01-07-2020, 07:57 PM
చిన్నయ సూరి – గిడుగు రామమూర్తి 2
చిన్నయ సూరి, మెకాలే (Macauley)
చిన్నయ సూరి బాలవ్యాకరణం 1858లో అచ్చవడమే మొదలుగా ప్రతులు బాగా అమ్ముడుపోయాయని అంకెల వల్ల తెలుస్తోంది. 1900నాటికి అది 17ముద్రణలు పొందింది. ఈ పుస్తకం ఇంత ప్రచారంలోకి రావడానికి కారణం తెలుగు పాఠాలు చెప్పే పండితులా, లేకపోతే ఈ పుస్తకమే వాడాలని కాలేజ్ బుక్ సొసైటీ వారి ఉత్తరువా అన్న సంగతి స్పష్టంగా చెప్పడానికి కావలిసిన సమాచారం మన దగ్గర లేదు. కానీ తెలుగు వ్యాకరణాలు అమ్ముడు పోయేవి అని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు దొరుకుతున్నాయి. వావిళ్ళ రామస్వామి శాస్త్రులు 1916లో ప్రచురించిన తా. వెంకయ్య రాసిన ఆంధ్ర వ్యాకరణము మూడవ ముద్రణ అయిదువేల కాపీలు వేశారని మొదటి అట్టమీద ఉంది. ఈ పుస్తకం వాడాలని కాలేజ్ బుక్ సొసైటీ వాళ్లు చెప్పే అవకాశం లేదు. అలాగే ఎవరు రాసినా 1830-1930 మధ్యకాలంలో వ్యాకరణం పుస్తకాలు పలు ముద్రణలు పొందాయి. అంచేత పిల్లలకి తెలుగు చెప్పవలసిన అవసరమూ, ఆ తెలుగు చెప్పడానికి వ్యాకరణం కావాలని ఒక అభిప్రాయమూ వున్నాయి కాబట్టి ఈ వ్యాకరణాలు ఇంత బాగా అమ్ముడు పోయాయని అనుకోవాలి. చిన్నయ సూరి బాలవ్యాకరణం కూడా ఈ కారణం చేతనే బాగా అమ్ముడు పోయి వుంటుంది. అది అమ్ముడుపోడానికి కాలేజ్ బుక్ సొసైటీ వాళ్ల తాఖీదు ఒక కారణం కాని అదే కారణమని మనం అనుకోనక్కరలేదు.
ఆరుద్ర గారు తమ సమగ్ర ఆంధ్ర సాహిత్యంలో: “చిన్నయ సూరి గ్రంథానికి వ్యాఖ్య రాయించాలని గాజుల లక్ష్మీ నరసు శెట్టి గారు ప్రయత్నించారుగాని ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు. … ఇరవయ్యో శతాబ్దంలో వ్యాఖ్యానాలు వెలువడ్డాక గాని బాల వ్యాకరణం రాజ్యమేలడం ప్రారంభించలేదు. పందొమ్మిదో శతాబ్దం ద్వితీయార్థంలో శేషయ్య వ్యాకరణం, వెంకయ్య వ్యాకరణం వంటివే పఠన పాఠనాదులలో ప్రసిద్ధాలు.” అన్నారు. ఈ వివరాలు ఆయన ఎక్కడ సేకరించినది మనకి చెప్పలేదు. (చిన్నయ సూరి పెద్దరికం; స.ఆం.సా; సంపుటం 10, 1990, పేజి 36) నిడదవోలు వెంకటరావుగారు పైన చెప్పిన వ్యాసంలోనే (1962) 1887 నాటికి బాలవ్యాకరణం 8 ముద్రణలు పొందితే శేషయ్య వ్యాకరణం, వెంకయ్య వ్యాకరణం 10-12 ముద్రణలుపొందాయని చెప్పారు.
ఉదయగిరి శేషయ్య రాసిన “తెలుగు వ్యాకరణము” (1857) 19వ శతాబ్దం రెండవ భాగంలో వచ్చిన వ్యాకరణాల కంటే చాలా భిన్నమయింది. దీనిలో భాష సరళంగాను, పుస్తకం అచ్చు వేసిన తీరు కంటికి చాలా సొంపుగాను ఉంటుంది. తక్కిన వ్యాకరణ పుస్తకాల రచయితలతో పోలిస్తే శేషయ్య పెద్ద హోదాలో పని చేయలేదు..
చిన్నయ సూరి పుస్తకం బాగా వాడుకలోకి రావడానికి రెండవ కారణం పండితుల ఆదరణ. తా. వెంకయ్య పేరుతో వున్న వ్యాకరణానికి చిన్నయ సూరి వ్యాకరణానికి భాష విషయంలో తేడా లేదు. రెండూ వ్యాకరణ మర్యాదలకి లోబడిన భాషనే ప్రమాణీకరిస్తున్నాయి. మాట్లాడుకునేప్పుడు వాడే భాషను తా. వెంకయ్య గ్రహించలేదు. అంతే కాదు, అప్పటికి రాసిన అన్ని వ్యాకరణాలు ఒకే రకమైన భాషకి నియమాలు చెప్తున్నాయి. ఉదాహరణకి బాలవ్యాకరణం కంటే ముందు వచ్చిన వేదం పట్టాభిరామరావు రాసిన ఆంధ్ర వ్యాకరణము (1810ల నాటి రాతప్రతి, మొదటి ముద్రణ 1951); రావిపాటి గురుమూర్తిరావు రాసిన తెనుఁగు వ్యాకరణము (1836, పునఃప్రచురణ 1951); పుదూరి సీతారామరావు రాసిన ప్రశ్నోత్తరాంధ్ర వ్యాకరణము (1834, 1852, 1859); వేదం వేంకటరమణరావు రాసిన తెనుగు లఘువ్యాకరణము (1856); ఇవన్నీ ఒక రకమైన భాషకే వర్తించే వ్యాకరణాలు. వ్యాకరణం అంటే అప్పటి వాళ్లందరికి ఒక రకమైన భాషే మనసుల్లోకి వచ్చింది. ఇది లాక్షణిక భాష. ఇది కాక ఆ కాలం నాడే అచ్చయి చదువుకున్న వాళ్ల చేతిలో ప్రచారంలోకి వచ్చిన పుస్తకాలు–ఏనుగుల వీరాస్వామి కాశీయాత్ర చరిత్ర, ఎర్రమల్లి మల్లికార్జునుడి చార్ దర్వీషు కథలు (1876), రావిపాటి గురుమూర్తి రావు విక్రమార్క కథలు (1819) ఇలాంటివి. వీటిలో వున్న భాష వ్యాకరణాలలో ఉన్న భాష కాదు. ఇది నేర్పక్కరలేకుండానే వచ్చే భాష. దీనికి వ్యాకరణ గ్రంథాలలో గ్రామ్యము అని పేరు.
సరిగ్గా ఆ రోజుల్లో కుంఫిణీ ప్రభుత్వం వాళ్లు మెకాలేస్ మినిట్ (Macaulay’s minute) అనే పేరుతో వున్న అభిప్రాయం ఆధారంగా పరిపాలన అంతా ఇంగ్లీషులో మొదలుపెట్టారు. తెలుగుకి ప్రభుత్వ ఆదరణ తగ్గిపోయింది. అయినా స్కూళ్లలో తెలుగు పండితులు తెలుగు పాఠాలు చెప్పేటప్పుడు ఈ వ్యాకరణాలే అనుసరించారు. చిన్నయ సూరి వచ్చిన తరవాత ఆయన వ్యాకరణమే పండితులందరికీ ఆమోదయోగ్యమయింది. అప్పటి రోజుల్లో చిన్నయ సూరికి అధికార వర్గాలలో మంచి పేరే వుండేది. ఒక వంక అర్బత్ నాట్ లాంటి తెల్ల దొరలు, గాజుల లక్ష్మీనరసయ్య శ్రేష్టి, కోమలాపురం శ్రీనివాస పిళ్ళే వంటి ధనవంతులైన అబ్రాహ్మణులు చిన్నయ సూరికి దన్నుగా వుండేవాళ్లు. పాండిత్య ప్రపంచంలో మద్రాసులో బ్రాహ్మలదే ప్రాపకం అనీ ఆ బ్రాహ్మణుల్లో స్మార్తులు, వైష్ణవులు రెండు వర్గాలుగా చీలి వుండేవారనీ ఇంతకుముందే చెప్పాం. అటువంటి పరిస్థితులలో సాతాని కులంలో పుట్టిన అబ్రాహ్మణుడైన చిన్నయ సూరికి ఇంత ప్రాధాన్యం రావడం, అతని పుస్తకాన్ని బ్రాహ్మణ పండితులు కూడా అంగీకరించడం ఎలా జరిగిందో మనకి స్పష్టంగా తెలియదు. అప్పటి కాలంలో ఉన్న పరిస్థితులు ఉన్నట్టుగా నిర్ణయించడానికి తగినంత విస్తృతమైన పరిశోధన ఇంతవరకూ ఎవరూ చేయలేదు.