Thread Rating:
  • 6 Vote(s) - 2.17 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Non-erotic మన తెలుగు గురించి కొంత తెలుసుకుందాము
#23
జయంతి రామయ్య పంతులు

జయంతి రామయ్య పంతులు 1860 సంవత్సరంలో తూర్పుగోదావరి జిల్లా ముక్తేశ్వరంలో పుట్టారు. పుట్టిన ఇరవయ్యొకటో రోజున దత్తతకు వెళ్లారు. ఆయన అక్షరాభాస్యం వీధి బళ్లో సాంప్రదాయిక పద్ధతిలో జరిగింది. అప్పుడు రాయడానికి పలకలు బలపాలు వుండేవి కావు. నేలమీద ఇసకలో గుంట ఓనమాలు దిద్దటం నేర్చుకున్నారు. తరవాత కంఠోపాఠంగా బాలరామాయణం, అమరకోశం చెప్పించుకున్నారు. 1870లో ఆయన చదివే కాలేజీ గ్రాంట్-ఇన్-ఎయిడ్ (Grant in aid) పాఠశాలగా మారింది. 1874లో రామయ్య పంతులుకి ఆయన అన్నయ్య ద్వారా ఇంగ్లీషు విద్యలో ప్రవేశం కలిగింది. ఆ ఇంగ్లీషు త్వరగా నేర్చుకుని హైకాలేజీ చదువు పూర్తి చేసి 1877లో మెట్రిక్యులేషన్ పరీక్ష, తరవాత ఎఫ్.ఎ. కూడా మొదటి తరగతిలో ప్యాసయ్యారు. కాలేజ్లో ఉపాధ్యాయుడిగా వుద్యోగం చేద్దామనుకున్నారు కానీ అప్పటి కాలేజి ప్రిన్సిపల్ మెట్‌కాఫ్ (Metcalfe) సలహా మీద బి.ఎ.లో చేరి లాజిక్, ఫిలాసఫీ, ఎథిక్స్, మెటాఫిజిక్స్ చదివారు. రామయ్య పంతులు మొదట్లో పిఠాపురం లోని మహారాజావారి హైకాలేజ్లో హెడ్మాస్టరుగా పనిచేసి 1886లో ఆ ఉద్యోగం వదిలేసి ఆపైన న్యాయశాస్త్రం చదివి బి.ఎల్. డిగ్రీ తెచ్చుకున్నారు.

ఆ తరవాత రెవెన్యూశాఖలో వుద్యోగంలో చేరి క్రమక్రమంగా డెప్యూటీ కలెక్టరు అయ్యారు. ఆ రోజుల్లో డెప్యూటీ కలెక్టరు వుద్యోగం చాలా పెద్ద ఉద్యోగం. రెవెన్యూ శాఖలో భారతీయులు పొందగలిగిన అతి పెద్ద ఉద్యోగం అదే. ఆ పైస్థానంలో వుండే కలెక్టరు ఎప్పుడూ తెల్లవాడే వుండేవాడు. ఇంగ్లీషు చదువుకుని రెవెన్యూ శాఖలో వుద్యోగం చేస్తూ ఆఫీసు ఫైళ్లలో తలమునకలుగా వుండే రామయ్య పంతులు ఎప్పుడు నేర్చుకున్నారో, ఎవరి దగ్గర నేర్చుకున్నారో సమాచారం లేదు గాని ఆయనకి తెలుగు కావ్యాల మీద, సంస్కృత భాష మీద ఒక పెద్ద పండితుడికి ఉండదగినంత సామర్థ్యం వచ్చింది. ఆయన లాక్షణిక భాషావాదాన్ని సమర్ధిస్తూ రాసిన పెద్ద వ్యాసం (A defense of literary Telugu) చదివితే ఈ సంగతి స్పష్టంగా తెలుస్తుంది. దీనితో పాటు ఆంధ్ర సాహిత్య పరిషత్తు నిర్మాణం లోను, గ్రాంథికవాదుల్ని కూడగట్టుకుని వారి వాదానికి జమిందారుల ప్రాపకం సంపాదించడం లోను, సూర్యరాయాంధ్ర నిఘంటువు సంపాదకత్వం తన చేతులోకి తీసుకోవడం లోను ఆయన రాజకీయంగా కూడా చాలా బలమయిన మనిషి అని కూడా తెలుస్తుంది.

దాదాపుగా తన చివరి రోజుల్లో (1934లో) ఆయనిచ్చిన ఉపన్యాసాలని, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగులో ఆధునికాంధ్ర వాఙ్మయ వికాసవైఖరి పేరుతో 1937లో అచ్చు వేశారు. ఆ పుస్తకం చదివితే ఆయనకి ఆధునిక తెలుగు సాహిత్యం గురించి, తెలుగు భాష గురించి ఉన్న అభిప్రాయాలు ‘ఎ డిఫెన్స్ ఆఫ్ లిటరరీ తెలుగు’ రోజులనుంచి చాలా మారాయని, ఎక్కువ ఉదారంగా తయారయ్యారని మనకి అనిపిస్తుంది. అంతే కాకుండా సాహిత్య విమర్శ గురించి ఆయన అభిప్రాయాలు కూడా స్పష్టంగా తెలుస్తాయి. ముఖ్యంగా ఆ ఉపన్యాసాలలో ఆయన చిన్నతనంలో తెలుగు చదువులు ఎలా వుండేవి, బళ్లలో ఏ పుస్తకాలని ఎలా చెప్పేవారు అనే వాటి గురించి చాలా వివరంగా సమాచారం ఇచ్చారు.

ఆయన అభిప్రాయంలో వర్తమాన కాలంలోనే వచనగ్రంథాలు వచ్చాయి. అంతకుముందు ఉన్నవన్నీ పద్యగ్రంథాలే! తెలుగులో వచనయుగాన్ని మొదలుపెట్టినవాడు చిన్నయ సూరి. రామయ్య పంతులు దృష్టిలో చిన్నయ సూరి వచనం గొప్ప వచనం. ఆ తరవాత ఆయన మెచ్చుకున్నవాళ్లలో ముఖ్యుడు వీరేశలింగం పంతులు. రామయ్య పంతులుకి తంజావూరు, మధుర రాజ్యాలలో తెలుగు పుస్తకాలు చాలా వచ్చాయని తెలుసు. ఆ కాలంలో వచ్చిన యక్షగానాలు, వచనగ్రంథాలు ఆయన చదివారు, అయినా ఆ యక్షగానాలు ఆ కాలానికి ప్రేక్షకులకి ఆనందం కలిగించేవే కానీ అవి మంచి రచనలు కావని ఆయన నమ్మకం. తరవాత వీరేశలింగం, ఆయనను అనుసరించి చిలకమర్తి లక్ష్మీనరసింహం, రాసిన నవలల్ని కూడా ఆయన తన ప్రసంగాలలో కొంత ప్రశంసాపూర్వకంగానే ప్రస్తావించారు. ఆధునిక కాలంలో తెలుగులో నాటకనిర్మాణం సంస్కృత నాటకాలకి ఇంగ్లీషు నాటకాలకి అనువాదంగా వచ్చిందని ఆయన వివరించారు.

అప్పటికి తెలుగులో వచ్చిన పుస్తకాలన్నిటినీ దాదాపుగా పూర్తిగా చర్చించిన ఈ వ్యాసంలో ఆయన గుర్తించినవి, మెచ్చుకున్నవి అన్నీ లాక్షణికభాషలో రాసినవే. దీనితో పాటు ఇంగ్లీషులో చదివి ఆ విషయాలు తెలుగులో చెప్పాలనే కోరికతో రాసిన శాస్త్రగ్రంథాలను గురించి కూడా ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. తెలుగులో ఆధునిక శాస్త్ర విషయాలు చెప్పడానికి కావలసిన పరిభాషాపదాలు లేవు కాబట్టి కొత్తగా తయారుచేసుకోవలసిన అవసరం వుందని కూడా ఆయన గుర్తించారు. పాశ్చాత్యదేశాల్లో శాస్త్ర పరిభాషాపదాలన్నీ గ్రీకు నుంచి లాటిన్ నుంచి తెచ్చుకున్నట్టుగా మనం కూడా భారతీయ భాషలన్నిటికీ సమానంగా సంస్కృతం నుంచి పరిభాషా పదాలు తయారు చేసుకోవాలని, ఇవి అన్ని భారతీయ భాషలకి సమానంగానే పనికొస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక నిఘంటువులు దగ్గరికి వచ్చేసరికి ఆయన శబ్దరత్నాకరాన్ని ప్రత్యేకంగా ప్రశంసించి, అయినా అది సమగ్రం కాదు కాబట్టి పిఠాపురం మహారాజావారి డబ్బుతో తయారవుతున్న సూర్యరాయాంధ్ర నిఘంటువు గురించి ప్రస్తావించారు.

కొమర్రాజు లక్ష్మణరావు మొదలుపెట్టిన ఆంధ్ర విజ్ఞానసర్వస్వం మూడు సంపుటాలు వచ్చాయని, ఇటువంటి పుస్తకాలు పూర్వం తెలుగులో లేవు కాబట్టి ఇంగ్లీషునుంచి తెచ్చుకున్నప్పటికీ ఇవి మనకు అవసరమని రామయ్య పంతులు గుర్తించారు. చరిత్రకు సంబంధించినంత వరకు సంస్కృతంలోను, తెలుగులోను కూడా చాలా సమాచారం దొరుకుతుంది కానీ అందులో అనేక అతిశయోక్తులు, కొంత సత్యము కలిసిపోయి ఉంటాయని ఆయన గమనించారు: ‘న్యాయమూర్తియైన ధర్మాధికారి వాది ప్రతివాదులు తెలుపు విషయములఁ బరిశీలించి సత్యమును గని పెట్టునట్లు–ఐతిహాసికుడు కూడా సామగ్రిని మధ్యస్థభావముతో నిష్పక్షపాతముగఁ బరిశీలించి సత్యమును గనిపెట్టవలయును, గాని, వేగిరపాటుతో నపసిద్ధాంతము చేయఁగూడదు.’

రాజమండ్రిలో చిలుకూరి వీరభద్రరావు నాయకత్వంలో స్థాపించిన ఆంధ్రా హిస్టారికల్ సొసైటీని గురించి కూడా రామయ్య పంతులు ప్రశంసాపూర్వకంగా మాట్లాడారు. ఇంగ్లీషులో జాన్సన్ రాసిన లైవ్స్ ఆఫ్ పొయట్స్ లాంటివి తెలుగులో వస్తున్నందుకు సంతోషిస్తూ, ఆ విషయంలో గురజాడ శ్రీరామమూర్తి, కందుకూరి వీరేశలింగం మొదలుపెట్టిన పనిని గురించి కూడా ప్రస్తావించారు. తెలుగులో స్వీయచరిత్రలు లేవన్న విషయం గుర్తించి వీరేశలింగం స్వీయచరిత్ర, ఇంకా ఇతర స్వీయచరిత్రలు, ముఖ్యంగా చెళ్లపిళ్ల వెంకటరావు జాతకచర్య గురించి వివరంగా చర్చించారు. కావ్యవిమర్శలో కూడా మృదువైన పద్ధతిని అనుసరించాలి కాని ఒకరినొకరు తిట్టుకునే పద్ధతి కూడదని సూచించారు. ఆధునిక కాలంలో అప్పటికి ఉన్న సాహిత్య సమాచారమంతా సేకరించి వాటిగురించి చాలా వివరంగా చెప్పిన ఉపన్యాసాలు ఇవి.

మొత్తం మీద ఈ ఉపన్యాసాలన్నీ చదివితే తెలుగు ఆధునికీకరించబడాలని, తెలుగులో లేని ప్రక్రియలు అవసరమయినంత వరకు తెచ్చుకోవాలని రామయ్య పంతులు స్పష్టంగానే చెప్పారని బోధపడుతుంది. ఐతే, భావకవిత్వాన్ని గురించి ఆయనకి అంత మంచి అభిప్రాయం వున్నట్టు లేదు. రవీంద్రనాథ్ టాగోరుని అనుసరించి, ఇంగ్లాండులో షెల్లీ, కీట్స్ మొదలయిన కవుల ప్రభావాన్ని అంగీకరించి, తెలుగులో భావకవిత్వం వచ్చిందని చెప్తూ ‘భావకవిత్యమందుఁ బెక్కుమందికి స్పురించుచున్న పెద్ద దోషము భావాభావము.’ అన్న అభిప్రాయం వెలిబుచ్చారు. అనంతపంతుల రామలింగస్వామి రాసిన శుక్లపక్షము ఆయనకి చాలా నచ్చింది. ఇక తెలుగు భాష పరిస్థితికి వచ్చేసరికి వ్యవహారంలో వున్న భాష ఒక ప్రాంతంవారి భాష ఇంకో ప్రాంతంవారికి అర్థం కాదని, ఒక కాలంలో రాసిన భాష ఇంకొక కాలంవారికి అర్థం కాదని, విద్యావంతులైన బ్రాహ్మణులు మాట్లాడే భాష కూడా ప్రాంతంనుంచి ప్రాంతానికి మారుతుందని, ఇలాంటి భాషలో రచనలు చెయ్యకూడదని ఆయనకు గట్టి నమ్మకం. అందుచేత లాక్షణికమైన భాషే రచనల్లో వాడాలని ఆయన అభిప్రాయం. తెలుగులో కవిత్రయంవారి మహాభారతం చదువుకోని పల్లెటూరివాళ్లకి కూడా అర్థం అవుతుందని, కేవలం ప్రబంధాలే పండితులకు మాత్రమే అర్థమయ్యే పుస్తకాలని రామయ్య పంతులు వివరించారు:
Quote:భారతము మొత్తముమీఁద ప్రౌఢగ్రంథమేకదా! ఆ గ్రంథము పల్లెటూళ్లలోఁ బురాణముగాఁ జదువు నాచారము చిర కాలమునుండి యున్నది. ఒకరు పుస్తకము చదువుట యింకొకరర్థము చెప్పుట యాచారము. ఇంచుమించుగా గ్రామములో నున్న వాఱందరును వచ్చి యాపురాణము విందురు. స్త్రీలు ముఖ్యముగా వత్తురు. చదువువాని కంటె నర్థము చెప్పువాఁడు గట్టివాఁడుగా నుండవలయును గదా! వ్రాలుచేయనేరని వారు శ్రుతపాండిత్యముచేతనే భారతమున కర్థము చెప్పుట నే నెఱుఁగుదును. ప్రతిపదార్థముతో నన్వయించు సామర్థ్యము లేకున్నను సభ్యులలో ననేకులకు పద్యము చదువఁగనే దాని ముఖ్య భావము బోధపడును.
లాక్షణిక భాషలో రాసినా వీరేశలింగం పుస్తకాలు, అలాగే చిలకమర్తి లక్ష్మీనరసింహం రాసిన గయోపాఖ్యానం కొన్నివేల ప్రతులు అమ్ముడు పోవటం గుర్తించారు. లాక్షణిక భాష కూడా చిన్నయ సూరి రాసినట్టే కాకుండా అవసరమైన చోట విసంధి పాటిస్తూ రాయాలని ఆయన అభిప్రాయం: ‘ఏమార్పులు చేసినను నియమములకు లోఁబడి యుండవలెను గాని విచ్చలవిడిగా నుండరాదు.‘ ఈ నమ్మకమే గ్రాంథిక భాషావాదంగా పేరుపడ్డ ఉద్యమానికి ఊపిరి.
ఇంతకీ, విశ్వవిద్యాలయాలల్లోను, పాఠశాలల్లోను దేశభాషలు ప్రవేశ పెట్టాలి, దేశభాషల్లో ఆధునిక విజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు రాయించాలి అన్న లార్డ్ కర్జన్ ఆలోచన తెలుగుదేశం దాకా వచ్చేసరికి లాక్షణిక, గ్రామ్య భాషావిభేదాలుగా పరిణమించింది.

 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply


Messages In This Thread
RE: మన తెలుగు గురించి కొంత తెలుసుకుందాము - by sarit11 - 06-07-2020, 12:21 AM
చెప్పండి - by Mohana69 - 29-08-2020, 10:42 AM



Users browsing this thread: 1 Guest(s)