13-06-2020, 06:55 AM
Interlude
కాలం - ?????
ప్రదేశం – xxxxx రాజ్యం
స్థలం – మూడొంతులు నిర్మాణం పూర్తయిన ఒక దేవాలయం
చిన్మయ స్థపతి తన మనసులోని ఆవేదనను ఎవరితో పంచుకోవాలో తెలియక డోలాయమాన స్థితి లో వున్నారు. కనులెదురుగా మూడొంతులు నిర్మాణం పూర్తి చేసుకున్న దేవాలయం కనిపిస్తోంది. కొంచెం దూరంలో వరుసకట్టి ప్రయాణం సాగిస్తున్న అనేక కుటుంబాలని చూసిన ఆయన హృదయం బద్దలవుతోంది. అలా వలసపోతున్న వారిలో ఆయన దేశదేశాలూ తిరిగి గాలించి తెచ్చిన శిల్పులు, వడ్రంగులు, కంసాలులు వున్నారు.
ప్రపంచంలోకెల్లా అత్యద్భుతమైన దేవాలయ నిర్మాణం చేద్దాము రమ్మని వారందరినీ బ్రతిమాలి తన రాజ్యానికి తీసుకువచ్చారు చిన్మయ స్థపతి. ఇప్పుడిలా వారందరూ తరలిపోతుంటే ఆయన హృదయం వేయి వ్రక్కలవుతోంది. మూడు సంవత్సరాల క్రితం వరకూ కూడా మహారాజు గారు స్థపతికి పూర్తి సహకారం అందించారు. తమది సుసంపన్న దేశం. ధనం లేకపోవడం సమస్యే కాదు, అప్పుడూ, ఇప్పుడూనూ. కొంతకాలం క్రితం వరకూ కూడా కళలను, సాంస్కృతిక పురోగతిని ప్రోత్సహిస్తూ వస్తున్న మహారాజు గారు ఉన్నట్టుండి తన వైఖరిని మార్చుకున్నారు.
చిన్మయుల వారి మనసు మూడు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలపైకి మళ్ళింది. ఎలా మర్చిపోగలరు ఆ సమయాన్ని? తన కలకు, జీవితాశయానికీ సంకెళ్ళు పడ్డ రోజులవి. కాశ్మీర దేశం నుండి వచ్చిన ఒక పండితుడు రాజుగారికి ఒక ఉద్గ్రంధం బహూకరించాడు. దానిపేరు ‘కామసూత్ర’ అని తెల్పి ఆ గ్రంధ సంకలనం తన జీవితకాల కృషి ఫలితం అని నిరూపించి రాజుగారి వద్దనుండి భారీ బహుమానం పొందాడా పండితుడు. (నిజంగా కామసూత్ర ఒక వ్యక్తి కూర్చుని రాసింది కాదు. అనేక కామ గ్రంధాలనుంచి ఎన్నిక చేసిన విషయాలను ఏర్చి కూర్చినది అని చరిత్రకారుల భావన)
ఏ ముహూర్తాన ఆ కామసూత్ర గ్రంధం మహారాజు వద్దకు చేరిందో కానీ, ఆ క్షణం నుంచి ఆయన మనసంతా ఒకటే ధ్యాసతో నిండింది. ఐహిక సుఖాలను అనుభవించడమే తన జీవిత పరమార్ధం అన్నట్టు మారిపోయారు మహారాజు గారు. చతుర్విధ పురుషార్ధాల్లో కేవలం కామం మీదే దృష్టి పెట్టి మిగతా వాటిని పక్కకు నెట్టారు.
మహారాజు వద్దకు చేరిన ఆ గ్రంధం చిన్మయుల వారు కూడా చూశారు. రాజాస్థానం లోని ఆంతరంగికులు ప్రతి ఒక్కరూ దానిని ఆసాగ్రమూ చదివారు. ఆ కామసూత్ర గ్రంధంలో ప్రతిపాదించబడిన సుఖాసనాలు, శృంగార క్రీడలు ఆజన్మ బ్రహ్మచారి అయిన చిన్మయుల వారి మనసులో సైతం కాసేపు కలకలం రేపాయి. ఐతే తన జీవితాన్ని ఇంకొక కార్యానికి అంకితం చేసిన చిన్మయుల వారు ఆ ప్రభావం నుంచి త్వరగానే బయటపడ్డారు. కానీ మహారాజు ఆ సుఖసాగరం నుండి బయటకు రావడానికి ఇష్టపడట్లేదు.
కళలకు, ఇతరత్రా ప్రోత్సాహకాలకూ అందజేసే ధనాన్ని కామసూత్రలో ప్రతిపాదించిన నాలుగు జాతుల స్త్రీలను వివిధ దేశాలనుంచి రప్పించడానికి మళ్లించారు. చిన్మయ స్థపతి చేపట్టిన దేవాలయ నిర్మాణం చివరి దశలో ఆగిపోయింది.
అదిగో ఆ చిన్మయుడు కట్టించిన దేవాలయమే మన పెంచలాపురంలోని సూర్యుడి గుడి. మహారాజు తన సుఖాల మోజులో ఏదో ఒక రోజు ధనం కోసం అతి విలువైన పంచలోహ విగ్రహాలను ఎక్కడ కరిగించివేస్తారో అని భయపడ్డారు ఆ స్థపతి. ప్రభు ద్రోహమైనా సరే గుడికి దారి మంత్రశక్తితో దాచివేశారు. తన జీవశక్తి అంతా ఒక చిన్న సూర్యుడి విగ్రహంలో నిక్షిప్తం చేసి అది చేతిలో వున్న వారే దేవాలయానికి దారి తెలుసుకునేలా చేశారాయన. ఈ కార్యంకోసం తన ప్రాణాలు ధారపోశారు ఆయన.
అయితే మనుషుల జీవశక్తి అల్పము. వందల సంవత్సరాల కాలం గడిచాక సూర్య విగ్రహంలోని చిన్మయుని జీవశక్తి సన్నగిల్లుతోంది. పశులకాపరి పెంచలయ్యకు తన మహిమ చూపినప్పుడు ఆ విగ్రహంలోని శక్తి కొంత ఖర్చయింది. ధనుంజయ్ ను శిక్షించడంతో అది దాదాపుగా కొడగట్టింది. ఒకవేళ విగ్రహం పరుల చేతిలో పడితే ధనుంజయ్ లా వాళ్ళను శిక్షించే శక్తి ఇక లేదా విగ్రహంలో మరి. సమయం మించిపోకముందే చివరిసారిగా తనను మంచి మనసుతో తాకిన కిరీటిని కలల ద్వారా చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నదా జీవశక్తి.
ఇంకొక నెలరోజుల్లో సంక్రాంతి పండగ వుందనగా ప్రెసిడెంటు గారు వాడిని, ఆచారిని ఓ రోజు సాయంత్రం తనదగ్గరికి పిలిపించుకున్నారు. ‘ఆచారీ, మీవోడికి ఇగ్రహం ఇసయం సెప్పాల. ఇంక ఆగే టైము లేదు నా కాడ’ అన్నారు.