08-06-2020, 08:25 AM
మాయ - 32
ఈ మధ్య ప్రతి రాత్రి జరుగుతున్నట్టే ఆ రాత్రి కూడా కిరీటి ఓ కలగంటున్నాడు. కల మొదలైన దగ్గర్నుంచీ వాడి మనసు కీడు శంకిస్తూనే ఉంది. భయంకరమైన ఉత్పాతం ఏదో సంభవించబోతోంది అని వాడి మనసు హెచ్చరిస్తోంది. ఎంత ప్రయత్నించినా కలను వీడి వెళ్లలేకపోతున్నాడు. జరుగబోయేది చూసి తీరాలి అని ఏదో శక్తి వాడిని పట్టి నిలిపివేస్తోంది.
ఈసారి తనెవరి శరీరంలో ఉన్నాడో తెలియట్లేదు, కానీ అతడు చెయ్యరాని పని ఏదో చెయ్యబోతున్నట్టు కిరీటి మనసంతా గజిబిజిగా వుంది. మనిషి మంచి బలిష్టంగా వున్నాడు. తన ఊరివాడే అనుకుంటా చుట్టుపక్కన కనిపిస్తున్న ప్రదేశాలన్నీ గుర్తుపడుతున్నాడు కిరీటి. ఊళ్ళో జనాలందరూ ఉత్సాహంగా ఉన్నారు. చుట్టూతా పండగ వాతావరణం నెలకొని ఉంది. కొంచెం దూరంలో కోలాహలం వినిపిస్తోంది. ఆ మనిషి జనాల తాకిడికి కొంత దూరంగా వెనక్కు వెళ్ళి నిలబడ్డాడు.
ఒక రెండు నిముషాల్లో ఓ ఊరేగింపు ఆ వీధిలోకి వచ్చింది. ఆ మనిషి ఊరేగింపు బండివైపే సూటిగా చూస్తున్నాడు. కలలో సైతం సూర్యుడి పంచలోహ విగ్రహం మెరిసిపోతోంది. చూపు తిప్పకుండా దాన్నే చూస్తున్నాడా మనిషి. ఇంతలో పూజారి పక్కనున్న యువకుడిపై అతని దృష్టి పడింది. ఆ మనిషి ఆ యువకుడ్ని గుర్తుపట్టి తలపంకించాడు. కలలో కిరీటి నిశ్చేష్టుడై తనని తాను వేరే వ్యక్తి కనులనుండి చూస్తున్నాడు. వాడు ఆ సంవత్సరం రెండుసార్లు ఊరేగింపులో పాల్గొన్నాడు. ఇది సంక్రాంతి నాటి ఊరేగింపా లేక రథసప్తమి ఊరేగింపా తెలియడం లేదు వాడికి. ఊరేగింపు జరిగినంతసేపూ బండిని ఫాలో అయ్యాడా మనిషి.
కిరీటికి ఒక విషయం మటుకు స్పష్టం అయింది. ఈ మనిషికి సూర్యుడి విగ్రహంపై అలివిమాలిన interest వుంది. ఊరేగింపు మాయమయ్యి చీకటిలో పిల్లగాలిని ఆస్వాదిస్తూ నిలబడ్డాడు ఆ మనిషి. చిరుచీకట్లు కమ్ముకుంటున్నాయి. మెల్లిగా నడుస్తూ వెళ్తుంటే సంతలో కట్టిన నాటకాల స్టేజి కనబడింది. మెల్లిగా అటువైపు అడుగేశాడా మనిషి. జనాలు కొంచెం పల్చగా వున్నారు చివరి వరుసల్లో. అక్కడికి పోయి కూర్చుందామనుకుంటూ మళ్ళీ తెలిసిన ముఖం కనిపించగానే ఆగిపోయాడు. కిరీటి మళ్ళీ తనను తాను శైలుతో కలిసి వుండగా చూసుకున్నాడు.
కనులు మూసి తెరిస్తే ఈసారి గుడిముందు నిలబడ్డాడు ఆ మనిషి. తన చేతిలోని రెండు సన్నటి చువ్వలతో గుడి తలుపుల తాళాలను అలవోకగా ఓపెన్ చేసి, శబ్దం చేయకుండా తలుపులు తెరిచి లోపలకు అడుగుపెట్టాడు. ఏం జరుగబోతోందో తెలిసి ముందుకు అడుగేయకుండా ఉండటానికి కిరీటి గింజుకుంటున్నాడు. ఆ మనిషి పిల్లి అడుగులతో ఉత్సవ విగ్రహాన్ని నిలిపి వుంచిన మండపాన్ని చేరుకున్నాడు. విగ్రహం పక్కనున్న దీపాలు కొండెక్కబోతున్నాయి.
సూర్య భగవానుడు చిమ్మచీకటిలోనూ వింతకాంతితో మెరిసిపోతున్నాడు. అది చూసిన ఆ మనిషి మనసులో మొదటిసారిగా జంకు కలిగింది. వెనుతిరిగి వెళ్లిపో అని కిరీటి అరుస్తున్నాడు ఆ మనిషి మస్తిష్కంలో. తల విదిలించి మళ్ళీ ముందడుగేశాడా మనిషి. జాగ్రత్తగా మండపం వెనక్కు చేరి విగ్రహాన్ని చేతిలోకి తీసుకోబోయాడు. తాకీ తాకగానే కరెంట్ షాక్ తగిలినట్టు చేతిని వెనక్కు తీసుకున్నాడు. ఇప్పుడు నిజంగా భయం తాండవిస్తోంది అతని మదిలో. గట్టిగా ఊపిరి పీల్చి వదులుతూ మనసు ధృడపరుచుకొని ‘యు ఆర్ మైన్’ అంటూ మరొక్కసారి విగ్రహం నడుము చుట్టూతా చేతిని బిగించి పైకి లాగాడు.
విగ్రహం చేజిక్కింది అనుకున్నాడు ఒక సెకను. కానీ అతడి చెయ్యి విగ్రహానికి అంటుకుపోయింది. అప్పుడు అనుభవమైంది అతనికి అసలు హింస. చేతిలో మొదలైన నొప్పి నరనరాల్లోనూ పాకుతూ అంగాంగాన్నీ భస్మం చేస్తూ మెదడు దాకా చేరింది. తను మనిషో, మృగమో తెలియనట్టు బాధలో పొలికేకలు పెడుతున్నాడు. శరీరంలోని అవయవాలన్నీ ఏదో అదృశ్య హస్తం పిండేసినట్టు అనుభూతి చెంది రక్తం కక్కుకుంటున్నాడు. ఇదంతా ఓ ప్రేక్షకుడిలా చూస్తున్న కిరీటి గజగజా వణికిపోతున్నాడు. ఆ మనిషి చివరకు ‘క్షమ, క్షమ’ అంటూ గొణుగుతున్నాడు. విగ్రహం నుంచి చెయ్యి విడివడగానే గుళ్ళోంచి బయటకు పరుగెట్టాడు.
రాత్రంతా ఎవరికంటా పడకుండా ఎక్కడో తుప్పల్లో స్పృహలేకుండా పడున్నాడు. తెలతెలవారుతుండగా ఓ ఇంటి తలుపు తట్టాడు. కిరీటి తలుపు తెరిచాడు. ఆఖరుసారిగా తననుతాను చూసుకున్న కిరీటి కలలోంచి బయటకొచ్చి పడ్డాడు. అన్నాళ్ల క్రితం గుడిలో పడ్డ దొంగ ధనుంజయ్ అని రూఢి అయింది అతనికి. మనసు వికలమైపోయిన కిరీటి ‘ధనుంజయ్, సునయన’ అని రెండు పేర్లు పలికాడు. ముఖాన్ని చేతుల్లో కప్పుకుని వుండిపోయాడు.
సమయం చూస్తే రాత్రి ఒంటిగంటే అయింది. మళ్ళీ తెల్లవారుఝాము ఓ కోడి నిద్ర తీసేవరకూ తనకొచ్చిన కలగురించి ఆలోచిస్తూ వుండిపోయాడు. మెలకువ వచ్చేముందు వాడికి మళ్ళీ తను, సునయన ఓ జలపాతం ముందు వుండటం కనిపించింది. ఈసారి ఆమెను కలిసే సందర్భం కోసం అదివరకట్లా ఆతృతతో ఎదురుచూడట్లేదు వాడు.