Thread Rating:
  • 6 Vote(s) - 2.17 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Non-erotic మన తెలుగు గురించి కొంత తెలుసుకుందాము
#24
జయంతి రామయ్య పంతులు మొదలైన వారిని గ్రాంథిక భాషావాదులు అని గిడుగు రామమూర్తి పెట్టిన పేరు ఒప్పేసుకోకుండా వాళ్ల వాదన ఏమిటో నిశితంగా పరిశీలించినవారు ఇంతవరకూ ఎవరూ లేరు. ఈ భాషావాదాలని గురించి బూదరాజు రాధాకృష్ణ, అక్కిరాజు రమాపతిరావుల దగ్గరి నుంచి భాషా శాస్త్రజ్ఞుడు భద్రిరాజు కృష్ణమూర్తి వరకు గ్రాంథికము, వ్యావహారికము అన్న మాటలనే వాడుతూ వచ్చారు. నన్నయ కాలంలోనే నన్నయ తన భారతంలో రాసిన భాషకి, ఆ కాలంలో శాసనాల్లో వున్న భాషకి తేడా వుందని కృష్ణమూర్తి గమనించారు. కానీ నన్నయది ప్రాచీన (Archaic) భాష అని కృష్ణమూర్తి అన్నారు. ఈ మాట తప్పు. ఏ భాషలో అయినా కావ్యాలలో ఉపయోగించే భాష ఒకటి, లౌకిక వ్యవహారంలో ఉపయోగించే భాష ఒకటి, రెండు వేర్వేరు భాషలు ఉంటాయి. నన్నయది ఛందస్సు బలం వల్ల ఏర్పడిన కావ్యభాష. ఈ భాష ఛందస్సు బలం వల్లే, ఛందస్సు ఒప్పుకున్న చిన్న చిన్న మార్పులతో, దాదాపు 900 సంవత్సరాలపాటు కొనసాగిందనీ ఇంతకు ముందే చెప్పాం. అంచేత ఇది ఆర్కయాక్ భాష కాదు, కావ్యభాష.

వ్యవహారంలో వచనం రాయవలసిన అవసరం అచ్చుయంత్రం వచ్చిన తరవాత 19వ శతాబ్దం ఆరంభంలోనే కలిగింది. లౌకిక వ్యవహారంలో వున్న తెలుగు అనేక రూపాల్లో ఒక స్థిరమైన వర్ణక్రమం లేకుండా ఎవరికి తోచిన పద్ధతిలో వాళ్లు రాసేవారు. ఇలాంటి తెలుగే మనకు పండితులు రాసిన వ్యాఖ్యానాల్లో కూడా కనిపిస్తుంది. పాటల్లో అయితే ఆ పాటలు పాడేవాళ్ల స్థాయిని బట్టి–అన్నమయ్య దగ్గరనుంచి దంపుళ్ల పాటలు పాడే ఆడవాళ్లవరకు– వాళ్ల వాళ్ల ఛందస్సులకి అనువైన పద్ధతిలో మాటలు వాడేవారని, వీటన్నిటికి కలిపి వ్యావహారికం అనే పేరు పెట్టడం వల్ల చాలా గందరగోళం ఏర్పడిందని, ఇది ఒక వ్యావహారికం కాదు, అనేక వ్యావహారికాలు అని గుర్తించాలి అని, మేము ఇంతకు ముందు చెప్పివున్నాం.


గిడుగు రామమూర్తి పంతులు మనం వాడవలసిన భాషకి వ్యావహారిక భాష అని పేరు పెట్టారని మనం ఇంతకు ముందు చూశాం. కానీ ఎవరు వ్యవహరించే భాష వ్యావహారిక భాష అని అడిగితే ఆయన స్పష్టంగా చెప్పలేక శిష్ట వ్యావహారిక భాష అనే మాట అన్నారు. శిష్టులంటే ఎవరు? గోదావరి జిల్లాల్లో చదువుకున్న బ్రాహ్మణులు. వాళ్ళు కూడా ఉచ్ఛరించే పద్ధతిలోనే తెలుగు రాయరు. అందుచేత శిష్ట వ్యావహారికం అనే మాటకి స్పష్టమైన నియమాలు చెప్పటం కష్టమై కూర్చుంది. వీళ్లల్లో గురజాడ అప్పారావు నిజంగా ఆలోచనాశీలి అయిన మనిషి. ఆయన కూడా తాను రాసిన పుస్తకాలలో ఎక్కడా శిష్ట వ్యావహారికం అంటే ఏమిటో ప్రదర్శించి చూపించలేదు. ఆయన రాసిన కన్యాశుల్కం వ్యావహారిక భాషలో రాసిన మొదటి సాహిత్య గౌరవం గల రచన అని అందరూ అనడం మొదలు పెట్టారు. కానీ జాగ్రత్తగా చూస్తే కన్యాశుల్కంలో భాష రామమూర్తి పంతులు అడిగిన శిష్టవ్యావహారికం కాదు. అందులో వున్న భాష పాత్రోచితంగా రాసిన భాష. ఏ పాత్ర ఏ కులానిదో, సమాజంలో ఏ స్థాయిదో గమనించి వాళ్ళు ఉచ్చరించే పధ్ధతి జాగ్రత్తగా అనుసరించి రాసిన నాటకం కన్యాశుల్కం. ఒకే పాత్ర తాను ఎవరితో మాట్లాడుతున్నది అనే దాన్ని బట్టి ఉచ్చారణని మారుస్తుంది అని కూడా గమనించి ఆ ఉచ్చారణ అచ్చులో చూపించడానికి అవసరమైన అక్షరాలు లేకపోతే వాటిని సూచించడానికి ప్రత్యేకమైన మార్గాలు అనుసరించి రాసిన పుస్తకం కన్యాశుల్కం. కన్యాశుల్కం తర్వాత తర్వాత అచ్చు వేసిన కొంతమంది ఈ విశేషాలని గమనించలేక ఆయా మాటల వర్ణక్రమాన్ని మార్చేశారు కూడా.

ఇకపోతే అప్పారావు స్వయంగా రచయితగా రాయవలసి వచ్చిన ఉపోద్ఘాతం, అంకితం మొదలైనవన్నీ ఇంగ్లీషులో రాశారు. నాటకం లోపల పాత్ర ప్రవేశాన్ని, అంకాన్ని, రంగాన్ని సూచించే భాష కేవలం గ్రాంథికం, అంటే చిన్నయ సూరి వ్యాకరణం ప్రకారం రాసినది. ఆయన రాసిన వ్యాసం (Minute of Dissent) ఇంగ్లీషులో రాశారు, తన సొంత డైరీలు ఇంగ్లీషులో రాశారు. చాలా వ్యక్తిగత విషయాలయిన తన ఆరోగ్య పరిస్థితిని గురించి డాక్టరుకి రాసిన సమాచార పత్రం కూడా ఇంగ్లీషులోనే రాశారు. ఇవన్నీ చూస్తే అప్పారావు ఆలోచించే భాష ఇంగ్లీషా, తెలుగా అని అనుమానం కలుగుతుంది. ఆయన వ్యావహారికవాదే కానీ వ్యావహారిక భాషలో వచనం ఎలా ఉంటుందో రాసి చూపించలేదు. నీలగిరిపాటల దగ్గరనించి ముత్యాలసరాల వరకు పాటలో వుండే సాహిత్యంలో తెలుగు ఎంతో అందంగా పట్టుకోగలిగిన అప్పారావు; నిత్య వ్యవహారంలో రకరకాల సందర్భాలలో రకరకాల మనుషులు మాట్లాడే తెలుగు అంత స్పష్టంగానూ పట్టుకోగలిగిన అప్పారావు; ఆధునిక వ్యవహారానికి ఆలోచనలు, శాస్త్ర విషయాలు, చరిత్ర, విమర్శ చెప్పగలిగే వచనం ఎందుకు రాయలేదో మనం ఊహించలేము. కళింగదేశ చరిత్ర రాస్తానని ఒప్పుకున్నారని తెలుస్తుంది; అందుకు కావలసిన పుస్తకాలు,శాసనాలు సంపాదించారని కూడా అంటున్నారు కానీ ఆయన ఆ పుస్తకం కనీసం మొదలు పెట్టినట్టు కూడా రుజువులు లేవు. ఆయన రాతప్రతులు అన్నీ ఏమైపోయాయో తెలియదు/ అవి ఎక్కడికి వెళ్ళాయో, ఎవరి దగ్గర ఉండేవో పరిశోధించిన వాళ్ళు కూడా ఎవరూ లేరు. మాకు తెలిసినంత వరకు తార్నాకలో (హైదరాబాదు) వున్న ఆర్కయివ్స్‌లో భద్రపరచపడిన కాగితాలే అందరికీ దొరికేవి.

ఆయన రాతప్రతులతో ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు మనకు తెలిసినవాళ్ళు అవసరాల సూర్యారావు, పురాణం సుబ్రహ్మణ్య రావు, నార్ల వెంకటేశ్వరరావు, మరీ ముఖ్యంగా విశాలాంధ్ర ప్రచురణ సంస్థ వాళ్ళు. తార్నాక ఆర్కయివ్స్‌కి చేరిన ఆ కొన్ని కాగితాలూ ఎవరు వాళ్లకి ఇచ్చారో ఆచూకీ తెలియదు. గురజాడని మహాకవి అని, యుగకర్త అని పొగిడిన కమ్యూనిస్టులు, ఆయనకి విగ్రహాలు వేయించిన ఆధునికులు, ఆయన కాగితాలని భద్రపరచడంలో కానీ ఆయన పుస్తకాలని అచ్చు వేయించడంలో కానీ కొంచెం కూడా శ్రద్ధపెట్టలేదు. ఇక విశాలాంధ్ర సంస్థ గురజాడ పుస్తకాలని తమకి తోచినంత గందరగోళంగా, లెక్కలేనన్ని అచ్చుతప్పులతో ప్రచురించిన తీరు చూస్తే గురజాడని మావాడు అని చెప్పుకోవటంలో వున్న ఆసక్తి, పట్టుదల ఆయన పుస్తకాల పట్ల, పుస్తకాల ప్రచురణ పట్ల లేదని స్పష్టమవుతుంది.

ఇక గురజాడ పరిస్థితి ఇలా ఉండగా గిడుగు రామమూర్తి రాసిన తెలుగు, పేరుకి వ్యావహారికమే కానీ నిజానికి గ్రాంథికానికే దగ్గరగా ఉంటుంది. ఇంతకన్నా చమత్కారమైన విషయం ఇంకొకటి ఏమిటంటే ఈ వ్యావహారిక భాషావాది తన సొంత విషయాలు తన భార్యకు రాసిన ఉత్తరాలలో చక్కని పద్యాల్లో రాశారు. ఆయన భార్య కూడా అంత చక్కని పద్యాల్లోనే సమాధానం రాశారు. పద్యాల్లో సొంత ఇంటి సంగతులు భార్యాభర్తలు మాట్లాడుకోడానికి పనికి వచ్చినప్పుడు, ఇతర లౌకిక వ్యవహారాలకి ఎందుకు పనికిరాదని ఆయన అనుకున్నారో చెప్పడం కష్టం. ఇది ఇలా ఉండగా రామమూర్తి పంతులు చిన్నయ సూరి నీతిచంద్రికలో వ్యాకరణ విరుద్ధమైన ప్రయోగాలు చూపించి ఆ భాష చిన్నయ సూరి కూడా వాడలేదని; అందుచేత ఆధునిక వ్యవహారానికి పనికిరాదనీ వాదించారు. కానీ చిన్నయసూరే స్వయంగా హిందూధర్మశాస్త్రసంగ్రహం అన్న పుస్తకంలో ఆధునిక న్యాయవ్యవహారాన్ని గ్రాంథిక భాషలో రాసి చూపించాడని రామమూర్తి పంతులు గుర్తించలేదు. ఇది ఇలా ఉండగా ఇంకొక పక్క రామలింగారెడ్డి వంటి ఆధునికుడు ఆధునిక సాహిత్యవిమర్శకే మూలగ్రంథమని అందరూ అనే కవిత్వతత్త్వవిచారము, ఎవరూ పట్టించుకోకపోయినా నిజంగా పట్టించుకోవలసిన అర్థశాస్త్రము గ్రాంథిక భాషలోనే రాశారు.
 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply


Messages In This Thread
RE: మన తెలుగు గురించి కొంత తెలుసుకుందాము - by sarit11 - 06-07-2020, 12:32 AM
చెప్పండి - by Mohana69 - 29-08-2020, 10:42 AM



Users browsing this thread: 1 Guest(s)