Thread Rating:
  • 6 Vote(s) - 2.17 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Non-erotic మన తెలుగు గురించి కొంత తెలుసుకుందాము
#4
సెయింట్ జార్జి కోటలో వున్న కళాశాలలో తెలుగు పండిత పదవి దొరకకముందు చిన్నయ కొన్నాళ్ళు సి. పి. బ్రౌన్ దగ్గర పని చేశాడు. బ్రౌన్ పద్ధతులు చిన్నయకు నచ్చలేదో, చిన్నయ రచనా పద్ధతులు బ్రౌన్‌కి నచ్చలేదో, ఆ ఉద్యోగంలో చిన్నయ ఎక్కువ కాలం ఉండలేదు. అంతకు ముందు మిషనరీ కాలేజీ లోను, పచ్చియప్ప హైకాలేజీలోను (1844-47) పని చేసినప్పటికీ, సెయింట్ జార్జి కోటలో వుద్యోగం దొరికిన తరువాతే చిన్నయకి కొంత స్థిరమైన, సుఖమైన జీవితం ఏర్పడింది. (1857లో ప్రెసిడెన్సీ హైకాలేజీ మద్రాసు విశ్వవిద్యాలయంగా మారినాక చిన్నయసూరి మొట్టమొదటి తెలుగు విభాగాధిపతిగా ఉద్యోగం కొనసాగించాడు.) ఈ కాలంలోనే అతను పంచతంత్రంలో మిత్రలాభం, మిత్రభేదం రాసి ప్రచురించాడు. చిన్నయ బహుశా అర్బత్‌నాట్ ప్రాపకం వల్లే కావచ్చు, మద్రాసు కాలేజ్ బుక్ సొసైటీలో (దీనినే ఉపయుక్త గ్రంథకరణసభ అంటారు) సభ్యుడయ్యాడు. అతని అధికార ప్రాభవం వల్లో లేక ఇతర కారణాల వల్లో అతని బాలవ్యాకరణం, పంచతంత్రంలో మిత్రలాభం, మిత్రభేదం (ఈ రెండు అర్బత్‌నాట్‌కే అంకితం యిచ్చాడు) పిల్లలకు పాఠ్యగ్రంథాలుగా వాడేవారు. దీని తరవాత బహుజనపల్లి సీతారామాచార్యులుగారు బాలవ్యాకరణంలో చెప్పని విషయాలని కలుపుకుని ప్రౌఢ వ్యాకరణము, దానితో పాటు తెలుగుకి ఇప్పటికీ పనికొస్తున్న శబ్దరత్నాకరము అనే నిఘంటువు రాశారు. ఈ మూడింటి వల్ల గ్రాంథిక భాషకి ఒక బలమైన దన్ను ఏర్పడింది. వ్యాకరణము, నిఘంటువు భాషకి ప్రాణం లాంటివి. ఇవి తెలుగు భాషకి బలమైన శాస్త్ర ప్రాతిపదికని ఏర్పాటు చేశాయి. ఏదైనా పదం ఈ రెండు వ్యాకరణాల వల్ల కానీ సాధించడం కుదరకపోతే అది గ్రామ్యం. అలాగే ఏదైనా పదం శబ్దరత్నాకరంలో కనిపించకపోతే కూడా అది గ్రామ్యమే. ఇవి ఆధారంగా తెలుగు భాషలో పండితులకి పుస్తకాలు రాయడానికి పుష్కలమైన అవకాశం దొరికింది.


చిన్నయ సూరిలో చాలామంది గ్రహించినా పైకి చెప్పని ఒక ప్రత్యేకమైన గుణం వుంది. ఆయనకి తెలుగుభాషలో సౌందర్యం, వాక్యనిర్మాణంలో స్పష్టత, పదాల కూర్పులో చక్కదనం, బాగా తెలుసు. ఈ గుణాలు తన సమకాలికులకెవ్వరికీ లేకపోగా చిన్నయ సూరి కొక్కడికీ ఎలా వచ్చాయో చెప్పడం కష్టం.
చిన్నయ సూరి రాసిన పుస్తకాలు ఆయన స్థాపించిన ప్రెస్ (వాణీదర్పణ ముద్రాక్షరశాల) లోనే అచ్చయేవి. అవి పిల్లలకి పాఠ్యగ్రంథాలుగా నిర్దేశించబడ్డాయని ముందే చెప్పాం. సూరి పుస్తకాలకి ప్రాచుర్యము, సూరి పాండిత్యానికి గౌరవము, కుంఫిణీ ప్రభుత్వంలో వున్న అర్బత్‌నాట్ వంటి వారి ప్రాపకం వల్ల జరిగిందని చెప్పడానికి కచ్చితమైన ఆధారాలు ఉన్నాయి.

చిన్నయ సూరి బాలవ్యాకరణం పాణిని అష్టాధ్యాయి లాగా బిగువైన సూత్రాలతో చదవడానికి, కంఠస్థం చేయడానికి చక్కగా వుండే నిర్మాణ పద్ధతిలో తెలుగు కవులకి ఆసరాగా నిలబడింది. అల్పాక్షరం ఆసందిగ్ధం సారవత్ విశ్వతోముఖమ్ అని చెప్పడానికి అనువైన సూత్రాలు చిన్నయ సూరి రాశాడు. ఆ వ్యాకరణం ఆధారంగా మాకూ ఒక శాస్త్ర గ్రంథం వుంది అని, మేము కూడా శబ్ద సాధుత్వ, అసాధుత్వాలు నిర్ణయించగలం, అని తెలుగు పండితులు ధైర్యంగా చెప్పగలిగే వాళ్ళు. ఆంధ్రశబ్ద చింతామణి నన్నయే రాశాడని, ఆయనని వాగనుశాసనుడిగా గౌరవించి చిన్నయ సూరి మర్యాదగా తన బాలవ్యాకరణంలో ఒప్పుకున్నాడు. బాలవ్యాకరణం చాలా శాస్త్రబద్ధంగా సూత్రాల పూర్వాపర నియమాలతో పాణిని సంప్రదాయంలో వుండే పరిభాషనే వాడుతూ తెలుగు భాషకి అంతకు ముందు లేని పాండిత్య గౌరవాన్ని సంపాదించి పెట్టింది. తెలుగులో వున్న ఒక లేమిని ఈ పుస్తకం పూర్తి చేసింది. తెలుగువాళ్ళు ఇలాంటి ఒక పుస్తకం కోరుకుంటున్న దశలో ఆ ఖాళీ (power vacuum) భర్తీ చేస్తూ బాలవ్యాకరణం ప్రవేశించింది. అది కారణంగా తెలుగు పండితులకి పెద్ద శాస్త్రాధారం దొరికింది.

కవిత్రయంతో మొదలు పెట్టి దాదాపు 8 శతాబ్దుల పాటు కవులు ఛందోబద్ధ కావ్యాలలో వాడిన భాషకి చిన్నయ సూరి వ్యాకరణం కచ్చితంగా సరిపోతుంది. ఏమన్నా తేడాలుంటే అవి చిన్నవి. కాని, మనం వేసుకోవలసిన ప్రధానమైన ప్రశ్న ఛందోబద్ధ కావ్యాలలో వాడిన భాష నన్నయ్య నుంచి ఈనాటి వరకు చిన్న చిన్న మార్పులు మినహా ఒకే పద్దతిలో ఎలా ఉండగలిగింది? అని. కవులందరూ వ్యాకరణ విధేయులై వ్యాకరణాన్ని వ్యతిరేకించే ఏ రూపాలు వాడకుండా ఉండటం దీనికి కారణం అని మనకు అందరూ చెప్తారు. కానీ అంత విస్తృతమైన వ్యాకరణం తెలుగుకి చిన్నయ సూరి వచ్చేదాకా నిజానికి లేదు. ఆంధ్రశబ్ద చింతామణి చాలా చిన్న వ్యాకరణం.

అయినప్పటికీ ఇన్నాళ్లపాటు కావ్యాలలో వుండే ఈ భాష దాదాపుగా ఒకే రూపంలో ఉండటానికి కారణం పండితులు అనుకున్నట్టుగా వ్యాకరణాలు కాదు. ఎవరో ఒకరు వ్యాకరణం రాయబట్టి, ఆ వ్యాకర్త వాగనుశాసనుడు కాబట్టి, ఆ తరవాత దక్షవాటిలో వుండే కవిరాక్షసుడు అనే ఆయన ఎవరో మనకి తెలియకుండా ఒక శాసనం చేశాడు కాబట్టి, కవులందరూ ఆ శాసనాన్ని పాటించారని వ్యాకరణ పండితుల వాదన.

ఆదిని శబ్దశాసన మహాకవి చెప్పిన భారతంబులో
నేది వచింపగా బడియె నెందును దానినె కాని సూతసం
పాదన లేమిచే దెనుగు పల్కు మరొక్కటి గూర్చి చెప్పగా
రాదని దక్షవాటి కవిరాక్షసు డీనియమంబు జేసినన్

(ఆంధ్రకవి తరంగిణి – మూడవ సంపుటము; పు. 73)

 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply


Messages In This Thread
RE: మన తెలుగు గురించి కొంత తెలుసుకుందాము - by sarit11 - 01-07-2020, 07:36 PM
చెప్పండి - by Mohana69 - 29-08-2020, 10:42 AM



Users browsing this thread: 1 Guest(s)