Thread Rating:
  • 5 Vote(s) - 2.4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Non-erotic మన తెలుగు గురించి కొంత తెలుసుకుందాము
#5
ఈ వాదనకి ప్రధానమైన బలం — ముందు వ్యాకరణం పుట్టి, దాన్ని అనుసరించి కావ్యాలు వస్తాయి అనే నమ్మకం. పండితులందరూ నన్నయ్య ముందు వ్యాకరణం రాసి తరవాతే మహాభారతం రాశాడని నిక్కచ్చిగా నమ్ముతారు. కానీ ఈ భాష ఇంత కాలం పాటు పెద్ద ఒడిదుడుకులు లేకుండా ఈ రూపంలో ఉండడానికి కారణం వాగనుశాసనులూ కాదు, కవిరాక్షసులూ కాదు. ఛందస్సు ఆ పని చేసింది. తెలుగు కావ్యాలలో ఏ ఛందస్సులు వాడబడాలో దాదాపుగా నన్నయ తన మహాభారతంలో వాడి చూపించాడు. దానికి తోడుగా ఏ కొద్ది కొత్త ఛందస్సులో జేర్చి పద్య కావ్యాలలో కవులు వాటినే వాడుతూ వచ్చారు. కవులు దాదాపుగా ఛందస్సు తమకు రెండవ భాష అయినట్టుగా చెప్పగలవి నన్నయ, తిక్కనలు వాడిన ఛందస్సులే. ఈ ఛందస్సులే దాదాపుగా అందరు కవులు కొన్ని వందల సంవత్సరాల పాటు యథేచ్ఛగా వాడారు. ఈ ఛందస్సులలో విశేషమేమిటంటే వాటిలో కొన్ని రకాల పద సంపుటులు మాత్రమే పడతాయి. అక్షరబద్ధం కాబట్టి వాటిని ఇష్టం వచ్చినట్లు మనం వాడే వాక్యాలలోకి నప్పించడం కష్టం. కష్టమే కాదు, అసాధ్యం కూడా! ఎక్కడైనా ఒక చోట మనం వ్యవహారంలో వాడే ఒక మాటనో, పేరునో ఏ కంద పద్యం లోనో, సీసపద్యం లోనో ఇమిడించవచ్చు గాక. కాని, పాతకాలపు మాట ఒక్కటి కూడా లేకుండా ఇప్పుడు మనం మాట్లాడే తెలుగులో పద్యం రాయడం అసాధ్యం. ఉదాహరణకి పరుచూరి శ్రీనివాస్, వెల్చేరు నారాయణరావు అనే మాటలు ఉన్నవి ఉన్నట్టుగా ఏ తెలుగు పద్యం లోను పట్టవు. పరుచూరి శ్రీనివాసుడు అని చేసుకుంటే కంద పద్యంలో ఇమిడించొచ్చు. వెల్చేరు నారాయణరావు ఒక పట్టాన ఏ పద్యంలోను పట్టదు. సాధ్యమైనన్ని వాడుకలో ఉండే తెలుగు మాటలతో శ్రీశ్రీ సిరిసిరిమువ్వ శతకం రాశాడు. కానీ అందులో కూడా వ్యవహారంలో లేని తెలుగు మాటలు పెట్టక పొతే పద్యం నడిచింది కాదు.


నీకొక సిగరెట్టిస్తా
నాకొక శతకమ్ము రాసి నయముగ నిమ్మా
త్రైకాల్య స్థాయిగ
శ్రీ కావ్యమ్ము వరలు సిరిసిరిభాయీ

ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటి అంటే పద్యాలలో ఉన్న తెలుగు భాష ఇంతకాలం పాటు ఒకే రూపంలో ఉండటం ఏ వ్యాకరణం వల్లనూ కాదు, ఏ శాసనం వల్లనూ కాదు, కేవలం ఛందస్సు వల్ల. పద్య ఛందస్సులు వాడకుండా మాత్రా ఛందస్సులు వాడి పాటలు రాసిన అన్నమయ్య, క్షేత్రయ్య, సారంగపాణి మనం వ్యవహారికం అనుకునే మాటలు (నిజంగా వ్యవహారికం కావు) రాయగలగడానికి కారణం వాళ్ళు అక్షర ఛందస్సులు అనుసరించక పోవడమే.
చిన్నయ సూరికి ముందు తెలుగు వాళ్ళే రాసిన తెలుగు వ్యాకరణాలు నాలుగైదు ఉన్నాయని ఇంతకు ముందు చెప్పాం. ఆ వ్యాకరణాలు పరిశీలిస్తే అవి శాస్త్రబద్ధంగానే ఉండటానికి ప్రయత్నించాయని తెలుస్తుంది. అంటే సంస్కృత వ్యాకరణ మర్యాదల్ని అనుసరించడానికి ప్రయత్నించాయి. ఇంకో మాటలో చెప్పాలంటే తెలుగు కావ్యాలలో వుండే భాషనే అవి ప్రమాణంగా పెట్టుకున్నాయి. భాషకి లక్షణం చెప్పేది వ్యాకరణమే అని, లక్షణ విరుద్ధమైన భాష గ్రామ్యమని ఈ వ్యాకరణాలన్నీ వొప్పుకున్నాయి. అరసున్నలు, సరళాదేశాలు, గసడదవాదేశాలు, కళాదృతప్రకృతికవిభాగాలు, సంధి నియమాలు ఈ వ్యాకరణాలన్నీ పాటించాయి. ఒక్కసారి వేదం వెంకటరమణ రావుగారు రాసిన లఘువ్యాకరణాన్ని చూస్తే దాదాపుగా చిన్నయసూరి బాలవ్యాకరణం చదువుతున్నట్టే ఉంటుంది. పుదూరి సీతారామరావుగారి ప్రశ్నోత్తరాంధ్రవ్యాకరణంలో ప్రశ్నలు శాస్త్రంలో వుండే ఉత్థాపిత ప్రశ్నల్లా ఉంటాయి. శాస్త్రార్ధం చేసే వాళ్లకి ఇలాంటి ప్రశ్నలు పరిచితమే.

ఇవి కాక తెలుగు పద్య కావ్యాలకి వ్యాఖ్యానాలు రాసిన పాత పండితులు ఒక రకమైన వ్యాఖ్యాన భాష రాసేవారు. ఇది పద్యకావ్యాలలో వుండే భాష కాదు. ఇవి చూస్తే ప్రక్రియని పట్టి భాష మారుతోందని, ఏ ప్రక్రియకి అనువైన భాష ఆ ప్రక్రియ రాసేటప్పుడు వాడారని, భాష కంతటికీ కలిపి ఒక వ్యవహారం లేదని, బోధపడుతుంది. భాష ఇలాంటి పరిస్థితిలో ఉందని గుర్తించి పద్యాలకి వాడిన భాషే సలక్షణమైన భాష అని భావించి, దానికి శాస్త్రీయంగా లక్షణం చెప్పి, ఆ భాషనే ఆధునిక వచన వ్యవహారానికి కూడా వాడవచ్చునని చూపించిన వాడు చిన్నయ సూరి. తెలుగులో పద్యాలకి మాత్రమే వాడుతున్న భాషని ఆధునిక వచన వ్యవహారానికి నప్పించి తెలుగు భాషని సమగ్రంగా ఆధునీకరించినవాడు ఆయనే. అందరూ చూచే చిన్నయ సూరి వచన రచనలు ఆయన నీతిచంద్రికలో రాసిన మిత్రలాభము, మిత్రభేదము మాత్రమే. ఇందులో మిత్రలాభం కన్నా మిత్రభేదం ఒక రకమైన గడ్డు భాషలో వుండి, బడిపిల్లలకు పాఠ్య గ్రంథాలుగా పెట్టబడి, బాలవ్యాకరణం ప్రకారం వచనం అంటే అలాగే ఉండాలనే అభిప్రాయం బలపడింది. కానీ చిన్నయ సూరే తెనిగించిన హిందూధర్మశాస్త్ర సంగ్రహము చూసినవాళ్ళకి చిన్నయ సూరి బాలవ్యాకరణం ప్రకారం రాసిన భాష ఆధునిక తెలుగు వచన రచనలు చేయడానికి కూడా పనికి వస్తుందని ఆయన భావించాడని తెలుస్తుంది.

ఈ అభిప్రాయం సరయిందేనా కాదా? చిన్నయ సూరి చేసిన పనిని సవిమర్శకంగా చూడవలసిన అవసరం ఉందా? అనే ప్రశ్నలకు సమాధానాలు గిడుగు రామమూర్తిగారు, గురజాడ అప్పారావుగారు చేసిన పనిని దృష్టిలో పెట్టుకుని వ్యవహారికా భాషావాదంలో ఉపయోగాలకు పరిమితులున్నాయా? అనేవి తర్వాత వ్యాసంలో వివరంగా చర్చిస్తాం.

 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply


Messages In This Thread
RE: మన తెలుగు గురించి కొంత తెలుసుకుందాము - by sarit11 - 01-07-2020, 07:45 PM
చెప్పండి - by Mohana69 - 29-08-2020, 10:42 AM



Users browsing this thread: 1 Guest(s)