు. వాళ్ళు ఈ తెల్లవాళ్ళకి తెలుగు నేర్పడం పేరుతో నన్నయభట్టీయం (ఆన్ధ్రశబ్దచింతామణి) నేర్పేవాళ్ళు. కచేరీలలో పరిపాలనకి ఎందుకూ పనికిరాని ఈ భాషతో ఏమి చెయ్యాలో తెలియక, ఇంక ఏ దారీ బోధ పడక, వాళ్ళు తమకి కావలసిన వ్యాకరణాలు తామే రాసుకున్నారు; కావలసిన నిఘంటువులు వాళ్ళే తయారు చేసుకున్నారు–విలియం క్యారీ, ఎ. డి. క్యాంప్‌బెల్, సి. పి. బ్రౌన్, ఆర్డెన్, మొదలైనవాళ్ళు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే తెలుగు పరిపాలనా భాష అయి వుండేది. తెలుగులో వివిధ విషయాల మీద వచన గ్రంథాలు వచ్చి వుండేవి. అప్పటికే ప్రచారం లోకి వచ్చిన అచ్చు యంత్రం సహాయంతో తెలుగు కొత్త పుంతలు తొక్కేది.
అన్యాయంగా ఈ పురోగమనానికి తీవ్రంగా అడ్డొచ్చినవాడు మెకాలే. అప్పటినుంచి ఇంగ్లీషు ప్రభావం ఫలితంగా మనలో ఒక ఆత్మన్యూనతాభావం మొదలయింది. మన పాతభాషని నిలబెట్టుకోడానికి వ్యాకరణాల పేరుతో గిరి గీసుకుని కూర్చోవడం మొదలయింది. విశ్వవిద్యాలయాలు ఇంగ్లీషు నేర్పుతూ వుంటే మన మేధావులు ఎంతో హాయిగా నేర్చుకుని తెలుగు తమకి రాదని, రానక్కర్లేదని పట్టుదలగా కూర్చున్నారు. మన మేధావులంతా కేవలం ఇంగ్లీషే నేర్చుకుని అందులోని విషయాలనే–హిస్టరీ, జాగ్రఫీ–మొదలైనవి జ్ఞానపరమావధిగా భావించారు. లార్డ్ కర్జన్ ఇలా ఇంగ్లీషు చదువుకున్నవాళ్ళు తమ భాషలకి ఏ ఉపకారమూ చెయ్యటం లేదని గమనించి ఒక సభ పెట్టి విశ్వవిద్యాలయాలలోనూ, ఇతర కాలేజీల్లోనూ, హైస్కూళ్ళల్లోనూ తెలుగు నేర్పాలనీ, ఇంగ్లీషులోంచి తెలుగులోకి అనువాదం ఒక ప్రధాన విషయం చెయ్యాలనీ అనుకోవడం ఆచరణలోకి వచ్చేసరికి తెలుగులో అతని అసలు ఉద్దేశం పక్కకు పోయి లాక్షణిక-గ్రామ్య/గ్రాంథిక-వ్యావహారిక వివాదంగా పరిణమించిందని మనం చూశాం. ఒక పక్క తెలుగు పండితులూ, తెలుగులో మిగిలిన ఒకరో ఇద్దరో మేధావులూ ఈ ప్రపంచంలో కొట్టుమిట్టాడుతూ వుంటే బయట అందరూ ఇంగ్లీషే నేర్చుకుంటున్నారనీ, అందులోని విజ్ఞానమే నిజమైన విజ్ఞానం అని అనుకుంటున్నారని మనం మర్చిపోకూడదు. ఈ పండితుల వాదప్రతివాదాలు కూడా ఇంగ్లీషులోనే జరిగాయనీ మనం మరీ గుర్తించాలి.
ఈ వరసలో సామినేని ముద్దునరసింహం నాయుడు లాంటి తెలివైన వాళ్ళ మాటలు ఎవరూ పట్టించుకోలేదు. పండితులు గిరి గీసుకుని వాళ్ళ గొడవలను అదే ప్రపంచం అన్నట్టుగా వాళ్ళ పత్రికల్లో ఒకపక్క రాసుకుంటూ వుంటే,ఇంకోపక్క చివరికి టేకుమళ్ళ కామేశ్వరరావు, మండపాక పార్వతీశరావు లాంటి వాళ్ళ ఆలోచనలు కూడా ఎవరూ ఉపయోగించుకోలేదు. చిన్నయ సూరి కూడా అంత పట్టుదలగా కావ్యభాషకి వ్యాకరణం రాసి దాన్ని వచనంలో కూడా వాడచ్చని హిందూ ధర్మశాస్త్రంలో ఉపయోగించి చూపించాడని మనం మెచ్చుకున్నాం సరే. కానీ లోకంలో కళ, దృతప్రకృతికాలు, గసడదవాదేశాలు జ్ఞాపకం లోంచి పోయాయని ఆయన గుర్తించి ఉంటే నిజంగా బాగుండేది. అతని దృష్టిలో చిన్న పిల్లలు కూడా క్లిష్టమైన పదాలని తగిన వర్ణక్రమంలో నేర్చుకోవడమే ప్రధానం. చివరికి ఇన్నాళ్ళుగా సాగిన ఇన్ని చర్చలూ తెలుగు భాష అభివృద్ధికి నిజంగా ఉపయోగించలేదు. ఇప్పటికి కూడా తెలుగు భాష కవిత్వం, కథలు, నవలలు రాసుకునే భాష అయింది కానీ కొత్త ఆలోచనలు తయారు చేసే భాష కాలేదు. దీన్ని గురించి ఇంకొన్ని వివరాలు వచ్చే భాగంలో రాస్తాం.
(సశేషం)