05-06-2020, 10:57 AM
మాయ - 30
‘ఇలాగ ఇంటికి రాలేనురా. ఎంత మతిలేని నాకొడుకుని కాకపోతే ఇట్టాంటి పని సేత్తానురా! ఊరోళ్ళు, బంధువర్గంలో ప్రతి వోడు అమ్మని, అయ్యని మాటలతో ఎట్టా పీక్కుతింటాండారో ఊహకి అందట్లే. ఎట్టా సూపియ్యనురా నా ముఖం ఆళ్ళకి’ అంటూ బాధపడ్డాడు. ‘సమస్తరం నుండీ స్టేజీలు, సెట్లు కట్టడానికి, మేకప్పులు ఎయ్యడానికి వాడతాండు రాములు బాబాయి నన్ను. యేసాలకి పనికిరానని తెలిసి కూడా తరిమెయ్యలేదు. అదొక్కటే సంతోసం’ అంటూ మనసులో బాధనంతా బయటకు కక్కాడు.
తమతో రమ్మని శతవిధాల బతిమాలారు, భయపెట్టారు ముగ్గురూ. ససేమిరా రానని మొండికేసాడు కిట్టి. చాలాసేపు మౌనంగా వున్న తర్వాత రంగ ఒక మాటన్నాడు. ‘రేయ్, నిన్నీ నాటకాల బాచితో ఒదిలేది లేదు. నేనోటి సెబుతా. ఇన్నావా సరే వుంది. లేకపోతే నిన్నీడనుంచి ఎట్టా లాక్కుపోవాల్నో మాకెరికే’ అనేసరికి కిట్టి ఎట్టకేలకు తలూపాడు.
‘మదరాసులో మా మాయ్య ఓ డిస్ట్రిబ్యూటరు ఆఫీసులో పనిసేత్తన్నాడు. నిన్నాడకి తోలకబోయి ఆయన సేతిలో బెడతా. ఏదో ఒక పనిలో పెడతాడు. పనిలో చేరిన తర్వాత వారం తిరక్కుండా మీ అమ్మా, అయ్యలకి ఉత్తరం రాయాల నువ్వు. నే సెప్పింది సెప్పినట్టు జరక్కపోతే నా అంత సెడ్డ మడిసి ఇంకోడుండడు’ అనేసరికి కళ్ళనీళ్లతో వాడిని వాటేసుకున్నాడు కిట్టి.
మర్నాడే బయల్దేరి మద్రాసు వెళ్లారు మిత్రులు నలుగురూ. కిట్టిని ఇక రాములు నాటకాల కంపెనీ వైపుకి పోనీయలేదు. సరాసరి వాడిని తీసుకెళ్లి రంగ వాళ్ళ మామయ్య చేతిలో పెట్టారు. ఆయన ‘ఇప్పటికిప్పుడు అంటే ఈ కుర్రాడికి ఏం పని చూడాలిరా నేను’ అని ఆలోచనలో పడ్డాడు. కిట్టికి స్టేజీలు కట్టడాలు, మేకప్పులు వెయ్యడాలు తెలుసని విని ఏదో ఒక ప్రొడక్షన్ కంపెనీలో పని వేయిస్తానని మాట ఇచ్చాడు.
ఎట్టకేలకు మళ్ళీ తమ స్నేహితుడు తమ మధ్యకు వచ్చినందుకు, వాడి జీవితం పాడైపోకుండా ఓ దారిలోకి వచ్చినందుకు చాలా సంతోషించారు మిత్రులందరూ. అన్నాళ్ల ఆకలి ఒకేసారి తెలిసినట్టుంది అర్జెంటుగా ఎక్కడన్నా భోజనానికి పోదామన్నాడు కిట్టి. ఆఫీసులోంచి నవ్వుతూ తుళ్లుతూ బయటకు వచ్చారు నలుగురూ. ఎందుకో తలతిప్పి ఆఫీసు బయటున్న బోర్డు వంక చూశాడు కిరీటి. తమిళంలో రాసున్న బోర్డు చూడగానే వాడి గుండె ఝల్లంది. కలలో చూసింది చూసినట్టు రెండోసారి జరిగింది. అర్జెంటుగా ఇంటికి చేరిపోయి వాళ్ళ నాన్నతోనూ, శైలూతోనూ ఈ విషయాన్ని పంచుకోవాలని వుంది వాడికి.
కిట్టిని పనిలో చేరిన వెంటనే ఉత్తరం రాయమని మరీ మరీ చెప్పి రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు మిగతా ముగ్గురూ. కిరీటి గుండె దడదడలాడుతోంది. సునయన కూడా నిజంగా కనిపిస్తుందా! వాడి కళ్ళు స్టేషన్ లోని ప్రతి ముఖాన్ని వెదికేస్తున్నాయి. చివరకు తమ ట్రైన్ వచ్చే platform వద్దకు చేరుకున్నారు. అక్కడా ఇక్కడా కొంతమంది జనాలు పక్కలు పరుచుకొని పడుకుని వున్నారు. కిరీటిని సామాన్లు చూస్తుండమని చెప్పి ఏమన్నా తినడానికి తీసుకొస్తామని వెళ్లారు గోరు, రంగ.
అదురుతున్న గుండెతో ఓ స్తంభాన్ని ఆనుకొని కూర్చుని జేబులోంచి ఓ coin బయటకు తీశాడు. మెల్లిగా దాన్ని వేళ్ళ మధ్యలో నాట్యమాడిస్తున్నాడు. గుండె టాప్ స్పీడ్ లో కొట్టుకుంటోంది వాడికి. కానీ సునయన వెనకనుండి వచ్చి వాటేసుకోలేదు. కలలో జరిగిన ఆ ఒక్క విషయం మటుకు జరగట్లేదు. మెల్లిగా ‘సునయనా’ అని పిలిచాడు. ఏమీ అద్భుతం జరగలేదు. నిరాశతో మరోసారి సునయన పేరు పిలిచాడు. పక్కగా పడుకున్న కొందరు కదలటం చూసి వాళ్ళని డిస్టర్బ్ చెయ్యటం ఇష్టం లేక అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. కాసేపాగి తన స్నేహితులతో కలిసి ట్రైన్ ఎక్కి వెళ్లిపోయాడు.
కిరీటి అక్కడినుండి వెళ్ళిన కాసేపటికి అక్కడ ముసుగుతన్ని పడుకుని ఉన్న ఒక ముసలావిడ తన తలకిందున్న బాగ్ తీసుకొని కిరీటి ఎక్కిన రైలు వైపుకి బయల్దేరింది. ఇంతలో పహిల్వానుల్లాంటి కొంతమంది మనుషులు ఆ రైలుని గమనిస్తుండడం చూసి ఆమె ముఖంలో భయం కదలాడింది. మెల్లిగా పక్క platform మీదకు వెళ్లి అక్కడున్న హైదరాబాద్ వెళ్తున్న రైలు ఎక్కింది. T.C. సీటు వుండే గూడ్సు బోగీ ఎక్కి రైలు బయల్దేరేవరకూ ఎవరికంటా పడకుండా కూర్చుంది. ఆ ముసలావిడ వేషంలో వుంది మన సునయనే.
ఆమె మనసులో ఆనందం, భయం, విషాదం అన్నీ కలగలిసి గుండెని పిండేస్తున్నాయి. కిరీటి తన పేరు పిలవగానే లేచి వాడిని హత్తుకుపోవాలని, వాడితోపాటు వెళ్లిపోవాలని కలిగిన కోరిక ఆపుకోవడానికి తన willpower అంతా వాడాల్సి వచ్చింది. ఓ అయస్కాంత శక్తి ఏదో తనని వాడివైపు లాగేస్తుంటే దాన్ని fight చెయ్యడానికి తల ప్రాణం తోకకొచ్చింది సునయనకి. వినయ్ మనుషులు రైల్వే స్టేషన్ లో లేకపోతే ఈపాటికి సునయన కిరీటితో వెళ్ళిపోయేదే.
అసలు వాడ్ని మళ్ళీ ఈ జన్మలో కలుస్తానని కానీ, వాడిని చూడడం కానీ జరుగుతుందనుకోలేదు. తనని మర్చిపోయాడేమో అనుకున్నది ఇన్నాళ్లూ. వాడు తనదాకా ఎలా వచ్చాడో, తనపక్కనే కూర్చొని తన పేరు ఎందుకు పిలిచాడో అంతా మాయగా వుంది సునయనకి. దాదాపు సంవత్సరంన్నర క్రితం చూసిన కిరీటికి ఇప్పుడు తను చూసిన యువకుడికీ ఎక్కడా పొంతన లేదు. కొంచెం పొడుగు సాగాడు మనిషి. కాస్త బక్కపల్చగా వుండేవాడు ఇప్పుడు కండ పట్టాడు. అలసటగా వున్నా వాడి ముఖంలో ఓ తెలియరాని వెలుగుంది.
వినయ్ గాంగ్, డిసౌజా మనుషుల రొంపిని వదిలించుకోవడానికి తన చేతిలో వున్న వజ్రాలను వదిలెయ్యాలి అనే దిశగా మొదటిసారిగా నిర్ణయం తీసుకుంది. కిరీటిని చూశాక తను జీవితంలో ఏం కోల్పోతోందో అర్ధమైంది సునయనకి. వినయ్ కి, డిసౌజాకి లంకె వేసి తను తప్పించుకోవడం ఎలా అనేదాని గురించి ఆలోచించడం మొదలెట్టింది.
అక్కడ కిరీటి పరిస్థితి చూద్దాం. తనకొచ్చిన కల నిజం అయ్యి తీరుతుంది అనే ఒక నమ్మకంతో వున్నాడు రైలు ఎక్కేవరకు కూడా. రైలు ఎక్కాక కూడా platform చూస్తూనే వున్నాడు. కలలో కనిపించిన అనేక విషయాలు నిజంగా జరిగిన దానికి సరితూగాయి. తిరుపతి వచ్చాడు, మదరాసు కూడా వచ్చాడు. అలా రావడం తన మిత్రునికి ఉపయోగపడింది. అందుకు సంతోషంగా వున్నాడు. ఐతే సునయన ఎందుకు కనబడలేదో అర్ధం కాకున్నది వాడికి. అదే ఆలోచనతో నిద్రపోయాడు. ఈసారి వాడికొచ్చిన కలలో సునయన ఒక జలపాతం ముందు కూర్చుని వుంది. మళ్ళీ తను ఆమె పక్కనున్నాడు! ఇద్దరూ నవ్వుతూ తుళ్లుతూ మాట్లాడుకుంటున్నారు. చాలా రోజులవరకూ జలపాతం, సునయన; ఈ రెండింటినీ మర్చిపోలేదు వాడు.