08-06-2020, 08:21 AM
మాయ - 31
కాలం చాలా వేగంగా పరిగెడుతున్నట్టు వుంది కిరీటికి. కిట్టి ఎపిసోడ్ ఒక కొలిక్కి వచ్చింది. విషయం తెలిసిన తక్షణం వాడి తల్లిదండ్రులు మద్రాసు వెళ్లారు. వాళ్ళు కోపంగా కాక ప్రేమతో వాడిని ట్రీట్ చెయ్యాలి అని కోరుకోవడం తప్ప ఇంకేమీ చెయ్యలేకపోయాడు కిరీటి. చూస్తుండగానే సంవత్సరం చివరకు వచ్చింది.
ఒకసారి అలా పెంచలాపురం దాటి బయట ప్రపంచంలో ఏం జరుగుతోందో చూసొద్దాము.
నైనిటాల్, లా విల్లా బ్లూ:
ఒక్కొక్కసారి మనం మనుషులను తప్పుడు అంచనా వేస్తుంటాము. పర్యవసానాలు ఎదురయ్యేదాకా మన తప్పు మనకి తెలిసిరాదు. ఫ్రాన్స్-వా డిసౌజా గురించి తానెంత తప్పుగా ఊహించాడో తెలుసుకున్న సుందర్ ఒక షాక్ లో వున్నాడు. తానే కాదు, అతడి దగ్గరనుండీ దొంగిలించాలని ఆలోచన చేసిన వాళ్ళంతా అదే తప్పు చేశారు. అతడి క్రూరత్వాన్ని, హద్దులెరుగకుండా తన కోపం చల్లారేవరకూ వెంటాడే అతడి తత్వాన్నీ ఎవరూ ఊహించలేదు.
ఎలా సాధించాడో తెలియదు కానీ నిజమైన మాలిని కపూర్ ను తన విల్లాలోకి రప్పించి బంధించాడు డిసౌజా. మాలినిని చూసిన సుందర్ ఆమెను తన కన్సల్టెన్సీలో అదివరకు పనిచేసి తొలగింపబడ్డ మనిషిగా గుర్తించాడు. ఈ విషయం విని డిసౌజా కళ్ళల్లో కదలాడిన భావాలు చదవలేకపోయాడు. దొంగతనం తలపెట్టడంలో తమ కన్సల్టెన్సీ పాత్ర కూడా వుందని అనుమానిస్తే దాన్ని నాశనం చెయ్యగల శక్తి వుంది ఈ డిసౌజాకి అని తెలుసుకున్నాడు ఇన్నినాళ్ళ సహవాసంలో సుందర్. తన భవిష్యత్తు గురించీ తన కంపెనీ భవిష్యత్తు గురించీ ఆందోళనలో పడ్డాడు.
తననెదిరిస్తే ఏం జరుగుతుందో తెలియజెప్పడానికి అన్నట్టు మాలినిని విచారించిన ప్రతిసారీ సుందర్ ను పక్కనే వుంచుకున్నాడు డిసౌజా. ఆ ఎత్తుగడ బాగానే ఫలించింది. ఇప్పుడు సుందర్ కలలో కూడా డిసౌజాను antagonize చేసే ధైర్యం చెయ్యట్లేదు. రాబట్టాల్సిన వివరాలన్నీ తెలుసుకున్నాక మాలినిని తన విల్లాలోంచి వేరేచోటకు మార్చాడు డిసౌజా. ఆమె fate ఏమిటనేది అడగడానికి ధైర్యం చాల్లేదు సుందర్ కు. అయితే మాలిని చెప్పిన సునయన అనే అమ్మాయి ఈ క్రూరుడి చేతిలో పడితే జరిగేది తలచుకొని ఒళ్ళు గగుర్పొడిచింది. తనని ఇబ్బందుల పాలు చేసినా కూడా సునయన ఈ దుష్టుడి చేతికి చిక్కకూడదనే కోరుకున్నాడు.
సూరత్ లోని ప్రతి కన్సల్టెన్సీకి ఓ పాఠంగా ఇక్కడ జరిగినవన్నీ సుందర్ కి చూపి వెనక్కు పంపాడు డిసౌజా. ఆ మాట బయటకు చెప్పలేదతను. కానీ డిసౌజా అంతరంగాన్ని అర్ధం చేసుకుని బ్రతుకు జీవుడా అనుకుంటూ సూరత్ తిరిగిపోయాడు సుందర్.
******************
హైదరాబాద్ చేరుకున్న సునయన ధనుంజయ్ చనిపోయేముందు తనకు రాసిన ఉత్తరాన్ని మళ్ళీ మళ్ళీ చదువుకుంది. వినయ్ కు ఉన్న అతి పెద్ద రహస్యం అతడి ఫ్యామిలి హిస్టరీ అని, అదొక్కటే బహుశా నిన్ను వాడినుంచి కాపాడుతుంది అని రాశాడు ధనుంజయ్. ఈ విషయాన్ని వాడుకొని డైరెక్ట్ గా వినయ్ ను బెదిరించాలో, లేక అతడ్ని దెబ్బతీయడానికి ఈ విషయాన్ని వేరేవాళ్ళకు చేరవేయాలో తేల్చుకోలేక పోతోంది ఆమె.
అలసిపోయిన మనసుతో వున్న ఆమెకు కిరీటి గుర్తొచ్చాడు. వాడిని ఎలాగైనా కలవాలని మనసు పీకుతోంది ఆమెకు. ఒక నిశ్చయానికి వచ్చి చిన్న పార్శిల్ తయారుచేసింది. అందులో డిసౌజా దగ్గర తీసుకున్న ఐదు వజ్రాలను, దానితోపాటు ఒక చిన్న ఉత్తరాన్ని ఉంచింది. Post office కు వెళ్ళి ఆ పార్శిల్ ను నైనిటాల్ పంపింది. పోస్ట్ ఆఫీసు నుంచి బయటకు వస్తుంటే ఎందుకో ఇద్దరు వ్యక్తులు తననే చూస్తున్నారు అని అనుమానించింది. హైదరాబాద్ లో కూడా కొన్నాళ్లు విశ్రాంతిగా ఉండే యోగం తనకు లేదేమో అనుకుంటూ కన్నీళ్లు చిప్పిల్లుతున్న కళ్ళతో అక్కడ్నుంచి వెళ్లిపోయింది.
******************
ఫ్రాన్స్-వా డిసౌజా తన స్టడీ రూమ్ లో కూర్చొని చేతిలో వున్న వస్తువుని తీక్షణంగా చూస్తున్నాడు. అది ఒక magnifying loupe. పసిపిల్లల గిలక్కాయ లాగా శబ్దం చేస్తోంది. Loupe పై లెన్స్ తెరిచి చూశాడు. ఐదు వజ్రాలు బయటపడ్డాయి. పక్కనే వున్న ఉత్తరం మళ్ళీ చదివాడు. వినయ్ కాతియా అనే పేరు సైలెంట్ గా మననం చేసుకున్నాడు.
దొంగతనం చేసిన పిల్ల రూపం మళ్ళీ కళ్ళముందు మెదిలింది. మామూలుగా ఐతే ఇక్కడితో ఈ ఆట ఆపేసేవాడు. వజ్రాలు తిరిగి తన చేతికొచ్చాయి. తప్పు చేసిన వాళ్ళందరికీ తన పవర్ ఏమిటో తెలిసేలా చేశాడు. వేరే వ్యాపకంలో పడిపోయేవాడే. కానీ మళ్ళీ ఆ అమ్మాయి రూపం గుర్తొచ్చింది. నో, ఒకసారైనా ఆమె యవ్వనాన్ని రుచిచూడందే వదలకూడదని నిర్ణయించుకున్నాడు.
******************
వినయ్ కాతియా మనసంతా అల్లకల్లోలంగా వుంది. ఎలా వచ్చారో తెలీదు, అతని హోటల్ గదిలోకి ఒక అర్ధరాత్రి ఇద్దరు మనుషులు చొరబడ్డారు. మాలినిని తీసుకెళ్తున్నామని చాలా కూల్ గా చెప్పి వెళ్లారు. తమ కన్ను అతడిపై వుందని, ఏమార్చే ప్రయత్నాలు చేస్తే ఏం జరుగుతుందో చాలా వివరంగా చెప్పి వెళ్లారు. చాలాకాలం పాటు తనను అంటిపెట్టుకొని వున్న మాలినిని కోల్పోవడం అతడ్ని మానసికంగా ప్రభావితం చేసింది. Sure, ఆమె చెప్పిన దొంగతనం ప్లాన్ బెడిసికొట్టింది. కానీ, సఫలమై వుంటే వచ్చే డబ్బు కోసం ఆ రిస్క్ చెయ్యవచ్చు అనిపించింది ఆ సమయంలో.
తన స్టేటస్ మీద తనకేమీ అపోహలు లేవు వినయ్ కు. తానేమీ నేరప్రపంచపు యువరాజు కాదని తెలుసు అతడికి. ఒకప్పుడు తనలో ఉన్న అలాంటి పిచ్చి ఊహాల్ని ధనుంజయ్ పటాపంచలు చేశాడు. మొట్టమొదటిసారి నిజాయితీగా ధనుంజయ్ ను, అతడి guidance ను తానెంత మిస్ అవుతున్నాడో గుర్తించాడు.
తన జేబులోంచి చిన్న డైరీ బయటకు తీసి ప్రస్తుతం తను తలపెట్టిన దొంగతనాలన్నిటినీ ఒకసారి పరిశీలించి చూశాడు. తక్కువ సమయంలో ఎక్కువ ధనం సంపాదించే వెంచర్ ఏదో గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇక ఈ దేశాన్ని వదిలిపోవటం బెటర్ అనుకుంటున్నాడు. ఉత్తరాదిన ఎలాగూ కాలుపెట్టలేడు. ఇప్పుడు వేసిన తప్పటడుగుతో దక్షిణాదిన కూడా దారులన్నీ మూసుకుపోతున్నాయి అనిపిస్తోంది అతడికి.
ఒక పేజీలో circle చేసి వుంచిన పంచలోహ విగ్రహం జాబ్ ను చూశాడు. కొంతకాలంగా దీన్ని పక్కన పెట్టి వుంచడంతో తనపైన కన్నేసివుంచిన వాళ్ళకి ఈ జాబ్ గురించి తెలిసే అవకాశం లేదని నిశ్చయించుకున్నాడు. తననెవరూ ఫాలో కాకుండా చూసుకొని ఢిల్లీలో ఒక అడ్రెస్ కి ‘still interested?’ అనే ఒక వాక్యపు టెలిగ్రాఫు పంపించాడు.
ఇక మిగిలింది ఒకే ఒక పని. సునయనను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదని డిసైడ్ అయ్యాడు.