22-05-2020, 07:59 PM
మాయ - 19
Back to పెంచలాపురం.......
ధనుంజయ్ కి కట్టు కట్టి పంపించాక కిరీటి తయారయ్యి తన స్నేహితుల దగ్గరికి వెళ్ళాడు. రంగ అప్పుడే వచ్చినట్టున్నాడు గోరు వాడికేదో ఉత్సాహంగా చెప్తున్నాడు. ‘అరేయ్ మామా, రంగ మిస్ అయిండురా రేత్తిరి గలాటా. నువ్వు కూడా సెప్పు’ అంటే ‘ఏం జరిగిందిరా రాత్రి?’ అని ఎదురు ప్రశ్న వేశాడు.
‘ఓర్నీయవ్వ, ఊళ్ళో ప్రతి మడిసి లెగిసి గుడికాడకి లగెత్తుకొచ్చినారు గందా! నువ్వేడుండావు?’
‘రాత్రి పడుకున్నవాడిని ఇప్పుడే ఒక గంట క్రితం లేచానురా. ఏమన్నా విశేషం జరిగిందా.’
గోరు ఒక గొప్ప సీక్రెట్ బయటపెట్టేవాడిలా వాళ్ళని కాసేపు ఊరించాడు. ఇద్దరూ అల్మోస్ట్ మీద పడి కొట్టినంత పని చేసేసరికి ‘సెబుతా, ఆగండ్రా’ అని వాళ్ళు నోరెళ్ళబెట్టే విషయం చెప్పాడు. ‘రేత్తిరి గుళ్ళో దొంగలు పడినారు. ఎంతమందో తెలీదు. సూరీడి ఇగ్రహం ఎత్తుకెళదామని వొచ్చారు లాగుంది. కానీ సామి మహిమ. రగతం కక్కుకు సచ్చారు దొంగనాయాళ్ళు.’
కిరీటి మైండ్ లో ఏదో అలారం మోగుతోంది. ‘ఏమంటున్నావురా? దొంగలు గుళ్ళో పడి చచ్చిపోయారా? అసలు ఊళ్ళో వాళ్ళకి ఎలా తెలిసింది దొంగలు పడ్డారని?’ అంటూ ప్రశ్నలు గుప్పించాడు.
‘దొంగోళ్ళు మన సేతికి సిక్కలే. అర్ధరేత్తిరి టయంలో గుళ్ళోనుంచి కేకలు ఇనబడ్డాయి. అట్టాన్టి ఇట్టాన్టి కేకలు కాదు. మడుసులు ఎవరూ అలాగ అరవడం ఎప్పుడూ ఇన్లేదని సెప్పాడు మా అయ్య. జనాలు గుడికాడకి ఎల్లే తలికి గుడి తాళాలు బద్దలు కొట్టున్నాయంట. లోపలికి పోయిన మొనగాళ్ళు వణికిపోతా బయటికొచ్చారు. నీళ్ళ బిందిలో పట్టేతంత రగతం సాములోరి ఇగ్రహం కాడ జూసి అందరికీ మాటలు పడిపోయినయ్యి. పెసిడెంటు గారింటి కాడ రేత్తిరి నించీ పెద్ద పంచాయితీ నడుస్తాంది.’ అంటూ బాంబు లాంటి వార్త చెప్పాడు.
కిరీటి, రంగా ఆ మాట విని షాక్ లో వున్నారు. ‘ఊరు ఊరంతా రేత్తిరి నిద్దర పోలే. ఊళ్ళోకొచ్చే దార్లు మూసేసినారంట. సంత లేపేసినారు పొద్దుగాలే అంటాండారు’ చెప్పుకుపోతున్నాడు గోరు. ఇంతలో రాజన్న వస్తూ కనిపించాడు. వీళ్ళ దగర ఆగి కిరీటితో ‘అబ్బీ, నీకు కుదిరినంక ఓ తూరి పెసిడెంటు గారింటికి పో. మీ అయ్యని రమ్మని కబురంపిండు పెదబాబు. నువ్వు కానబడితే పంపియ్యమండు’ అని చెప్పాడు.
‘వెళ్తున్నా బాబాయి’ అని చెప్పి ప్రెసిడెంటు గారింటికి బయల్దేరాడు కిరీటి. అక్కడంతా కోలాహలంగా వుంది. ఎప్పుడూ రాత్రిళ్ళు ఆయన ఇంట్లో పడుకునే ఇద్దరు పాలెగాళ్ళు కాక ఇంకొక పది మంది జమాజెట్టీలు కాపలా కాస్తున్నారు అక్కడ. పెదబాబు అరుగుమీద కూర్చొని చుట్టూతా వున్న జనాలతో మాట్లాడుతున్నారు. కిరీటిని చూడగానే ‘రేయ్, మీ బాబు పనికి కావల్సిన టయంలో ఎప్పుడూ ఊళ్ళో వుండడా? ఇంత గలాటా జరుగుతాంది, ఇప్పుడా ఊరిడిసి పొయ్యేది’ అంటూ చిందులు తొక్కడం మొదలెట్టారు.
అప్పుడే టీ గ్లాసులతో బయటికి వచ్చిన ఆయన భార్య ‘చాల్లే ఊర్కోండి. ఆచారి పక్కన లేకపోతే కాళ్ళు చేతులు ఆడట్లేదు అని చెప్పాల్సింది పోయి కుర్రాడి మీద అరుస్తారా? అబ్బీ, నువ్వు లోపలికి రా అయ్యా. పంచాయితీ తెమిల్చి లోపలికి రా, ఇంత తిని పో ఊళ్ళోకి. మళ్ళీ ఇంటి మొగం ఎప్పుడు చూస్తావో’ అని పెదబాబుని కసిరి కిరీటిని లోపలికి తీసుకెళ్లింది.
‘ఏమన్నా తిన్నావా బాబూ?’ అని అడిగి కిరీటి సమాధానం చెప్పేలోపే ఓ ప్లేట్ లో ఉప్మా పెట్టి ఇచ్చింది. మంచి ఆకలి మీద వున్నాడేమో కిరీటి మారు మాట్లాడకుండా తినేశాడు. ‘అబ్బీ, రాత్రి గలాటా విన్న కాడ్నించి శైలమ్మ కంటి మీద కునుకు లేకుండా నీ పేరే కలవరిస్తాంది.’ కిరీటి గుండెల్లో రాయి పడింది. నిన్న జరిగింది శైలు ఈవిడకి ఏమన్నా చెప్పిందో ఏమో అని భయపడసాగాడు.
కిరీటి ముఖంలో భయం చూసి ‘భయపడాకు, ఈ కొన్ని నెలలుగా నువ్వు, నిక్కమ్మ లేకుంటే నా బిడ్డ ఏమైపోయేనో. ఎప్పుడు చూసినా మీ ఇద్దరి మాటలే దానికి. ఓ పాలి దాన్ని చూసిరా. అట్నే నీ సేత్తో ఏమన్నా తినిపియ్యి. నా వల్ల కాటల్లేదు దానితో ఏమన్నా కతికియ్యడం. తొరగా పోయిరా, ఆయన లోపలికొస్తే నిన్ను పనిలో ముంచేస్తాడు’ అని ఉప్మా ప్లేట్ ఇచ్చి శైలు గదిలోకి పంపింది.
గదిలో శైలు మంచమ్మీద పడుకొని ఉంది. మూడంకె వేసుకొని చేతులు కాళ్ళ మధ్య పెట్టుకొని చిన్న బాల్ లా ముడుచుకొని వుంది. కోడి నిద్రలో వుందేమో కిరీటి అడుగుల చప్పుడు వినగానే చటుక్కున తల ఎత్తి చూసింది. వాడ్ని చూడగానే లేచి కూర్చుని పెద్ద పెద్ద కళ్ళతో వాడ్నే చూస్తోంది. కిరీటి తన పక్కన కూర్చోగానే వాడ్ని తన చేతులలో చుట్టేసి మొహం వాడి ఛాతీలో దాచేసుకొని ఏడవడం మొదలెట్టింది.
ఆమెను అలాగే పొదివి పట్టుకొని ఒక రెండు నిమిషాలాగి ‘శైలూ, ప్లీజ్ ఆపు. ఎందుకేడుస్తున్నావు? చూడు’ అంటూ పైకి లేపాడు. ‘రాత్రి జనాలతో పాటు వెళ్ళావా?’ అని అడిగింది. ‘నువ్వు నమ్మవు, నేను రాత్రి నిద్ర లేవలేదు. గోరు చెప్పేవరకు ఏం జరిగిందో కూడా తెలీదు నాకు’ అన్నాడు.
‘థాంక్ గాడ్, నువ్వూ నీ మొద్దు నిద్ర.’
‘మీ అత్తయ్య నువ్వు నా పేరు కలవరించావని చెప్పారు’ కొంచెం బెరుగ్గా అన్నాడు కిరీటి. ఈసారి వాడ్నింకా గట్టిగా పట్టుకొని వుండిపోయింది. ‘నాకెంత భయమేసిందో తెలుసా నీ గురించి? దొంగలు విగ్రహం పట్టుకుని రక్తం కక్కుకున్నారని చెప్పారు. నిన్న నువ్వు కూడా విగ్రహం పట్టుకెళ్ళావు ఇక్కడ్నుంచి. నీకేమన్నా ఔతుందేమో అని రాత్రి అంతా ఎంత గాభరా పడ్డానో.’
‘నేనేమన్నా దొంగనా, నాకేమన్నా అవడానికి?’ నవ్వుతూ అడిగాడు. కానీ శైలు నవ్వే మూడ్ లో లేదు. ‘అది కాదురా, నిన్న నువ్వు చక్కగా ఊరేగింపు కోసం పవిత్రంగా వస్తే నేను...నేను... నిన్ను పట్టుకొని, ముద్దు పెట్టుకొని పిచ్చిదాన్లా behave చేశాను’ అంటూ వణికిపోసాగింది.
‘శైలూ, డోంట్ వర్రీ. నాకేమీ కాలేదు. వాళ్ళు రక్తం కక్కుకున్నారని ఏంటి గ్యారంటీ? ఏదన్నా తగిలి వాళ్ళ కాళ్ళు చేతులు కోసుకుపోయి వచ్చిన రక్తమేమో అది. అసలు జరిగింది ఎవరన్నా చూసారా? పూర్తిగా వివరం తెలీకుండా ఇలా భయపడితే ఎలా? మనకు తెలిసిందల్లా ఎవరో గుడి తాళాలు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారని మాత్రమే’ అంటూ సముదాయించాడు. శైలు కొంచెం శాంతించడం చూసి మెల్లిగా ఉప్మా తినిపించాడు. ‘రెస్ట్ తీసుకుంటావా, నేను మళ్ళీ కలుస్తాను’ అని అడిగాడు.
‘కిరీటీ, వాళ్ళు నిన్ను బలవంతపెడతార్రా’ అంటూ మళ్ళీ చుట్టేసింది. ‘ఎవరు, ఎందుకు?’ మెల్లిగా ఆమె తల నిమురుతూ అడిగాడు. ‘నిన్న రాత్రి అలా జరిగిన దగ్గర్నుంచీ ఒక్కళ్ళు కూడా విగ్రహం ముట్టుకోడానికి సాహసించట్లేదు. నిన్న నువ్వు ఒక్కడివే విగ్రహం పట్టుకుని సేఫ్ గా వున్నావు. అందరూ superstitious గా ఆలోచిస్తున్నారు. నిన్ను విగ్రహం ఇక్కడికి తీసుకొచ్చి మామ తిజోరీ లో పెట్టమని బలవంతం చేస్తార్రా’ వాడి ముఖంలోకి భయంగా చూస్తూ అంది.
కిరీటి తన తండ్రి దగ్గర అనుభవించిన ప్రేమ ఒక రకం, నిక్కీ దగ్గర అనుభవించిన affection ఒక రకం. కానీ ఇలా శైలు వాడిపట్ల చూపే ప్రేమ వాడు ఎప్పుడూ అనుభవించనిది. ఇంత డీప్ గా తన క్షేమం గురించి ఆలోచించే స్త్రీ రూపం వాడికి ఇప్పటిదాకా జీవితంలో లేదు. తొలిసారి తల్లిప్రేమ లాంటి ప్రేమ, కేరింగ్ experience చేసేసరికి వాడికి కళ్ళమ్మట నీళ్లొచ్చాయి.
‘భయమేస్తోందా’ అని శైలు అడిగితే లేదని తల ఊపి ఆమెను పడుకోబెట్టాడు. ‘కొంచెంసేపు పడుకో. నేను మళ్ళీ వస్తాను’ అని చెప్పి వెళ్ళాడు. కాసేపటికి పెదబాబు లోపలకి వచ్చి ‘మీ బాబు రేపు సాయంత్రం వస్తాడ్రా. పూజారి తొరగా ఏదో శాంతి చెయ్యాలి అంటాండాడు. ఇగ్రహం అలా గుళ్ళో ఒదిలెయ్యలేము. ఆయనకి కూసింత తోడుండి ఏం సెప్తాడో అది సేత్తావా’ అని అడిగారు. అది అడిగేటప్పుడు వాడి ముఖం చూడలేకపోతున్నారు ఆయన.
కిరీటి అది గమనించనట్టే ‘అలాగే పెద్దాయనా, శాంతి చేశాక విగ్రహం నేనే తెచ్చి ఇస్తాను’ అని ఆయన అడగలేని ప్రశ్నకి జవాబు చెప్పాడు. పెద్దాయన కిరీటి చేతులు పట్టుకొని ‘ఊరు ఊరంతా గగ్గోలు పెడతాండారు. సిన్న పిల్లోనివి, నీ సేత ఇసుంటి పని... మీ అయ్య వుంటే నిన్నీ పని సెయ్యమన్నందుకు నన్ను నరికి పొగులేట్టే వాడేమో. నన్ను ఒగ్గెయ్యారా’ అంటుంటే ఆయన మాట పూర్తి కానివ్వలేదు కిరీటి. ‘పెదబాబూ, మీరు ఊళ్ళో కాపలా సంగతి చూస్కోండి, నేను వస్తాను’ అని గుడికి వెళ్ళాడు.
గుడి చుట్టూతా కాపలా ఇంకా దిట్టంగా వుంది. కిరీటి గుడి లోపలికి వెళ్ళి పూజారి గారికి గుడి శుభ్రం చేయటంలో సాయపడి ఆయన విగ్రహాలన్నిటికీ శాంతి చేస్తుంటే చెయ్యగలిగిన సాయం చేశాడు. సూర్యుడి విగ్రహానికి అభిషేకం పూర్తి చేసి ‘కిరీటీ, విగ్రహం తీసుకెళ్తావా?’ అని అడిగారు పూజారి గారు.
వాడికి ఓ క్షణం గుండె దడదడలాడింది. ఇప్పటిదాకా ఎప్పుడూ దైవత్వం, మహిమలు వంటి వాటి గురించి ఆలోచించలేదు వాడు. ఎంత కాదనుకున్నా నిన్న జరిగింది తీసి పారెయ్యలేని నిజం. గుళ్ళో పడ్డ దొంగలు అరిచిన అరుపుల గురించి పూజారి గారు కూడా చెప్పారు. తన కళ్ళతో చూశాడు ఎంత రక్తం వుందో గుళ్ళో. అది ఏమన్నా కోసుకుపోతే వచ్చే రక్తంలా అనిపించలేదు వాడికి.