01-07-2020, 08:44 PM
సామినేని ముద్దునరసింహం నాయుడు
సామినేని (స్వామినీన) ముద్దునరసింహం నాయుడు హితసూచని అన్న పేరుతో 1855 నాటికే ఒక ప్రతిభావంతమైన కొత్త పుస్తకం రాశారు. ఇది 1862లో అచ్చయ్యింది.
‘పురాణాల్లో వాస్తవమైన సంగతులు, వాస్తవం కాని సంగతులు కలిపేసి కొన్ని చోట్ల ధర్మశాస్త్రానికి సంబంధించిన సంగతులు కొన్ని ఒకదానికొకటి భేదించియుండే నిర్ణయములు చేసి ఇష్టానుసారముగా దిద్దుబాటు చేయబడుచూ వుండటంవల్ల జీవితానికి అవసరమైన విద్యలు, శరీరారోగ్యానికి అవసరమైన సంగతులు బాగా తెలుసుకునే అవకాశం లేకపోవడం వల్ల‘ ముద్దునరసింహం నాయుడు తన పుస్తకంలో అనేక వైజ్ఞానిక విషయాలు, సామాజిక విషయాలు వ్యాసాలుగా రాసి వాటికి ప్రమేయములు అని పేరు పెట్టారు. ఆయన పుస్తకంలో విద్యా ప్రమేయము, వైద్య ప్రమేయము, సువర్ణ ప్రమేయము, మనుష్యేతర జంతు సౌజ్ఞా ప్రమేయము, రక్షప్రభృతి ప్రమేయము, మంత్ర ప్రమేయము, పరోక్షాది జ్ఞాన ప్రమేయము, వివాహ ప్రమేయము అని తొమ్మిది ప్రమేయాలున్నాయి.
![[Image: nayudu.png]](https://eemaata.com/images/jan2019/nayudu.png)
ప్రపంచ జ్ఞానానికి సంబంధించిన విషయాలు తెలుగులో లేవని గుర్తించడంతో పాటు ముద్దునరసింహం నాయుడు అవి రచించవలసిన తెలుగు భాషాశైలిని గురించి కూడా కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. పద స్వరూపం ఎలా వుండాలో తన ఆలోచనలు చెప్తూ భాష సాధ్యమైనంత సులభంగా వుండాలని ఆయన గుర్తించారు. అరసున్నలు ఉండాలని లక్షణ గ్రంథాలలో చెప్పినా, అరసున్నలు లేకుండా తెలుగులో పదాలు వాడుకలో వున్నాయని గమనించి అరసున్నలు లేకుండా ఆయన పదాలు రాశారు. అలాగే శకటరేఫ, సాధురేఫ రెండిటికీ మధ్య ఉచ్చారణ భేదం పోయినందువల్ల ఆ తేడా పాటించవలసిన అవసరం లేదని శకటరేఫ వాడుకని ఆయన మానివేశారు. సంధులు కలపడంలో లక్షణ గ్రంథాలు చెప్పిన నియమాలు వాడుకలో లేవని సంధి నియమాలు లేకుండా తమ వాక్యాలు రాశారు.
సంఘ సంస్కారం విషయంలో ఆరోగ్యకరమైన జీవితానికి కావలసిన వైజ్ఞానిక విషయాలు తెలుగులో కావాలని చెప్తూ స్త్రీలకు విద్య కావాలని, వాళ్లకి వ్యక్తి స్వాతంత్ర్యం కావాలని, రజస్వలానంతరమే వాళ్ల ఇష్టాన్ని అనుసరించి వివాహం చెయ్యాలని ఎంతో ముందుచూపుతో రాసినవారు ముద్దునరసింహం నాయుడు.
తెలుగు భాష ఆధునిక కాలంలో ఆధునిక, వైజ్ఞానిక వ్యవహారానికి ఏ రూపంలో వుండాలో ఆయన స్పష్టంగా చెప్పి, తన పుస్తకంలో ఆయన వాడి చూపించారు. అందులో ఆధునిక విశ్వవిద్యాలయాల ద్వారా పాశ్చాత్య ప్రపంచం నుంచి వస్తున్న అనేక ఆలోచనలు శాస్త్ర విషయాలు తెలుగులోకి రావలసిన అవసరం వుందని, ఆ విషయాలు రాయడానికి అప్పటికి తెలుగు కావ్యాలలో వున్న భాష పనికిరాదని కూడా ఆయన గమనించారు. హితసూచనిలో మిగతా భాగాలు చూస్తే ఆయన ఉద్దేశం మనకి బాగా బోధ పడుతుంది.
తెలుగులో వచనం అనే మాట ఇప్పుడు మనం అనుకునే అర్థంలో అప్పుడు వాడుకలో లేదు. పద్యకావ్యాలలో వచన భాగాలే మనకు వచనం. దానికి గద్యం అనే పేరు కూడా ప్రబంధాలు వచ్చిన తర్వాత ఏర్పడింది. వచనంలో విషయ ప్రధానమైన పుస్తకాలూ లేవు, అలాటి పుస్తకాలని గుర్తించడానికి ఒక పేరూ లేదు. ముద్దునరసింహం నాయుడు వాటికి వాక్యగ్రంథాలు అని పేరు పెట్టారు. ఇలాంటి వాక్యగ్రంథాలు రావాలని, అందుకు అనువైన తెలుగు భాష మనం తయారు చేసుకోవాలని ఆయన ప్రతిపాదించారు. వాక్యగ్రంథాలలో,
Quote:“బాలురకు అక్షరములయొక్క జ్ఞానమిన్ను వాటిని కూర్చేశక్తిని సలక్షణముగా వచ్చేకొరకు అచ్చులు హల్లులు మొదలైన వాటి వివేకముతో ఒకపత్రిక వ్రాయించి అదిన్ని శబ్దశబ్దార్థముల యొక్క జ్ఞానము వారికి కలుగడమునకు ఏయేదేశ భాషలయందు వాడికలోనుండే పదములలో వారుచ్చరించడమునకు అనుకూలముగానున్ను అర్థావగాహన చేసుకోవడమునకు జురూరుగానున్ను ఉండే పదములు ఏర్పరచి వర్గులుగానున్ను లక్షణక్రమముగాను (అనగా) నామవాచకాదిభేదముల వరుసనున్ను సులభముగా బోధకాతగిన ప్రతిపదములతో జాబితా వ్రాయించి అదిన్ని విభక్తులు మొదలైన హద్దులు వివరముగా తెలియడమునకు తగిన పత్రికయొకటి వ్రాయించి అదిన్ని వాక్యరచనాసార్థ్యము సలక్షణముగా కలుగడమునకు కర్తరిప్రయోగము మొదలైనవాటి వివకముగల పత్రికయొకటి వ్రాయించి అదిన్ని యొక పుస్తకముగాచేర్చి అచ్చువేయించి వారికి క్రమముగా చెప్పించవలసినది, …”అని. అంటే ఈ వాక్యగ్రంథాలలో వాడే భాష ఎవరికి తోచినట్టు వారు రాయడం కాకుండా కొన్ని నియమాలతో కూడిన ఒక పత్రిక (ఇది ఇప్పుడు మనం స్టైల్ మాన్యువల్ అని అంటున్న దానికి పర్యాయ పదం) కావాలని ఆయన అప్పుడే ఊహించారు. అలాగే,
Quote:“ఐతే, సంస్కృతము వగైరా భాషలయందు శారీరశాస్త్రము మొదలైనవి రచించబడి యున్నవి కాని ఆ గ్రంథములు బహు ప్రాచీనములైనవిన్ని దరిమిలాను పరిశీలనవల్ల తెలియవచ్చిన సంగతులచేత అభివృద్ధిని పొందించ బడనివిన్ని ఐయున్నందున వాటిని పట్టియేయే దేశభాషలను సంగ్రహములు చెయ్యడము కంటే యింగిలీషున ఇప్పట్లో వాడికెలో నుండే జిఆగ్రఫి, జిఆమిత్రి, ఎరిధ్మిటిక్, ఎస్త్రాన్మీ, ఫిలాస్సాఫి, ఎనాట్టొమి, అనే గ్రంథముల యొక్క సంగ్రహములు ఏయే దేశభాషలను వ్రాయించి విద్యార్థులకు చెప్పించడము జురూరై యున్నది.”
“ఈ అనుక్రమముగా విద్య చెప్పించేయెడల స్త్రీ జాతి ఎవరెవరి మర్యాదకున్ను స్థితికిన్ని అనుకూలమని తోచిన మట్టుకు విద్య చెప్పించవచ్చును సాధ్యమైనంతమట్టుకు గ్రంథములు స్త్రీలున్ను చదవడమునకు లాయబుగానుండేలాగు రచించబడవలసినది,…”