18-05-2020, 07:15 PM
మాయ - 15
ఇంటిదాకా ప్రయాణం వాళ్ళకొక నరకంలా అనిపించింది. ఇద్దరికీ చేతులు పెనవేసుకొని నడవాలని వుంది. కానీ అందరికీ అందరూ తెలిసిన పల్లెటూళ్ళో అలాంటివి కుదరవు. ఇరువురికీ మళ్ళీ ఏకాంతం ఎప్పుడు లభిస్తుందో అన్న ఊహాతో భారంగా ఇంటిదాకా ప్రయాణం సాగింది.
నిక్కీ వాడిని రాను రానంటున్నా బలవంతాన ఇంట్లోకి లాక్కువెళ్ళి వాడు చేసిన సహాయం గురించి తన తల్లిదండ్రులకు చెప్పింది. రాజన్న, నరసు వాడిని చుట్టేసి కళ్ళనీళ్లు పెట్టుకున్నారు. వారు కొంచెం తేరుకున్నాక గోరు వాడిని బయటకు లాక్కెళ్ళాడు. ‘యా కాటికి నా దుంప తెంచుతాండావురా సామీ. ఇంగ నేను ఇంటా, కాలేజీల రెండు సోట్ల బలి దాని సేతుల’ అంటూ తన బాధ మొరపెట్టుకున్నాడు. కిరీటి నవ్వి ‘ఒరేయ్, మనకి ఇప్పుడు చాలా అవసరంరా తన హెల్ప్. మొదటి సంవత్సరమే fail అయితే డిగ్రీ పూర్తయ్యేసరికి ఏ అయిదేళ్ళో పడుతుంది. కొన్నాళ్లు భరించక తప్పదు’ అని వాడి భుజం తట్టాడు.
నిక్కుమాంబ కాలేజీలో పని చెయ్యడం మొదలుపెడితే తామిద్దరు కలిసి వుండేది తక్కువ అని కిరీటికి తెలుసు. అటు నిక్కీకి కూడా అన్నీ సక్రమంగా జరిగితే తను చదువు కోసం కిరీటిని వదిలి వెళ్లాలని తెలుసు. అయితే తామిరువురికీ ఒకరంటే ఒకరికి ఇష్టం అన్న నిజాన్ని దాచుకోవటం ఆపేశారు. కిరీటి మనసులో ఇంకెవరో వున్నారని తెలుసు నిక్కీకి. కానీ వాడు చెప్పేదాకా ఆ విషయం మాట్లాడకుండా వాడి అభిమానాన్ని వీలైనంతగా అనుభవించాలి అని డిసైడ్ అయ్యిన్ది.
ఇవతల కిరీటి పరిస్థితి దారుణంగా వుంది. మనసుని ఇద్దరు అమ్మాయిలు చెరొకపక్కనుంచీ లాగుతున్నారు. సునయన మళ్ళీ ఎప్పుడు కలుస్తుందో తెలీదు. కానీ వారిద్దరి మధ్య వున్నది భిన్న ధృవాల మధ్య వుండే ఆకర్షణ. అది ఒక ఫండమెంటల్ ఫోర్స్. దాన్ని ప్రపంచంలో ఎవ్వరూ కంట్రోల్ చేయలేరు.
నిక్కీ, తను కలవాలంటే సాంఘికంగా, కుటుంబపరంగా ఎన్నో ఎన్నెన్నో అడ్డంకులు వున్నాయని తెలుసు. గోరు స్నేహాన్ని, చిన్నప్పటినుంచి వాళ్ళ తల్లిదండ్రులు చూపిన ప్రేమని తలచుకొని guilt లో మునిగితేలుతున్నాడు. కానీ దగ్గరితనం వల్ల ఏర్పడ్డ బంధాన్ని ఇగ్నోర్ చెయ్యలేకపోతున్నాడు. కొన్ని రోజులు ఇలా అంతులేని వ్యధ అనుభవించి జరిగేది జరుగక మానదు, ప్రస్తుతం ఎదురుగా వున్న నిక్కీని సంతోషంగా వుంచుదాం అని డిసైడ్ అయ్యాడు.
మర్నాడు నిక్కీ, శైలు కలిసి రాణి రత్నమాంబ కాలేజీకి వెళ్లారు. తన replacement కోసం వెతుకున్నారు అని తెలుసుకున్న ఇంగ్లీష్ లెక్చరర్ అప్పటికప్పుడే resign చేసి పోతానని బెదిరించాడు. ప్రిన్సిపాల్ గారు అంతకంటే క్రూరంగా బెదిరించి అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోవద్దని వార్నింగ్ ఇచ్చి పంపించారు అతడికి.
అప్పటిదాకా రంగ సహాయంతో ఏదోలా మాథ్స్ లో నెట్టుకొస్తున్న మన నలుగురు మిత్రులు నిక్కీ స్పెషల్ క్లాసుల మూలంగా కొంచెం మెరుగుపడుతున్నారు. నిక్కీ తోడు లేకుండా ఒక్కదాన్నే ఇంట్లో కూర్చోవడం నా వల్ల కావట్లేదు అని శైలు కూడా వచ్చి సీనియర్ స్టూడెంట్లకు అప్పుడప్పుడూ ఇంగ్లీష్ స్పెషల్ క్లాసులు చెబుతోంది.
అప్పటిదాకా ఎప్పుడూ శైలూని మంచిగా తయారయి వుండగా చూడలేదు కిరీటి. మొదటిసారి కాలేజీకి వచ్చేడప్పుడు చీరకట్టుకొని, తన పొడవాటి కురులను ముడి వేసుకొని మంచి styleగా పెదబాబు గారి TVS బండి మీద వచ్చిన శైలుని నోరెళ్ళబెట్టి చూస్తుండిపోయాడు. ఈ మధ్య చాలా పరధ్యానంగా వుంటున్న కిట్టి కూడా శైలుని చూసి ‘పెసిండెంటు గోరి తాలూకా పిల్ల ఈవిడేనంట్రా’ అంటూ కళ్ళు విప్పార్చుకుని చూస్తుండిపోయాడు. కాలేజీలో Unofficial గా ఓ ఫాన్ క్లబ్ ఏర్పడిపోయింది శైలుకి. అప్పుడప్పుడూ కాకుండా ప్రతిరోజూ ఆమెను చూసే భాగ్యం కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు.
టైమ్ చాలా వేగంగా వెళ్లిపోతున్నట్టు అనిపిస్తోంది కిరీటికి. చూస్తుండగానే జనవరి నెల వచ్చేసింది. గత నాలుగు నెలల్లో నిక్కీతో ఒంటరిగా గడిపిన సందర్భాలు వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు వాడు. ఒంటరిగా కలవడం కుదిరిన ప్రతిసారీ శైలు కూడా వస్తోంది వాళ్ళతో.
ఇద్దరూ హద్దులు దాటి వెళ్లిపోకుండా చూస్తోంది. మాటలతో కాలం గడపడం కాకుండా ఇద్దరూ ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగిపోయి మౌనంగా కూర్చునేవారు. విడిపోయేటప్పుడు ఒక ముద్దు మటుకు ఇచ్చిపుచ్చుకొనేవాళ్లు. అది కూడా శైలు ‘ఉహుం’ అని గొంతు సవరించుకొనే వరకే!
కిరీటి మాట్లాడటం అంటే comfortable గా వుండడు కాబట్టి నిక్కీ కూడా వాడ్ని ఇబ్బంది పెట్టేది కాదు. శైలు మటుకు ఏదో ఒకటి అడిగి వాడ్ని వాగించాలని చూసేది. ‘ఎందుకే వాడ్ని ఇబ్బంది పెడతావు. వదిలెయ్యి’ అని నిక్కీ అంటే ‘నువ్వు నోర్ముయ్యి. సైలెంట్ రొమాంటిక్ సినిమా చూడలేక చచ్చిపోతున్నా. ఐనా తెలిసిన మన దగ్గరే నోరెత్తకపోతే రేపు బయటికి పోయి ఎలా బతుకుతాడే వాడు’ అని ఫైర్ అయ్యింది శైలు.
నిక్కీ పొడుగాటి జడ అంటే కిరీటికి చాలా ఇష్టం. దగ్గర వున్నంతసేపూ ఆమె కురులను చూస్తూ మైమరిచిపోయేవాడు. ఒకరోజు ధైర్యం చేసి నిక్కి జడను తన మెడ చుట్టూ చుట్టుకొని కౌగిలించుకొని కూర్చున్నాడు. నిక్కి సిగ్గుల మొగ్గైపోయింది మొదటిసారి కిరీటి అలా చొరవ తీసుకొనేసరికి. చిత్రంగా వాడా పని చేయగానే శైలు హృదయం భగ్గున మండింది. ‘చాలా బాగుందే. అలానే లాక్కెళ్లిపో వాడిని దున్నపోతుకి తాడు కట్టి లాక్కెళ్లినట్టు. నువ్వు తియ్యరా’ అని బలవంతంగా లాగేసింది. మరీ ఎక్కువ చేశానని అనుకుందేమో ‘కావాలంటే చేతికి చుట్టుకో’ అనేసి పక్కకి తిరిగి కూర్చుండిపోయింది బుగ్గలు ఎర్రబడిపోతూ.
సంక్రాంతి పండగ రానే వచ్చింది. గోదారొడ్డున సంత కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. మళ్ళీ నలుగురు మిత్రులూ హుషారుగా దానికోసం ఎదురు చూస్తున్నారు. సంక్రాంతి పండగ రోజు సూర్యుడి విగ్రహాన్ని ఊరేగించేటప్పుడు గుడి పూజారి గారికి సహాయంగా రమణాచారి వుండేవాడు ఎప్పుడూ. ఆ సంవత్సరం ఊళ్ళో ఎవరో ఆడకూతురు పురుడు కోసం ఆ పిల్ల తల్లిదండ్రులు తమకు తోడు కావాలని బలవంతంగా ఆయన్ను పట్నం తీసుకెళ్లారు.
పట్నం వెళ్ళే ముందు రోజు కిరీటిని పిల్చి ఈ సారి పండక్కి ఊరేగింపులో పూజారి గారికి సహాయం చెయ్యి అని చెప్పారు. ‘నేనా, నాకు మంత్రాలు అవీ ఏమీ రావు. నేనేం చేస్తాను!’ అని కిరీటి అంటే ‘నిన్ను మంత్రాలు చదవడానికి పంపించట్లేదురా, పక్కనే వుండి పూజారి గారు అడిగినప్పుడు పూలు పళ్ళు అందిస్తుండు చాలు’ అని బలవంతంగా ఒప్పించారు. ‘సంక్రాంతి రోజు పీతాంబరాలు కట్టుకొని గుడికి పో. నీరుకావి పంచె కాదు, పట్టుబట్టలు. అక్కడ్నుంచి ఏం చెయ్యాలో పూజారి గారే చెప్తారు’ అని భుజం తట్టారు.
పండుగ రోజు శుచిగా తయారయ్యి పూజారి గారితో పాటు ఊరేగింపు బండిలో వెళ్ళాడు కిరీటి. గుడి దగ్గర మొదలైన ఊరేగింపు ముందుగా విగ్రహం కోసం ప్రెసిడెంటు గారి ఇంటి వైపుకి వెళ్లింది. ప్రెసిడెంటు గారు, ఆయన భార్య బైట నిలబడి ఎదురు చూస్తున్నారు. ‘నాయనా, నేను ఇన్నిసార్లు బండి ఎక్కి దిగలేను. వెళ్ళి విగ్రహం పట్రా’ అని పూజారి గారు కిరీటిని పంపారు.
‘ఏరా, మీ బాబు మరీ బిజీ ..’ అంటూ ప్రెసిడెంటు గారు ఏదో మొదలెట్టబోతుంటే ఆయన భార్య ఇప్పుడు కాదు అన్నట్లు గుడ్లురుమి చూసింది. ‘లోపల శైలు విగ్రహానికి పూజ చేస్తోంది. పోయి తీస్కరా బిడ్డా’ అని పంపింది.
లోపలికి వెళ్ళిన కిరీటిని చూసి శైలు బొమ్మలా నిలబడిపోయింది. కరెక్ట్ గా ఎదిగే వయసులో వున్నాడు వాడు. ఆర్నెల్ల క్రితం వాడు పరిచయం అయినప్పటికీ, ఇప్పటికీ బాగా తేడా వచ్చింది. ఎప్పుడూ చూసే కిరీటే ఐనా ఇవాళ ఎందుకో కొత్తగా వున్నాడు. ఆరడుగులకి ఓ రెండు అంగుళాలు తక్కువే వున్నా చూడ్డానికి ఠీవిగా వున్నాడు. ఇప్పుడిప్పుడే మొలుస్తున్న కోర మీసం, ఎప్పటి లాగానే తనని చూడగానే వాడి ముఖం మీద వెలిగిన ఓ చిరునవ్వు చూసి stun అయి నిలబడిపోయింది.
వాడు కట్టుకున్న పట్టు పీతాంబరాల మూలంగా ఓ వింత మెరుపులో మెరిసిపోతున్నాడు. ఆ మెరుపు కులాలకి, వర్గాలకి అతీతం మిత్రులారా. ఏ కులం వాడైనా పెళ్ళికొడుకు పెళ్లిరోజున కళకళలాడడానికి కొంత కారణం ఆ పట్టుబట్టలే.
‘నువ్వు నా కిరీటివేనా, ఎంత బాగున్నావు!’ అంటూ దగ్గరకు వచ్చి వాడ్ని కౌగిలించుకుంది. అప్రయత్నంగా వాడు కూడా ఆమెను పొదివి పట్టుకున్నాడు. అంతసేపూ పూలు, అగరొత్తులు, సుగంధాల మధ్యన కూర్చొని వచ్చాడేమో ఓ గమ్మత్తైన సువాసన వస్తోంది వాడి దగ్గర. ఓ క్షణం ఆ సువాసనని ఆస్వాదించి మెల్లిగా వాడి పెదవులను తన పెదవులతో ఒత్తింది. కిరీటికి ఒళ్ళంతా జివ్వున లాగింది. ‘నా దృష్ఠే తగిలేలా వుందిరా సారీ’ అని తన కళ్ల కాటుకతో కనబడీ కనబడనట్లు వాడి బుగ్గ మీద చిన్న చుక్క పెట్టింది.
వాడి చెయ్యి పట్టుకుని పూజ గది దాకా తీసుకెళ్లి ‘అదుగో విగ్రహం జాగ్రత్తగా పట్టుకెళ్లు’ అని చూపించింది. అదివరకు ఊరేగింపుల్లో ఎన్నో సార్లు చూసినా ఇంత దగ్గరగా ఆ విగ్రహాన్ని చూడడం ఇదే మొదటిసారి కిరీటికి. అదీ ఇదీ అని చెప్పలేని ఓ వింతరంగులో వుంది విగ్రహం. ఒక అడుగు పొడవున్నది ఆ విగ్రహం. చేతిలోకి తీసుకోగానే ఓ మంచు ముక్కను పట్టుకున్నట్టు చల్లగా వుంది. ‘మిమ్మల్ని మళ్ళీ కలుస్తానండి’ అని శైలూకి చెప్పి జాగ్రత్తగా బయటకు తీసుకెళ్ళాడు.
శైలు పూజగది పక్కనే కూలబడిపోయింది. ఇన్నాళ్లూ వాడి మీద అది ఇది అని చెప్పలేని ఒక ఫీలింగ్ వుండేది. ఇవాళ అర్ధమైంది వాడంటే తనకు విపరీతమైన possessiveness వుందని. తనని నిస్సహాయ స్థితిలో చూసినా ఏమీ చెయ్యని వాడి మంచితనం, మాటల్లో కాకపోయినా చేతల్లో తనంటే వాడు చూపించే caring, తన అల్లరిని ఎప్పుడూ చిరునవ్వుతో భరించే వాడి ఓపిక ఇవన్నీ ఇన్నాళ్లూ తేలికగా తీసుకుంది కానీ ఇప్పుడు వాడు నా సొంత మనిషి అని ఒక ఫీలింగ్ ఏర్పడిపోయింది. ఇప్పుడు కూడా ముద్దు పెట్టుకుంటే ఆశ్చర్యపోయాడే కానీ హద్దు దాటలేదు. చిత్రంగా తనకు కూడా వాడ్ని ముద్దు పెట్టుకోవడం ఊపిరి పీల్చడం అంత న్యాచురల్ గా అనిపించింది. ఇది ఒక బ్యూటిఫుల్ relationship గా మారుతుందా లేక స్నేహితురాళ్ళ మధ్య వాడ్ని నలిగిపోయేలా చేస్తుందా అన్నది ముందు ముందు చూద్దాం.
విగ్రహం తీసుకెళ్లి ఊరేగింపులో పాల్గొన్నాడు కిరీటి. వాళ్ళ వీధిలోనుంచి వెళ్ళేటప్పుడు నిక్కీ కూడా వాడ్ని చూసి ఓ క్షణం చిత్తరువయ్యింది. నిక్కీకి, గోరుకి చెయ్యి ఊపి సాగిపోయాడు కిరీటి. ఊరేగింపు జరిగినంతసేపూ వాడ్ని ఓ జత కళ్ళు పరిశీలిస్తూనే వున్నాయి.