11-05-2020, 08:38 AM
మాయ - 8
సునయన నుండి విడివడ్డాక కిరీటి మామూలు మనిషి కావడానికి కొన్ని రోజులు పట్టింది. ఆ తర్వాత ఆమెను మర్చిపోయాడు అని కాదు, ఎప్పటికైనా తనని కలవాలి అన్న ఒక లాంగ్ టర్మ్ గోల్ అంటూ వుంది కాబట్టి తన జ్ఞాపకాల్లో పడి కొట్టుమిట్టాడకుండా మిగతా విషయాలపై దృష్ఠి పెట్టాడు. ఇలా చులాగ్గా ఒక మాటలో తేల్చేసానని వాడు పడ్డ బాధని తక్కువ అంచనా వెయ్యకండి.
అంతేకాదండోయ్, ఓ తుఫానులా ఇతని జీవితంలో ప్రవేశించి వెళ్ళిపోయిన సునయన లానే ఇంకొన్ని పాత్రలు అతడి routineను అల్లకల్లోలం చేసేశాయి.
డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నారు అని చెప్పుకున్నాము కదా మన బ్యాచ్. కిరీటి సునయనతో చెప్పుకున్నట్టు వీళ్ళందరికీ ఇదే మొదటి సారి ఇంగ్లీష్ మీడియంలో చదవటం. Quarterly పరీక్షలు వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ లో చాలామంది పిల్లలు విపరీతంగా struggle అవడం కాలేజీ యాజమాన్యం గమనించింది. అంత క్రితం సంవత్సరం వరకూ ఆ కాలేజీలో పనిచేసిన అద్భుతమైన ఇంగ్లిష్ లెక్చరర్ తనకు రైల్వే competitive పరీక్షల్లో ర్యాంక్ రావటం వల్ల ఈ వుద్యోగం వదిలేసి రైల్వేలో జాయిన్ అయిపోయాడు. కొత్తగా వచ్చిన లెక్చరర్ hopeless కావడంతో ప్రిన్సిపాల్ తలపట్టుకు కూర్చున్నాడు.
రాణి రత్నమాంబ కాలేజీ government కాలేజీ కాదు. ఓ రాజా వారు తన భార్య పేరుమీద చుట్టుపక్కల వున్న పల్లెటూరి పిల్లలు చదువుకోవడం కోసం దాన్ని కట్టించారు. పిల్లల చదువు, పాస్ పర్సెంటేజ్ వంటి వాటిపై ఆయన ఒక కన్ను వేసి వుంచుతారు. అందుకే ప్రిన్సిపాల్ గారు టెన్షన్ టెన్షన్ గా వున్నారు.
అది సెప్టెంబర్ మాసం. half yearly పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ను యే రకంగా గట్టెక్కించాలో తెలీక అవస్థలో వున్న ప్రిన్సిపాల్ రూమ్ కి ఓ కుర్రాడు వచ్చాడు.
May I come in sir అంటూ ఆయన డోర్ పై knock చేశాడు. లోపలికి రమ్మని పిలిచిన ప్రిన్సిపాల్ ఆ కుర్రాడితో ఒక అరగంట మాట్లాడారు. ఆయన ప్రాబ్లం కి ఒక సొల్యూషన్ suggest చేసి వెళ్ళాడు ఆ కుర్రాడు.
ఆ వచ్చిన కుర్రాడు మన కిరీటే. ఏమిటా సొల్యూషన్, ఏమా కథ అని తెలుసుకోవాలంటే ఒక మూడు నెలలు వెనక్కు వెళ్ళాలి.
********** మూడు నెలల క్రితం ***********
Misdirection is the heart of magic. Unless the magician truly has supernatural powers (spoilers: they do not!), any magic trick he/she shows you has an element of misdirection in it.
సునయన దగ్గర కొన్న పుస్తకంలో మొదటి పేజీ మొదటి లైన్స్ చదవగానే కిరీటికి తానీ పుస్తకం చదివి అర్ధం చేసుకోవడం జరగని పని అని డిసైడ్ అయ్యాడు. పుస్తకం తీసి పక్కన పడేద్దామంటే మనసొప్పట్లేదు. కానీ చదివి అర్ధం చేసుకొనే శక్తి లేదు. Frustration పెరిగిపోయి పుస్తకాన్ని జాగ్రత్తగా తన క్లాస్ పుస్తకాల మధ్య పెట్టి స్నేహితులతో కలిసి ఊరి మీద పడి తిరుగుదామని బయల్దేరాడు.
ముందే చెప్పుకున్నాంగా బ్యాచ్ అంతా పక్క పక్క వీధుల్లో వుంటారని. కిరీటి ఇంటికి మూడు నాలుగిళ్ళ పక్కన ఆ వీధిలోనే వుంది గౌరయ్య ఇల్లు. గోరు ఇంటి దగ్గరికి వెళ్తూనే ఏదో తేడా గమనించాడు. వాడి ఇంట్లోనుంచి పెద్ద పెద్ద కేకలు వినిపిస్తున్నాయి. గోరు, వాళ్ళ నాన్న రాజన్న ఇంటికప్పు ఎగిరిపోయే రేంజులో అరుచుకుంటున్నారు.
వడివడిగా ఇంట్లోకి వెళ్ళిన కిరీటికి ఆ ఇంట్లో ఎప్పుడూ చూడని దృశ్యం కనిపించింది. రాజన్న చేతిలో గొడ్లని కట్టేసే పలుపుతాడు వున్నది. గోరు వంటిమీద ఆల్రెడీ రెండు మూడు చోట్ల కమిలిపోయిన గుర్తులున్నాయి. మళ్ళీ కొట్టడానికి చెయ్యెత్తగానే ఇక ఆలస్యం చేయకుండా రాజన్న మీద పడ్డాడు కిరీటి. ‘బాబాయ్, ఆగు బాబాయ్’ అంటూ రాజన్నని ఒడిసి పట్టుకొని ‘పిన్నీ, పిన్నీ’ అంటూ కేకేసాడు. లోపల్నుంచీ ఇద్దరు ఆడవాళ్ళ ఏడుపులు వినిపిస్తున్నాయి.
‘వదల్రా బిడ్డా. ఈ నా కొడుకు ఇయ్యాల నా సేతిలో సచ్చాడే. ఓరుగల్లు వింజినీరింగ్ కాలేజీ సదువుల రాణిరా నా అమ్మి. దాని సెప్పులు తుడుస్తాకి కూడా పనికిరాడు ఈ నా కొడుకు, దాని మీద కూకలేస్తాడా’ అంటూ ఊగిపోతున్నాడు. విప్పసారా వాసన గుప్పున కొడుతోంది అతని దగ్గర. రాజన్నకు తాగుడు అలవాటు లేదు.
ముందు పరిస్థితి ఒక గాడిలో పెట్టాలని డిసైడ్ అయ్యి ‘గోరూ, నువ్వు ముందు పోరా ఇక్కడ్నుంచి’ అని వాడ్ని గదిమాడు. గోరు కదలకపోయేసరికి గొంతులోని బలమంతా ఉపయోగించి ‘గోరూ, నువ్వు ముందు రంగ ఇంటికి పోరా, అక్కడికొస్తాను’ అంటూ అరిచాడు. ఎప్పుడో కానీ నోరెత్తని కిరీటి అంత గట్టిగా అరిచేసరికి రాజన్న స్థాణువయ్యాడు. గోరు షాక్ తిన్నవాడిలా అక్కడ్నుంచి వెళ్ళాడు.
అదే అరుపు గొంతుతో ‘పిన్నీ’ అంటూ ఇంకో పొలికేక పెట్టాడు. లోపల్నుంచీ ఏడుపుల శబ్దాలు ఆగి గోరు తల్లి నరసు కళ్ళు ఒత్తుకుంటూ బయటకు వచ్చింది. ‘ఇంద, బాబాయిని పడుకోబెట్టు. నాన్న రాగానే పంపిస్తా’ అంటూ రంగ ఇంటికేసి బయల్దేరాడు.