Thread Rating:
  • 6 Vote(s) - 2.17 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Non-erotic మన తెలుగు గురించి కొంత తెలుసుకుందాము
#9
రామాయణంలో పిడకల వేటలాగా వచ్చిన ఈ కథలు ఇలా ఉండగా, ప్రభుత్వాదరణ అంతగా లేకపోయినా స్కూళ్లలో తెలుగు చెప్పడం కొనసాగింది. పంతొమ్మిదవ శతాబ్దం మొదటి భాగంలో చెన్నపట్నంలో మూడు ఉన్నత పాఠశాలలు ఉండేవి. అప్పటికి కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఏర్పడలేదు. అంటే ఇవే ఉన్నతమైన విద్యాసంస్థలు. వాటిలో ప్రతిష్ఠాత్మకమైనది ప్రెసిడెన్సీ లేక బోర్డు హైకాలేజీ. దీనిలో ఎక్కువ భాగం తెల్లవాళ్లే చదువుకునేవారు, కాని 1840 ప్రాంతం తరువాత భారతీయుల్ని కూడా చేర్చుకున్నారు. రెండవది చెన్నపట్నంలోని ప్రముఖ హిందువులు స్థాపించిన పచ్చయప్ప హైకాలేజీ. మూడవది కేవలం క్రైస్తవ మిషనరీల కోసం యేర్పరచిన (ఆప్టన్) మిషనరీ హైకాలేజీ.

చిన్నయ సూరి ఈ మూడు సంస్థల్లోను పనిచేశారు. 1836-37 ప్రాంతాల్లో చిన్న జీతంతో మిషనరీ హైకాలేజీలో ఉద్యోగాన్ని ప్రారంభించి తన పాండిత్యంతో నగరంలో పేరు ప్రఖ్యాతులు గడించిన తరువాత 1844లో పచ్చయప్ప హైకాలేజీలో తెలుగు పండితుడి స్థానానికి, మూడేళ్ల తరువాత 1847లో ప్రెసిడెన్సీ హైకాలేజీలో ప్రధాన తెలుగు పండితుడి స్థానానికి ఎదిగారు. మద్రాసులో యూనివర్సిటీ ఏర్పడినప్పుడు అక్కడి తెలుగు పండిత స్థానానికి కూడా చిన్నయ సూరే ఎంపిక చేయబడ్డారు (1857-1861). అంటే చిన్నయ సూరి ఉద్యోగం ఆ రోజుల్లో తెలుగుకి గొప్ప ఉద్యోగం. ఇక మిగిలిన తెలుగు ఉద్యోగాలు చాలా చిన్నవి. వాటికి చెప్పుకోదగ్గ గౌరవం కూడా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఉద్యోగం చెప్పుకోదగ్గ స్థాయిలో వుండడం, 1853 తరువాత చిన్నయ సూరి పుస్తకాలు బాగా అమ్ముడు పోవడం (నీతిచంద్రిక-1853, బాలవ్యాకరణం-1858), కారణంగా చిన్నయ సూరి సుఖంగానే జీవించారు.


ఇది ఇలా వుండగా ప్రధానమైన రాజకీయ భాష ఇంగ్లీషే అయింది. అంచేత ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వారందరూ ఇంగ్లీషే నేర్చుకుంటున్నారు. ఇంగ్లీషులోనే ప్రావీణ్యం సంపాదిస్తున్నారు. ఆరోజుల్లో వాళ్ళు ఆఖరికి వాళ్ల ఉత్తరాలు, డైరీలు కూడా ఇంగ్లీషులోనే రాసేవారు. విద్యావంతుల్లో తెలుగు నీరసించడం మొదలయ్యింది. బాగా చదువుకున్నవాళ్లు, అంటే లాయర్లు, పెద్ద పెద్ద రెవెన్యూ ఉద్యోగస్తులు గొప్ప కోసం మాకు తెలుగు రాదని చెప్పుకోవడం మర్యాదయింది.

ఒక పక్క విద్యారంగంలో తెలుగు బలహీనపడుతూండగా, ఇంకొక పక్క అచ్చుయంత్రం వాడుకలోకి రావడం మొదలయింది. తెలుగు పుస్తకాలు అచ్చులోకి వస్తున్నాయి. తెలుగు, సాహిత్యేతర వ్యవహారాలకోసం–అంటే, రాజకీయ, లౌకిక వ్యవహారాలకు–వచన రూపంలో అభివృద్ధి కావలసిన అవసరం వుందని చిన్నయ సూరి గమనించారు. ఈ భాష ఆధునిక వ్యవహారాలకి ఒక నియతమైన రూపంలో యేర్పడాలని ఆయన అభిమతం. తెలుగు పదాల వర్ణక్రమం ఎవరి అవసరాలకి సామర్థ్యానికి తగినట్టుగా వారు రకరకాల పద్ధతుల్లో రాస్తున్నారు. ఈ వర్ణక్రమాన్ని ఒక దారిలో పెడితే తప్ప తెలుగు పదాలకి ఒక స్థిరత్వం యేర్పడదు. ఇటు పండితులు రాసే వ్యాఖ్యానాలలోను, అటు పండితులు అయిన వాళ్లు, కాని వాళ్లు పాడే పాటల్లోను, ఆ కాలంలో ప్రకటింపబడ్డ శాసనాల్లోను రకరకాల వర్ణక్రమాలు వున్నాయని గుర్తించి వాటిని ఒక స్థిరమైన రూపంలో ఆధునీకరించ తలపెట్టిన వ్యక్తి చిన్నయ సూరి. అందుకని మొదటిసారిగా తెలుగు భాషలో వచనం రాయడానికి అనువైన, సలక్షణమైన భాషని సూత్రబద్ధంగా నిర్మించారు. దానితోపాటు తెలుగుని ఒకవంక అందమైన భాష గాను, ఇంకొకవంక అందం కోసం కాకుండా కేవలం వ్యవహార అవసరాలకి తగిన భాష గానూ రూపొందించి చూపించాలి. ఇంత పెద్ద ఊహ మనసులో పెట్టుకుని ఒక పక్క వ్యాకరణము, ఇంకొక పక్క నీతి చంద్రికలో మొదటి రెండు భాగాలు, కేవలం లౌకిక వ్యవహారానికి పనికొచ్చే హిందూ ధర్మశాస్త్ర సంగ్రహము సూరి ప్రకటించారు.

కానీ 1862లో చిన్నయ సూరి అకాల మరణం తరవాత ఆయన దృక్పథానికి కొనసాగింపు లేకపోయింది సరికదా దానికి వక్రీకరణలు ఆరంభమయ్యాయి. ఆ తరవాత చిన్నయ సూరి మిత్రలాభం, మిత్రభేదంలో వున్న వచనాన్ని అనుసరిస్తున్నామనుకొని ‘బండరాళ్ల లాంటి శుష్క వచనం’ రాసిన వీరేశలింగం పంతులు, కొక్కొండ వెంకటరత్నం పంతులు ఆ వచనాన్ని పాఠశాలలో విద్యార్థులపై బలవంతంగా రుద్ది, తెలుగు భాష అలాగే రాయబడాలని మార్గ నిర్దేశం చేశారే తప్ప చిన్నయ సూరి ఉద్దేశాన్ని సరిగా బోధపరుచుకోలేదు. చిన్నయ సూరికి భాషా సౌందర్యం పట్ల ఉన్న సామర్థ్యాన్ని కూడా వాళ్లు గుర్తించలేదు. చిన్నయ సూరే హిందూ ధర్మశాస్త్ర సంగ్రహంలో ఎంత సులభమైన, స్పష్టమయిన వచనం రాశాడో ఎవ్వరూ మాట వరసకు కూడా అనలేదు. ఆ పుస్తకం ప్రతులు ఎవరికీ అందుబాటులోకి కూడా వచ్చినట్లు లేదు. దాన్ని తను రాసిన చిన్నయ సూరి జీవిత చరిత్రకి అనుబంధంగా ప్రకటించిన నిడదవోలు వెంకటరావు హిందూ ధర్మశాస్త్ర సంగ్రహాన్ని లండనులో బ్రిటిష్ లైబ్రరీ నుంచి ఫోటోకాపీ తెప్పించుకున్నామని చెప్పారు. దీన్ని బట్టి ఈ పుస్తకం ఎవరికీ అందుబాటులో లేదేమో అని అనుమానించడానికి ఆస్కారం వుంది. ఒక్క గురజాడ అప్పారావు మాత్రం పాఠ్యగ్రంథాలుగా వాడుతున్న నీతిచంద్రికలో చిన్నయ సూరి రాసిన మిత్రలాభం, మిత్రభేదం అందమైన వచనమని; వీరేశలింగం రాసిన భాగాలే గడ్డు వచనం, శుష్క వచనం అని గుర్తించారు.

చిన్నయసూరి మరణించిన తరవాత తెలుగు ఒక విధమైన దురవస్థలో పడింది. మెకాలే చెప్పిన మాటల ఆధారంగా ప్రభుత్వ కార్యకలాపాలన్నీ ఇంగ్లీషులోనే జరిగేవి. అంచేత తెల్లదొరలు తెలుగు నేర్చుకోవలసిన అవసరం పోయింది. గ్రామ పరిపాలనలోను, రైతులనుంచి పన్నులు వసూలు చేయడానికి కావలసిన లెక్కలు రాయడంలోను తర్ఫీదు పొందిన కరణాలు వాళ్లకలవాటయిన భాషలో ‘కరణీకపు తెలుగు’ రాస్తుండేవారు. ఈ కరణీకపు తెలుగు సర్కారు జిల్లాల్లో ఎంత విస్తృతంగా అమలులో వుందో మెకంజీ తరపున కావలి సోదరులు సంపాదించిన, కైఫీయత్తులలో వివరంగా తెలుస్తుంది. ఆ కైఫీయత్తుల లోని భాష నాలుగైదు భాషల్లో అవలీలగా వ్యవహరించగల కరణాలు తయారు చేసిన భాష. అప్పటికే దక్షిణాంధ్ర యుగంలో యక్షగానాల్లో చాలా పాత్రోచితమైన భాష వాడబడింది. దానితో పాటు విజ్ఞానశాస్త్ర గ్రంథాలయిన ఖడ్గలక్షణశిరోమణి వంటివి కూడా తెలుగులో వచ్చాయి. కాకపోతే ఆ పుస్తకాలు అచ్చులోకి రావడానికి దాదాపు 1940 దాకా పట్టింది. ఇవేవీ తెలియని తెలుగు పండితులకి అందుబాటులో వున్నవి తెలుగు కావ్యాలే. అందులోను మరీ ముఖ్యంగా ద్వ్యర్థికావ్యాలు, బంధకవిత్వము, చిత్రకవిత్వము పండితుల మేధాశక్తికి పదును పెట్టే జటిలమైన గ్రంథాలు ప్రచారంలో వుండేవి. నన్నయ నుంచి మొదలుపెట్టి నాటివరకు ఉన్న పుస్తకాలన్నీ పండితుల దృష్టిలో ప్రామాణిక గ్రంథాలు.

ఈ కాలంలో, తెలుగు పండితులకి ప్రభుత్వాదరణ పోయి జమిందార్ల ప్రాపకంలో మెలగవలసిన స్థితి వచ్చింది. అక్కడ సంస్కృత పండితులదే ప్రాబల్యం. సంస్కృత వ్యాకరణ సంప్రదాయంలో అంటే పాణిని, పతంజలి, భట్టోజి దీక్షితులు, అలాంటి వారితో పోటీ పడగల వ్యాకరణాలు తెలుగుకి సంస్కృతంలో కొన్ని ఉన్నాయని తెలుగు పండితులు వాదించడం మొదలుపెట్టారు. నన్నయ ఆంధ్రశబ్దచింతామణి నిజంగా నన్నయ రాసింది కాదు. కానీ అది నన్నయే రాశాడని తెలుగు పండితులు నమ్మవలసిన అవసరం వచ్చింది. చిన్నయసూరి కూడా నన్నయని పరమగౌరవంగా వాగనుశాసనులు అని వ్యవహరిస్తారు. బాలవ్యాకరణం పేరుకి బాలురకోసం రాశానని చిన్నయ సూరి చెప్పినా, అది పండితులకి పరమ ప్రామాణికం అయింది. దానిలో సూత్రరచనా నిర్మాణ దక్షత వాళ్ళని ముగ్ధుల్ని చేసింది. ముఖ్యంగా చిన్నయ సూరి వ్యాకరణం శాస్త్రబద్ధంగా కనిపించింది. అంచేత తెలుగు పండితులు ఈ వ్యాకరణాన్ని ప్రధానమైన ఆయుధంగా వాడటం మొదలుపెట్టారు.

స్కూళ్లలో చెప్పే తెలుగు వ్యాకరణం కూడా చిన్నయ సూరి వ్యాకరణానికి అనుకూలమైనదిగా చేసి, చిన్నయ సూరి కంటే జటిలంగా చిన్నయ సూరి వచనంలోని అందం ఏ కోశానా లేకుండా వీరేశలింగం పంతులు రాసిన సంధి, విగ్రహము అనే పంచతంత్ర భాగాలు కాలేజీ పిల్లలకి పాఠ్య గ్రంథాలుగా చెప్పేవారు. లోకానికి పనికొచ్చే భాష ఇంగ్లీషు కాబట్టి ఆ ఇంగ్లీషులోనే ప్రపంచ విషయాలన్నీ విశ్వవిద్యాలయాలలో పెద్ద చదువులు చదువుకున్నవాళ్లు రాస్తూ వుండగా తెలుగు పండితులు ఇంకా ఇంకా పాత పద్ధతుల్లోకి వెళ్లి విద్యార్థులు రాసే తెలుగులో సున్నలు, అరసున్నలు, ఱ-లు ఉన్నాయో లేవో చూసే పనిలో పడ్డారు. జీతాలు, అవకాశాలు తక్కువయిన ప్రపంచంలో కార్పణ్యాలు కక్షలు విపరీతంగా వుంటాయి. పండితులు ఒకరి పుస్తకంలో ఒకరు దోషాలు వెతకడమే పనిగా పెట్టుకున్నారు. తిరుపతి వెంకటకవులు ఒక పక్క ధారాళంగా ఆశుకవిత్వం చెబుతూ, తమ కవిత్వంలో వ్యాకరణ దోషాలు చూపించేవాళ్లతో అంత తీవ్రంగాను యుద్ధాలు చేస్తూ, తెలుగు సాహిత్యానికి ఒక పక్కన ప్రచారము, ఇంకోపక్క చిన్నయ సూరి వ్యాకరణం ప్రకారం లేకపోతే అది మంచి కవిత్వం కాదనే వాదనకి బలము రెండూ తెచ్చిపెట్టారు. ఆ కాలంలోనే,
Quote:కవనార్థం బుదయించితిన్ సుకవితా కార్యంబె నావృత్తి యీ
భవమద్దాన తరింతు తద్భవమ మద్భాగ్యంబు సర్వంబు మృ
త్యువు నేదాన జయించితిన్‌రుజ జయింతున్‌దానిచేన్ అట్టి నా
కవనంబున్ గురుడేమి లెక్క హరుడే కాదాడ వాదాడెదన్
లాంటి పద్యాలు వచ్చాయి.

 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply


Messages In This Thread
RE: మన తెలుగు గురించి కొంత తెలుసుకుందాము - by sarit11 - 01-07-2020, 08:25 PM
చెప్పండి - by Mohana69 - 29-08-2020, 10:42 AM



Users browsing this thread: 1 Guest(s)